విదేశీ భాషలు నేర్చుకోవాలంటే...

అగ్రికల్చర్‌ ఇంజినీరింగ్‌ మొదటి సంవత్సరం చదువుతున్నాను. పై చదువులు చదవాలనుంది. వేటిని ఎంచుకోవాలి? ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో నాకున్న ఉద్యోగావకాశాలేంటి? - శ్రావణి

Published : 12 Dec 2016 01:26 IST

విదేశీ భాషలు నేర్చుకోవాలంటే...

 అగ్రికల్చర్‌ ఇంజినీరింగ్‌ మొదటి సంవత్సరం చదువుతున్నాను. పై చదువులు చదవాలనుంది. వేటిని ఎంచుకోవాలి? ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో నాకున్న ఉద్యోగావకాశాలేంటి?

- శ్రావణి

జ: పై చదువులకు ఇప్పటినుంచే ప్రణాళిక వేసుకోవడం మంచి విషయమే. ఇంకా మీరు మొదటి సంవత్సరంలోనే ఉన్నారు కాబట్టి, మంచి మార్కులతో ముందు ఇంజినీరింగ్‌ డిగ్రీని పూర్తిచేయండి. తరువాత ఉన్నత చదువులకు గేట్‌ (గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌) పరీక్షను రాయాల్సి ఉంటుంది. గేట్‌లో మంచి స్కోరు సాధిస్తే, విశ్వవిద్యాలయాలు, ఐఐటీల్లో ఎంటెక్‌ లేదా ఎంఎస్‌ చేయడానికి అవకాశం ఉంటుంది.

 ఎంటెక్‌లో అగ్రికల్చర్‌ ఇంజినీరింగ్‌, అగ్రికల్చరల్‌ ప్రాసెస్‌ అండ్‌ ఫుడ్‌ ఇంజినీరింగ్‌, ఆక్వాకల్చర్‌ ఇంజినీరింగ్‌, ఫార్మ్‌ మెషినరీ అండ్‌ పవర్‌ ఇంజినీరింగ్‌, ఇరిగేషన్‌ అండ్‌ డ్రైనేజీ ఇంజినీరింగ్‌ మొదలైన స్పెషలైజేషన్లు ఉంటాయి. ఆసక్తి మేరకు కోర్సును ఎంచుకోవచ్చు.

అగ్రికల్చర్‌ ఇంజినీరింగ్‌ చదివినవారికి ప్రైవేటు, ప్రభుత్వ రంగాల్లో చాలా ఉద్యోగావకాశాలుంటాయి. ఉదాహరణకు- నేషనల్‌ డైరీ డెవలప్‌మెంట్‌ బోర్డ్‌, ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, నేషనల్‌ సీడ్స్‌ కార్పొరేషన్స్‌, ఇండియన్‌ అగ్రికల్చరల్‌ రిసర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌, ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ రిసర్చ్‌ మొదలైన ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగావకాశాలుంటాయి.

అగ్రో బయోటెక్‌, ఇండో- అమెరికన్‌ హైబ్రిడ్‌ సీడ్స్‌ ప్రై. లిమిటెడ్‌, ప్రో ఆగ్రో సీడ్‌ కంపెనీ లిమిటెడ్‌, సెంచురీ సీడ్స్‌ ప్రై. లిమిటెడ్‌ మొదలైన ప్రైవేటురంగ సంస్థల్లో కూడా ఉపాధికి వీలుంటుంది. దేశానికి వ్యవసాయం వెన్నెముక లాంటిది కాబట్టి, అగ్రికల్చర్‌ కోర్సు చదివినవారికి ఉద్యోగాలకు కొరత ఉండదు.

ఇంటర్‌ సెకండియర్‌ చదువుతున్నాను. నాకు విదేశీ భాషలంటే ఇష్టం రోజురోజుకీ ఎక్కువైపోతోంది. దీంతో నా కోర్సుపై శ్రద్ధ చూపించలేకపోతున్నా. ఫారిన్‌ లాంగ్వేజ్‌ నేర్చుకోవడానికి ఏం చేయాలి?

- రామ్‌

జ: మీ ఆసక్తి అభినందనీయం. అలాగని మీరు చదువుతున్న కోర్సును అశ్రద్ధ చేయడం సరైన పని కాదు. మీరు మొదట ఇంటర్మీడియట్‌ను శ్రద్ధగా చదివి పూర్తిచేయండి. ఎందుకంటే విదేశీభాషలు నేర్చుకోవడానికి 10+2 తప్పనిసరిగా చదివివుండాలి. మన తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా హైదరాబాద్‌లోని ఇంగ్లిష్‌ అండ్‌ ఫారిన్‌ లాంగ్వేజెస్‌ యూనివర్సిటీ (EFLU) లో విదేశీ భాషలు అందుబాటులో ఉన్నాయి.

వీరు స్వల్పకాలిక కోర్సులను కూడా అందిస్తున్నారు. కాబట్టి మీరు ఏదైనా డిగ్రీ చదువుతూ కూడా విదేశీ భాషలు నేర్చుకునే అవకాశం ఉంటుంది. బహుళజాతి సంస్థలు కూడా విదేశీభాషలు తెలిసినవారికి ప్రాముఖ్యం ఇస్తున్నాయి. మీ ఉద్యోగానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఒకవేళ మీరు విదేశీభాషలను కెరియర్‌గా ఎంచుకోదలిస్తే పూర్తికాలపు కోర్సులను చేయవచ్చు. ఇతర రాష్ట్రాల్లో కూడా విదేశీ భాషలు అందించే విద్యాసంస్థలు ఉన్నాయి.

  ఈఈఈ బ్రాంచితో డిప్లొమా ఫైనలియర్‌ చదువుతున్నాను. అందరిలాగా డిప్లొమా తర్వాత బీటెక్‌ చేయాలనుకోవటం లేదు. హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు మీద ఆసక్తి ఉంది. డిప్లొమా తర్వాత ఈ కోర్సు చేయవచ్చా? చేస్తే ఎలాంటి అవకాశాలుంటాయి? ఆపైన ఎంబీఏ చదవటానికి వీలుంటుందా?

- ఎస్‌కే చాంద్‌ బాషా, హనుమాన్‌పుర, మహబూబ్‌నగర్‌

జ: మీకు హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సుపై ఆసక్తి ఉంది కాబట్టి డిప్లొమా పూర్తయ్యాక దానిలో చేరవచ్చు. ఈ కోర్సు చదివినవారికి స్వదేశంలో, విదేశాల్లో కూడా మంచి ఉద్యోగావకాశాలుంటాయి. అయితే హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులో చేరడానికి ఇంటర్మీడియట్‌ లేదా దానికి సమానమైన కోర్సులో ఇంగ్లిష్‌ను ఒక సబ్జెక్టుగా చదివివుండాలి. వయసు 22 సంవత్సరాలు మించరాదు. కొన్ని వర్గాలవారికి వయః పరిమితిలో మినహాయింపు ఉంటుంది.

ఉద్యోగాల విషయానికొస్తే.. హోటళ్ళు, రెస్టారెంట్లలో, పర్యాటక రంగంలో, కేటరింగ్‌ సర్వీసులు, ఫుడ్‌క్రాఫ్ట్‌ సంస్థల్లో, విమానయాన రంగంలో, బహుళజాతి సంస్థల్లో, విద్యాసంస్థల్లో అవకాశాలుంటాయి. సొంతంగా వ్యాపారం చేయడానికి కూడా వీలు ఉంటుంది. ఈ కోర్సు పూర్తయినతర్వాత ఉన్నతవిద్యను అభ్యసించాలంటే మీరు ఎంబీఏ (హోటల్‌ మేనేజ్‌మెంట్‌) చదవటానికి కూడా అవకాశాలుంటాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని