PM Modi: ‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ

PM Modi: వీవీ ప్యాట్‌ స్లిప్‌ల లెక్కింపుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రజాస్వామ్యానికి విజయం దక్కినట్లయ్యిందని ప్రధాని మోదీ అన్నారు. ఈ తీర్పు విపక్షాలకు గట్టి చెంపదెబ్బ అని విమర్శించారు.

Published : 26 Apr 2024 15:17 IST

పట్నా: ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల్లో (EVM) నమోదైన ఓట్లతో 100 శాతం వీవీప్యాట్ల (VVPAT) స్లిప్పులను సరిపోల్చి లెక్కించాలన్న పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. ఈ తీర్పును ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) స్వాగతించారు. ఈసందర్భంగా విపక్షాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశ ప్రజలకు వారు క్షమాపణలు చెప్పాలని అన్నారు.

బిహార్‌లోని అరారియాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని.. సుప్రీం తీర్పుపై స్పందించారు. ‘‘ఈ రోజు ప్రజాస్వామ్యానికి గొప్ప రోజు. మన ప్రజాస్వామ్య విలువలను, ఎన్నికల ప్రక్రియను యావత్‌ ప్రపంచం కొనియాడుతోంది. కానీ విపక్షాలు మాత్రం తమ స్వార్థ ప్రయోజనాల కోసం వాటిని కించపరుస్తున్నాయి. ఈవీఎంలపై అనుమానాలు రేకెత్తేలా ప్రతిపక్ష కూటమిలోని ప్రతీ నేత నిరంతరం అసత్య ఆరోపణలు చేస్తున్నారు. అలాంటివారికి సుప్రీం తీర్పుతో  గట్టి చెంపదెబ్బ తగిలింది. బ్యాలెట్‌ బాక్సులను దోచుకోవాలని కలలు కంటున్న వారి కుట్రలను భగ్నం చేసింది. ఇది ప్రజాస్వామ్యానికి దక్కిన విజయం’’ అని మోదీ తెలిపారు.

100% వీవీప్యాట్‌ స్లిప్‌ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం

ఎన్నికల కౌంటింగ్‌ సమయంలో మొత్తం వీవీ ప్యాట్‌ స్లిప్‌లను లెక్కించాలని, లేదా పేపర్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ను తిరిగి తీసుకురావాలని డిమాండ్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు శుక్రవారం తిరస్కరించింది. ఒక వ్యవస్థను గుడ్డిగా అపనమ్మకంతో చూడటం.. అనవసర అనుమానాలకు దారి తీస్తుందని ఈసందర్భంగా ధర్మాసనం అభిప్రాయపడింది. ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న వేళ ఈ తీర్పు ప్రాధాన్యం సంతరించుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని