రెండు రాష్ట్రాల్లోనూ పోటీపడొచ్చా?

పీజీ (ఆర్గానిక్‌ కెమిస్ట్రీ) చేశాను. రసాయనాల కారణంగా ఏర్పడిన భయం వల్ల లెక్చరర్‌గా చేయాలంటే భయంగా ఉంది. సోషల్‌ మెథడాలజీలో బీఈడీ చేయాలనుకుంటున్నాను. కుదురుతుందా?

Published : 29 Aug 2016 01:13 IST

రెండు రాష్ట్రాల్లోనూ పోటీపడొచ్చా?

పీజీ (ఆర్గానిక్‌ కెమిస్ట్రీ) చేశాను. రసాయనాల కారణంగా ఏర్పడిన భయం వల్ల లెక్చరర్‌గా చేయాలంటే భయంగా ఉంది. సోషల్‌ మెథడాలజీలో బీఈడీ చేయాలనుకుంటున్నాను. కుదురుతుందా?

- ఓ పాఠకుడు

మీరు సోషల్‌ మెథడాలజీలో బీఈడీ చేయడం కుదరదు. చేయాలంటే ఇంటర్మీడియట్‌లో తప్పనిసరిగా సోషల్‌ను చదివివుండాలి. కాబట్టి మీరు మళ్లీ ఇంటర్‌ నుంచి సోషల్‌ సబ్జెక్టులను చదివితేనే ఆ సబ్జెక్టులో బీఈడీ చేయడానికి అవకాశం ఉంటుంది.

దూరవిద్య ద్వారా కంటే రెగ్యులర్‌గా చదవడానికి ప్రయత్నించండి. అపుడే సబ్జెక్టు తొందరగా అర్థం అవుతుంది. పైగా ఎంచుకున్నది ఉపాధ్యాయ వృత్తి కాబట్టి రెగ్యులర్‌గా చదవడం వల్ల మేలు అధికం. సబ్జెక్టును ఎక్కువగా నేర్చుకోవడానికీ, అవగాహన పెంపొందించుకోవడానికీ వీలుంటుంది.



ఎంఏ, బీఈడీ పూర్తిచేశాను. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నాను. రెండు తెలుగు రాష్ట్రాల పోటీపరీక్షలను రాయాలనుకుంటున్నాను. కుదురుతుందా?

- జి. ప్రశాంత్‌, కరీంనగర్‌

మీకు అర్హత ఉంది. ఏ రాష్ట్ర పోటీపరీక్ష అయినా ఉద్యోగాన్ని బట్టి 10%- 15% ఓపెన్‌ కేటగిరీకి కేటాయిస్తారు. ఇతర రాష్ట్రాలకు చెందినవారు ఈ కేటగిరీలో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. ఉద్యోగ నోటిఫికేషన్లో ఇచ్చిన అన్ని అర్హతలను కలిగి ఉంటే ఇతర రాష్ట్రాల పోటీపరీక్షలకు నిరభ్యంతరంగా దరఖాస్తు చేసుకోవచ్చు. కానీ ఆ రాష్ట్రాల రిజర్వేషన్‌ మాత్రం లభించదు.



ఎంఎస్‌సీ, మెడికల్‌ మైక్రోబయాలజీ మూడో సంవత్సరం చదువుతున్నాను. నాకు ఐఐటీల్లో పీహెచ్‌డీ చేసే వీలుందా? వివరాలు తెలపండి. ఉద్యోగావకాశాలెలా ఉంటాయి?

- డీవీ రమణ,

మన దేశంలో మెడికల్‌ మైక్రోబయాలజీలో పీహెచ్‌డీని అతి తక్కువ విద్యాసంస్థలు అందిస్తున్నాయి. ఐఐటీల్లో ప్రత్యేకంగా మెడికల్‌ మైక్రోబయాలజీ అందుబాటులో లేదు. దేశంలోని ఏఐఎంఎస్‌ (ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌)- న్యూదిల్లీలో మెడికల్‌ మైక్రోబయాలజీలో పీహెచ్‌డీ అందుబాటులో ఉంది.ఇది విభిన్నమైన కోర్సు. రకరకాల బాక్టీరియా, వైరస్‌ల వల్ల పెరుగుతున్న వ్యాధుల నిర్ధారణ, నివారణకు సంబంధించిన పరిశోధనల అవసరం నేడు ఎంతైనా ఉంది. కాబట్టి ఈ కోర్సు చదివినవారికి ఉద్యోగావకాశాలు ఎక్కువగానే ఉంటాయి.

ప్రభుత్వరంగ సంస్థలైన సెంటర్‌ ఫర్‌ డిజీజ్‌ కంట్రోల్‌, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ మొదలైన సంస్థల్లో, ప్రైవేటు హెల్త్‌కేర్‌ సర్వీసుల్లో, ఔషధాల తయారీ సంస్థల్లో ఉద్యోగావకాశాలు, మెడికల్‌ కళాశాలలు/ విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకునిగా అవకాశాలుంటాయి.



బీఏ పూర్తిచేసి, ఎంఏ తెలుగు (2011-13) దూరవిద్య ద్వారా, బీఈడీ (2011-12) రెగ్యులర్‌ కోర్సు చేశాను. ఒకే సంవత్సరం రెగ్యులర్‌, దూరవిద్య కోర్సులు చేయవచ్చా? నేను ఎస్‌ఏ, ఎల్‌పీ (తెలుగు) పోస్టులకు, ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయుడిగా అర్హుడినేనా?

- రాజేష్‌

ఒకేసారి 2 డిగ్రీలను కానీ, పీజీలనుకానీ, ఒక డిగ్రీ, ఒక పీజీ కోర్సులను చదవడానికి వీలు లేదు. గతంలో యూజీసీ ఈ విషయానికి సంబంధించి ఒక కమిటీని నియమించింది. కానీ ఈ విషయంపై ఇప్పటివరకూ ఎలాంటి స్పష్టత లేదు. ఎస్‌ఏ, ఎల్‌పీ పోస్టులకు దరఖాస్తు చేయడానికి డిగ్రీలో తెలుగును మెయిన్‌ సబ్జెక్టుగా చదివి ఉండాలి. అంతేకాకుండా బీఈడీ (తెలుగు) చదివి ఉండాలి. మీకు స్కూల్‌ అసిస్టెంట్‌, తెలుగు లాంగ్వేజ్‌ పండిట్‌ పోస్టులకు అర్హత ఉంటుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం డిగ్రీ, బీఈడీ చదివినవారు ప్రభుత్వ గుర్తింపు ఉన్న పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా పనిచేయడానికి అర్హత ఉంటుంది. కొన్ని పాఠశాలలు ప్రత్యేక నిబంధనలకు లోబడి పనిచేస్తాయి. వాటి నిబంధనల ప్రకారం మీ విద్యార్హత సరిపోతే ఏ పాఠశాలలో అయినా పనిచేయడానికి అర్హత ఉంటుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని