Ola Cabs: 4 నెలలకే ఓలా క్యాబ్స్‌ సీఈఓ రాజీనామా.. 10% మంది ఉద్యోగులకు ఉద్వాసన!

ఓలా క్యాబ్స్‌ సీఈఓ పదవికి హేమంత్‌ భక్షి రాజీనామా చేశారు. సీఈఓ పదవి చేపట్టిన 4 నెలలకే బాధ్యతల నుంచి వైదొలిగారు.

Published : 29 Apr 2024 17:40 IST

Ola Cabs | ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ క్యాబ్ సేవల సంస్థ ఓలా పేరిట సేవలందించే ఏఎన్‌ఐ టెక్నాలజీస్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఓలా క్యాబ్స్‌ (OLA Cabs) సంస్థకు సీఈఓగా వ్యవరిస్తున్న హేమంత్‌ భక్షి (Hemant Bakshi quits) తన పదవికి రాజీనామా చేశారు. కంపెనీలో చేరిన నాలుగు నెలలకే వైదొలిగారు. మరోవైపు ఐపీఓ సన్నాహకాల్లో ఉన్న కంపెనీ.. 10 శాతం మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికేందుకు సిద్ధమైందని ఆంగ్ల మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.

ఓలా క్యాబ్స్‌ సీఈఓగా ఈ ఏడాది జనవరిలోనే హేమంత్‌ భక్షి బాధ్యతలు స్వీకరించారు. అప్పటివరకు ఓలా సీఈఓగా ఉన్న భవీశ్‌ అగర్వాల్‌ తన బాధ్యతల నుంచి వైదొలిగారు. విద్యుత్‌ వాహన విభాగంపై దృష్టి సారించేందుకు ఓలా ఎలక్ట్రిక్‌పై సీఈఓగా కొనసాగుతున్నారు. అయితే, కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడంలో భాగంగా భక్షి సీఈఓ పదవి నుంచి వైదొలిగినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. ఆయన రాజీనామా తక్షణమే అమల్లోకి వచ్చిందని పేర్కొన్నాయి. ఓలా క్యాబ్స్‌కు కొత్త సీఈఓను త్వరలోనే నియమించే అవకాశం ఉంది.

ఈ క్రెడిట్‌ కార్డులతో బిల్లులు చెల్లిస్తున్నారా? మే 1 నుంచి అదనపు ఛార్జీ..!

మరోవైపు ఓలా క్యాబ్స్‌ ఐపీఓకు (IPO) సన్నద్ధమవుతోంది. ఈ క్రమంలో పునర్నిర్మాణ ప్రక్రియను చేపట్టబోతోంది. ఇందులోభాగంగా 10 శాతం మంది ఉద్యోగులను తొలగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో దాదాపు 200 మంది ఉద్యోగులపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఐపీఓకు వచ్చేందుకు సన్నద్ధం అవుతున్న వేళ కంపెనీ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్స్‌తో ఓలా క్యాబ్స్‌ ఇటీవలే చర్చలు నిర్వహించింది. మరో రెండు మూడు నెలల్లో సెబీకి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఓలా ఎలక్ట్రిక్‌ ఇప్పటికే ఐపీఓ కోసం సెబీకి దరఖాస్తు చేసుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని