ఎంఏ తర్వాత ఐటీఐ చేస్తే?

ఎంఏ పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఈమధ్యే పూర్తిచేశాగానీ దీంతో ఎక్కువ ఉద్యోగావకాశాలు లేవనిపిస్తోంది. ఇప్పుడు ఐటీఐ చేసి ఆర్‌ఆర్‌బీ, జేఎల్‌ఎం, ఇతర టెక్నీషియన్‌ కోర్సులకు సన్నద్ధం అవటం మెరుగేనా?

Published : 10 Apr 2024 00:04 IST

ఎంఏ పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఈమధ్యే పూర్తిచేశాగానీ దీంతో ఎక్కువ ఉద్యోగావకాశాలు లేవనిపిస్తోంది. ఇప్పుడు ఐటీఐ చేసి ఆర్‌ఆర్‌బీ, జేఎల్‌ఎం, ఇతర టెక్నీషియన్‌ కోర్సులకు సన్నద్ధం అవటం మెరుగేనా?

ఎన్‌.రమేష్‌కుమార్‌

మీరు ఎంఏ పూర్తి చేశారంటే, మీ వయసు కనీసం 23 ఏళ్లు ఉంటుంది. ఇప్పుడు ఐటీఐ చేస్తే, మరో రెండేళ్లు చదవాలి. అంతేకాకుండా, మీకంటే పది సంవత్సరాలు తక్కువ వయసున్నవారితో కలిసి విద్య అభ్యసించాలి. ఐటీఐ చేశాక కూడా ఉద్యోగం రావడం కష్టమయితే, అప్పుడు ఏం చేస్తారు? మీకు ఐటీఐ కోర్సు అంటే ఇష్టమా, ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉన్నాయనే ఉద్దేశంతోనా? ప్రస్తుతం ప్రతి ఉద్యోగానికీ చాలా పోటీ ఉంది. అందుబాటులో ఉన్న ఉద్యోగాలు వేలల్లో ఉంటే, వాటికి అర్హులయిన వారు లక్షల్లో ఉన్నారు. ఈ పోటీ ప్రపంచంలో రాణించాలంటే- అందుబాటులో ఉన్న తక్కువ కొలువుల కోసం పోటీ పడి, మెరుగైన ప్రతిభతో ఉద్యోగం పొందే ప్రయత్నం చేయాలి.

చాలామంది ఉద్యోగం అంటే ప్రభుత్వ ఉద్యోగం అనే భావనతో ఉంటున్నారు. ముందుగా దీన్నుంచి బయటకు వచ్చి నచ్చిన పని చేస్తూ సంబంధిత రంగంలో ఎదిగే ప్రయత్నం చేయటం ఉత్తమం. ఒకవేళ మీరు ఐటీఐ చేసి ప్రభుత్వ ఉద్యోగం పొందినా, మీ పీజీ చదువుకు తగిన ఉద్యోగం పొందలేక పోయానని బాధ పడవచ్చు. అలా కాకుండా పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ పీజీతో కానీ, మీ డిగ్రీ విద్యార్హతతో కానీ, ఉద్యోగ ప్రయత్నాలు చేయండి. కేంద్ర, రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఉద్యోగాలతో పాటు స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌, రైల్వే రిక్రూట్‌మెంట్‌, బ్యాంకింగ్‌, ఇన్సూరెన్స్‌ లాంటి ఉద్యోగాలకోసం ప్రయత్నించండి. బీఈడీ చేసి బోధనరంగంలో ప్రయత్నాలు చేయవచ్చు. బీఈడీ చేసి రాష్ట్ర ప్రభుత్వ డీ…ఎస్సీ కోసం మాత్రమే ఎదురుచూడకుండా నవోదయ, కేంద్రీయ విద్యాలయ లాంటి కేంద్రీయ విద్యాసంస్థల్లోనూ ఉద్యోగ ప్రయత్నాలు చేయండి. ఆసక్తి/ అవకాశం ఉంటే జర్నలిజం, లైబ్రరీ సైన్స్‌, మేనేజ్‌మెంట్‌, ఎల్‌ఎల్‌బీ లాంటి ప్రొఫెషనల్‌ కోర్సుల గురించి కూడా ఆలోచించండి. ఇంగ్లిష్‌ భాషపై కొంత పట్టుంటే ఎంఏ ఇంగ్లిష్‌ చదివి బోధన రంగంలో ఉపాధి అవకాశాలు పెంచుకోవచ్చు. మీ పీజీ విద్యార్హతతో స్వచ్ఛంద సేవాసంస్థల్లో, ప్రభుత్వేతర సంస్థల్లో, రిటైలింగ్‌ రంగంలో ఉద్యోగ ప్రయత్నాలు చేయవచ్చు. ఇవన్నీ వీలుకాకపోతే మీరు అనుకున్నట్లుగా, ఐటీఐ చేసి మీరనుకుంటున్న కోర్సులూ.. కొలువుల ప్రయత్నాలు చేయండి.

ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని