పీహెచ్‌డీ చేయాలంటే..?

పాండిచ్చేరి సెంట్రల్‌ యూనివర్సిటీలో ఎంఏ పొలిటికల్‌ సైన్స్‌లో మాస్టర్స్‌ చేస్తున్నా. తర్వాత నెట్‌, జేఆర్‌ఎఫ్‌ సాధిస్తే స్టేట్‌ యూనివర్సిటీల్లో పీహెచ్‌డీ చేయవచ్చా?

Published : 08 Apr 2024 00:09 IST

పాండిచ్చేరి సెంట్రల్‌ యూనివర్సిటీలో ఎంఏ పొలిటికల్‌ సైన్స్‌లో మాస్టర్స్‌ చేస్తున్నా. తర్వాత నెట్‌, జేఆర్‌ఎఫ్‌ సాధిస్తే స్టేట్‌ యూనివర్సిటీల్లో పీహెచ్‌డీ చేయవచ్చా? ఈ పరీక్షల్లో పాసవకపోతే ఏం చేయాలి?

వినయ్‌ చెవ్వ

చాలా కాలంగా ఒక్కో యూనివర్సిటీ ఒక్కో పద్ధతిని అవలంబిస్తూ పీహెచ్‌డీ ప్రవేశాలు చేపడుతున్నాయి. చాలా కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, జాతీయస్థాయిలో ప్రత్యేక పరీక్షలు నిర్వహించి, ప్రతిభ కనపర్చినవారికి ఇంటర్వ్యూల ద్వారా ప్రవేశాలు కల్పిస్తున్నాయి. పలు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, జాతీయ పరిశోధన సంస్థలు యూజీసీ/ సీఎస్‌ఐఆర్‌ జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలోషిప్‌ పొందిన విద్యార్థులకు నేరుగా ఇంటర్వ్యూలు నిర్వహించి, అడ్మిషన్లు నిర్వహిస్తున్నాయి. నెట్‌ (నేషనల్‌ ఎలిజిబిలిటి టెస్ట్‌)లో ఉత్తీర్ణత పొందినవారికి కూడా చాలా యూనివర్సిటీలు రాతపరీక్ష నుంచి మినహాయింపు ఇస్తున్నాయి. యూజీసీ నిబంధనల ప్రకారం ఎంఫిల్‌ పూర్తి చేసినవారికి కూడా రాత పరీక్ష నుంచి మినహాయింపు ఉంది. అలాగే గేట్‌ (గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌)లో మంచి పర్సంటైల్‌ పొందినా, రాత పరీక్ష నుంచి మినహాయింపు ఉంది. రాష్ట్ర స్థాయి యూనివర్సిటీల్లో పైన చెప్పినవాటికి అదనంగా స్టేట్‌ ఎలిజిబిలిటి టెస్ట్‌ (సెట్‌)లో అర్హత పొందినవారు ఇంటర్వ్యూ ద్వారా పీహెచ్‌డీలో నేరుగా ప్రవేశం పొందే అవకాశం ఉంది. నెట్‌/ సెట్‌లో ఉత్తీర్ణత పొందలేకపోతే, రాష్ట్రస్థాయిలో నిర్వహించే ఆర్‌సెట్‌ (రిసెర్చ్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌)లో మెరుగైన ర్యాంకు పొంది, ఇంటర్వ్యూ ద్వారా రాష్ట్ర యూనివర్సిటీల్లో పీహెచ్‌డీ ప్రవేశం పొందవచ్చు.

వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని గత నెలలో యూజీసీ పీహెచ్‌డీ ప్రవేశాల్లో విప్లవాత్మక మార్పు తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా పీహెచ్‌డీ ప్రవేశాలకు నెట్‌ పరీక్షను ప్రాతిపదికగా తీసుకొమ్మని సూచించింది. ఇక నుంచి యూజీసీ/ సీఎస్‌ఐఆర్‌ నెట్‌లో ఉత్తీర్ణత పొందినవారిని పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా మూడు విభాగాలు చేస్తారు. మొదటిది- నెట్‌- జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలోషిప్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌షిప్‌. రెండోది- అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌షిప్‌. మూడోది- ప్రత్యేకంగా పీహెచ్‌డీ ప్రవేశాల కోసం మాత్రమే నిర్దేశించారు. ఈ మూడు విభాగాల్లో దేనిలో ఉత్తీర్ణత సాధించినా ఇంటర్వ్యూ ద్వారా నేరుగా పీహెచ్‌డీలో ప్రవేశం పొందవచ్చు. ఈ సూచన పూర్తిస్థాయిలో అమలవ్వడానికి కొంత సమయం పట్టవచ్చు. ఈలోపు మీరు జేెఆర్‌ఎఫ్‌/ నెట్‌/ సెట్‌/ ఆర్‌సెట్‌లలో ఉత్తీర్ణత సాధించి స్టేట్‌ యూనివర్సిటీల్లో పీహెచ్‌డీ ప్రవేశానికి ప్రయత్నించవచ్చు. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేకపోతే భవిష్యత్తులో పీహెచ్‌డీ ప్రవేశం కష్టం కావచ్చు. ఈ నిబంధనలు అమల్లోకి రాకముందే ఏదైనా స్టేట్‌ యూనివర్సిటీలో ఆర్‌సెట్‌ ద్వారా పీహెచ్‌డీ ప్రవేశం పొందే ప్రయత్నం చేయండి. పీహెచ్‌డీ ప్రవేశం పొందలేకపోతే కేంద్ర, రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌, స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌, బ్యాంకింగ్‌, ఇన్సూరెన్స్‌ పోటీ పరీక్షల్లో, ఇతర ప్రభుత్వరంగ సంస్థల్లో ఉద్యోగాలకోసం ప్రయత్నించండి. జూనియర్‌ కళాశాలల్లో అధ్యాపక ఉద్యోగాలకు పీహెచ్‌డీ/ నెట్‌/సెట్‌ అవసరం లేదు కాబట్టి వాటికి పోటీపడొచ్చు.

ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని