ఎంసీజేతో ప్రభుత్వ కొలువులు?

కాకతీయ యూనివర్సిటీ నుంచి ఎంసీజే (జర్నలిజం) చేశాను. ఈ కోర్సుతో ప్రభుత్వ ఉద్యోగాలుంటాయా?

Published : 22 Apr 2024 00:05 IST

కాకతీయ యూనివర్సిటీ నుంచి ఎంసీజే (జర్నలిజం) చేశాను. ఈ కోర్సుతో ప్రభుత్వ ఉద్యోగాలుంటాయా?

కె.వెంకటసాయి

  • సాధారణంగా జర్నలిజం చదివినవారికి, ప్రభుత్వ రంగంతో పోలిస్తే, ప్రైవేటు రంగంలోనే ఉపాధి అవకాశాలు ఎక్కువ. ప్రభుత్వ ఉద్యోగాల విషయానికొస్తే... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, యూనివర్సిటీల్లో పబ్లిక్‌ రిలేషన్స్‌/ ఇన్ఫర్మేషన్‌ ఆఫీసర్లుగా చేరవచ్చు. దూరదర్శన్‌, ఆల్‌ ఇండియా రేడియోల్లోనూ ఉద్యోగావకాశాలు ఉంటాయి. జర్నలిజం చదివినవారికి ఇండియన్‌ ఇన్ఫర్మేషన్‌ సర్వీస్‌, దానికి సమానమైన రాష్ట్ర స్థాయి సర్వీసుల్లో కూడా అవకాశాలు లభిస్తాయి. మినిస్ట్రీ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ అండ్‌ బ్రాడ్‌ కాస్టింగ్‌లో వివిధ విభాగాలైన సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ కమ్యూనికేషన్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా మానిటరింగ్‌ సెంటర్‌, న్యూ మీడియా వింగ్‌, ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా, ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో, పబ్లికేషన్స్‌ డివిజన్‌, రిజిస్ట్రార్‌ ఆఫ్‌ న్యూస్‌ పేపర్స్‌ ఫర్‌ ఇండియాల్లో ఉపాధి ప్రయత్నాలు చేయవచ్చు. మీకు బోధన రంగంపై ఆసక్తి ఉంటే- జర్నలిజం కళాశాలల్లో అధ్యాపకుడిగా స్థిరపడవచ్చు. జర్నలిజంలో శిక్షణ పొందినవారికి ప్రైవేటు రంగంలో విభిన్న ఉద్యోగావకాశాలు ఉన్నాయి. వృత్తి నైపుణ్యాలు మెరుగుపర్చుకొని కొంత ఉద్యోగానుభవం గడిస్తే వేతనం, హోదా కూడా పెరుగుతాయి. 2004 తర్వాత ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరినవారికి పెన్షన్‌ సదుపాయం లేదు. అందుకని ఉద్యోగ భద్రత మినహా ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలకు పెద్దగా తేడా ఏమీ లేదు. ప్రైవేటు రంగంలో సర్వీసు, వయసుతో పనిలేకుండా ప్రతిభ ఆధారంగా పదోన్నతులూ, అధిక వేతనాలకు ఆస్కారం ఉంటుంది. జర్నలిజం రంగంలో ప్రైవేటు ఉద్యోగాల్లో సృజనాత్మకతకు అవకాశం అధికం. ప్రైవేటు రంగంలో మంచి ఉద్యోగం వస్తే నిరుత్సాహపడకుండా చేరి నైపుణ్యాలు మెరుగుపర్చుకోండి. అంతర్జాతీయ మీడియా సంస్థల్లో ఉద్యోగ ప్రయత్నాలు చేయండి.

ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని