ఇంజినీరింగ్‌ పరీక్షలు... ఎన్ని రాస్తే మేలు?

ఇంజినీరింగ్‌లో చేరదల్చిన విద్యార్థులకు దాదాపు ఇరవై అయిదు ప్రవేశపరీక్షలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఎక్కువ సంఖ్యలో పరీక్షలకు దరఖాస్తు చేసుకోవాలా?

Published : 28 Mar 2016 02:42 IST

ఇంజినీరింగ్‌ పరీక్షలు... ఎన్ని రాస్తే మేలు?

ఇంజినీరింగ్‌లో చేరదల్చిన విద్యార్థులకు దాదాపు ఇరవై అయిదు ప్రవేశపరీక్షలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఎక్కువ సంఖ్యలో పరీక్షలకు దరఖాస్తు చేసుకోవాలా? కొన్నిటికే పరిమితమైతే మంచిదా? వేటిని ఏ అంశాలు చూసి, ఎంచుకుని, సిద్ధమవ్వాలి? ఈ సందేహాలను నివృత్తి చేసే కథనమిది!
ఎంసెట్‌లో 160 ప్రశ్నలు, బిట్‌శాట్‌లో 150 ప్రశ్నలు. అందువల్ల బిట్‌శాట్‌కు తయారైతే ఎంసెట్‌కు కావలసిన వేగం, కచ్చితత్వం ఏర్పరుచుకోవచ్చు.

నదేశంలో ఇంజనీరింగ్‌ విద్యను ఎంచుకునేవారిలో తెలుగు రాష్ట్రాలది ప్రథమ స్థానం. రెండు రాష్ట్రాల్లో ఇంటర్‌ విద్యార్థుల సంఖ్య 11 లక్షల వరకు ఉంటే వారిలో 4 లక్షలమంది వరకూ ఎం.పి.సి. వారే. అత్యధికులు ఇంజనీరింగ్‌లో చేరటానికి రాసే పరీక్ష ఎంసెట్‌. ప్రతిభావంతులు కెరియర్‌ పరంగా ప్రాధాన్యక్రమంలో మొగ్గు చూపే సంస్థలు- ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ఐఐఐటీలు, బిట్స్‌, విశ్వవిద్యాలయ కళాశాలలు, స్వయంప్రతిపత్తి ఉన్న విశ్వవిద్యాలయాలు, తెలుగు రాష్ట్రాల్లోని అత్యుత్తమ 20 ఇంజినీరింగ్‌ కళాశాలలు. విద్యార్థులు సాధారణంగా కళాశాలకూ, ఆపై ఆసక్తి ఉన్న బ్రాంచికీ ప్రాధాన్యం ఇస్తుంటారు.

ఐఐటీల్లో ప్రవేశం పొందటానికి రాసే పరీక్ష... జేఈఈ అడ్వాన్స్‌డ్‌. దీనికి అర్హత పరీక్షగా ఈ సంవత్సరం వరకూ జేఈఈ-మెయిన్స్‌ ఉంటుంది. జేఈఈ-మెయిన్స్‌లో వివిధ కేటగిరీల్లో కలిపి 2,00,000 మంది తొలి విద్యార్థులకు అడ్వాన్స్‌ పరీక్ష రాసే వీలు కల్పిస్తారు. ఈ సంఖ్య గత ఏడాది వరకూ 1,50,000 ఉన్నది. ఇంటర్‌ మార్కులు కూడా అర్హతకు 75% లేదా తొలి 20 పర్సంటైల్‌లో ఉండాలని నిర్ణయించారు. సీటు సాధించగల అందరూ ఈ అర్హత సాధిస్తారు. అందువల్ల జేఈఈ-మెయిన్స్‌ను ఈ సంవత్సరం వరకూ అర్హత పరీక్షగా పరిగణించవచ్చు.

దీనిలో అర్హత పొంది రాసే జేఈఈ-అడ్వాన్స్‌డ్‌ 3 గంటల వ్యవధిలో 2 పేపర్లుగా జరుగుతుంది. ఆ పరీక్ష స్వరూపం ఏటా మారుతూనే ఉంటుంది. ఐఐటీల్లో ప్రవేశం కోరే విద్యార్థులు స్వయం నైపుణ్యం కలిగి ఉండాలనీ, ఏదైనా సమస్య ఏర్పడినప్పుడు దాన్ని సొంతంగా సాధించే దిశలో వారి ఆలోచన సాగాలనీ భావన. అందువల్లనే పరీక్ష ఆ విధంగా ఉంటుంది. పరీక్ష ఎలా ఉన్నా రాయగలమనే తత్వం ఉన్నవారే దీనిలో నెగ్గాలని ఇలా నిర్ణయించినట్లు గ్రహించాలి.

జేఈఈ-మెయిన్‌లో 90 ప్రశ్నలు ఉంటాయి. మేథమేటిక్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీలలో 30 చొప్పున మొత్తం 90 ప్రశ్నలతో సాధారణ విద్యార్థి రాయగల స్థాయిలో 50 ప్రశ్నల వరకు ఉంటాయి. ఈ పరీక్ష ద్వారా జేఈఈ-అడ్వాన్స్‌డ్‌కు అర్హత నిర్ణయించడమే కాకుండా ఎన్‌ఐటీ, ఐఐఐటీల్లో ప్రవేశం కోసం ఈ ర్యాంకు ఉపయోగపడుతుంది.

మెయిన్స్‌... అడ్వాన్స్‌డ్‌ తేడా?
జేఈఈ మెయిన్స్‌- అడ్వాన్స్‌డ్‌ పరీక్షల మధ్య ముఖ్యమైన తేడా ఏమిటి? మెయిన్స్‌లో ప్రాథమిక అంశాలపై అవగాహన, ఏక అభ్యాస సంబంధిత అంశాలపై అధిక ప్రశ్నలు ఉంటాయి. అదే అడ్వాన్స్‌డ్‌లో అయితే విషయపరంగా లోతు, వివిధ అభ్యాసాలను మిళితం చేసిన ప్రశ్నల సంఖ్య అధికం. అందువల్లనే జేఈఈ-మెయిన్‌లో అధిక మార్కులు సాధించినవారే అడ్వాన్స్‌డ్‌లో మంచి ర్యాంకులు సాధిస్తున్నారు.

జేఈఈయి-మెయిన్‌ ద్వారా ఎన్‌ఐటీల్లో సీటు సాధించే అవకాశం ఉన్నా దానిలో మెయిన్స్‌ మార్కుల కన్నా ఇంటర్‌ మార్కులకే ప్రాధాన్యం అధికం. ఇంటర్‌ మార్కుల పర్సంటైల్‌కు 40 శాతం వెయిటేజి ఇస్తున్నారు. పర్సంటైల్‌ అంటే ఒక విద్యార్థికి తన కంటె తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థుల సంఖ్య పర్సంటేజ్‌.

ఇంటర్‌ పర్సంటైల్‌ను జేఈఈ-మెయిన్‌ పర్సంటైల్‌గా పరిగణించి ఆ పర్సంటైల్‌కు సంబంధిత జేఈఈ-మెయిన్‌ మార్కును విద్యార్థి మార్కుగా తీసుకుంటారు. దానికి నలభై శాతం వెయిటేజి, జేఈఈ-మెయిన్‌లో సాధించిన మార్కుకు 60 శాతం వెయిటేజి ఇచ్చి తుది ర్యాంకును లెక్కిస్తున్నారు. దీనివల్ల ఇంటర్‌ మార్కులకు ఎక్కువ ప్రాధాన్యం లభిస్తోంది.

జూనియర్‌ ఇంటర్‌లో 470 మార్కులకు 440పైన వచ్చినవారికే మెయిన్స్‌లో మంచి ర్యాంకు సాధించే అవకాశం ఉంటుంది. జేఈఈ-మెయిన్స్‌లో 360 మార్కులకు కనీసం 180 మార్కులపైన సాధించేలా కృషిచేయగల్గితే మెయిన్స్‌లో సీటు సాధించినట్లే. అంటే... ఉన్న మూడు సబ్జెక్టుల్లో రెండింటిపై ఎక్కువ దృష్టి సాధించినా ఈ పరీక్షలో నెగ్గవచ్చు.

బిట్స్‌ ప్రవేశపరీక్ష
జూనియర్‌ ఇంటర్‌లో 430 లోపు మార్కులు తెచ్చుకున్నవారు బిట్‌శాట్‌ లాంటి పరీక్షలకు ప్రాధాన్యం ఇవ్వడం మేలు. బిట్‌శాట్‌లో ఇంటర్‌ మార్కులకు ప్రాధాన్యం లేదు. కేవలం ఇంటర్‌లో రాష్ట్ర ప్రథమ మార్కు సాధించిన విద్యార్థికి బిట్స్‌లో సీటు ఇస్తారు కానీ, మిగిలిన ర్యాంకులకు ఇంటర్‌ మార్కుల వెయిటేజి లేదు. అందువల్ల జూనియర్‌ ఇంటర్‌లో 430లోపు మార్కులు ఉన్నవారు బిట్‌శాట్‌కు తయారవడం ఉత్తమం.

ఈ పరీక్షలో 150 ప్రశ్నలుంటాయి. మేథమేటిక్స్‌ 45, ఫిజిక్స్‌ 40, కెమిస్ట్రీ 40, ఇంగ్లిష్‌, ఆప్టిట్యూడ్‌ రీజనింగ్‌లో 25 ప్రశ్నలు ఉంటాయి. సరైన సమాధానానికి +3 మార్కులు, తప్పు సమాధానానికి -1 మార్కు.

ఈ బిట్‌శాట్‌... ఎంసెట్‌ మాదిరిగానే ఉంటుందని చెప్పవచ్చు. ఎంసెట్‌లో 160 ప్రశ్నలు, బిట్‌శాట్‌లో 150 ప్రశ్నలు. అందువల్ల బిట్‌శాట్‌కు తయారైతే ఎంసెట్‌కు కావలసిన వేగం, కచ్చితత్వం ఏర్పరుచుకోవచ్చు. బిట్‌శాట్‌లో ర్యాంకును ప్రభావితం చేసేది ఇంగ్లిష్‌, ఆప్టిట్యూడ్‌ రీజనింగ్‌. ఈ సమయంలో వాటికి అధిక ప్రాధాన్యం ఇచ్చి అభ్యాసం చేయగల్గితే బిట్స్‌లో సీటు సులభంగానే సాధించవచ్చు.

కొన్ని వ్యత్యాసాలు...
వివిధ ఇంజినీరింగ్‌ ప్రవేశ పరీక్షలు 25కు పైగా ఉన్నాయి. వీటిన్నిటికీ దరఖాస్తు చేసి, అన్నీ రాసే ప్రయత్నం చేయటం సరైన పద్ధతి కాదు. రెండు నెలల వ్యవధిలో 25 పరీక్షలు అంటే దాదాపు ప్రతి రెండు రోజులకో పరీక్ష రాయటమని చెప్పుకోవచ్చు.

ఈ పరీక్షల్లో ఒక పరీక్షకూ వేరొక పరీక్షకూ కొన్ని వ్యత్యాసాలు ఉంటున్నాయి. ఎక్కువ పరీక్షలు రాయటమంటే విద్యార్థి ఆ తేడాలు తెల్సుకోవడానికి కూడా వీలు లేకుండా పోతుంది. దీనికంటే ఉన్న పరీక్షల్లో విద్యార్థి తాను సీటు సాధించాలని భావిస్తున్న సంస్థల పరీక్షలకే పరిమితమయితే అధిక లాభం చేకూరుతుంది.

జేఈఈ-మెయిన్స్‌, బిట్‌శాట్‌, ఎంసెట్‌ రాస్తున్నా వీటికి తోడు రెండు లేదా మూడు పరీక్షలకు పరిమితమై ప్రణాళిక వేసుకోవడం మేలు. తొలి నాలుగు పరీక్షల ఎంపిక తర్వాత ఆలోచించాల్సింది- తెలుగు రాష్ట్రాల్లో ఇంజినీరింగ్‌ చేయడమా, ఇతర రాష్ట్రాలకు వెళ్ళడమా అనేది. ఈ నిర్థారణకు వస్తే సగం పరీక్షలు తగ్గుతాయి. ఇక విద్యార్థి తన స్థాయికి అనుగుణంగా ఏ విద్యాసంస్థలో సీటు సాధించాడానికి అవకాశం ఉంటుందో వాటిపై సర్వశక్తులూ కేంద్రీకరింపగల్గితే విజయం సాధించవచ్చు.

ప్రవేశపరీక్షలను ఎంచుకొనేటప్పుడు పరీక్షలోని ప్రశ్నల సంఖ్యకు ఎక్కువ తేడా లేనివి తీసుకోవటం మంచిది. దీనివల్ల అభ్యాసం సులభమవుతుంది.

ఈ విధంగా పరీక్షలపై అవగాహన ఏర్పరుచుకొని కొన్ని నియమిత పరీక్షలకే పరిమితమవటం విజయావకాశాలను పెంచుతుంది. సాధన, పునశ్చరణ ఎక్కువగా చేయగల్గిన విద్యార్థులు ఈ ఇంజినీరింగ్‌ ప్రవేశపరీక్షల్లో విజయాలు సాధించి తమ భవిష్యత్తుకు బంగారు బాట వేసుకోగల్గుతారు!

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని