దుబాయ్‌కి అలా వెళ్లొచ్చా?

బ్యాచిలర్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ (బీహెచ్‌ఎం) పూర్తిచేశాను. దుబాయ్‌ వెళ్లాలనుకుంటున్నా. కన్సల్టెన్సీలో డబ్బు కట్టి వెళ్లొచ్చా?

Published : 12 Jun 2024 00:30 IST

బ్యాచిలర్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ (బీహెచ్‌ఎం) పూర్తిచేశాను. దుబాయ్‌ వెళ్లాలనుకుంటున్నా. కన్సల్టెన్సీలో డబ్బు కట్టి వెళ్లొచ్చా?

- లోకేష్‌

హోటల్‌ మేనేజ్‌మెంట్‌ చదివినవారికి విదేశాల్లో ఉద్యోగావకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. విదేశాలకు వెళ్లి ఉద్యోగం చేయాలనే తొందరలో చాలామంది బోగస్‌ కన్సల్టెన్సీల్లో డబ్బు కట్టి మోసపోతున్నారు. మీరు కన్సల్టెన్సీని సంప్రదించే ముందు కొంత హోమ్‌ వర్క్‌ చేసుకోండి. ముఖ్యంగా ఆ కన్సల్టెన్సీ విశ్వసనీయత పూర్తిగా తెలుసుకోండి. ఒక్కదానిమీదే ఆధారపడకుండా రెండు మూడు కన్సల్టెన్సీలను సంప్రదించి వాటి సమాచారాన్ని తెలుసుకోండి. మీ కళాశాల సీనియర్లు ఎవరైనా దుబాయ్‌లో పనిచేస్తుంటే, వారి ద్వారా అక్కడి ఉద్యోగ మార్కెట్‌ సమాచారాన్ని సేకరించండి. వారు దుబాయ్‌లో ఎలా ఉద్యోగం పొందారో కూడా కనుక్కోండి. వారి అనుభవాలను పరిగణనలోకి తీసుకొని, సరైన కన్సల్టెన్సీని సంప్రదించి మీ సందేహాలను నివృత్తి చేసుకోండి. ఇంటర్‌నెట్‌లో కూడా కన్సల్టెన్సీల గురించి చాలా సమాచారం అందుబాటులో ఉంది. అది కూడా దృష్టిలో పెట్టుకొని సరైన నిర్ణయం తీసుకోండి. వీలైనంత వరకు కన్సల్టెన్సీతో సంబంధం లేకుండా అక్కడ ఉద్యోగం పొందే అవకాశాల గురించీ ఆలోచించండి. కన్సల్టెన్సీ ద్వారా విదేశాలకు వెళ్ళడంపై పూర్తి నమ్మకం లేకపోతే, మనదేశంలో ఉన్న అంతర్జాతీయ హోటల్‌లో కొంతకాలం ఉద్యోగం చేసి, బదిలీ ద్వారా దుబాయ్‌ వెళ్లే మార్గం ఉంది. అక్కడ కొంతకాలం పనిచేసి, ఆ తరువాత దుబాయ్‌లో మరో ఉద్యోగం పొందే ప్రయత్నాలు చేయవచ్చు. 

- ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌  


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని