Rathnam movie review: రివ్యూ: రత్నం.. విశాల్‌ నటించిన యాక్షన్‌ డ్రామా మెప్పించిందా?

Rathnam movie review: విశాల్‌ కథానాయకుడిగా హరి దర్శకత్వంలో వచ్చిన యాక్షన్‌ ఫిల్మ్‌ తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా?

Published : 26 Apr 2024 15:26 IST

Rathnam movie review: చిత్రం: రత్నం; నటీనటులు: విశాల్‌, ప్రియా భవానీ శంకర్‌, సముద్రఖని, రామచంద్రరాజు, గౌతమ్‌ వాసుదేవ్‌ మేనన్‌, యోగిబాబు, మురళీ శర్మ, హరీశ్‌ పేరడి తదితరులు; సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌; ఎడిటింగ్‌: టి.ఎస్‌. జై; సినిమాటోగ్రఫీ: ఎం.సుకుమార్‌; నిర్మాత: కార్తికేయన్‌ సంతానం, అలంకార్‌ పాండియన్‌; రచన, దర్శకత్వం: హరి; విడుదల: 26-04-2024

హ‌రి సినిమా అన‌గానే యాక్ష‌న్ ప్రియులు ఉత్సాహంగా ఎదురు చూస్తుంటారు. ‘సింగం’ సినిమాల‌తో ఆయ‌న చూపించిన ప్ర‌భావం అలాంటిది. విశాల్‌తో ఆయ‌న చేసిన  ‘భ‌ర‌ణి’, ‘పూజ’ సినిమాలు కూడా మంచి విజ‌యాల్ని సొంతం చేసుకున్నాయి. కొంత విరామం త‌ర్వ‌త ఈ క‌ల‌యిక‌లో రూపుదిద్దుకున్న చిత్ర‌మే.. ‘ర‌త్నం’.  ప్రేక్ష‌కుల్లో మంచి అంచ‌నాల్ని సృష్టించి... ప్ర‌చార చిత్రాల‌తో ఆస‌క్తిని రేకెత్తించిన ఈ సినిమా ఎలా ఉంది?(Rathnam movie review) తెలుగు ప్రేక్షకులను అలరిస్తుందా?

క‌థేంటంటే: త‌మిళ‌నాడు, ఆంధ్ర స‌రిహ‌ద్దుల్లో సాగే క‌థ ఇది. ల‌క్ష్యం కోసం హ‌త్య‌లు చేయ‌డానికైనా వెన‌కాడ‌ని యువ‌కుడు ర‌త్నం (విశాల్‌). తాను మావ‌య్య అని పిలుచుకునే ఎమ్మెల్యే ప‌న్నీర్‌స్వామి(స‌ముద్ర‌ఖ‌ని) అండ‌తో అప్పుడ‌ప్పుడూ చ‌ట్టాన్ని త‌న చేతుల్లోకి తీసుకుంటూ ప‌నులు చ‌క్కబెడుతుంటాడు. పోలీసుల‌కి స‌గం స‌మ‌స్య‌ల్ని త‌గ్గిస్తుంటాడు. ఎమ్మెల్యేకి కుడి భుజంలాంటి ర‌త్నం జీవితంలో ఎన్నో క‌ల్లోలాలు. చిన్నప్పుడే త‌ల్లి రంగనాయ‌కి పోలీస్‌స్టేష‌న్‌లో ఉరి వేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకుంటుంది. అత‌ని బాల్యం కొంత‌కాలం జైల్లో గ‌డుస్తుంది. అలాంటి ర‌త్నం జీవితంలోకి మ‌ల్లిక (ప్రియ‌భ‌వానీ శంక‌ర్‌) వ‌చ్చాక కొత్త ప‌రిణామాలు చోటు చేసుకుంటాయి. త‌మిళ‌నాడులోని తిరుత్త‌ణిని అడ్డాగా చేసుకుని ఎన్నెన్నో అరాచ‌కాలకు పాల్ప‌డుతుంటారు లింగం బ్ర‌ద‌ర్స్ (ముర‌ళీశ‌ర్మ‌, హ‌రీష్ పేర‌డి). వాళ్లే మ‌ల్లిక‌పై హ‌త్యాయ‌త్నం చేయ‌గా, ర‌త్నం కాపాడ‌తాడు. (Rathnam movie review) ఇంత‌కీ మ‌ల్లిక ఎవ‌రు?ఆమెని లింగం బ్ర‌ద‌ర్స్ చంపాల‌నుకోవ‌డానికి కార‌ణం ఏమిటి?మ‌ల్లికని కాపాడేందుకు ర‌త్నం ఏం చేశాడు? అస‌లు ర‌త్నం త‌ల్లి రంగ‌నాయ‌కి పోలీస్‌స్టేష‌న్‌లో ఎందుకు ఆత్మ‌హ‌త్య చేసుకుంది? త‌దిత‌ర విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

ఎలా ఉందంటే: హ‌రి సినిమా అంటేనే ఫ‌క్తు మాస్ క‌థ‌, వీరోచిత‌మైన పోరాటాలు, ప‌రుగులు పెట్టే స‌న్నివేశాలే గుర్తొస్తాయి. ఇక విశాల్‌తో ఆయ‌న జ‌ట్టు క‌ట్టారంటే ఆ క‌థ‌, క‌థ‌నాలు ఎలా ఉంటాయో ప్రేక్ష‌కులు ముందే ఓ అంచ‌నాకొస్తారు. ఆ ఇద్ద‌రి క‌ల‌యిక‌లో ఇదివ‌ర‌కు వ‌చ్చిన సినిమాలు అలాంటివి. అదే టెంప్లేట్‌తో సాగే క‌థ‌తోనే... మాస్‌, యాక్ష‌న్, సెంటిమెంట్ అంశాల్ని ఇంకాస్త అప్‌గ్రేడ్ చేస్తూ ఈ సినిమాని మ‌లిచారు ద‌ర్శ‌కుడు హ‌రి. 90వ‌ ద‌శ‌కంతో క‌థ‌ని మొద‌లుపెడుతూ, ఆరంభ స‌న్నివేశాలతో పాత్ర‌ల్ని ప‌రిచ‌యం చేశారు. ఆ ప‌ని పూర్త‌య్యాక అస‌లు సిస‌లు హ‌రి మార్క్ స‌న్నివేశాలు షురూ అవుతాయి. (Rathnam movie review) ఛేజింగ్‌లు, యాక్ష‌న్ ఘ‌ట్టాల‌తో స‌న్నివేశాలు ప‌రుగులు పెడ‌తాయి. మ‌ల్లిక పాత్ర ప‌రిచ‌యం, ఆమెపై హ‌త్యాయ‌త్నంతో క‌థ‌లో మ‌లుపులు చోటు చేసుకుంటాయి. లింగం బ్ర‌ద‌ర్స్ అరాచ‌కాలు, మెడిక‌ల్ కాలేజీ వ్య‌వ‌హార‌మంతా సాదాసీదాగా పాత సినిమాల్నే గుర్తు చేసినా, విరామం త‌ర్వాత  క‌థ‌లో చోటు చేసుకునే మ‌లుపులు సినిమాని ప్ర‌త్యేకంగా మార్చాయి. అయితే అవేవీ వాస్త‌వానికి ద‌గ్గ‌ర‌గా అనిపించ‌వు.

సినిమాలో ఓ చోట క‌థానాయ‌కుడితో స‌ముద్ర‌ఖ‌ని ‘క‌ల‌లో కూడా ఊహించ‌లేనివి నీ జీవితంలో జ‌రిగాయి’ అంటాడు. ఆ మాట‌కి త‌గ్గ‌ట్టుగానే ఈ కథ ఎక్క‌డా స‌హ‌జంగా అనిపించ‌దు. ఏ పాత్ర‌తోనూ స‌గ‌టు ప్రేక్ష‌కుడు క‌నెక్ట్ కాలేని ప‌రిస్థితి. క‌థ‌లో మ‌లుపుల పేరిట బ‌ల‌వంతంగా  స‌న్నివేశాలు రాసిన‌ట్టు అనిపిస్తుందే త‌ప్ప, వాస్త‌వానికి ద‌గ్గ‌ర‌గా ఉన్న‌ట్టు అనిపించ‌దు. క‌థ ముగుస్తుంద‌నుకున్న ప్ర‌తిసారీ మ‌రో అంకం మొద‌ల‌వుతుంది. (Rathnam movie review) ఇదంతా సాగ‌దీత వ్య‌వ‌హార‌మే. హీరో, హీరోయిన్ మ‌ధ్య బంధాన్ని ఆవిష్క‌రించిన తీరు కొత్త‌గానే ఉన్నా అవి ప్రేక్ష‌కుడికి ఆమోద‌యోగ్యం అనిపించ‌దు. ద్వితీయార్ధంలో  హీరో త‌ల్లి నేప‌థ్యంలో వ‌చ్చే ఎపిసోడ్, ఓ బ్రాహ్మ‌ణ కుటుంబంతో ముడిపెట్టిన విధానం సెంటిమెంట్ ప‌రంగా ఆక‌ట్టుకుంటుంది. ప‌తాక స‌న్నివేశాలు ప‌ర్వాలేద‌నిపిస్తాయి. కాలం చెల్లిన క‌థ‌కి, బ‌ల‌వంతంగా కొన్ని మ‌లుపుల్ని జోడించి తీసిన సినిమా ఇది. అస‌లు  క‌థ కంటే యాక్ష‌న్ హంగామానే ఎక్కువ‌. 

ఎవ‌రెలా చేశారంటే: విశాల్‌కి అల‌వాటైన పాత్రే. ర‌త్నంగా తెర‌పై ఒదిగిపోయారు. త‌న మార్క్ పోరాట ఘ‌ట్టాల్ని చాలా బాగా చేశారు. భావోద్వేగాల్నీ పండించారు. క‌థానాయిక ప్రియ భ‌వానీ శంక‌ర్‌కి క‌థ‌లో హీరోకి స‌మాన‌మైన పాత్ర దొరికింది. పాత్ర ప‌రిచ‌య‌మైన‌ప్ప‌టి నుంచి హీరోతోపాటే క‌నిపిస్తూ ఉంటుంది.  వైద్యురాలు కావాల‌నుకునే ఓ యువ‌తిగా  చాలా బాగా న‌టించింది. ఎమ్మెల్యేగా క‌నిపించే స‌ముద్ర‌ఖ‌ని పాత్ర ఆక‌ట్టుకుంటుంది. (Rathnam movie review) లింగం బ్ర‌ద‌ర్స్‌గా క‌నిపించే ముర‌ళీశ‌ర్మ‌, హ‌రీష్ పేర‌డీ పాత్ర‌లూ బాగున్నాయి. రాజేంద్ర‌న్‌, యోగిబాబు పెద్ద‌గా న‌వ్వించ‌లేక‌పోయారు.

సాంకేతికంగా యాక్ష‌న్ ఘ‌ట్టాలు అల‌రిస్తాయి. సంగీతం చిత్రానికి ప్ర‌ధాన‌బ‌లం. పాట‌లు, నేప‌థ్య సంగీతంలో దేవిశ్రీప్ర‌సాద్ మార్క్ క‌నిపిస్తుంది. ద‌ర్శ‌కుడు హ‌రి సినిమాల‌కి ప్ర‌త్యేక‌మైన ఫ్యాన్ బేస్ ఉంది. అయితే క‌థ‌, క‌థ‌నాల ప‌రంగానే ఆయ‌న వైవిధ్యం చూపించాల్సిన అవ‌స‌రం ఉంది. పోరాటాలు, వేగవంత‌మైన స‌న్నివేశాల‌పైనే ఆధార‌ప‌డుతున్నారు త‌ప్ప, మారుతున్న ప్రేక్ష‌కుల అభిరుచుల‌కి త‌గ్గ‌ట్టుగా క‌థ‌ని చెప్ప‌డంలో విఫ‌ల‌మ‌వుతున్నారు.

  • బ‌లాలు
  • + క‌థ‌లో మ‌లుపులు
  • + విశాల్ యాక్ష‌న్‌
  • బ‌ల‌హీన‌త‌లు
  • - కొత్త‌ద‌నం లేని క‌థ‌, క‌థ‌నం
  • - ద్వితీయార్ధంలో సాగ‌దీత‌
  • చివ‌రిగా: కాలం చెల్లిన క‌థ‌తో... ర‌త్నం (Rathnam movie review)
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని