మధ్యలో ఆగిన కోర్సు మళ్ళీ చదవాలంటే..

డిగ్రీ మధ్యలోనే ఆపేశాను. విభిన్నమైన కెరియర్‌ను ఎంచుకోవాలని ఉంది. సినిమాలపై ఆసక్తి ఉంది...

Published : 04 Sep 2017 01:47 IST

మధ్యలో ఆగిన కోర్సు మళ్ళీ చదవాలంటే..

డిగ్రీ మధ్యలోనే ఆపేశాను. విభిన్నమైన కెరియర్‌ను ఎంచుకోవాలని ఉంది. సినిమాలపై ఆసక్తి ఉంది. మంచి రచయిత కావాలనుకుంటున్నాను. ఏం చేయాలి?

- రఘుగోపాల్‌, మహబూబ్‌నగర్‌

విభిన్న కెరియర్‌ను ఎంచుకోవాలన్న మీ ఆసక్తి అభినందనీయం. సినిమా రంగంలో రాణించాలనుకునేవారు స్వతహాగా తమదైన ప్రతిభను ఏర్పరచుకోవాలి. దీనికి తోడుగా మీరు నిర్ణయించుకున్న రంగంలో కోర్సులను అందిస్తున్న మంచి శిక్షణ సంస్థల్లో తర్ఫీదును పొందాలి. ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌టీఐఐ) పుణె, అన్నపూర్ణ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ ప్లస్‌ మీడియా, రామోజీ అకాడమీ ఆఫ్‌ ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌, నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ డ్రామా వంటి ప్రముఖ సంస్థలు నటన, స్క్రిప్ట్‌ రైటింగ్‌, ఫిల్మ్‌ మేకింగ్‌, మల్టీ మీడియా వంటి విభాగాల్లో శిక్షణను ఇస్తున్నాయి. సినిమా పరిశ్రమలో ప్రతీ రంగం తమదైన ప్రత్యేకతను కలిగి ఉంది. కాబట్టి మీరు ఎంచుకున్న రంగం మీద ఆసక్తి కలిగి ఉండి కృషి చేయండి. తప్పకుండా విజయం సాధిస్తారు.


ఇంటర్‌ 5 సంవత్సరాల క్రితం పూర్తిచేశాను. రష్యాలో ఏడాదిపాటు ఎంబీబీఎస్‌ చేశాను. కొన్ని కుటుంబ కారణాల వల్ల కొనసాగించలేకపోయాను. ఇప్పుడు మనదేశంలో ఎంబీబీఎస్‌ చేయవచ్చా? ప్రవేశపరీక్ష రాయడానికి నాకు అర్హత ఉందా?

- గోపాల్‌ షిండే

గతంలో చెప్పినట్టుగా ఎంబీబీఎస్‌ అభ్యసించదలచుకున్నవారు 10+2లో ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టులను 50% మార్కులతో పూర్తిచేసి ఉండాలి.
సీబీఎస్‌సీ వారు నిర్వహించే నీట్‌ ఆధారంగా ఎంబీబీఎస్‌లో ప్రవేశం పొందవచ్చు. పరీక్ష రాయడానికి కనిష్ఠ వయసు 17 సంవత్సరాలు. మీరు 10+2 విధానంలో బైపీసీ చదివుంటే ఎంబీబీఎస్‌ చేయడానికి అర్హులే.


ఇంటర్‌ ఫెయిల్‌ అయ్యాను. తరువాత డిగ్రీ దూరవిద్య ద్వారా పూర్తిచేశాను. గ్రూప్‌-4 వంటి ఉద్యోగాలకు అర్హత ఇంటర్‌గా ఉంటుంది. అలాంటివాటికి నాకు అర్హత ఉంటుందా? లేకపోతే ఏం చేయాలి?

- జి. స్వర్ణ

ఇంటర్‌ అర్హతగా ఉన్న ఉద్యోగాలకు మీరు దరఖాస్తు చేసుకోవడం కుదరదు. డిగ్రీ అర్హతతో ఉన్న గ్రూప్‌-2, గ్రూప్‌-1 ఉద్యోగాలు, ఇతర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఉద్యోగాలకు అర్హత ఉంటుంది. ఒకసారి బోర్డ్‌ ఆఫ్‌ ఇంటర్మీడియట్‌ వారిని సంప్రదించి ఫెయిల్‌ అయిన లేదా మధ్యలో ఆపేసిన ఇంటర్‌ను ఇప్పుడు కొనసాగించడం/ పరీక్ష రాయడం కుదురుతుందో లేదో అనే సమాచారాన్ని సేకరించుకోవాలి. దానినిబట్టి ఇంటర్‌ పూర్తి చేయడమో, ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోవడమో చేయడం ద్వారా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.


మా అమ్మాయి బైపీసీ రెండో సంవత్సరం చదువుతోంది. నీట్‌ రాయాలనుకుంటోంది. కనీస వయఃపరిమితి ఎంత? వైద్యవృత్తిలో చేరాలంటే నీట్‌ కాకుండా వేరే ప్రత్యామ్నాయాలున్నాయా? వివరాలను తెలియజేయండి. ఒకవేళ వయసు తక్కువగా ఉంటే అనుమతి పత్రాన్ని ఎలా పొందాలి?

- కాశీనాథ్‌

జాతీయస్థాయిలో ఎంబీబీఎస్‌లో చేరడానికి నిర్వహించే పరీక్షే నీట్‌. దీన్ని రాయడానికి కనిష్ఠ వయఃపరిమితి పదిహేడు సంవత్సరాలు కాగా, సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం గరిష్ఠ వయః పరిమితి లేదు. ఇదేకాకుండా భారత్‌లో వైద్యవృత్తిలో చేరడానికి ఎయిమ్స్‌ ద్వారా దేశంలోని ప్రతిష్ఠాత్మకమైన ఏడు ఎయిమ్స్‌ కళాశాలల్లో ఎంబీబీఎస్‌ సీటును పొందవచ్చు. జిప్‌మర్‌ ద్వారా కూడా ఎంబీబీఎస్‌లో ప్రవేశం పొందవచ్చు. మీ అమ్మాయికి తగినంత వయసు లేకపోతే సంబంధిత వైద్యాధికారి (ప్రభుత్వ), జిల్లా మెజిస్ట్రేట్‌, కలెక్టర్‌లలో ఎవరో ఒకరి నుంచి అనుమతి పత్రం పొందవచ్చు.


డిగ్రీ (బీకాం) మూడో సంవత్సరం (2013) పూర్తిచేయలేదు. 1, 2 సంవత్సరాల్లోనూ సబ్జెక్టులు మిగిలివున్నాయి. ఇప్పుడు మళ్లీ డిగ్రీ కొనసాగించాలనుకుంటున్నాను. రెగ్యులర్‌ దూరవిద్యల్లో ఏది మేలు? తెలియజేయగలరు.

- శ్రీనివాసరావు

ఏ కోర్సు అయినా రెగ్యులర్‌ విధానంలో చదవడం వల్ల విషయ పరిజ్ఞానాన్నీ, భావ వ్యక్తీకరణనీ పెంచుకోవచ్చు. దీని ద్వారా మంచి ఉద్యోగావకాశాన్ని పొందవచ్చు. ఏవైనా కారణాల వల్ల రెగ్యులర్‌ విద్యను అభ్యసించడం కుదరకపోతే దూరవిద్యను ఆశ్రయించవచ్చు. సాధ్యమైతే రెగ్యులర్‌ విధానంలోనే డిగ్రీని పూర్తిచేయండి. అలా కుదరకపోతే డిగ్రీ చదివిన విశ్వవిద్యాలయంలోనే దాన్ని దూరవిద్యలోకి మార్చుకుని గ్రాడ్యుయేషన్‌ పట్టాను పొందండి. ఏ విధానంలో విద్యను అభ్యసించినా లోతైన అధ్యయనంతోపాటు విషయ పరిజ్ఞానం పెంచుకునే ప్రయత్నం చేయండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు