కోర్సు ఎంపికలో జాగ్రత్త

విశ్వవిద్యాలయ ఎంపికకు ముందే విద్యార్థి చేయాల్సిన పని... మేజర్ (కోర్సు) ఎంపిక. ఆసక్తి ఉన్న కోర్సును ఎంచుకుని, విశ్వవిద్యాలయంలో దానికి సరిపోయే సబ్జెక్టును వెతుక్కోవడం కీలకం...

Published : 14 Jan 2016 19:24 IST

కోర్సు ఎంపికలో జాగ్రత్త


 విశ్వవిద్యాలయ ఎంపికకు ముందే విద్యార్థి చేయాల్సిన పని... మేజర్‌ (కోర్సు) ఎంపిక. ఆసక్తి ఉన్న కోర్సును ఎంచుకుని, విశ్వవిద్యాలయంలో దానికి సరిపోయే సబ్జెక్టును వెతుక్కోవడం కీలకం. ఇలా తమ స్కోరింగ్‌ ఆధారంగా తమకున్న ఎంపిక అవకాశాలను వడపోయడం-విద్యార్థులకో చక్కని మార్గాన్ని ఏర్పరుస్తుంది.

విశ్వవిద్యాలయంలో ఫుల్‌టైం విద్యార్థులుగా నమోదు చేసుకున్న అంతర్జాతీయ విద్యార్థులు పార్ట్‌టైం వర్క్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. సెమిస్టర్స్‌ జరుగుతున్న సమయంలో 20 గంటలూ, హాజరు తప్పనిసరి కాని సమయమైన వేసవిలో 40 గంటలూ పనిచేసుకోవచ్చు.

ప్రతిసారీ అనుకున్న కోర్సు/ బ్రాంచి దొరకదు. అయినా ఒకే బ్రాంచిలో ఎంచుకోవాల్సిన అవసరమూ లేదు. ఉదాహరణకు- ఒక విద్యార్థి ప్రస్తుతం మెకానికల్‌ ఇంజినీరింగ్‌ చదువుతున్నాడని అనుకుందాం. ఆటోమోటివ్‌, ఏరోస్పేస్‌, బయో మెకానికల్‌, మాస్టర్‌ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ రంగాల్లో మాస్టర్స్‌ అతడికున్న అవకాశాలు. ఈ అంశాలపై పరిశోధన చేసుకునే సౌకర్యం కూడా ఉంది.

ఒక విశ్వవిద్యాలయంలో ఒక సబ్జెక్టును మేజర్‌గా ఎంచుకునేముందు కిందివి దృష్టిలో ఉంచుకోవాలి.

* ఒక కోర్సు/ కోర్‌ సబ్జెక్టు ఎంచుకునేటపుడు తమ బలాలు/ బలహీనతలు గుర్తించాలి.

* ఆసక్తి ఉన్న రంగాన్ని ఎంచుకోవడం చాలా అవసరం.

  * నిర్దిష్టమైన లక్ష్యం ఉండాలి. అంటే చదువు పూర్తిచేశాక చేద్దామనుకుంటున్న ఉద్యోగానికి ఏ కోర్సు ఉపయోగపడుతుందో తెలుసుకోవాలి.

* తోటి విద్యార్థులతో, సీనియర్లతో, ప్రొఫెసర్లతో మాట్లాడాలి. తగిన సలహాలు, సూచనలు పొందాలి.

* విశ్వవిద్యాలయ ప్రమాణాలు కూడా చాలా ముఖ్యం. ఓ నిర్దిష్ట మేజర్‌ ఎంచుకుని దానికి సరిపోయే సౌకర్యాలు, ల్యాబ్‌, కోర్సు అవుట్‌లైన్లు, డెమో సెషన్స్‌ మొదలైనవాటిని ముందుగానే పరిశీలించాలి.

* తగినంత చొరవ చూపడం అవసరం. అకడమిక్‌ సంస్థలు నిర్వహించే సెమినార్‌లకీ, మీటింగ్‌లకీ హాజరవ్వాలి. ప్రొఫెసర్లు నిర్వహించే కౌన్సెలింగ్‌ సెషన్లలో పాల్గొనాలి. విశ్వవిద్యాలయంలోని విద్యార్థులతో మాట్లాడాలి.

* ఒక సబ్జెక్టును మేజర్‌గా ఎంచుకునేముందు ఖర్చు ఎంతవుతుందో తెలుసుకోవాలి. ఓ ప్రొఫెసర్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న పరిశోధన ప్రాజెక్టును గుర్తించి, ఆయన నేతృత్వంలో పనిచేయడానికి ఆసక్తి ఉందని ఈ-మెయిల్‌ రాసి, ఆ పరిశోధనలో సాయం చేస్తే.. మీ ఫీజు రద్దు చేయవచ్చు. లేదా ఆయన పరిధిలో టీచింగ్‌ అసిస్టెంట్‌గా, రీసెర్చ్‌ అసిస్టెంట్‌గా పార్ట్‌టైం ఉద్యోగం దొరకవచ్చు.

మొదటి సెమిస్టర్‌లో నమోదు చేసుకున్న విద్యార్థులకు ఆయా విభాగాలు గ్రాడ్యుయేట్‌ అసిస్టెంట్‌షిప్‌ ఇస్తాయి. ఇది చాలామంది విద్యార్థులకు తెలియదు. పైగా ఈ పొజిషన్స్‌ ‘ముందు వచ్చినవారికి ముందు’ (ఫస్ట్‌ కమ్‌ ఫస్ట్‌ సర్వ్‌) పద్ధతిలో అందుతాయి. అటువంటి స్థానాలను గుర్తించి సరైన సమయంలో దరఖాస్తు చేసుకోవడం వల్ల మీ కోర్సుకు అవసరమయ్యే నిధులను సమకూర్చుకోగలుగుతారు.

* విశ్వవిద్యాలయంలో మీ మిత్రులు ఎంచుకున్నారనో, లేదా ఇంకెవరి ఒత్తిడికో తలవంచి మేజర్‌ను ఎంచుకోవద్దు. విద్యార్థి సామర్థ్యం, బలాలు, ఆసక్తిపైనే ఆధారపడి ఆ ఎంపిక ఉండాలి.

రిపోర్టింగ్‌- కోర్సు ఎన్‌రోల్‌మెంట్‌
విశ్వవిద్యాలయం, మేజర్‌ల ఎంపిక చేసుకున్నారు. వీసా కూడా సిద్ధంగా ఉంది. వెంటనే విశ్వవిద్యాలయంలో అడుగుపెట్టాక చేయాల్సినపని- విశ్వవిద్యాలయంలో రిపోర్ట్‌ చేసి, కోర్సులో చేరడం.

విమానం ఎక్కకముందే- కావాల్సిన సమాచారమంతా సేకరించుకోవాలి. విశ్వవిద్యాలయంలో దాఖలు చేయాల్సిన పత్రాలన్నీ సిద్ధం చేసుకోవాలి. కోర్సు కాలానికి సరిపడా విదేశంలో ఉండడానికి అవసరమైన సరంజామా సర్దుకోవాలి. ఈ వివరాలన్నింటిని సీనియర్ల నుంచి/ తోటి విద్యార్థుల నుంచి తెలుసుకోవాలి. తమ వీసా ఆమోదం, ప్రయాణ తేదీ గురించి విద్యార్థులు ముందుగానే- ఇంటర్నేషనల్‌ గ్రాడ్యుయేట్‌ స్టూడెంట్స్‌ కో-ఆర్డినేటర్‌కు సమాచారమివ్వాలి. ఇలా చేయడం వల్ల విద్యార్థులకు సాయం చేసే సిబ్బంది పని సులువవుతుంది. తాత్కాలిక బస ఏర్పాటు చేయగలుగుతారు.

విశ్వవిద్యాలయంలో అందజేయాల్సిన అన్ని ప్రయాణ పత్రాల జాబితా రూపొందించుకోవడం కూడా అవసరం. మీ విశ్వవిద్యాలయానికి దగ్గర్లో ఉన్న విమానాశ్రయానికి టికెట్‌ కొనుక్కోవాలి. ఈ దశలో ఇమిగ్రేషన్‌, కస్టమ్స్‌ చెక్‌కు సన్నద్ధమవాలి.

తాత్కాలిక బస గురించీ, స్టూడెంట్‌ ఓరియంటేషన్‌ ప్రోగ్రామ్‌ జరిగేవరకు తోటి విద్యార్థుతో కలివిడిగా ఉండే ఏర్పాట్ల గురించీ పూర్తి సమాచారం సేకరించాలి. క్యాంపస్‌లోని గ్రాడ్యుయేట్‌ ఆఫీస్‌, డిపార్ట్‌మెంట్‌ ఆఫీస్‌, లైబ్రరీ, అథ్లెటిక్‌ ఫెసిలిటీస్‌ వంటి వాటిని తెలుసుకోవాలి.

* యూనివర్సిటీ నిర్వహించే ఇంటర్నేషనల్‌ స్టూడెంట్‌ ఓరియంటేషన్‌ ప్రోగ్రామ్‌కి తప్పక హాజరవ్వాలి. 2-3 రోజులపాటు జరిగే ఈ కార్యక్రమంలో అన్ని వివరాలూ చెబుతారు. అన్ని సందేహాలకూ ఇక్కడ సమాధానాలు లభిస్తాయి. కోర్సు ప్రారంభం నుంచి ముగించే వరకు మొత్తం ప్రక్రియను విద్యార్థులకు స్పష్టం చేస్తారు.

* తర్వాతి ముఖ్యమైన అంశం- గ్రాడ్యుయేట్‌ విద్యార్థి సలహాదారును ఎంచుకోవడం. మాస్టర్స్‌ చదవడంలో ఇది కీలకం. థీసిస్‌ ఆప్షన్‌ అయినా, నాన్‌ థీసిస్‌ ఆప్షన్‌ అయినా గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేయాలంటే సలహాదారు ఆధ్వర్యంలో పరిశోధన చేయాల్సి ఉంటుంది. విద్యార్థులు గ్రాడ్యుయేట్‌ స్టూడెంట్స్‌ కో- ఆర్డినేటర్‌తో చర్చించి డిపార్ట్‌మెంట్‌లో అందుబాటులో ఉన్న ఫండింగ్‌ అవకాశాలను తెలుసుకోవాలి. ప్రొఫెసర్లు/ వారి బృందంలోనూ లభించే పరిశోధనావకాశాల గురించి ప్రొఫెసర్లకు ఈ-మెయిల్‌ చేయడం ఎంతో అవసరం.

విశ్వవిద్యాలయంలో ఫుల్‌టైం విద్యార్థులుగా నమోదు చేసుకున్న అంతర్జాతీయ విద్యార్థులు పార్ట్‌టైం వర్క్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. సెమిస్టర్స్‌ జరుగుతున్న సమయంలో 20 గంటలూ, కోర్సులకు హాజరుకావడం తప్పనిసరి కాని సమయమైన వేసవిలో 40 గంటలూ పనిచేసుకోవచ్చు. సాధారణంగా ఈ సమయంలో ఇంటర్న్‌షిప్‌కు దరఖాస్తు చేసుకుంటారు విద్యార్థులు. లైబ్రరీ, ఫుడ్‌ కోర్ట్‌, పోలీస్‌ శాఖ, యూనివర్సిటీ ఐటీ అండ్‌ సపోర్ట్‌ డెస్క్‌, ఇంటర్నేషనల్‌ స్టూడెంట్‌ ఆఫీసుల్లో విద్యార్థులకు పార్ట్‌టైం ఉద్యోగాలు లభిస్తాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని