ముందస్తు దరఖాస్తు!

అమెరికాలో ఏ మేజర్ కోర్సు చేయాలో ముందు నిర్ణయించుకోవాలి. దాన్ని అత్యుత్తమ స్థాయిలో అందించే విశ్వవిద్యాలయాన్ని ఎంచుకోవాలి....

Published : 14 Jan 2016 19:05 IST

ముందస్తు దరఖాస్తు!

అమెరికాలో ఏ మేజర్‌ కోర్సు చేయాలో ముందు నిర్ణయించుకోవాలి. దాన్ని అత్యుత్తమ స్థాయిలో అందించే విశ్వవిద్యాలయాన్ని ఎంచుకోవాలి. ఇక ఆ కోర్సును అక్కడ చదవడానికి దరఖాస్తు కూడా చేసుకోవాలి కదా! ఇది అతి ముఖ్యమైన ప్రక్రియ. ఈ సందర్భంగా ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి?

విశ్వవిద్యాలయంలో చేరికకు సంబంధించి దరఖాస్తు దాఖలు తొలి అంకం. దీన్ని పూర్తిగా, తప్పులు లేకుండా నింపకపోతే విశ్వవిద్యాలయంలో ప్రవేశం ఆలస్యం కావచ్చు/ దరఖాస్తు తిరస్కరణకు గురి కావచ్చు. అందుకే ఈ విషయంలో తగిన జాగ్రత్తలు అవసరం.

 విదేశాల్లోని విశ్వవిద్యాలయాల్లో మాస్టర్స్‌ డిగ్రీ కోసం దరఖాస్తు చేసుకోవాలంటే.. ఎన్నో రకాల స్పెషలైజేషన్లు, కాన్సన్‌ట్రేషన్లు, మేజర్స్‌ నుంచి తగిన సబ్జెక్టుని ఎంచుకోవాలి. విదేశీ విశ్వవిద్యాలయాలు ఒక సెమిస్టర్‌ కాలానికి/ 

త్రైమాసిక కాలానికి మాత్రమే ప్రవేశం కల్పిస్తాయి. సెమిస్టర్‌ పద్ధతిలో- ఫాల్‌, స్ప్రింగ్‌, సమ్మర్‌ సీజన్లలో ప్రవేశాలు కల్పిస్తాయి. ఎక్కువమంది విద్యార్థులు ఆగస్టులో ప్రారంభమయ్యే ఫాల్‌ సెమిస్టర్‌లో చేరతారు.

వివిధ విశ్వవిద్యాలయాల్లో విభిన్న కోర్సులకు దరఖాస్తుల గడువు తేదీలు వేర్వేరుగా ఉంటాయి.

ఆన్‌లైన్‌ / పేపరు దరఖాస్తు
దేశీయ విద్యార్థులతో పోల్చితే, విదేశీ విద్యార్థుల ప్రవేశాల ప్రక్రియకు సంబంధించిన డాక్యుమెంట్ల తయారీ, SEVIS (స్టూడెంట్‌ ఎక్సే్చంజ్‌ అండ్‌ విజిటర్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టం) విధానం, ఇంకా ఇతర అంశాలకు సంబంధించిన ప్రక్రియకు చాలా సమయం తీసుకుంటుంది. పైగా విద్యార్థి ఆర్థిక సహాయం కోరుకుంటున్నట్లయితే, దరఖాస్తును మరింత ముందుగా దాఖలు చేయాల్సి ఉంటుంది. బహుళ దరఖాస్తులను ఆన్‌లైన్‌లో నింపి పంపవచ్చు/ పేపర్‌ దరఖాస్తులను నింపి పంపవచ్చు. మీరు దరఖాస్తు చేస్తున్న విశ్వవిద్యాలయ ఆవశ్యకతలు తెలుసుకోలేకపోయినా/ అవి మీకు సౌకర్యంగా లేకపోయినా దరఖాస్తు ప్రక్రియలో తడబడే ప్రమాదముంది.

 కొన్ని విశ్వవిద్యాలయాలు కేవలం ఆన్‌లైన్‌ దరఖాస్తులను స్వీకరిస్తాయి, మరికొన్ని పేపర్‌ దరఖాస్తులను మాత్రమే ఆమోదిస్తాయి. ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించే కొన్ని విశ్వవిద్యాలయాలు దరఖాస్తు రుసుము తీసుకోవు.
ఏ పద్ధతిలో దరఖాస్తు నింపినా దానికి జతగా పోస్టులోగానీ కొరియర్‌లోగానీ పంపవలసిన డాక్యుమెంట్లు- ట్రాన్స్‌క్రిప్ట్స్‌, రికమండేషన్స్‌, బ్యాంకు స్టేట్‌మెంట్స్‌, స్టేట్‌మెంట్‌ ఆఫ్‌ పర్పస్‌, లెటర్‌ ఆఫ్‌ ఫైనాన్షియల్‌ సపోర్ట్‌ వంటివి చాలా ఉంటాయి. లభించే సమయాన్ని బట్టి, ఆసక్తిని బట్టి విద్యార్థి ఏ విశ్వవిద్యాలయం తనకు నప్పుతుందో తెలుసుకోవాలి. దరఖాస్తు రుసుము చెల్లించడానికి ఇంటర్నేషనల్‌ క్రెడిట్‌ కార్డు ఉండాలి. పేపర్‌ ఆధారిత దరఖాస్తులు నింపడానికి చాలా సమయం పడుతుంది, శ్రమతో కూడుకున్న పని. తప్పులు దొర్లే అవకాశాలెక్కువ. దరఖాస్తులో కొట్టివేతలూ, దిద్దుబాట్లూ ఉండకూడదు.

 ఆరునెలల నుంచి...
బాచిలర్స్‌, మాస్టర్స్‌ దరఖాస్తుల ప్రక్రియ పూర్తవడానికి కనీసం ఆరునెలల నుంచి సంవత్సరం సమయం పడుతుంది. అదే డాక్టొరల్‌ డిగ్రీలకైతే సంవత్సరం కంటే ఎక్కువే పడుతుంది. ఈ సమయంలో విశ్వవిద్యాలయాల ఆవశ్యకతలు, గడువులకు సంబంధించి ఎన్నో ప్రాథమిక పనులు పూర్తి చేసుకోవాలి. సంబంధిత పత్రాలు లేకపోతే- ప్రవేశపు ప్రక్రియ ఆలస్యమవుతుంది.

ఒక విద్యార్థి 3/4 విశ్వవిద్యాలయాలకు దరఖాస్తు చేసుకుంటే- దరఖాస్తు ఫీజు, కొరియర్‌ చార్జీలు, డాక్యుమెంటేషన్‌ ఖర్చు అన్నీ కలిపి సుమారు 30 వేల నుంచి 35 వేల రూపాయల వరకు ఖర్చవుతుంది. ముందే ఈ ఖర్చు గురించి తెలుసుకోవాలి. తల్లిదండ్రులను, ప్రొఫెసర్లను ఇప్పటికే విదేశాల్లో చదువుకుంటున్న సీనియర్లను సంప్రదించడం మంచిది. సరైన దిశలో నిర్ణయం తీసుకువడానికి ఇది ఉపయోగపడుతుంది.

దరఖాస్తుకు ముందు...
* ఆయా విశ్వవిద్యాలయాల వెబ్‌సైట్లు, తాజా కేటలాగుల నుంచి స్వీకరించిన సమాచారాన్ని జాగ్రత్తగా మదింపు చేయాలి. చాలా విశ్వవిద్యాలయాలు ఆన్‌లైన్‌ దరఖాస్తుకు ప్రాధాన్యమిస్తాయి. దరఖాస్తు నింపడానికి అవసరమైన సూచనలను కూడా డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. దరఖాస్తులోని అంశాలను చదివి అర్థం చేసుకుని, దరఖాస్తుతోపాటు జత చేయవలసినవాటికి ఓ చెక్‌లిస్ట్‌ తయారు చేసుకోవాలి. అంటే, ట్రాన్స్‌క్రిప్ట్స్‌, స్టేట్‌మెంట్‌ ఆఫ్‌ పర్పస్‌, రికమండేషన్లు, దరఖాస్తు ఫీజు, ఇంకా ఇతర ఆవశ్యక పత్రాలు వంటివి.

 వేర్వేరు విశ్వవిద్యాలయాలకు ఈ సమాచారం వేర్వేరుగా ఉంటుందని గ్రహించాలి. దరఖాస్తు ఆన్‌లైన్‌లో నింపుతుంటే అకడమిక్‌, ఫైనాన్షియల్‌ పత్రాలు పక్కనే ఉంచుకోవాలి. అంతేకాదు, దరఖాస్తు ఫీజు చెల్లించేందుకు ఇంటర్నేషనల్‌ క్రెడిట్‌ కార్డు సిద్ధంగా ఉంచుకోవాలి. ఆన్‌లైన్లో దరఖాస్తు నింపుతుంటే, వీలైనంతవరకు ఒకే దఫాలో నింపాలి/ తరువాత సబ్‌మిట్‌ చేయడానికి ఫైల్‌ను సేవ్‌ చేసుకోవాలి. ఇలాంటి దరఖాస్తుల గడువు కోసం విశ్వవిద్యాలయాలు ఇచ్చే ప్రత్యేక గమనికలను దృష్టిలో ఉంచుకోవాలి.

పూర్తిచేసిన ఆన్‌లైన్‌ దరఖాస్తులను పంపించాక సంబంధిత పత్రాలను యూనివర్సిటీలోని డిపార్ట్‌మెంట్‌కూ, గ్రాడ్యుయేట్‌/ అండర్‌ గ్రాడ్యుయేట్‌ అడ్మిషన్‌ ఆఫీస్‌కూ కొరియర్‌ చేయాలి. పత్రాలు అందకపోతే, ప్రవేశం ఆలస్యమవుతుంది. మీ టెస్ట్‌ స్కోర్లు నేరుగా విశ్వవిద్యాలయాలకు పంపేలా చూసుకోవాలి. చాలా అమెరికన్‌ విశ్వవిద్యాలయాలకు ఇది తప్పనిసరి. ఇలా ఒక్కో విశ్వవిద్యాలయానికి స్కోరును విడివిడిగా తెలియజేయడానికి 15- 25 డాలర్లు ఖర్చవుతాయి. విద్యార్థులు ఈ వ్యయాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలి.

* కొన్ని విశ్వవిద్యాలయాలు మిమ్మల్ని రికమెండ్‌ చేస్తున్నవారి నుంచి సిఫారసు పత్రాలను నేరుగా ఈ-మెయిల్‌ ద్వారా పొందాలనుకుంటాయి. నిర్దేశిత పత్రాలను సక్రమంగా నింపేలా చూసుకోవాలి (లేదా తమ సొంత రికమండేషన్లను రూపొందించుకోవాలి). అవి సరైన చిరునామాకు చేరేలా జాగ్రత్త వహించాలి.

బ్యాంకు స్టేట్‌మెంట్‌ను, అఫిడవిట్‌ ఆఫ్‌ సపోర్ట్‌ను తమ అకడమిక్‌ డాక్యుమెంట్లతోపాటు జోడించడం మర్చిపోకూడదు. ఎందుకంటే విశ్వవిద్యాలయాలు ఫారంÐI 20 ఇవ్వాలంటే ఇవి తప్పనిసరి. దరఖాస్తుకే వీటిని జోడించటం ద్వారా మీకు సమయం, డబ్బు ఆదా అవుతాయి (కొరియర్‌ చార్జీలు మిగులుతాయి).

మీ దరఖాస్తు అన్నివిధాలుగా సక్రమంగా ఉందని నిర్ధారించుకున్నాక విశ్వవిద్యాలయం వాళ్లు మీకు ఓ కోడ్‌ను ఇస్తారు. మీరు కొరియర్‌లో పంపిన డాక్యుమెంట్లు వాళ్లకి అందిన వారం/ 10 రోజుల తరువాత ఈ కోడ్‌ సాయంతో మీ దరఖాస్తు స్టేటస్‌ల గురించి తెలుసుకోవచ్చు. మీ దరఖాస్తు స్టేటస్‌ ఏమిటో విశ్వవిద్యాలయ అధికారుల నుంచి తెలుసుకుంటుండవచ్చు.

ఐ-20 రూపంలో ప్రవేశం లభించగానే మీకు కేటాయించిన సలహాదారుతో సంప్రదింపులు జరుపుతూ, డిపార్ట్‌మెంట్‌, పరిశోధన, ఫ్యాకల్టీ, విద్యార్థి సంఘాల వివరాలు తెలుసుకోవాలి. తమ విభాగంలో ప్రొఫెసర్‌ నియంత్రణలో లభించే టీచింగ్‌ అసిస్టెంట్‌, రీసెర్చ్‌ అసిస్టెంట్‌, గ్రాడ్యుయేట్‌ అసిస్టెంట్‌ వంటి పార్ట్‌టైం ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఫీజు రద్దు/ నిధుల కోసం ప్రొఫెసర్‌కీ, అడ్మిషన్‌ కో ఆర్డినేటర్స్‌కీ ఈ-మెయిల్‌ చేయడం తప్పనిసరి. ఫారం ఐ-20 ఇవ్వకముందు నుంచీ కూడా ఈ అంశంపై విద్యార్థులు దృష్టిపెట్టాలి. ఎందుకంటే విద్యార్థులు పూర్తి/ పాక్షిక స్కాలర్‌షిప్‌/ ఆర్థికసాయం పొందడంలో ప్రొఫెసర్లు కీలకపాత్ర పోషిస్తారు.

* తాము చేరదలచుకున్న విశ్వవిద్యాలయాన్ని ఎంచుకోవడం మరో ముఖ్యమైన అంశం. వివిధ విశ్వవిద్యాలయాల నుంచి అడ్మిషన్‌ ఆఫర్లు వస్తే చేయాల్సిన పని ఇది. ఈ నిర్ణయం చాలా కీలకమైనదీ, ఓ సబ్జెక్టులో మేజర్‌ చదవడానికి పునాది వేసేదీ.

ఈ నిర్ణయం తీసుకునేముందుగా- పీజీ కెరియర్‌ అవకాశాలు, ఫీజు, ఓ ప్రధాన నగరానికి/ పట్టణానికి ఎంత సమీపంలో ఉంది, విద్యార్థి- ఉపాధ్యాయుల నిష్పత్తి, పరిశోధనావకాశాలు, ఇంటర్న్‌షిప్‌ అవకాశాలు, అథ్లెటిక్స్‌ వసతులు, విద్యార్థుల సాంస్కృతిక వైవిధ్యం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి.

 ఏం చేయాలి?

1. కళాశాల దరఖాస్తు ప్రక్రియనూ, సూచనలనూ అవగాహన చేసుకోవాలి.
2. కళాశాల దరఖాస్తు గడువు తేదీలను సరిచూసుకోవాలి.
3. కళాశాల ఫేర్‌లకూ, కౌన్సెలింగ్‌ సెషన్లకూ హాజరవ్వాలి.
4. ప్రామాణిక పరీక్షలకు సన్నద్ధమవడానికి తగినంత సమయం తీసుకోవాలి.
5. కళాశాలలు అందించే కోర్సులపై అవగాహన పెంచుకోవాలి.
6. తగిన, అర్హతగల స్కాలర్‌షిప్‌లూ, అసిస్టెంట్‌షిప్‌లకు దరఖాస్తు చేసుకోవాలి.
7. మీ కళాశాల ట్యూషన్‌ వ్యయం కోసం అవసరమైన నిధులను సమకూర్చుకోవాలి.
8. కళాశాల వెబ్‌సైట్ల నుంచీ, ఇతర ఉపయోగకరమైన వనరుల నుంచీ అవసరమైన సమాచారాన్ని సేకరించుకోవాలి.
9. ఓ నిర్దిష్టమైన విశ్వవిద్యాలయంలో చేరడానికి నిర్ణయం తీసుకునేముందు కుటుంబంతో, కౌన్సెలర్‌తో సంప్రదించాలి.
10. అవసరమైన టీకాలు వేయించుకోవాలి. అనుబంధ పత్రాలను సిద్ధం చేసుకోవాలి.
11. దరఖాస్తు పాకెట్‌ను జాగ్రత్తగా పరిశీలించి, సామాన్యంగా చేసే తప్పులూ, దొర్లే పొరబాట్లూ చేయకుండా జాగ్రత్త వహించాలి.
12.స్టేట్‌మెంట్‌ ఆఫ్‌ పర్పస్‌, వ్యాసాలు రాయడానికీ, మార్పులు చేర్పులు చేయడానికీ తగినంత సమయం తీసుకోవాలి. అవసరమైతే తిరగరాయాలి.
13. మీ ఆసక్తులు, ప్రతిభా సామర్థ్యాలు తెలిసిన- మీకు క్లాసులు చెప్పిన ప్రొఫెసర్ల నుంచే సిఫారసు పత్రం అడిగి తీసుకోవాలి (రికమండేషన్‌ లెటర్లు కనీసం 3).
14. అథ్లెటిక్స్‌లో, స్థానిక సముదాయాల్లో స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొనడం వల్ల కళాశాలలో ప్రవేశం దొరికే అవకాశాలు మెరుగవుతాయి. కళాశాలలో ఉన్న కాలంలో ఇంటర్న్‌షిప్‌, పార్ట్‌టైం ఉద్యోగాలు పొందడంలో ఇది ఉపయోగపడుతుంది.
15. సానుకూల దృక్పథంతో వ్యవహరించాలి. ఒకవేళ ఏ కళాశాలైనా మీ దరఖాస్తును తిరస్కరించినా, మళ్లీ దరఖాస్తు చేసుకోవాలి. మీ నిబద్ధత, మెరుగుదల వ్యక్తం చేయడం ద్వారా ప్రవేశం లభించే అవకాశముంటుంది.

ఏం చేయకూడదు?
1. దరఖాస్తు దాఖలు చేయడానికి ఆఖరి నిమిషం వరకూ ఆగవద్దు.
2. ఆరు కంటే ఎక్కువ విశ్వవిద్యాలయాలకు దరఖాస్తు చేయవద్దు. ఎందుకంటే ఇదంతా ఎక్కువ సమయం పట్టే ప్రక్రియ. పైగా ఒక్కోసారి తగిన ఫలితం కూడా రాకపోవచ్చు.
3. విశ్వవిద్యాలయం గురించిన వదంతులను నమ్మవద్దు. ఇతరుల అభిప్రాయాలపై పూర్తిగా ఆధారపడకూడదు. సెమినార్లకు హాజరవడం, పూర్వవిద్యార్థులను కలవడం/ వెబ్‌సైట్‌ ద్వారా సమాచారం సేకరించడం చేయాలి.
4. మీకు లభించిన అవార్డులు, సర్టిఫికెట్ల విషయంలో తప్పుడు సమాచారం ఇవ్వవద్దు.
5. మీ ఆసక్తులకు పూర్తిగా నప్పని కళాశాల/ విశ్వవిద్యాలయంలో చేరడానికి తొందరపడవద్దు.
6. మీకు మీరు బాగా చేయలేదనుకుని ఏ స్కోరునీ రద్దు చేయవద్దు. విశ్వవిద్యాలయాలు ఎక్కువ వచ్చిన స్కోరునే పరిగణనలోకి తీసుకుంటాయి.
7. ఆశించిన స్థాయిలో మీ టెస్ట్‌ స్కోరు లేకపోతే కంగారు పడవద్దు. మరోసారి పరీక్ష రాసి ఎక్కువ స్కోరు చేయవచ్చు.
8. విశ్వవిద్యాలయం వారు మీకు అడ్మిషన్‌ లెటర్‌ ఇచ్చేముందు ఏవైనా అదనపు రుజువులు, పత్రాలు, ట్రాన్స్‌క్రిప్ట్స్‌ అడిగితే కంగారుపడాల్సిన అవసరంలేదు.
9. మిత్రులు చేరారని చెప్పి అదే కళాశాలలో చేరాలనుకోకూడదు. నప్పే కళాశాలనే ఎంచుకోవాలి. ఉదాహరణకు- మీ మిత్రుడు చేరిన కోర్సు విశ్వవిద్యాలయంలో బాగా ప్రఖ్యాతిగాంచిన కోర్సు అయ్యుండొచ్చు. కానీ మీ కోర్సుకు మరో విశ్వవిద్యాలయంలో మెరుగైన అవకాశాలుండవచ్చు.

రచయిత ‘విద్య ఎస్‌.వి. ఎడ్యుకేషనల్‌ గ్రూప్‌’ డైరెక్టర్‌

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని