పీహెచ్‌డీనా? ఉద్యోగమా?

బీటెక్‌ (సివిల్‌) తర్వాత ఎంబీఏ హెచ్‌ఆర్‌ అండ్‌ ఫైనాన్స్‌ పూర్తిచేశాను. ఇప్పుడు ఎంబీఏలో పీహెచ్‌డీ చేయటం మంచిదా? ఉద్యోగంలో చేరమంటారా?

Published : 11 Jun 2024 00:16 IST

బీటెక్‌ (సివిల్‌) తర్వాత ఎంబీఏ హెచ్‌ఆర్‌ అండ్‌ ఫైనాన్స్‌ పూర్తిచేశాను. ఇప్పుడు ఎంబీఏలో పీహెచ్‌డీ చేయటం మంచిదా? ఉద్యోగంలో చేరమంటారా?

కె. సూర్య

మీ విద్యార్హతలతో సివిల్‌ ఇంజనీర్‌/ హెచ్‌ఆర్‌ మేనేజర్‌/ ఫైనాన్స్‌ మేనేజర్‌గా ఉద్యోగం చేసే అవకాశం ఉంది. అలా కాకుండా, బీటెక్, ఎంబీఏ రెండు డిగ్రీలను ఉపయోగించుకొని ఏవైనా కన్‌స్ట్రక్షన్‌ కంపెనీల్లో కానీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కంపెనీల్లో కానీ, సిమెంట్‌ ఫ్యాక్టరీల్లో కానీ కొలువు పొందవచ్చు.

సాధారణంగా సివిల్‌ ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్‌ రంగాల్లో మంచి ఉద్యోగాలు పొందాలంటే ఉద్యోగానుభవం అవసరం. ఒకవేళ మీకు గత ఉద్యోగానుభవం లేకపోతే మొదటి ఉద్యోగాన్ని తక్కువ వేతనంతో అయినా ప్రారంభించి మెలకువలు తెలుసుకోండి. కొంత అనుభవం గడించాక మెరుగైన కొలువుకు మారే ప్రయత్నం చేయవచ్చు.

మీరు ఎంబీఏలో పీహెచ్‌డీ చేయాలని ఎందుకనుకొంటున్నారు? బోధన రంగంపై ఆసక్తి ఉందా? లేదా మేనేజ్‌మెంట్‌లో పీహెచ్‌డీ చేసి, ఇండస్ట్రీలోకి వెళ్లే ఉద్దేశం ఉందా? భవిష్యత్తులో ఎలా స్థిరపడాలనుకొంటున్నారన్న విషయంపై స్పష్టత అవసరం.

ఒకవేళ మీరు పీహెచ్‌డీ చేసి మెరుగైన ఉపాధి పొందాలనుకుంటే- ఐఐఎం, ఐఐటీల్లాంటి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల నుంచి కానీ, ప్రముఖ విదేశీ యూనివర్సిటీల నుంచి కానీ పీహెచ్‌డీ చేసే ప్రయత్నం చేయండి. పరిశోధనపై ఆసక్తితో కనీసం నాలుగేళ్ల పాటు ఎలాంటి విసుగూ లేకుండా పట్టుదలతో, ఓపిగ్గా నాణ్యమైన కృషి చేయాలి. ఆపై అంతర్జాతీయ జర్నల్స్‌లో పరిశోధన పత్రాలు ప్రచురించి, బోధన, పరిశోధన రంగాల్లో మెలకువలు నేర్చుకొంటేనే మీ పీహెచ్‌డీకి విలువ ఉంటుంది. ఈ డిగ్రీని ఆభరణంలా కాకుండా, తపస్సులాగా చేసినప్పుడే మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈ విషయాలన్నిటినీ దృష్టిలో పెట్టుకొని సరైన నిర్ణయం తీసుకోండి.

ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని