ఆ సర్టిఫికెట్లు చెల్లుతాయా?

ఇంటర్‌ 1988లో పూర్తిచేశాను. తర్వాత చదువు కొనసాగలేదు. అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయంలో దూరవిద్య ద్వారా బీఏ పాసయ్యాను.....

Published : 10 Apr 2017 02:08 IST

ఆ సర్టిఫికెట్లు చెల్లుతాయా?

* ఇంటర్‌ 1988లో పూర్తిచేశాను. తర్వాత చదువు కొనసాగలేదు. అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయంలో దూరవిద్య ద్వారా బీఏ పాసయ్యాను. నా పాత సర్టిఫికెట్లు లేకపోవడం వల్ల బీఏలో నా పుట్టినతేదీని నోటరీ అఫిడవిట్‌ ద్వారా మార్చుకున్నాను. తర్వాత ఎంసీజే చేశాను. ఈ మధ్య నా పాత సర్టిఫికెట్లు దొరికాయి. అవి ఇప్పుడు చెల్లుతాయా? నేను ఏపీ సెట్‌ రాయడానికి అర్హుడినేనా? వయసుని బట్టి నేను ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చా?

- ఎం. శ్రీనివాస్‌, అమలాపురం

* పదో తరగతి సర్టిఫికెట్లు, ఇప్పుడు అఫిడవిట్‌ ద్వారా తీసుకున్నవాటిల్లో ఉన్న పుట్టినతేదీలు రెండూ ఒకటే అయితే ఏ సమస్యా ఉండదు. రెండు సర్టిఫికెట్లలో వేర్వేరు పుట్టినతేదీలు తీసుకోవడం సరైన చర్య కాదు. ఎవరికైనా పదోతరగతిలో ఏ పుట్టినతేదీ ఉంటుందో అదే ప్రామాణికం. ఉన్నత చదువులైనా, ఉద్యోగాలకైనా దీన్నే పరిగణనలోకి తీసుకుంటారు. కాబట్టి పాత సర్టిఫికెట్లు చెల్లకపోవడం అంటూ ఉండదు.

ఒకవేళ మీరు తేదీని మార్చుంటే దాన్ని సరిచేసుకోవాలంటే కోర్టు ద్వారా చేసుకోవచ్చు. గతంలో చెప్పినట్టుగా ఉద్యోగాలకు కానీ, రాత పరీక్షలకు కానీ వయఃపరిమితి లేదా రెగ్యులర్‌ చదువు ఉండాలని నోటిఫికేషన్‌లో ఇవ్వనంతవరకూ దూరవిద్య ద్వారా చదివినవారు అన్నింటికీ అర్హులు. ఏపీసెట్‌కు వయఃపరిమితి లేదు. కాబట్టి మీరు నిరభ్యంతరంగా రాయవచ్చు.

* బీకాం కంప్యూటర్స్‌ పూర్తిచేశాను. తర్వాత చదవాలంటే ఏ కోర్సులున్నాయి? ఉద్యోగసాధన సులభం కావడానికి ఏ మార్గాలను అనుసరించాలి?

- హెచ్‌. శంకర దత్తు, విశాఖపట్నం

* బీకాం తర్వాత ఉన్నత చదువులు చదవడానికి చాలా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఛార్టర్డ్‌ అకౌంటెంట్‌ (సీఏ), మాస్టర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ (ఎంకాం), మాస్టర్స్‌ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎంబీఏ ఇన్‌ ఫైనాన్స్‌), సర్టిఫైడ్‌ మేనేజ్‌మెంట్‌ అకౌంటెంట్‌ (సీఎంఏ), సర్టిఫైడ్‌ పబ్లిక్‌ అకౌంటింగ్‌, అసోసియేషన్‌ ఆఫ్‌ చార్టర్డ్‌ సర్టిఫైడ్‌ అకౌంటెంట్స్‌ (ఏసీసీఏ) బిజినెస్‌ అకౌంటింగ్‌ అండ్‌ టాక్సేషన్‌ మొదలైన కోర్సులను చదవవచ్చు.

ఉద్యోగసాధన సులభం కావడానికి- కమ్యూనికేషన్‌ నైపుణ్యాలనూ, సబ్జెక్టు పట్ల పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవడం వంటి మార్గాలను అనుసరించాలి. విశ్లేషణాత్మక, సమస్యలను సమర్థంగా పరిష్కరించగల సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి. వీటితోపాటు బృందంతో కలిసి పనిచేయడం, కంప్యూటర్‌, నిర్వహణలో నేర్పు, ఏదైనా నేర్చుకోగల సామర్థ్యాలను కలిగి ఉండాలి. వీటిని పెంచుకోవటం ద్వారా మంచి ఉద్యోగాన్ని సులభంగా సంపాదించుకోవచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని