ఈ స్పెషలైజేషన్‌ ఎక్కడుంది?

బీటెక్‌ (మెకానికల్‌ ఇంజినీరింగ్‌) కిందటి ఏడాది పూర్తిచేసి.. మెకానికల్‌ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తున్నాను. ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ మేనేజ్‌మెంట్‌లో ఎంబీఏ చేయాలనుంది.

Updated : 15 May 2024 00:33 IST

బీటెక్‌ (మెకానికల్‌ ఇంజినీరింగ్‌) కిందటి ఏడాది పూర్తిచేసి.. మెకానికల్‌ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తున్నాను. ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ మేనేజ్‌మెంట్‌లో ఎంబీఏ చేయాలనుంది. ఇది ఎక్కడ ఉంది?

ఎ.పవన్‌ కుమార్‌

సాధారణంగా ఎంబీఏ చదివినవారికి విభిన్న రంగాల్లో ఉద్యోగావకాశాలు ఉంటాయి. ఎంబీఏ స్పెషలైజేషన్‌తోపాటు అండర్‌ గ్రాడ్యుయేట్‌ డిగ్రీలో చదివిన కోర్సులు, గత ఉద్యోగానుభావం లాంటి అంశాలు మరో ఉద్యోగంలోకి మారడానికీ, పదోన్నతికీ దోహదపడతాయి. ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ మేనేజ్‌మెంట్‌ ్లో ఎంబీఏ చేస్తే, మీ ఉద్యోగావకాశాలు ఆయిల్‌, గ్యాస్‌ రంగాలకే పరిమితం అవుతాయి. ఇప్పటికే ఆయిల్‌, గ్యాస్‌ రంగంలో పనిచేసేవారు ఈ కోర్సు చేస్తే ఎక్కువ ఉపయోగకరం. విదేశాల్లో ఎంబీఏ ప్రోగ్రాంలో ప్రవేశం పొందాలంటే సంబంధిత రంగంలో ఉద్యోగానుభవం అవసరం. ఎంబీఏలో ఆపరేషన్స్‌ మేనేజ్‌మెంట్‌, లాజిస్టిక్స్‌ మేనేజ్‌మెంట్‌, సప్లై చెయిన్‌ మేనేజ్‌మెంట్‌, ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌ లాంటి స్పెషలైజేషన్‌తో చదివితే గ్యాస్‌, ఆయిల్‌ రంగాలతో పాటు ఇతర రంగాల్లో కూడా ఉద్యోగావకాశాలు పెరుగుతాయి.

ప్రపంచవ్యాప్తంగా ఎంబీఏ ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రాంను అతి తక్కువ యూనివర్శిటీలు మాత్రమే అందిస్తున్నాయి. మన దేశంలో దీన్ని యూనివర్సిటీ ఆఫ్‌ పెట్రోలియం అండ్‌ ఎనర్జీ స్టడీస్‌, దేహ్రాదూన్‌ అందిస్తోంది. ఈ ప్రోగ్రాం యూకే, ఆస్ట్రే లియా, యూఎస్‌ యూనివర్సిటీల్లో ఎంబీఏలో కాకుండా.. ఎంఎస్‌లో భాగంగా అందుబాటులో ఉంది. యూనివర్సిటీ ఆఫ్‌ అబెర్డీన్‌, యూనివర్సిటీ ఆఫ్‌ డూండీ, బ్రూనెల్‌ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్‌ ఈస్ట్‌ లండన్‌, ఇంజినీరింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, గ్లాస్గో కలేడోనియన్‌ యూనివర్సిటీ, కొవెంట్రీ యూనివర్సిటీ, టెక్సాస్‌ ఏ అండ్‌ ఎం యూనివర్సిటీల్లో పీజీలో ఈ స్పెషలైజేషన్‌ ఉంది. ఆయా యూనివర్సిటీల వెబ్‌సైట్‌లకు వెళ్లి మరిన్ని వివరాలు తెలుసుకోండి.

ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు