రెండు పరీక్షలూ ఒకేసారి...

Published : 07 May 2024 00:53 IST

బీఏ (దూరవిద్య) రెండో ఏడాది చదువుతున్నాను. నా వయసు 27. 2016లో బీఎస్సీ రెగ్యులర్‌ డిగ్రీ చివరి ఏడాది కాలేజీకి వెళ్లలేదు. పది సబ్జెక్టులు మిగిలాయి. వీటిని ఇప్పుడు రాయాలనుకుంటున్నా. అయితే రెండు డిగ్రీల పరీక్షలు మేలోనే ఉండే అవకాశం ఉంది. వీటిలో దేనికి ప్రాధాన్యమివ్వాలి?

రాజు

ప్రతి డిగ్రీ పూర్తి చేయడానికి నిర్దిష్ట కాల వ్యవధి ఉంటుంది. యూజీసీ నిబంధనల ప్రకారం- మూడు సంవత్సరాల డిగ్రీని గరిష్ఠంగా ఐదు సంవత్సరాల వ్యవధిలో పూర్తిచేయాలి. కొన్ని యూనివర్శిటీలు కాలపరిమితి విషయంలో కొంత ఉదాసీనంగా ఉంటున్నాయి. మీరు బీఎస్సీ చదివిన యూనివర్శిటీలో గరిష్ఠ వ్యవధి గురించి తెలుసుకోండి. ఒకవేళ పరీక్షలు రాయడానికి వెసులుబాటు ఉన్నా, మీరు 2016లో బీఎస్సీ చివరి సంవత్సరం కాలేజీకి వెళ్లనందున డిగ్రీ పరీక్షలు రాయడం కుదరదు. బీఎస్సీలో ప్రాక్టికల్స్‌ కూడా ఉంటాయి. అందుకని కళాశాలకు వెళ్లడ[ం తప్పనిసరి. మీరు చెబుతున్న పది సబ్జెక్టులు ఫైనల్‌ ఇయర్‌తో కలిపా? మొదటి రెండు సంవత్సరాలకు సంబంధించినవా? ఇప్పుడు మీరు పది సబ్జెక్టులు రాసినా, అన్నింటిలో ఉత్తీర్ణత సాధించడం చాలా కష్టం కాబట్టి, బీఏ పరీక్షలు రాయడం ఉపయోగకరం. మీరు బీఏ డిగ్రీని అయినా మూడు సంవత్సరాల్లో పూర్తి చేసేందుకు ప్రయత్నించండి. ఆసక్తి ఉంటే మీ యూనివర్సిటీ నిబంధనలు అనుమతిస్తే, బీఎస్సీ పూర్తికి ప్రయత్నం చేయవచ్చు. మూడు సంవత్సరాల బీఎస్సీ డిగ్రీని సుదీర్ఘ వ్యవధిలో పూర్తి చేయడం వల్ల ఆ డిగ్రీతో ఉద్యోగం పొందడం కూడా కష్టమవుతుంది. ఉద్యోగం పొందడానికి డిగ్రీ సర్టిఫికెట్‌ అర్హత మాత్రమే. మేటి కొలువులు దక్కాలంటే విద్యార్హతతో పాటు విషయ పరిజ్ఞానం, నైపుణ్యాలు కూడా చాలా ముఖ్యం.

ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని