పీజీలో వేరే కోర్సు చదివితే?

1980ల్లో కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌లో డిగ్రీ/ పీజీ చదివినవారు తక్కువమంది. అందుకని మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, ఫిజిక్స్, ఇతర ఇంజినీరింగ్‌ సబ్జెక్టుల్లో పీజీ చేసినవారు పీహెచ్‌డీలో కంప్యూటర్‌ సైన్స్‌ సంబంధిత అంశంపై పరిశోధన చేసి సీఎస్‌ విభాగంలో బోధన ఉద్యోగాలు  పొందేవారు.

Published : 20 May 2024 00:12 IST

బీటెక్‌ (ఎలక్ట్రికల్‌), ఎంటెక్‌ (కంప్యూటర్‌ సైన్స్‌) చేశాను. డిఫెన్స్‌లో జూనియర్‌ సైంటిఫిక్‌ ఆఫీసర్‌గా ఉద్యోగం చేస్తున్నా. తరచూ బదిలీలుంటాయి. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా స్థిరపడాలనుంది. యూజీ, పీజీల్లో వేర్వేరు కోర్సుల వల్ల దీనికి ఇబ్బంది ఉంటుందా?

విజయ్‌కుమార్‌ 

  • 1980ల్లో కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌లో డిగ్రీ/ పీజీ చదివినవారు తక్కువమంది. అందుకని మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, ఫిజిక్స్, ఇతర ఇంజినీరింగ్‌ సబ్జెక్టుల్లో పీజీ చేసినవారు పీహెచ్‌డీలో కంప్యూటర్‌ సైన్స్‌ సంబంధిత అంశంపై పరిశోధన చేసి సీఎస్‌ విభాగంలో బోధన ఉద్యోగాలు  పొందేవారు. 1990ల్లో ఎంటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌ సీట్లు ఎక్కువ సంఖ్యలో అందుబాటులోకి వచ్చాయి. దీంతో ఎంటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌ చేసినవారికి మాత్రమే కంప్యూటర్‌ సైన్స్‌ విభాగంలో బోధించే అవకాశం కల్పించారు. 2000 సంవత్సరం తరువాత బీటెక్, ఎంటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌ చదివినవారు, కంప్యూటర్‌ సైన్స్‌లో పీహెచ్‌డీ చేసినవారు ఎక్కువమంది ఉండటం వల్ల కంప్యూటర్‌ సైన్స్‌లో బీటెక్, ఎంటెక్, పీహెచ్‌డీ చేసినవారికి మాత్రమే కంప్యూటర్‌ సైన్స్‌ అధ్యాపక ఉద్యోగాలు పొందుతున్నారు. ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ ఐటీల్లో ఈ ఇబ్బంది లేదు. కంప్యూటర్‌ సైన్స్‌ రంగంలో అత్యుత్తమ పరిశోధన పత్రాలు ప్రచురించి ఉంటే, గ్రాడ్యుయేషన్‌లో చదివిన సబ్జెక్టుతో సంబంధం లేకుండా సీఎస్‌ విభాగంలో బోధించే అవకాశం ఇస్తున్నారు. 
    ఇంజినీరింగ్‌ విద్య అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) పరిధిలో ఉంది కాబట్టి, వారి నిబంధనల ప్రకారమే ఇంజినీరింగ్‌ కళాశాలల్లో బోధన నియామకాలు చేపడతారు. ప్రత్యేక సందర్భాల్లో కొన్ని ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలలు బీటెక్‌లో చదివిన సబ్జెక్టుతో సంబంధం లేకుండా ఎంటెక్‌ డిగ్రీని బట్టి ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయి. కానీ సంబంధిత అనుబంధ యూనివర్సిటీ, వారి సర్వీసును ర్యాటిఫై చేయడం లేదు. కొన్ని యూనివర్శిటీలు మాత్రం గ్రాడ్యుయేషన్‌ స్థాయిలో కంప్యూటర్‌ సైన్స్‌ చదవకుండా ఎంటెక్‌లో కంప్యూటర్‌ సైన్స్‌ చదివినవారు ఎన్‌పీటెల్‌లో నాలుగు కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సులు చదివి సర్టిఫికెట్‌ పొందితే కంప్యూటర్‌ సైన్స్‌ విభాగంలో బోధించడానికి  అనుమతిస్తున్నాయి. 
    జాతీయ విద్యావిధానం- 2020 పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చాక, వివిధ సబ్జెక్టుల మధ్య అడ్డుగోడలు తొలగిపోయి, అధ్యాపక నియామకాల్లో చాలా వెసులుబాట్లు ఉంటాయి. ఇటీవల యూజీసీ జారీచేసిన జేెఆర్‌ఎఫ్‌- నెట్‌ నోటిఫికేషన్‌లో 75 శాతంతో నాలుగు సంవత్సరాల డిగ్రీ పూర్తి చేసినవారు నచ్చిన సబ్జెక్టులో నెట్‌ రాసి పీహెచ్‌డీ చేయవచ్చని పేర్కొన్నారు. కాబట్టి, భవిష్యత్తులో మీరు కంప్యూటర్‌ సైన్స్‌ విభాగంలో బోధించడానికి ఇబ్బందులు ఉండకపోవచ్చు. మీకు బోధన రంగంలో ఆసక్తి ఉంటే ముందుగా ఏదైనా  ప్రైవేటు పాలిటెక్నిక్‌ కళాశాలలో ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో అధ్యాపకుడిగా బోధన కెరియర్‌ను ప్రారంభించవచ్చు. అదే సమయంలో కంప్యూటర్‌ సైన్స్‌/ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌/డేటా సైన్స్‌లో పీహెచ్‌డీ చేసి, భవిష్యత్తులో ఈ విభాగాల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఉద్యోగానికి ప్రయత్నాలు చేయండి. 

ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని