విదేశీ విద్యకు... విధివిధానాలు ఇవీ!

ఉన్నతవిద్యను విదేశాల్లో చదవాలని కలలు కనే భారతీయ విద్యార్థులు ఎందరో! దాన్ని సాకారం చేసుకునే ప్రయత్నాలు ఆరంభించటానికి ఈ అక్టోబరు నెల సరైన తరుణం. ఇక్కట్లేమీ పడకుండా సుదూర విద్యాసంస్థల్లో ప్రవేశించి, సాఫీగా విద్యాభ్యాసం చేయాలంటే గమనించాల్సిన అంశాలేమిటి? సన్నద్ధతకు ప్రాతిపదికగా ఏమేం తెలుసుకోవాలి?

Published : 09 Oct 2017 02:08 IST

విదేశీ విద్యకు... విధివిధానాలు ఇవీ!

ఉన్నతవిద్యను విదేశాల్లో చదవాలని కలలు కనే భారతీయ విద్యార్థులు ఎందరో! దాన్ని సాకారం చేసుకునే ప్రయత్నాలు ఆరంభించటానికి ఈ అక్టోబరు నెల సరైన తరుణం. ఇక్కట్లేమీ పడకుండా సుదూర విద్యాసంస్థల్లో ప్రవేశించి, సాఫీగా విద్యాభ్యాసం చేయాలంటే గమనించాల్సిన అంశాలేమిటి? సన్నద్ధతకు ప్రాతిపదికగా ఏమేం తెలుసుకోవాలి?

నదేశంలో నాణ్యమైన విద్యను అందించే ప్రముఖ విద్యాసంస్థలు తక్కువ. వాటిలోనూ సీట్లకోసం విపరీతమైన పోటీ. ఈ పరిస్థితులు విద్యార్థులు ప్రత్యామ్నాయ మార్గాలను వెదికేలా చేస్తోంది. విదేశీ విద్య వాటిలో ఒకటి. ఉత్తమశ్రేణి విద్యాబోధనకూ, తద్వారా జీవితంలో మంచి స్థితిలో స్థిరపడటానికీ ఆస్కారం కలుగుతుంది కాబట్టే వ్యయ ప్రయాసలకోర్చి మన విద్యార్థులు సరిహద్దులు దాటుతున్నారు. దీనికోసం- టోఫెల్‌, ఐఈఎల్‌టీఎస్‌ లాంటి ప్రీ రిక్విజిట్‌ పరీక్షల్లో స్కోరు తెచ్చుకోవటం, ఇతరదేశాల్లోని విద్యాసంస్థలను ఎంచుకోవటం, వాటికి దరఖాస్తు చేసుకుని, ప్రవేశం పొందటం, వీసా ఇంటర్వ్యూకు హాజరై నెగ్గటం..ఇదంతా సుదీర్ఘ ప్రక్రియ.

ఇదంతా పెద్ద శ్రమ కాక¹పోవచ్చు. విదేశాలకు వెళ్ళి ఇంజినీరింగ్‌, ఎంబీఏ, సైన్స్‌, ఫైనార్ట్స్‌, ఇతర పీజీ కోర్సులు చదువుకోవడం సగటు విద్యార్థికి ఆర్థికంగా భారమే. ఇదొకరకంగా విద్యార్థుల భవిష్యత్తుకు తల్లిదండ్రులు పెట్టే పెట్టుబడి. చాలా దేశాలు విద్యాభ్యాసం తర్వాత అక్కడే ఉద్యోగాలు పొందే అవకాశాలు కల్పిస్తున్నాయి. దీనివల్ల విద్యారుణాలను సులువుగా తీర్చివేయగలుగుతున్నారు. జీవితంలో స్థిరపడగలుగుతున్నారు.

ప్రధానంగా ఏ దేశాలు?

విద్యార్థులు పీజీలో తమకు తగిన కోర్సునూ, దాన్ని చదవదల్చిన దేశాన్నీ ఎంచుకోవటం చాలా ముఖ్యం. అలాగే ప్ర¾వేశాలకు అవసరమైన వివిధ టెస్టులకూ, డాక్యుమెంటేషన్‌ తయారీకీ సిద్ధమవ్వాలి. మన విద్యార్థులు ప్రధానంగా ఎంచుకుంటున్న దేశాలు- యు.ఎస్‌.ఎ., యు.కె., ఆస్ట్రేలియా, కెనడా, జర్మనీ, న్యూజీలాండ్‌, సింగపూర్‌, కొన్ని ఐరోపా దేశాలు.

ఈ దేశాల్లో గిరాకీ ఉన్న ప్రోగ్రాములు: కంప్యూటర్‌ సైన్స్‌, బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌, మెకానికల్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌, సివిల్‌ ఇంజినీరింగ్‌, ఫిల్మ్‌ మేకింగ్‌, ఫొటోగ్రఫీ లాంటి ఫైనార్ట్స్‌ కోర్సులు.

అర్హతల విషయానికొస్తే... ప్రవేశానికి అవసరమైన మార్కుల శాతం, టెస్ట్‌ స్కోర్ల గురించి తెలుసుకోవాలి. మార్కుల శాతం తక్కువున్నా, ఎక్కువున్నా ఉన్న అవకాశాలు విస్తృతంగానే ఉంటాయి. అయితే 60 శాతానికి మించి మార్కులు తెచ్చుకుంటే ప్రవేశాలకు ఉపయోగకరం.

వివిధ దేశాలు పరిగణనలోకి తీసుకునే టెస్టులు-
యు.ఎస్‌.ఎ.: జీఆర్‌ఈ/జీమ్యాట్‌, టోఫెల్‌/ఐఈఎల్‌టీఎస్‌/పీటీఈ
యు.కె.: టోఫెల్‌/ఐఈఎల్‌టీఎస్‌
ఆస్ట్రేలియా: ఐఈఎల్‌టీఎస్‌, టోఫెల్‌, పీటీఈ
కెనడా: ఐఈఎల్‌టీఎస్‌, జీఆర్‌ఈ
న్యూజీలాం: ఐఈఎల్‌టీఎస్‌

టోఫెల్‌/ఐఈఎల్‌టీఎస్‌/పీటీఈలు విద్యార్థుల ఆంగ్ల ప్రావీణ్యాన్ని అంచనా వేస్తాయి. ఈ భాషా సామర్థ్యం విదేశాలకు వెళ్ళే అంతర్జాతీయ విద్యార్థులకు తప్పనిసరి.

విద్యార్థుల క్వాంటిటేటివ్‌, వెర్బల్‌ ఎబిలిటీలను లెక్కించటానికి అకడమిక్‌ డిపార్టుమెంట్లకు జీఆర్‌ఈ/జీమ్యాట్‌లు సహాయపడతాయి. ఈ టెస్టుల స్కోర్లు యు.ఎస్‌.ఎ., కెనడాల్లోని చాలా విద్యాసంస్థల్లో అవసరం. కానీ చాలా దేశాల్లో వీటి అవసరం ఉండదు.

దేశాన్నీ, విశ్వవిద్యాలయాన్నీ బట్టి ప్రవేశాల అర్హతలూ, పరీక్షలూ మారవచ్చు గానీ మన విద్యార్థులకు టోఫెల్‌/ఐఈఎల్‌టీఎస్‌/పీటీఈ లాంటి ఇంగ్లిష్‌ టెస్టులు తప్పనిసరి. ఎందుకంటే మనది ఇంగ్లిష్‌ మాట్లాడే దేశం కాదు కాబట్టి.

ప్రవేశాలు ఎన్నిసార్లు?

ఒక్కో విశ్వవిద్యాలయానికి దరఖాస్తుల సమర్పణ తేదీలు వేర్వేరుగా ఉంటాయి. దరఖాస్తుల సంఖ్యను బట్టీ, విద్యాసంస్థ విధానాలూ, పద్ధతులను బట్టీ ఈ తేడాలు సహజం. అలాగే విశ్వవిద్యాలయంలోని వివిధ డిపార్ట్‌మెంట్లు దరఖాస్తులపై నిర్ణయం తీసుకోవటానికి తీసుకునే వ్యవధిని బట్టి కూడా ఈ భేదాలుంటాయి. ఒక విశ్వవిద్యాలయంలోనే ఒక్కో డిపార్ట్‌మెంట్‌కు ఒక్కో గడువుతేదీ ఉండవచ్చు. ఫార్మసీ, హెల్త్‌ సైన్సెస్‌, సైన్సెస్‌ లాంటి కోర్సుల్లో చేరదల్చినవారు మిగతావారి కంటే ముందుగానే దరఖాస్తులను సమర్పించాల్సివుంటుంది.

ఉపకార వేతనాలను కోరుతూ చేసే దరఖాస్తుల గడువు కూడా విశ్వవిద్యాలయాలకో తీరులో ఉంటుంది. వీటిని సాధారణంగా వెబ్‌సైట్లలో ప్రస్తావించరు. అందుకే ఉపకారవేతనాలు, ఫీజు మినహాయింపులు ఆశించేవారు వీలైనంత ముందుగా దరఖాస్తు చేసుకోవటం చాలా అవసరం.

ప్రవేశాల నుంచి వీసా వరకూ కొనసాగే ప్రక్రియకు చాలా సమయం పడుతుంది. ఇది గమనించి చివరి నిమిషం హైరానాలేమీ లేకుండా ముందస్తుగా దరఖాస్తులను విదేశీ యూనివర్సిటీలకు పంపుకోవటం శ్రేయస్కరం.

యు.ఎస్‌.ఎ.: ఇక్కడి విశ్వవిద్యాలయాలు ఫాల్‌ (సెప్టెంబరు), స్ప్రింగ్‌ (జనవరి)లలో ప్రవేశాలు కల్పిస్తాయి. చాలా కొద్ది విద్యాసంస్థలు సమ్మర్‌ (మే)లో కూడా ప్రవేశాలను అనుమతిస్తాయి. విద్యార్థులు అత్యధిక సంఖ్యలో చేరే తరుణం మాత్రం ఫాల్‌. విద్యాసంవత్సరం ముగించాక, వచ్చే ప్రవేశాల తరుణం కాబట్టి ఇదే అత్యుత్తమమని ఎక్కువమంది దీనికే మొగ్గు చూపిస్తారు.

యు.కె.: యు.ఎస్‌.ఎ.లాగే ఇక్కడ ప్రధానంగా ప్రవేశాలు ఫాల్‌లోనే. జనవరిలో స్ప్రింగ్‌ ఇన్‌టేక్‌ ఉంటుంది.

ఆస్ట్రేలియా/న్యూజీలాండ్‌: ఈ దేశాల్లో ముఖ్యమైన ఇన్‌టేక్‌ జరిగేది జులైలో. దీంతోపాటు ఫిబ్రవరి/మార్చిలలో కూడా ప్రవేశాలుంటాయి. యు.ఎస్‌.లో ఫాల్‌ ఇన్‌టేక్‌ లాగే ఇక్కడ గరిష్ఠంగా విద్యార్థులు చేరేది జులైలోనే. ఈ దేశాల్లో చదవదల్చిన విద్యార్థులు మేలో తమ కోర్సు పూర్తయిన వెంటనే ప్రవేశాలకు తక్కువ వ్యవధి ఉంటుందని గుర్తించాలి. దరఖాస్తు ప్రక్రియను వేగవంతం చేయాలి.

ప్రసిద్ధ విశ్వవిద్యాలయాల్లో అంతర్జాతీయ విద్యార్థుల దరఖాస్తుల గడువులు:
ఫాల్‌: డిసెంబరు 31, స్ప్రింగ్‌: ఆగస్టు 1

మరికొన్ని విద్యాలయాలు నిర్దేశించే దరఖాస్తు గడువులు
ఫాల్‌: మార్చి 1, స్ప్రింగ్‌: అక్టోబరు 1

తక్కువ ర్యాంకులున్న విశ్వవిద్యాలయాల గడువులు
ఫాల్‌: మే 1, స్ప్రింగ్‌: నవంబరు 1

సుప్రసిద్ధ విశ్వవిద్యాలయాల్లో దరఖాస్తుల గడువు మిగిలినవాటికంటే ముందు ఉండటం గమనించవచ్చు.

చదువులు పూర్తయ్యాక వర్క్‌ పర్మిట్‌ అవకాశాలను చాలా దేశాలు అందిస్తున్నాయి. ఇక్కడితో పోలిస్తే మెరుగైన వేతనాలు పొందగలుగుతున్నారు. స్వదేశానికి తిరిగి వచ్చినపుడు మెరుగైన ఉపాధి అవకాశాలు వారికి స్వాగతమిస్తున్నాయి. 

ఏయే స్పెషలైజేషన్లు?

విద్యార్థులు ఎంచుకోవటానికి వివిధ కోర్సుల్లో అందుబాటులో ఉండే స్పెషలైజేషన్లు చూద్దాం.
* కంప్యూటర్‌ సైన్స్‌: సిస్టమ్స్‌ ఇంజినీరింగ్‌, ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌, సైబర్‌ సెక్యూరిటీ (ప్రస్తుతం దీనికెంతో గిరాకీ), డేటా సైన్స్‌, డేటా అనలిటిక్స్‌, ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజెస్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌.
* మెకానికల్‌ ఇంజినీరింగ్‌: మాన్యుఫాక్చరింగ్‌, ఆటోమొబైల్‌, ప్రొడక్షన్‌, రోబోటిక్స్‌, ఇండస్ట్రియల్‌ ఇంజినీరింగ్‌, మెషిన్‌ ఇంజినీరింగ్‌, డిజైన్‌ ఇంజినీరింగ్‌.
* ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌: టెలికమ్యూనికేషన్స్‌, పవర్‌ సర్క్యూట్స్‌, వీఎల్‌ఎస్‌ఐ డిజైన్‌, ఎంబెడెడ్‌ సిస్టమ్స్‌, రేడియో ఫ్రీక్వెన్సీ/ మైక్రోవేవ్స్‌ అండ్‌ ఎలక్ట్రో మ్యాగ్నెట్స్‌, కంట్రోల్‌ సిస్టమ్స్‌, వైర్‌లెస్‌ కమ్యూనికేషన్స్‌.
* సివిల్‌ ఇంజినీరింగ్‌: కన్‌స్ట్రక్షన్‌ ఇంజినీరింగ్‌, కన్‌స్ట్రక్షన్‌ మేనేజ్‌మెంట్‌, ట్రాన్స్‌పోర్టేషన్‌ ఇంజినీరింగ్‌, స్ట్రక్చరల్‌ ఇంజినీరింగ్‌, హైడ్రాలిక్‌ అండ్‌ వాటర్‌ రిసోర్సెస్‌ ఇంజినీరింగ్‌, జియో టెక్నికల్‌ అండ్‌ ఎన్వైరాన్‌మెంటల్‌ ఇంజినీరింగ్‌.
* బిజినెస్‌ స్టడీస్‌: సోషల్‌సైన్సెస్‌లో స్థూల సబ్జెక్టు ఇది. దీనిలో స్పెషలైజేషన్లు- అకౌంటెన్సీ, ఫైనాన్స్‌, ఆర్గనైజేషన్‌, హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌, హెల్త్‌కేర్‌ మేనేజ్‌మెంట్‌, స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌, టెక్నాలజీ మేనేజ్‌మెంట్‌, మార్కెటింగ్‌.
* సైన్సెస్‌: ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయలాజికల్‌ సైన్స్‌, మ్యాథమేటిక్స్‌, అగ్రికల్చర్‌, జియాలజీ.
* ఫైన్‌ఆర్ట్స్‌: ఫిల్మ్‌ మేకింగ్‌, థియేటర్‌, గ్రాఫిక్‌ డిజైన్‌, డాన్స్‌, క్రియేటివ్‌ రైటింగ్‌, యాక్టింగ్‌, ఫొటోగ్రఫీ, ఫ్యాషన్‌, హేర్‌ సైలిస్ట్స్‌.

విదేశాల్లోనే ఎందుకని?

1. విద్యాప్రమాణాలు, మౌలిక సదుపాయాలు: మనదేశ విద్యావిధానంలో థియరీకి ప్రాధాన్యం ఉంటుంది. కానీ విదేశీ విద్యాసంస్థల్లో ఆచరణాత్మక విధానానికి అధిక ప్రాముఖ్యం. మౌలిక వసతుల విషయంలో ఐఐటీల వంటి కొన్నిటిని పక్కనపెడితే మిగతా వాటికంటే అక్కడి చాలా విశ్వవిద్యాలయాలు ఎన్నో రెట్లు మెరుగ్గా ఉంటాయి. దీంతో ఉత్తమ విద్యాప్రమాణాలకు అవకాశం ఏర్పడింది.

2. భిన్న సంస్కృతుల కూడలి: అమెరికా, యు.కె. లాంటి దేశాలకు వెళ్ళే విద్యార్థులకు విభిన్న దేశాల, సంస్కృతుల నేపథ్యం ఉన్న సహాధ్యాయులతో కలసి చదువుకునే అవకాశం ఏర్పడుతుంది. ఇది విశాల దృక్పథాన్ని గణనీయంగా పెంచుతుంది. ఎన్నో విషయాలు నేర్చుకునేలా చేసి, వారి భవిష్యత్తును తీర్చిదిద్దుతుంది.

3. చదువుతూనే సంపాదన: విద్యాభ్యాసం సాగిస్తూనే సంపాదించుకునే సదుపాయం దాదాపు మనదేశంలో ఉండదు. క్యాంపస్‌ వెలుపల గానీ, క్యాంపస్‌లో గానీ ఉద్యోగం చేసే వీలు ఇక్కడ ఉండదు. కానీ ఇతరదేశాల్లో అయితే దాదాపు అందరు విద్యార్థులూ పార్ట్‌టైమ్‌ విధులు నిర్వహించి డబ్బు సంపాదించుకోగలుగుతారు. ఇది వారిని భవిష్యత్తుకు సిద్ధం చేస్తుంది. అంతే కాదు; సంపాదించే కొద్ది మొత్తమైనా వీరికి ఈ దశలో ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుంది. తమ ఖర్చులకు అవసరమైన డబ్బును ఈరకంగా స్వయంగా సంపాదించుకోగలుగుతారు. దాదాపు అన్ని ఇతర దేశాలూ విద్యార్థుల విరామ సమయాల్లో పార్ట్‌ టైమ్‌, ఫుల్‌టైమ్‌ విధులకు అవకాశం కల్పిస్తున్నాయి.

4. ఉద్యోగ అవకాశాలు: చదువులు పూర్తయ్యాక వర్క్‌ పర్మిట్‌ అవకాశాలను చాలా దేశాలు అందిస్తున్నాయి. దీనివల్ల విద్యార్థులకు అక్కడి పరిస్థితులను పూర్తిగా అవగాహన చేసుకోవటానికి ఆస్కారమిస్తోంది. ఫలితంగా అక్కడే ఉద్యోగాల్లోకి సులువుగా ప్రవేశించటానికీ, పైగా ఆసక్తి ఉంటే ఆ దేశాల్లోనే స్థిరపడటానికీ వీలవుతోంది. ఇక్కడితో పోలిస్తే మెరుగైన వేతనాలు పొందగలుగుతున్నారు. స్వదేశానికి తిరిగి వచ్చినపుడు మెరుగైన ఉపాధి అవకాశాలు వారికి స్వాగతమిస్తున్నాయి.

5. బాధ్యతాయుత వ్యక్తిత్వం: విదేశాలకు వెళ్ళటమంటేే.. విద్యార్థులు తమకు అలవాటైన భారతీయ వాతావరణానికి పూర్తి భిన్నమైన వాతావరణంలో ఉండటం. అప్పటివరకూ తల్లిదండ్రుల నీడలో చరించినవారు స్వతంత్రంగా తమ అవసరాలను తామే చూసుకోవాల్సిరావటం వారికి గొప్ప నేర్చుకునే అనుభవమవుతుంది. ఫలితంగా వీరు దృఢంగా, నిర్ణయాత్మకంగా రూపొందుతారు. వ్యక్తిత్వం, బాధ్యతాయుత ప్రవర్తన మెరుగుపడతాయి.మంచి పౌరులుగా, వ్యక్తులుగా తయారవుతారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు