డిగ్రీతోపాటు ఏ కోర్సు మేలు?

ఇంటర్‌ (సీఈసీ) పూర్తిచేశాను. స్టాటిస్టిక్స్‌ స్పెషలైజేషన్‌తో డిగ్రీ చదవాలనుంది. దీంతోపాటు దూరవిద్యలో ఏ కోర్సు చదివితే మంచిది?

Published : 09 Apr 2024 01:05 IST

ఇంటర్‌ (సీఈసీ) పూర్తిచేశాను. స్టాటిస్టిక్స్‌ స్పెషలైజేషన్‌తో డిగ్రీ చదవాలనుంది. దీంతోపాటు దూరవిద్యలో ఏ కోర్సు చదివితే మంచిది?

లావణ్య

సాధారణంగా స్టాటిస్టిక్స్‌ కోర్సును డిగ్రీలో మ్యాథమెటిక్స్‌తో కలిపి చదివే అవకాశం ఉంది. బీఎస్సీలో మ్యాథ్స్‌, స్టాటిస్టిక్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌ కానీ, మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, స్టాటిస్టిక్స్‌ కాంబినేషన్‌లో కానీ చదవొచ్చు. బీఏలో మ్యాథ్స్‌, ఎకనామిక్స్‌, స్టాటిస్టిక్స్‌ కాంబినేషన్‌ ఉంది. మీరు ఇంటర్‌లో మ్యాథ్స్‌ చదవలేదు కాబట్టి, ప్రస్తుత పరిస్థితుల్లో పైన చెప్పిన కాంబినేషన్లతో డిగ్రీ చేసే వీలు లేదు. జాతీయ విద్యావిధానం - 2020 పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చాక ఇలాంటి ఇబ్బందులు లేకుండా, ఎవరైనా ఏ కోర్సులైనా చదివే వెసులుబాటు ఉంటుంది. కొన్ని ప్రైవేటు యూనివర్సిటీలు ఇప్పటికే నూతన విద్యావిధానాన్ని అమలు చేయడం మొదలుపెట్టాయి. కాబట్టి, ఇంటర్‌లో మ్యాథ్స్‌ లేకుండా, డిగ్రీలో స్టాటిస్టిక్స్‌ కాంబినేషన్‌ ఉన్న డిగ్రీ ప్రోగ్రాంలో చేరే ప్రయత్నం చేయండి. డిగ్రీ మొదటి సంవత్సరంలో మ్యాథ్స్‌ ఫౌండేషన్‌ కోర్సులు చేయాల్సిన అవసరం ఉంటుంది.

మీకు స్టాటిస్టిక్స్‌ చదవాలన్న కోరిక బలంగా ఉంటే, ఇంటర్‌ రెండు సంవత్సరాల మ్యాథ్స్‌ సబ్జెక్టులను ఇప్పుడు పూర్తి చేసి, డిగ్రీలో స్టాటిస్టిక్స్‌ కోర్సును మ్యాథ్స్‌ కాంబినేషన్‌లో చదవండి. అలా వీలు కాకపోతే బీకాంలోనే స్టాటిస్టిక్స్‌ను ఒక సబ్జెక్టుగా చదివే ప్రయత్నం చేయండి. మీకు కంప్యూటర్‌ రంగంపై ఆసక్తి ఉందనుకోండి- బీకాం కంప్యూటర్స్‌ కోర్సు చదివితే, కంప్యూటర్స్‌తో పాటు స్టాటిస్టిక్స్‌ కోర్సును ఒక సబ్జెక్ట్‌గా చదవొచ్చు. స్టాటిస్టిక్స్‌ అప్లికేషన్స్‌పై ఆసక్తి ఉంటే, బీకాం/ బీబీఏలో బిజినెస్‌ అనలిటిక్స్‌/ డేటా సైన్స్‌ చదివే వీలుంటుంది. స్టాటిస్టిక్స్‌, డేటా సైన్స్‌, అనలిటిక్స్‌ కోర్సుల్లో రాణించాలంటే- మ్యాథ్స్‌పై గట్టి పట్టు ఉండాలి. మీరు డిగ్రీ చదువుతూనే స్వయం, ఎన్‌పీటెల్‌, కోర్స్‌ ఎరా, ఎడెక్స్‌, యుడెమి లాంటి ఆన్‌లైన్‌ వేదికల్లో స్టాటిస్టిక్స్‌ కోర్సులు చేయవచ్చు.

ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని