బీఎల్‌ఐఎస్‌సీ చేయాలనుంది!

బీఎస్‌సీ (కంప్యూటర్‌ సైన్స్‌) పూర్తిచేశాను. సివిల్‌ సర్వెంట్‌ కావడం నా కోరిక. ఇప్పటినుంచి సివిల్స్‌కు సన్నద్ధమవడం....

Published : 01 May 2017 01:57 IST

బీఎల్‌ఐఎస్‌సీ చేయాలనుంది!

* బీఎస్‌సీ (కంప్యూటర్‌ సైన్స్‌) పూర్తిచేశాను. సివిల్‌ సర్వెంట్‌ కావడం నా కోరిక. ఇప్పటినుంచి సివిల్స్‌కు సన్నద్ధమవడం మంచిదేనా? అయితే ముందుగా దేశంలో ఏదైనా ఉన్నత విద్యాసంస్థలో ఎంబీఏ చేయాలనుకుంటున్నాను. ఇందుకు క్యాట్‌ రాయాలనుకుంటున్నాను. ప్రభుత్వం నుంచి ఏదైనా స్కాలర్‌షిప్‌, ఫీజు రీయంబర్స్‌మెంట్‌ లాంటివి పొందే అవకాశం ఉందా?

- రాయి నాగేంద్ర, ధర్మవరం

* మీరు ఉన్నత విద్యాసంస్థలో ఎంబీఏ చదవాలనుకుంటున్నారు. సివిల్‌ సర్వెంట్‌ కావాలనీ అనుకుంటున్నారు. ఈ రెండూ విభిన్నమైన దారులు. అయితే మీరు ప్రణాళికబద్ధంగా చదివితే తప్పకుండా విజయం సాధించవచ్చు. ఆప్టిట్యూడ్‌ అనేది క్యాట్‌, సివిల్‌ సర్వీసెస్‌ రెండు పరీక్షల్లోనూ ఉంటుంది. ఇది మీకు ఇతర పోటీ పరీక్షల్లోనూ తోడ్పడుతుంది.

మీ స్వల్పకాలిక లక్ష్యం ఐఐఎం అయితే మొదట దాన్ని సాధించండి. ఆ తర్వాత మీ దీర్ఘకాలిక లక్ష్యం- సివిల్‌ సర్వీసెస్‌కు అవసరమైన వయసు, పరీక్ష ప్రయత్నాల సంఖ్య (అటెంప్ట్స్‌) మొదలైనవాటి గురించిన సమాచారాన్ని సేకరించుకోండి. దాని ప్రకారం ప్రణాళికను రూపొందించుకుని, ఆ దిశగా కొనసాగండి.

ఐఐఎంల్లో చదవడానికి ఖర్చు ఎక్కువగానే అవుతుంది. ప్రభుత్వం నుంచి స్కాలర్‌షిప్‌ సౌకర్యం ఉన్నప్పటికీ అది కొంతమంది మెరిట్‌ విద్యార్థులకే లభిస్తుంది. కాబట్టి పోటీ ఎక్కువ. అంతేకాకుండా ఫీజు మొత్తాన్ని దీనిలో అందించరు. అయితే మీకు బ్యాంకు రుణం తీసుకుని చదివే అవకాశం మాత్రం ఉంటుంది.

* డిగ్రీ పూర్తిచేశాను. తర్వాత బీఎల్‌ఐఎస్‌సీ చేయాలని ఉంది. అందించే విశ్వవిద్యాలయాలు ఏవి?

- వాడపల్లి నరసింహారావు

* మన తెలుగు రాష్ట్రాల్లో బీఎల్‌ఐఎస్‌సీ (బ్యాచిలర్‌ ఆఫ్‌ లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌)ను ఉస్మానియా, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయాలు అందిస్తున్నాయి. కాకతీయ విశ్వవిద్యాలయంలో ఈ కోర్సును దూరవిద్య ద్వారా అందిస్తున్నారు. శ్రీవెంకటేశ్వర, ఆంధ్ర విశ్వవిద్యాలయాల్లో ఎంఎల్‌ఐఎస్‌సీ కూడా అందుబాటులో ఉంది. కాబట్టి మీకు ఆసక్తి ఉన్న విశ్వవిద్యాలయంలో కోర్సును ఎంచుకోండి.

* ఎంఎస్‌సీ (ఆర్గానిక్‌ కెమిస్ట్రీ) మొదటి సంవత్సరం చదువుతున్నాను. నాకు పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పోటీ పరీక్షలు రాయాలని ఉంది. కానీ ఎంఎస్‌సీ వల్ల సాధ్యం కావడంలేదు. పరిష్కారం చెప్పండి.

- పి. బంగారు నాయుడు

* పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పోటీపరీక్షలు రాయడానికి మీ చదువును మానుకోవాల్సిన లేదా అశ్రద్ధ చేయాల్సిన పనిలేదు. చాలామంది పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పోటీపరీక్షల్లో మంచి ర్యాంకు సాధించినవారిలో ఉద్యోగం చేస్తూ, పరీక్షకు సన్నద్ధమయినవారు కూడా ఉన్నారు. కాబట్టి ఒక ప్రణాళిక ప్రకారం సన్నద్ధమైతే విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది.

ఆర్గానిక్‌ కెమిస్ట్రీ అంత సులువైన సబ్జెక్టు కాదు. ఒకవేళ మీకు చదువుతున్నదానిపై ఆసక్తి లేకపోతే కేవలం మీరనుకుంటున్న సివిల్‌ సర్వీసెస్‌పైనే దృష్టిపెట్టండి. రెండింటిమీదా ఆసక్తి ఉంటే, ప్రస్తుతం చదువుతున్నదాని మీద శ్రద్ధపెట్టి, పూర్తిచేయండి. ఆ తర్వాత సర్వీసెస్‌ గురించి చూడండి. రెండింటిమీదా దృష్టి సారించగలను అనుకుంటే మీకున్న ప్రాధాన్యాన్ని బట్టి సమయాన్ని విభజించుకోండి. అలాగే రోజూ వార్తాపత్రికలు చదవడం, పోటీపరీక్షకు సంబంధించిన సబ్జెక్టు పుస్తకాలను చదవడం, వివిధ అంశాలను అధ్యాపకులు/ స్నేహితులతో చర్చించడం, విశ్లేషణ సామర్థ్యాన్ని పెంచుకోవడంపైనా శ్రద్ధ తీసుకోండి.

- ప్రొ. బి. రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని