కొలువు పొందే వీలుందా?

బీసీఏ 2012-2015 మధ్యకాలంలో చదివాను. బ్యాక్‌లాగ్స్‌ 2020లో పూర్తిచేశాను. వయసు 34. కెరియర్‌ గ్యాప్, వయసు ఎక్కువగా ఉండటం వల్ల ఉద్యోగం రావడం లేదు.

Published : 28 May 2024 00:23 IST

బీసీఏ 2012-2015 మధ్యకాలంలో చదివాను. బ్యాక్‌లాగ్స్‌ 2020లో పూర్తిచేశాను. వయసు 34. కెరియర్‌ గ్యాప్, వయసు ఎక్కువగా ఉండటం వల్ల ఉద్యోగం రావడం లేదు. పైగా ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజెస్‌ మీద పట్టులేదు. ఈ వయసులో ఏదైనా కోర్సు నేర్చుకుంటే ఉద్యోగం వస్తుందా? స్వయంఉపాధి మార్గాలున్నాయా? 

ఉపేందర్‌

కెరియర్‌లో విరామం రావడంతో పాటు వయసు కూడా ఎక్కువ కావడం వల్ల ఉద్యోగావకాశాలు రావడం లేదు అన్నారు. గత కొద్ది సంవత్సరాలుగా ఇంజినీరింగ్‌లో కంప్యూటర్‌ సైన్స్‌ చదివినవారు ఎక్కువమంది అందుబాటులో ఉన్నందున బీసీఏ, బీఎస్సీ (కంప్యూటర్‌ సైన్స్‌) లాంటి కోర్సులు చదివినవారికి ఉద్యోగావకాశాలు కొంతమేరకు తగ్గాయి. మీకు ప్రోగ్రామింగ్‌ మీద పట్టులేదంటున్నారు కాబట్టి కొత్త కోర్సులు నేర్చుకోవడమూ కొంత కష్టం కావొచ్చు. డేటా సైన్స్, మెషిన్‌ లెర్నింగ్, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌కు సంబంధించిన కోర్సులు నేర్చుకుంటే, ఉద్యోగావకాశాలు మెరుగవుతాయి. కంప్యూటర్‌ కోర్సులు కాకుండా మీకు ఏ రంగంపై ఆసక్తి ఉందో తెలుసుకొని దానిలో స్థిరపడే కోర్సులు చదివే ప్రయత్నం చేయండి.

మేనేజ్‌మెంట్‌ రంగంలో ఆసక్తి అంటే ఎంబీఏ, జర్నలిజం ఇష్టమైతే ఎంఏ జర్నలిజం, బోధన రంగంలో అభిరుచి ఉంటే బీఈడీ, కౌన్సెలింగ్‌పై అభిలాష ఉంటే సైకాలజీ పీజీ, ఇంగ్లిష్‌పై ఆసక్తి ఉంటే ఎంఏ ఇంగ్లిష్, సోషల్‌ సైన్స్‌ ఇష్టమైతే పీజీలో ఎకనామిక్స్, సోషియాలజీ, హిస్టరీ, పొలిటికల్‌ సైన్స్, ఆంత్రపాలజీ, హిస్టరీ, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్, పబ్లిక్‌ పాలసీ‡, రూరల్‌ డెవలప్‌మెంట్, జాగ్రఫీ లాంటివి చదవొచ్చు. నిజమైన ఆసక్తి ఉంటే ఏ వయసులోనైనా చదువుకోవచ్చు. బీసీఏని కంప్యూటర్‌ కోర్సుగా కాకుండా ఒక డిగ్రీ కోర్సుగా భావించి, డిగ్రీ అర్హత ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాల కోసం ప్రయత్నించండి.

స్వయం ఉపాధి మార్గాల విషయానికి వస్తే- బీసీఏ చదివారు కాబట్టి, కంప్యూటర్‌ యాక్సెసరీ స్టోర్, కంప్యూటర్‌ సర్వీసింగ్‌ సెంటర్, మొబైల్‌ సర్వీసింగ్‌ సెంటర్, కంప్యూటర్‌ నెట్‌వర్క్స్‌లాంటి వాటి గురించి ఆలోచించండి. ఒకవేళ కంప్యూటర్స్‌కు సంబంధం లేని వ్యాపారం చేయాలనుకుంటే చిన్న కిరాణా దుకాణం మొదలు, మిల్క్‌ సెంటర్, హార్డ్‌వేర్‌ స్టోర్స్, స్టేషనరీ స్టోర్స్, ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ, ఎలక్ట్రికల్‌ స్టోర్స్‌ లాంటివీ ఆలోచించవచ్చు. చదివిన చదువుకు తగ్గ ఉపాధి దొరక్కపోతే, మనసుకి నచ్చిన పని చేయాలి. అదికూడా కుదరకపోతే, ఆదాయం ఎక్కువగా వచ్చే ఉపాధిని వెతుక్కోవాలి. మారుతున్న పరిస్థితుల్లో కోర్సుతో సంబంధం లేకుండా నిజాయతీగా ఎలాంటి పని చేయడానికైనా ఇబ్బంది పడకపోతే, మెరుగైన భవిష్యత్తు ఉంటుంది.

ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని