కోర్సు ఏదైనా ఆసక్తి ప్రధానం

మాది మధ్యతరగతి కుటుంబం. పిల్లల చదువుల విషయంలో మీ సలహా కోరుతున్నా. పెద్దబ్బాయి డిగ్రీ...

Published : 27 Feb 2017 01:34 IST

కోర్సు ఏదైనా ఆసక్తి ప్రధానం

మాది మధ్యతరగతి కుటుంబం. పిల్లల చదువుల విషయంలో మీ సలహా కోరుతున్నా. పెద్దబ్బాయి డిగ్రీ ఫైనలియర్‌ (కెమిస్ట్రీ- కంప్యూటర్‌) చదువుతున్నాడు. 80 శాతం మార్కులు వస్తాయి. తనను వచ్చే ఏడాది ఏం చదివించాలో తెలియటం లేదు. లాంగ్‌ టర్మ్‌ కోచింగ్‌లో పెట్టి ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించడం; సీఏ, ఎంసీఏ, ఎంబీఏ లాంటి కోర్సులు చదివించడం... ఏది మెరుగు? రెండో అబ్బాయి ఇంటర్‌ ఎంపీసీ రెండో సంవత్సరంలో ఉన్నాడు. 60 శాతం మార్కులు వస్తాయి. లెక్కల్లో డల్‌ అని చెప్పాలి. తనకు ఏ కోర్సులు మంచివో తెలుపగలరు.

- లలిత, బొబ్బిలి

ఏ కోర్సుకైనా తనదైన ప్రత్యేకత ఉంటుంది. ఏది చదివినా ఆసక్తితో దానిలో పరిజ్ఞానం, నైపుణ్యం పెంచుకోవాలే గానీ ఉద్యోగావకాశాలకు లోటు ఉండదు. కాబట్టి మీ అబ్బాయిలకు ఏ కోర్సు పట్ల ఆసక్తి ఉందో, వారి సామర్థ్యాలేమిటో తెలుసుకుని తగిన కోర్సులో చేర్పించటమే సరైన పని.
పెద్దబ్బాయి ఎలాగూ మంచి మార్కులు సాధిస్తున్నందున తర్వాతికాలంలో ఉపాధికి సమస్య ఉండదు. రెండో అబ్బాయి లెక్కలంటే అంత ఆసక్తి చూపించడంలేదు కాబట్టి ఫిజిక్స్‌/ కెమిస్ట్రీ లాంటివి- ఒకవేళ తనకు ఆసక్తి ఉంటే చదివించవచ్చు. తన సామర్థ్యానికి కష్టంగా అనిపిస్తే గణితం లేని కోర్సులు కూడా చాలా ఉన్నాయి. ఏ కోర్సు మెరుగు అనేది విద్యార్థి ఆసక్తీ, అభిరుచులతో సంబంధం లేకుండా చెప్పడం కష్టం. ఎవరో చెప్పారనో, ఎవరో చదువుతున్నారనో కాకుండా విద్యార్థులకు ఇష్టమైన రంగాన్ని ఎంచుకోవటం సమంజసం. దానిలో కృషి చేసి వారు తప్పకుండా రాణించగలుగుతారు.


భారతీయ సంగీతంలో డిప్లొమా/డిగ్రీ/సర్టిఫికెట్‌ కోర్సును అందించే విద్యాసంస్థలు ఏమిటి? ప్రవేశ విధానం ఎలా ఉంటుంది? టెక్నికల్‌ టీచర్‌ సర్టిఫికెట్‌ పొందే విధానం గురించి తెలపండి.

- ఆసూరి సుకుమార్‌, లక్ష్మణ చాంద, నిర్మల్‌ జిల్లా

మన తెలుగు రాష్ట్రాల్లో సంగీతంలో డిప్లొమా/డిగ్రీ/ సర్టిఫికెట్‌ కోర్సులను పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, ఆంధ్ర విశ్వవిద్యాలయం, శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ, ఆంధ్ర మహిళాసభ కాలేజ్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ మీడియా, ఎం.ఆర్‌. గవర్నమెంట్‌ మ్యూజిక్‌ కాలేజ్‌ (విజయనగరం) మొదలైన విద్యాసంస్థలు అందిస్తున్నాయి. చెన్నైలోని తమిళనాడు మ్యూజిక్‌ అండ్‌ ఫైన్‌ఆర్ట్స్‌ యూనివర్సిటీలో కూడా డిప్లొమా/డిగ్రీ (మ్యూజిక్‌) కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

ప్రవేశవిధానం ఒక్కో విద్యాసంస్థలో ఒక్కో విధంగా ఉంటుంది. కొన్ని కళాశాలలు ప్రవేశపరీక్ష ద్వారా; మరికొన్ని ప్రవేశపరీక్షా, మౌఖిక పరీక్షా ద్వారా ప్రవేశాలు కల్పిస్తున్నాయి. ఎం.ఎ. మ్యూజిక్‌ చదవడానికి బి.ఎ. మ్యూజిక్‌ తప్పనిసరిగా చదివివుండాలి.

టెక్నికల్‌ టీచర్‌ సర్టిఫికెట్‌ 42 రోజుల కోర్సు. ఈ కోర్సు చదవడానికి వయసు 18-45 సంవత్సరాల మధ్య ఉండాలి. సెకండరీ స్కూల్‌ సర్టిఫికెట్‌తో పాటు లోయర్‌ గ్రేడ్‌ టెక్నికల్‌ సర్టిఫికెట్‌ కోర్సు (టీసీసీ) చదివివుండాలి. కర్ణాటక/హిందుస్థానీ వోకల్‌ సర్టిఫికెట్‌ ఉన్న అభ్యర్థులకు మాత్రమే ఈ సంగీత రీతురల్లో ప్రవేశం ఇస్తారు.


నేను బీఎస్‌సీ ఫైనలియర్‌ చదువుతున్నాను. ఈ డిగ్రీ తర్వాత అగ్రికల్చర్‌ కోర్సు చేయవచ్చా?

- ఒక పాఠకుడు, దిల్‌సుఖ్‌నగర్‌, హైదరాబాద్‌

అగ్రికల్చర్‌ కోర్సు చదవడానికి ఎంసెట్‌ రాయాల్సివుంటుంది. మీరు మీ డిగ్రీ పూర్తయిన తర్వాత ఎంసెట్‌ రాసి అగ్రికల్చర్‌ కోర్సులో ప్రవేశాన్ని పొందవచ్చు. మీరు బీఎస్‌సీ ఏ కోర్సు చదువుతున్నారో తెలుపలేదు. ఇంటర్మీడియట్లో ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయాలజీ/మేథమేటిక్స్‌ చదివినవారు ఎంసెట్‌ రాయడానికి అర్హులు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని