విదేశీ విద్యకు వెసులుబాటు

విదేశాల్లో ఉన్నత విద్య చదవాలని నిర్ణయం తీసుకున్నారా? ఖర్చు చూస్తే భారీగానే ఉంటుంది కదా, మరెలా అనుకుంటున్నారా?

Published : 01 Aug 2016 02:03 IST

విదేశీ విద్యకు వెసులుబాటు

విదేశాల్లో ఉన్నత విద్య చదవాలని నిర్ణయం తీసుకున్నారా? ఖర్చు చూస్తే భారీగానే ఉంటుంది కదా, మరెలా అనుకుంటున్నారా? బ్యాంకుల నుంచి విద్యారుణం పొందగలిగితే ప్రధాన అవరోధం తొలగుతుంది. మార్గం సుగమం అవుతుంది!

రోజుల్లో చాలా బ్యాంకులు తక్కువ వడ్డీ రేట్లతో (9.55 నుంచి 14 శాతం) విద్యారుణాలను అందిస్తున్నాయి. విదేశీవిద్య కోసం ఈ రుణాలను తీసుకోదల్చిన విద్యార్థులు కింది ముఖ్యాంశాలు గమనించాలి: 1) ఏ దేశంలో చదవాలి? ఎంత వ్యయమవుతుంది? 2) ఎంబసీ ఏరకమైన విద్యారుణాలను అనుమతిస్తుంది? 3) విద్యారుణం పొందటానికి అర్హతలేమిటి? 4) ఎప్పుడు దరఖాస్తు చేసుకోవాలి? 5) రుణం ఖరారవటానికి ఎంత సమయం పడుతుంది? 5) డబ్బు అందటానికి ఎంత వ్యవధి పడుతుంది? వీటిలో ఒక్కో అంశాన్ని వివరంగా చూద్దాం.

ఏ దేశం, ఎంత ఖర్చు: కోర్సు వ్యవధి, అది చదవటానికి అయ్యే ఖర్చు, కోర్సు ముగిశాక ఉపాధి అవకాశాలు... వీటిని దృష్టిలో పెట్టుకుని ఏ దేశంలో చదవాలో నిర్ణయించుకోవాలి. చాలామంది ట్యూషన్‌ఫీజు ఆధారంగా మాత్రమే ఖర్చును లెక్కిస్తుంటారు. కానీ దేశం, ప్రదేశం, ఉపకార వేతనాల లభ్యత, ట్యూషన్‌ ఫీజు... వీటన్నిటిపై ఆధారపడి విద్యాభ్యాసపు ఖర్చు ఉంటుంది. జీవనవ్యయం, ఆరోగ్యబీమా, పుస్తకాలు, ఇతర ఫీజులను కూడా పరిగణనలోకి తీసుకుని కాగల ఖర్చును అంచనా వేసుకోవాల్సివుంటుంది.

ఎంబసీ అనుమతించే రుణాలు: జాతీయ బ్యాంకులూ, కొన్ని సుప్రసిద్ధ ప్రైవేటు బ్యాంకులూ మంజూరు చేసే రుణాలను మాత్రమే ఎంబసీ అనుమతిస్తుంది. ప్రాంతీయ బ్యాంకులు అందించే విద్యారుణాలను మాత్రం ఎంబసీలు అంగీకరించవు.

ఏ అర్హతలు: 1) తల్లిదండ్రుల/హామీదారుల కొలేటరల్‌ సెక్యూరిటీతో విద్యారుణాలను అనుమతిస్తారు. ఈ సెక్యూరిటీ.. భవనాలు/ అపార్ట్‌మెంట్లు, ఓపెన్‌ప్లాట్లు (వ్యవసాయేతర భూములు), ఆర్నెల్ల నాటి ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, ఎల్‌ఐసీ పాలసీలు, పోస్టల్‌ బాండుల సరెండర్‌ వాల్యూలు 2) విశ్వవిద్యాలయాల ర్యాంకింగుల ఆధారంగా 3) గత విద్యార్హతలో మార్కుల శాతం, జీఆర్‌ఈ/ఐఈఎల్‌టీఎస్‌/టోఫెల్‌ టెస్టు స్కోరు 4) రూ. 4లక్షల నుంచి ఒకటిన్నర కోట్ల వరకూ రుణాల మంజూరుకు అనుమతి ఉంది.

ఎప్పుడు దరఖాస్తు?: చాలామంది విద్యార్థులకూ, తల్లిదండ్రులకూ అడ్మిషన్ల వ్యవహారం మొదట పూర్తిచేయాలా? దానికంటే ముందు విద్యారుణం సంగతి తేల్చుకోవాలా అనేది సమస్యగా ఉంటుంది. చాలా బ్యాంకులు విద్యార్థుల ప్రవేశాలు నిర్థారణ అయ్యాకే రుణం మంజూరు లేఖను ఇస్తాయి. కొన్ని విశ్వవిద్యాలయాలు విద్యార్థులకు కచ్చితమైన ఫండింగు ఉండాలనే నిబంధన పాటిస్తాయి.

చాలా కళాశాలలు అడ్మిషన్లకూ, ఫీజు చెల్లింపునకూ మధ్య ఎక్కువ వ్యవధిని ఇవ్వవు. దీంతో విద్యారుణ దరఖాస్తు- మంజూరు విషయంలో హైరానా పడాల్సివస్తుంది. కోర్సులో ప్రవేశం నిర్థారణ జరగటానికి ముందే విద్యారుణ సంబంధితులను సంప్రదిస్తే రుణ అర్హత గురించి తెలుసుకోవచ్చు.

రుణ మంజూరుకు వ్యవధి: విద్యారుణం మంజూరు అనేది బ్యాంకును బట్టి ఉంటుంది. ఇది సాధారణంగా ఒక వారం నుంచి నెలవరకూ పడుతుంది.

రుణాల అందజేత తీరు: విద్యారుణ దరఖాస్తును రెండు దశల్లో పరిష్కరిస్తారు. ప్రాథమికంగా మంజూరు, విద్యార్థి వీసా పొందిన తర్వాత రుణాన్ని అందజేయటం. దరఖాస్తును పూర్తిగా నింపి తగిన డాక్యుమెంట్లు జోడించి సమర్పిస్తే... స్వీకరించి పరిశీలించి మంజూరు లేఖను వారం నుంచి నెల రోజలలోపు ఇస్తారు. అదే రకంగా పోస్ట్‌ శాంక్షన్‌ డాక్యుమెంట్లు, ప్రక్రియ తర్వాత వారం రోజుల్లో రుణం అందిస్తారు. విద్యారుణ మొత్తాన్ని సెమిస్టర్‌ వారీగా, దరఖాస్తుదారు విద్యాప్రగతి ఆధారంగా విడుదల చేస్తారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని