ఇంజినీరింగ్‌ కాకుండా...

ఇంటర్మీడియట్‌ (ఎంపీసీ) పూర్తిచేశాను. సివిల్‌ సర్వెంట్‌ కావాలనేది నా లక్ష్యం. వీలుకాకపోతే ప్రభుత్వ ఉద్యోగంలోనైనా స్థిరపడాలనుంది. మ్యాథ్స్‌ అంటే చాలా ఇష్టం.

Updated : 01 May 2024 00:29 IST

ఇంటర్మీడియట్‌ (ఎంపీసీ) పూర్తిచేశాను. సివిల్‌ సర్వెంట్‌ కావాలనేది నా లక్ష్యం. వీలుకాకపోతే ప్రభుత్వ ఉద్యోగంలోనైనా స్థిరపడాలనుంది. మ్యాథ్స్‌ అంటే చాలా ఇష్టం. ఇంజినీరింగ్‌ కాకుండా ఇంకా ఏ కోర్సులు చదవొచ్చు?

పి.వైష్ణవి

ఇంటర్‌ తరువాత ఇంజనీరింగ్‌ కాకుండా చాలా రకాల ప్రోగ్రామ్స్‌ చదివే అవకాశం ఉంది. మీరు ఇంటర్‌లో ఎంపీసీ చదివారు కాబట్టి, డిగ్రీలో కూడా మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీతో బీఎస్సీ చదవొచ్చు. మ్యాథ్స్‌తో పాటు ఫిజిక్స్‌/ ఎలక్ట్రానిక్స్‌/ ఎకనామిక్స్‌ /స్టాటిస్టిక్స్‌/ కంప్యూటర్‌ సైన్స్‌/ జియాలజీ లాంటి కాంబినేషన్లు చదవొచ్చు. ఇవే కాకుండా బీఎస్సీలో డేటా సైన్స్‌లో చేరే అవకాశం ఉంది. మీకు బిజినెస్‌ రంగంపై ఆసక్తి ఉంటే బీబీఏ, బీకాం, జర్నలిజం, టూరిజం లాంటి ప్రోగ్రామ్స్‌ చదవొచ్చు. న్యాయవాద వృత్తిపై ఆసక్తి ఉంటే ఐదు సంవత్సరాల ఎల్‌ఎల్‌బీలో చేరొచ్చు. యూపీఎస్సీ పరీక్షలో లా సబ్జెక్టును కూడా ఒక ఆప్షనల్‌గా ఎంచుకోవచ్చు. సివిల్‌ సర్వీసెస్‌ ఉద్యోగానికి ఏ డిగ్రీ చదివినా అర్హులు అవుతారు. కానీ మీరు సివిల్స్‌ పరీక్షలో భవిష్యత్తులో ఎంచుకోబోయే ఆప్షనల్‌ సబ్జెక్టును దృష్టిలో పెట్టుకొని డిగ్రీలో ఆ సబ్జెక్టు చదివే ప్రయత్నం చేయవచ్చు. హిస్టరీ, ఎకనామిక్స్‌, పొలిటికల్‌ సైన్స్‌, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, జాగ్రఫీ, ఆంత్రొపాలజీ, సోషియాలజీ, సైకాలజీ, జియాలజీ, తెలుగు సాహిత్యం, ఇంగ్లిష్‌, సంస్కృత సాహిత్యం లాంటి వాటి గురించి కూడా ఆలోచించవచ్చు. రాష్ట్రస్థాయి పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఉద్యోగాలకూ డిగ్రీ విద్యార్హత సరిపోతుంది. వీటితో పాటు స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌, రైల్వే రిక్రూట్‌మెంట్‌, బ్యాంకింగ్‌ లాంటి పలు ఉద్యోగాలకు డిగ్రీ విద్యార్హతతో పోటీపడి విజయం సాధించవచ్చు.

ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని