ప్రొఫెషనల్‌ చెఫ్‌ కావాలంటే?

బీఎస్‌సీ పూర్తిచేసి ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాను. నాకు ప్రొఫెషనల్‌ చెఫ్‌ కావాలనుంది. చదవాల్సిన కోర్సులు, అందించే సంస్థల వివరాలను

Published : 26 Nov 2017 18:55 IST

 ప్రొఫెషనల్‌ చెఫ్‌ కావాలంటే?

?బీఎస్‌సీ పూర్తిచేసి ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాను. నాకు ప్రొఫెషనల్‌ చెఫ్‌ కావాలనుంది. చదవాల్సిన కోర్సులు, అందించే సంస్థల వివరాలను తెలుపగలరు.

నరేష్‌ బాలే

జ: చెఫ్‌కి కావాల్సిన ముఖ్యమైన అర్హత- కుకింగ్‌ పట్ల ఆసక్తి, నమ్మకం, నిర్వహణా నైపుణ్యాలు. వీటితోపాటు కిచెన్‌లో పనిచేసిన అనుభవమూ ఉండాలి. డిగ్రీ మాత్రమే ముఖ్యం అనుకుంటే అపోహే. దీనికి సంబంధించి కోర్సులు చేయాలనుకుంటే.. కలినరీ ఆర్ట్స్‌లో డిప్లొమా, సర్టిఫికెట్‌ కోర్సులను చేయొచ్చు.

ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ క్యాటరింగ్‌ టెక్నాలజీ (ఎన్‌సీహెచ్‌ఎంసీటీజేఈఈ) 10+2 అర్హతతో ఉమ్మడి రాతపరీక్షను నిర్వహిస్తోంది. దీని ద్వారా దేశంలోని 21 కేంద్ర ప్రభుత్వ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థలతోపాటు రాష్ట్ర ప్రభుత్వ, వాటి అనుబంధ ప్రయివేటు సంస్థల్లో బీఎస్‌సీ- హాస్పిటాలిటీ అండ్‌ హోటల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కోర్సులో ప్రవేశం కల్పిస్తారు.

మీరు డిగ్రీ పూర్తి చేశారు కాబట్టి ఏదైనా గుర్తింపు పొందిన కళాశాల నుంచి కలినరీ క్రాఫ్టింగ్‌, కలినరీ ఆర్ట్స్‌లో సర్టిఫికేట్‌ లేదా డిప్లొమా కోర్సులు చేయడం ద్వారా సమయాన్ని ఆదా చేసుకోవచ్చు. చెఫ్‌ కావడానికి ముఖ్యంగా కిచెన్‌లో పనిచేసిన అనుభవం బాగా తోడ్పతుంది. కొత్తదనం, ఆసక్తీ ముఖ్యమే.

 


 

డిగ్రీ మార్కులు పెంచుకోవచ్చా?

 ?దూరవిద్య విధానంలో డిగ్రీ 44% మార్కులతో 2010లో పూర్తి చేశాను. నా మార్కుల శాతాన్ని ఓడీఈ (ఆన్‌ డిమాండ్‌ ఎగ్జామినేషన్‌) ద్వారా పెంచుకోవాలనుకుంటున్నాను. కుదురుతుందా? దీనికి సంబంధించిన వివరాలు తెలియజేయగలరు.

సి.నాగబాబు

జ: ఓడీఈ (ఆన్‌ డిమాండ్‌ ఎగ్జామినేషన్‌) ముఖ్య ఉద్దేశం- కోర్సు వ్యవధిని పూర్తిచేసుకుని కూడా టర్మ్‌ ఎండ్‌ ఎగ్జామినేషన్‌ కోసం వేచిచూస్తూ, వీలును బట్టి పరీక్షలను రాయాలనుకునే వారికి వీలును కల్పించడం. పరీక్ష ఫెయిల్‌ అయినవారు సమయం వృథా కాకుండా తిరిగి త్వరగా పరీక్ష రాసి ఉత్తీర్ణులు కావాలనుకునేవారికి వీలు కల్పించే ప్రయత్నమిది. ఒకసారి కోర్సులో ఉత్తీర్ణత పొంది, సంవత్సరాలు గడిచిన తర్వాత మార్కులు పెంచుకునే మార్గం మాత్రం కాదు.

మార్కులను పెంచుకోవడానికి విద్యార్థులకు విశ్వవిద్యాలయాలు ఇంప్రూవ్‌మెంట్‌ పరీక్షల ద్వారా అవకాశం కల్పిస్తాయి. వీటిని రాసి మార్కులు పెంచుకోవాలనుకుంటే సంబంధిత విశ్వవిద్యాలయాల నిబంధనల ప్రకారం విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలి. ఈ అవకాశం డిగ్రీ పాసైన మూడేళ్లలోపు మాత్రమే (విశ్వవిద్యాలయాన్ని బట్టి) ఉంటుంది. మరిన్ని వివరాలకు ఒకసారి మీరు డిగ్రీ (దూరవిద్య) చదివిన విశ్వవిద్యాలయాన్ని సంప్రదించండి.

 


 

ఎంఎల్‌టీ చేయాలంటే ఎలా?

 ?ఇంటర్‌ (బైపీసీ) పూర్తిచేశాను. బీఎస్‌సీ - ఎంఎల్‌టీ చేయాలనుంది. కోర్సు, అందించే సంస్థల వివరాలను తెలియజేయండి.

డి.సందీప్‌

జ: బీఎస్‌సీ- మెడికల్‌ ల్యాబ్‌ టెక్నాలజీ కోర్సు చేయదలచిన విద్యార్థులు ఇంటర్‌ బైపీసీ లేదా ఒకేషనల్‌ కోర్స్‌ ఇన్‌ మెడికల్‌ ల్యాబ్‌ టెక్నాలజీ పూర్తిచేసి ఉండాలి. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్‌.టి.ఆర్‌. హెల్త్‌ యూనివర్సిటీ, తెలంగాణలో కాళొజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌, వాటి అనుబంధ కళాశాలల్లో ఈ కోర్సును అభ్యసించడానికి అవకాశం కల్పిస్తున్నాయి. ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో ప్రకటన విడుదల చేస్తాయి. రంగరాయ మెడికల్‌ కాలేజ్‌ ఆశ్రమ్‌ కాలేజ్‌, ఏలూరు; గుంటూరు మెడికల్‌ కళాశాల, గుంటూరు; షాదన్‌ కళాశాల, హైదరాబాద్‌; ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌ వంటివి ఈ కోర్సును అందిస్తున్న ముఖ్యమైన విద్యాసంస్థలు.

ప్రొ.బి. రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని