డిప్లొమా తర్వాత బీఏ.. సమస్యేనా?

ఇంజినీరింగ్‌ డిప్లొమా (ఈఈఈ) చేసి ప్రభుత్వ ఉద్యోగంలో ప్రమోషన్‌ కోసం ఓపెన్‌ యూనివర్సిటీలో బీఏ చేశాను.

Published : 22 May 2024 00:08 IST

ఇంజినీరింగ్‌ డిప్లొమా (ఈఈఈ) చేసి ప్రభుత్వ ఉద్యోగంలో ప్రమోషన్‌ కోసం ఓపెన్‌ యూనివర్సిటీలో బీఏ చేశాను. ఇలా ఇంజినీరింగ్‌ డిప్లొమా తర్వాత.. ఆర్ట్స్‌ డిగ్రీ చేయడం ఏమైనా ఇబ్బందా? నాకు అటవీ శాఖలో ఉద్యోగం చేయాలనుంది. వయసు 26 ఏళ్లు. తెలుగు రాష్ట్రాల్లో డిస్టెన్స్‌లో బీటెక్‌ ఎక్కడ చేయొచ్చు?

హరీష్‌ 

ఇంజనీరింగ్‌ డిప్లొమా తర్వాత బీఏ డిగ్రీ చేయడం వల్ల ఎలాంటి ఇబ్బందీ లేదు. చాలా సందర్భాల్లో, ఇంజనీరింగ్‌ డిప్లొమాను ఇంటర్మీడియట్‌కు సమానంగానే పరిగణిస్తారు. మీరు డిగ్రీ అర్హత ఉన్న అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాలకూ అర్హులు అవుతారు. అటవీ శాఖలో కూడా డిగ్రీ అర్హత ఉన్న ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

ఏఐసీటీఈ నిబంధనల ప్రకారం ఇంజినీరింగ్‌ కోర్సుల్ని దూరవిద్య ద్వారా చదవడం కుదరదు. కానీ ఈవెనింగ్‌ కాలేజీ ద్వారా కంటిన్యూయింగ్‌ ఎడ్యుకేషన్‌ పద్ధతిలో చదివే వెసులుబాటు ఉంది. ఉస్మానియా యూనివర్సిటీ ఇంజినీరింగ్‌ కళాశాలలో మూడు సంవత్సరాల బీఈ ప్రోగ్రాం ఉంది. ఈ ప్రోగ్రాంను ఆరు సెమిస్టర్లలో అందిస్తారు. ఒక్కో సెమిస్టర్‌కు ట్యూషన్‌ ఫీజు 50 వేల రూపాయలు. దీనిలో ప్రవేశం పొందాలంటే, మూడు సంవత్సరాల ఇంజినీరింగ్‌ డిప్లొమాలో కనీసం 45 శాతం మార్కులు పొందివుండాలి. కనీసం ఒక సంవత్సరం ఉద్యోగానుభవం ఉండి, హైదరాబాద్‌కు 100 కిలోమీటర్ల లోపు దూరంలో ఉన్న సంస్థలో ఉద్యోగం చేస్తూ ఉండాలి. ప్రస్తుతం ఈ అవకాశం సివిల్, మెకానికల్, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ మెషిన్‌ లెర్నింగ్‌ల్లో మాత్రమే అందుబాటులో ఉంది. ఏఐ అండ్‌ ఎంఎల్‌ ప్రోగ్రాంలో ప్రవేశానికి కంప్యూటర్‌ సైన్స్‌ డిప్లొమా చదివినవారు మాత్రమే అర్హులు. ఒకవేళ కంప్యూటర్‌ సైన్స్‌ డిప్లొమా చదివినవారు తగినంతమంది లేకపోతే, ఇతర డిప్లొమాల వారినీ పరిగణిస్తారు. భవిష్యత్తులో ఇతర బ్రాంచీల్లో కూడా ఈ ప్రోగ్రాం అందుబాటులోకి రావచ్చు. బిట్స్‌ పిలానీలో వర్క్‌ ఇంటిగ్రేటెడ్‌ లెర్నింగ్‌ ప్రోగ్రాం ద్వారా ఆన్‌లైన్‌ పద్ధతిలో బీటెక్‌ ప్రోగ్రాం అందుబాటులో ఉంది. దీన్ని యూజీసీ అనుమతించింది. కానీ ఈ నాలుగేళ్ల బీటెక్‌ ప్రోగ్రాం ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్, ఇంజినీరింగ్‌ టెక్నాలజీ, ప్రాసెస్‌ ఇంజినీరింగ్‌ల్లో మాత్రమే ప్రస్తుతం అందిస్తున్నారు.

ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌ 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని