Flight ticket prices: డీజీసీఏ కొత్త రూల్‌.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?

Flight ticket prices: టికెట్‌ ధరలో మిగిలిన సేవలను కూడా కలిపేస్తున్న నేపథ్యంలో డీజీసీఏ విమానయాన సంస్థలు కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో రాబోయే రోజుల్లో టికెట్‌ ధరలు కొంతమేరకు తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

Published : 26 Apr 2024 15:23 IST

దిల్లీ: విమాన టికెట్ కొనుగోలు చేసేటప్పుడు పలు రకాల సర్వీసులను ఆ ధరలోనే కలిపేస్తారు. దీనివల్ల అవసరం లేని సేవలకు సైతం ప్రయాణికులు చెల్లించక తప్పని పరిస్థితి. ఇది అనవసర భారమనే చెప్పాలి. దీనికి పరిష్కారంగా ‘డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (DGCA)’ ఇటీవల ఓ ప్రతిపాదనను ముందుకు తీసుకొచ్చింది.

‘‘విమానయాన సంస్థలు ప్రయాణ ఛార్జీల్లో వారు అందించే కొన్ని సేవలను కూడా కలిపేస్తాయి. వివిధ వర్గాల నుంచి అందిన ఫీడ్‌బ్యాక్‌ ప్రకారం.. చాలా సందర్భాల్లో ఆయా సేవలు ప్రయాణికులకు అవసరమై ఉండకపోవచ్చు. ఈ నేపథ్యంలో వాటికి విడిగా రుసుము వసూలుచేసే విధానాన్ని తీసుకొస్తే మొత్తంగా టికెట్‌ ధర తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నాం. ఈనేపథ్యంలోనే ఆయా సేవలను టికెట్‌ ప్రాథమిక ధర నుంచి వేరు చేయాలి. వాటిని ‘ఆప్ట్‌-ఇన్‌’ పద్ధతిన ఎంచుకునే అవకాశం ప్రయాణికులకు కల్పించాలి’’ అని డీజీసీఏ ఇటీవల విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఆప్ట్‌-ఇన్‌ పద్ధతిలో టికెట్‌ ప్రామాణిక ధరతో పాటు ఎంచుకున్న సేవలకు మాత్రమే ఛార్జీలు వేస్తారు. అంటే అవసరమైన సేవలను ప్రయాణికులు విధిగా ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. అదే ‘ఆప్ట్‌-ఔట్‌’ విధానంలో అన్ని సేవల ఛార్జీలు టికెట్‌ ధరలో ముందే కలిపేస్తారు. వద్దనుకున్న వాటిని విధిగా తొలగించుకోవాల్సి ఉంటుంది. డీజీసీఏ ఉత్తర్వుల్లో పేర్కొన్న ప్రకారం కింద పేర్కొన్న సేవలను టికెట్‌ బేస్‌ ధర నుంచి వేరు చేయాల్సి ఉంటుంది.

  • ప్రాధాన్య సీటు కేటాయింపు
  • భోజనం/స్నాక్‌/డ్రింక్‌ (తాగునీరు మినహాయించి)
  • ఎయిర్‌లైన్‌ లాంజ్‌ల వినియోగం
  • చెక్‌-ఇన్‌ బ్యాగేజ్‌
  • ఆట వస్తువులపై రుసుము
  • సంగీత వాద్యాలపై ఛార్జీ
  • విలువైన బ్యాగేజ్‌గా ప్రత్యేక ధ్రువీకరణ ఛార్జీ

మరోవైపు ఎయిర్‌లైన్‌ బ్యాగేజ్‌ పాలసీలో భాగంగా.. సంస్థలు ఫ్రీ బ్యాగేజ్‌ అలవెన్స్‌తో పాటు జీరో బ్యాగేజ్‌/నో-చెకిన్‌ బ్యాగేజ్‌ను కస్టమర్లకు అందించొచ్చు. అయితే, టికెట్‌ కొనుగోలు చేసేటప్పుడు వీటిని ఎంచుకొని.. తీరా ప్రయాణ సమయంలో కౌంటర్‌ దగ్గరకు బ్యాగేజ్‌తో వస్తే మాత్రం అప్పుడు ఛార్జీలు విధించుకునేందుకు అనుమతించింది. ఈ నియమాన్ని ప్రయాణికులకు కొనుగోలు సమయంలోనే విధిగా తెలియజేయాలి. టికెట్‌ ప్రింటవుట్‌పైనా ముద్రించాలి.

డీజీసీఏ తాజా మార్గదర్శకాల నేపథ్యంలో విమానయాన సంస్థలు తమ టికెట్ల ధరల మదింపు విధానాన్ని స్వల్పంగా మార్చే అవకాశం ఉందని నిపుణులు తెలిపారు. ప్రయాణికులు తమ బడ్జెట్‌కు అనుగుణంగా కావాల్సిన సేవలను పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. దీనివల్ల భారీగా కాకపోయినా.. కొంతవరకు విమాన ప్రయాణ ఛార్జీలు తగ్గొచ్చని వివరించారు.

మరోవైపు 12 ఏళ్ల చిన్నారులకు అదే పీఎన్‌ఆర్‌ నంబర్‌పై ప్రయాణిస్తున్న తల్లిదండ్రులు లేదా సంరక్షకుల్లో ఒకరి పక్కన సీటు కేటాయించాలని డీజీసీఏ సూచించిన విషయం తెలిసిందే. విమానాల్లో కొన్నిసార్లు చిన్నారులకు తల్లిదండ్రులతో కాకుండా వేరుగా సీటు కేటాయిస్తున్న ఉదంతాల నేపథ్యంలో ఈ ఆదేశాలు ఇచ్చింది. దీనికి సంబంధించిన రికార్డులను నిర్వహించాలని సూచించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని