శ్రేష్ఠతకు సోపానాలు

అమెరికాలో చదువుకోవడం విద్యార్థులకు చక్కని అనుభవమే కాదు- అత్యున్నత అవకాశాలను అందిపుచ్చుకునే దిశగా వేసే అడుగు కూడా...

Published : 14 Jan 2016 19:39 IST

శ్రేష్ఠతకు సోపానాలు

అమెరికాలో చదువుకోవడం విద్యార్థులకు చక్కని అనుభవమే కాదు- అత్యున్నత అవకాశాలను అందిపుచ్చుకునే దిశగా వేసే అడుగు కూడా. భిన్న సంస్కృతుల పరిచయంతో అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాలు అందుకోవడానికి ఉపకరించే మార్గం!
  వివిధ నియామక సంస్థలు ప్రపంచ మార్కెట్‌లో తమ విస్తృతి కోసం ‘అంతర్జాతీయ నైపుణ్యాలు’ండే పట్టభద్రుల కోసం అన్వేషిస్తున్నాయి. అమెరికాలో చదువుకునే విదేశీ విద్యార్థులకు సహజంగానే ఈ నైపుణ్యాలు విద్యాభ్యాస కాలంలో అలవడతాయి. ఎందుకంటే బహుభాషల్లో ప్రావీణ్యం, వైవిధ్యమైన సంస్కృతుల భావ ప్రసారం.. వీటన్నిటికీ అక్కడ అవకాశం లభిస్తుంది. అంతర్జాతీయ సంస్థలు భిన్న నేపథ్యాలు, సంస్కృతుల నుంచి వచ్చిన విదేశీ విద్యార్థులను తమ బృందాల్లో నియమించుకుంటున్నాయి. ఇలాంటివారిలో అమెరికాలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థులే ఎక్కువమంది.

అమెరికాలో ఉన్నతవిద్య ద్వారా పొందే స్వతంత్రత, ఆత్మవిశ్వాసం, నైపుణ్యం, భిన్న సంస్కృతుల అనుభవం దీర్ఘకాలపు కెరియర్‌లో సోపానాలుగా ఉపయోగపడతాయి.

అమెరికా విశ్వవిద్యాలయాల్లో విదేశీ విద్యార్థులకు బోధకులుగా, పరిశోధకులుగానూ చక్కని అవకాశాలు లభిస్తాయి. సరికొత్త నైపుణ్యాలు, వినూత్న ఆలోచనలుండే విద్యార్థులు.. విద్యార్థి దశలో ఉండగానే బోధకులుగా అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు.

విద్యార్థులకు అండగా...
అమెరికాలోని మారుమూలన ఉన్న విద్యాసంస్థలో అయినా, అతి పెద్ద నగరంలోని విశ్వవిద్యాలయంలో అయినా .. విదేశీ విద్యార్థుల అభిరుచులు, ఆసక్తులకు సరిపోయేలా స్టూడెంట్‌ క్లబ్‌లు, విద్యార్థి సంఘాలు ఉంటాయి. అమెరికాకు ఉన్నత విద్య నిమిత్తం వచ్చే విద్యార్థులు తమకు సహాయపడే సంస్థల వివరాలను కూడా తెలుసుకోవాలి. వాటిలో ప్రధానమైనది విదేశీ విద్యార్థుల కార్యాలయం.

కొత్త వాతావరణంలో ఇమడడానికి ఎవరికైనా కొంత సమయం పడుతుంది. ఏళ్ల తరబడి ఒకచోట ఉండి.. అకస్మాత్తుగా ఉన్నతవిద్య కోసం కొత్త దేశం రావడం.. ఇక్కడ రోజువారీ కార్యకలాపాలను, జీవన వ్యవహారాలను చక్కబెట్టుకోవడం అంత సులువు కాదు. విద్యాపరంగా, సాంస్కృతికంగా కొత్త వాతావరణానికి అలవాటుపడే విషయంలో కొన్ని ఇబ్బందులూ తప్పవు. వీటిని తొలగించి, విదేశీ విద్యార్థులకు సహాయం అందించడానికి ఆయా విశ్వవిద్యాలయాల ప్రాంగణాల్లో విదేశీ విద్యార్థుల కార్యాలయాలుంటాయి.

అమెరికా వచ్చిన విద్యార్థులు చేయాల్సిన మొదటి పని- చేరబోయే విశ్వవిద్యాలయంలోని విదేశీ విద్యార్థుల కార్యాలయాన్ని సంప్రదించడం. అలాగే విదేశీ విద్యార్థుల కార్యాలయం మొదట చేసే పని- వీరికి వీలైనంత త్వరగా ఓరియంటేషన్‌ ప్రోగ్రామ్‌ జరిగేలా చూడడం. ఈ కార్యాలయం విదేశీ విద్యార్థులు అమెరికాలో ఉన్నంతకాలం వారి కోసం ఎన్నో కార్యక్రమాలు రూపొందించి అమలు చేస్తుంది. వీసా స్టేటస్‌, ఆర్థిక సహాయం, వసతి, ఉద్యోగావకాశాలు, ఆరోగ్యాంశాలు వంటి ఎన్నో అంశాల్లో సందేహాలను తీరుస్తుంది. విదేశీ విద్యార్థుల ఉన్నతవిద్య పూర్తయ్యేనాటికి ఈ కార్యాలయం రెజ్యూమే రూపొందించడంలోనూ, ఉద్యోగావకాశాలను కల్పించడంలోనూ సాయం చేస్తుంది. అమెరికాకు ఉన్నత విద్య నిమిత్తం వచ్చే విదేశీ విద్యార్థులకు కార్యాలయం ఓ అద్భుత సమాచార వనరు.

ప్రాంగణ జీవితం
అమెరికాలోని విశ్వవిద్యాలయాలు అద్భుతమైన ప్రాంగణాల (క్యాంపస్‌)ను కలిగి ఉన్నాయి. విదేశీ విద్యార్థులు ఇక్కడి విద్యావకాశాలను విస్తృతం చేసుకోవడమే కాక సాంస్కృతిక అంశాలను విశాలం చేసుకోగల అవకాశం లభిస్తుంది. విద్యతోపాటు సాంస్కృతిక, కళ, క్రీడలతోపాటు జీవన నైపుణ్యాలను అందించడం అమెరికన్‌ విశ్వవిద్యాలయాలకు చెందిన క్యాంపస్‌ల ప్రత్యేకత. ఇక్కడ ఉన్నత విద్యావ్యవస్థ ఎవరికి కావాల్సిన విద్యను వారికి అందించగలుగుతోంది. అండర్‌ గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్‌లో లిబరల్‌ ఆర్ట్స్‌ కోర్సులో లాంగ్వేజెస్‌, మేథమేటిక్స్‌ అంశాల్లో తరగతులుంటాయి. సాంకేతిక పరిశోధనలు, విజ్ఞాన అధ్యయనాలు, అత్యాధునిక పరికరాలను అమెరికా విశ్వవిద్యాలయాలు విద్యార్థులకు అందుబాటులో ఉంచుతాయి. ఎంచుకున్న సబ్జెక్టుతో శాస్త్ర, సాంకేతిక అంశాలకు సంబంధం లేకపోయినా ఏదో దశలో వాటితో కూడా పరిచయం పెంచుకోగల అవకాశం లభిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉండే పరిశోధకులతో, అధ్యాపకులతో తమ రంగంలోని నిపుణులతోనూ విదేశీ విద్యార్థులు సంబంధాలు కొనసాగించవచ్చు.

‘ఎంఎస్‌’ దరఖాస్తుకు ఇవి జతచేయాలి
1. కరికులమ్‌ వీటె/ రెజ్యూమే/ బయోడేటా- దానిపై విద్యార్థి సంతకం తప్పనిసరి.

2. స్టేట్‌మెంట్‌ ఆఫ్‌ పర్పస్‌- విద్యార్థి సంతకం తప్పనిసరి.

3. పాస్‌పోర్ట్‌ కాపీ- మొదటి పేజీ, ఆఖరి/ చిరునామా పేజీ

4. పదో తరగతి (ఎస్‌ఎస్‌సీ)/ సీబీఎస్‌సీ సర్టిఫికెట్‌: హెడ్‌ మాస్టర్‌/ ఇటీవల చదివిన కళాశాల ప్రిన్సిపల్‌ సంతకం అటెస్ట్‌ చేసి ఉండాలి. సంతకం పెట్టి, అధికారి ముద్రవేసిన ఎన్వలప్‌లో ఉంచాలి.

5. ఇంటర్మీడియట్‌/ 10+2 సర్టిఫికెట్‌: ఇంటర్‌ కళాశాల ప్రిన్సిపల్‌/ ఇటీవల మీరు చదివిన కళాశాల ప్రిన్సిపల్‌ అటెస్ట్‌ చేయాలి. సంతకం చేసిన అధికారిక ముద్ర వేసిన ఎన్వలప్‌లో ఉంచాలి.

6. డిగ్రీ ట్రాన్‌స్క్రిప్ట్స్‌: సెమిస్టర్‌ వారీగా యూనివర్సిటీ కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ అటెస్ట్‌ చేయాలి. దానిని ఓ సీల్డ్‌ కవర్‌లో ఉంచాలి. ఆఖరి సంవత్సరం విద్యార్థులు స్టడీ సర్టిఫికెట్లు, ఇటీవలే డిగ్రీ పూర్తిచేసిన విద్యార్థులు ప్రొవిజినల్‌ సర్టిఫికెట్‌ ఇంకా అందకపోతే కోర్సు పూర్తయినట్టుగా ఒక ధ్రువీకరణ పత్రం తీసుకోవాలి.

7. సిఫార్సు పత్రాలు- ముగ్గురు ప్రొఫెసర్ల నుంచి.

8. టోఫెల్‌/ ఐఈఎల్‌టీఎస్‌ స్కోరు రిపోర్ట్‌.

9. జీఆర్‌ఈ జనరల్‌ టెస్ట్‌ స్కోర్‌ రికార్డు.

10. బ్యాంకు బాలెన్స్‌ సర్టిఫికెట్‌: రూ. 20 లక్షల నుంచి 25 లక్షలు.

11. తల్లిదండ్రులు/ స్పాన్సర్స్‌ మద్దతు తెలిపే అఫిడవిట్‌ (రూ.10 నాన్‌ జ్యుడీషియల్‌ స్టాంప్స్‌).

12. ఉద్యోగానుభవ సర్టిఫికెట్లు (ఏవైనా ఉంటే).

13. విద్యేతర కార్యక్రమాలు (సభ్యత్వాలు, పేపర్‌ ప్రెజెంటేషన్స్‌, భాగస్వామ్యం మొదలైనవి).

రచయిత ‘విద్య ఎస్‌వీ ఎడ్యుకేషనల్‌ గ్రూప్‌’ డైరెక్టర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని