దూరవిద్యా డిగ్రీలతో ఇబ్బందా?

ఆంధ్రా యూనివర్సిటీలో దూరవిద్య ద్వారా బీఏ డిగ్రీ, పీజీ పూర్తిచేశాను. ఇలాంటి డిగ్రీలకు ఈమధ్య విలువ ఇవ్వడం లేదు. (ఉదాహరణకు డీఈడీ, బీఈడీ కోర్సులు కూడా).

Published : 04 Apr 2024 00:22 IST

ఆంధ్రా యూనివర్సిటీలో దూరవిద్య ద్వారా బీఏ డిగ్రీ, పీజీ పూర్తిచేశాను. ఇలాంటి డిగ్రీలకు ఈమధ్య విలువ ఇవ్వడం లేదు. (ఉదాహరణకు డీఈడీ, బీఈడీ కోర్సులు కూడా). భవిష్యత్తులో నా డిగ్రీలకు ఇబ్బంది వస్తుందా? వీటికి రెగ్యులర్‌ డిగ్రీలతో సమాన ప్రాధాన్యం ఎప్పటినుంచి ఇస్తారు?

శ్రీహరి

  • డిగ్రీ, పీజీలను దూరవిద్య/ ఓపెన్‌ యూనివర్సిటీ ద్వారా చదివినా, రెగ్యులర్‌గా చదివినా వాటి విలువల్లో ఎలాంటి మార్పూ ఉండదు. అన్ని రకాల డిగ్రీలను వివిధ యూనివర్సిటీలు యూజీసీ నిబంధనలకు లోబడే జారీ చేస్తాయి. డిగ్రీని దూరవిద్య/ ఓపెన్‌ యూనివర్సిటీ ద్వారా చదివిన చాలామంది సివిల్‌ సర్వీసెస్‌, అధ్యాపక ఉద్యోగ పరీక్షలు రాసి ఉన్నతోద్యోగాలు చేస్తున్నారు. సాధారణంగా ఉద్యోగ నోటిఫికేషన్లలో డిగ్రీ/ పీజీ నిర్ధారిత శాతం మార్కులుండాలని మాత్రమే పేర్కొంటారు. డిగ్రీ/ పీజీ రెగ్యులర్‌గానే చదివి ఉండాలని ఉండదు. స్వల్పంగా కొన్ని బోధన/ పరిశోధన ఇంటర్వ్యూల్లో మాత్రం రెగ్యులర్‌ డిగ్రీలకు కొంత ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇటీవల యూజీసీ జారీ చేసిన అకడమిక్‌ బ్యాంక్‌ ఆఫ్‌ క్రెడిట్‌ నిబంధనల ప్రకారం రెగ్యులర్‌/ దూరవిద్య/ ఆన్‌లైన్‌ ద్వారా చదివిన కోర్సుల మధ్య తేడా ఏమీ లేదు. జాతీయ విద్యావిధానం- 2020 పూర్తిస్థాయిలో అమలైనపుడు అన్ని రకాల డిగ్రీలనూ ఒకే విధంగా పరిగణించే అవకాశం ఉంది. బీఈడీ, డీఈడీ లాంటి ఉపాధ్యాయ శిక్షణ కోర్సులను రెగ్యులర్‌గా మాత్రమే చేయాలని నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌ నిబంధనలు చెబుతున్నాయి. ఉపాధ్యాయ శిక్షణ కోర్సులను దూరవిద్య ద్వారా చేసే అవకాశం లేదు. అదేవిధంగా ఇంజినీరింగ్‌, మెడిసిన్‌, ఎల్‌ఎల్‌బీ లాంటి ప్రొఫెషనల్‌ కోర్సులను కూడా దూరవిద్యా విధానంలో చేసే అవకాశం లేదు.

ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని