Vishal: 19ఏళ్ల కెరీర్‌లో 12 పెళ్లిళ్లు చేశారు.. అందుకే తొలిసారి ట్వీట్‌ చేశా: నటుడు విశాల్‌

ఇటీవల లక్ష్మీ మేనన్‌ను పెళ్లి చేసుకోబోతున్నట్లు వచ్చిన వార్తలతో పాటు, జాతీయ అవార్డులపై గతంలో తాను చేసిన వ్యాఖ్యలకు నటుడు విశాల్‌ వివరణ ఇచ్చారు.

Published : 15 Sep 2023 02:13 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సల్మాన్‌ఖాన్‌ పెళ్లి చేసుకున్న తర్వాత తాను కూడా చేసుకుంటానని సినీ నటుడు విశాల్‌ (Vishal) అన్నారు. ఆయన కథానాయకుడిగా అధిక్‌ రవిచంద్రన్‌ దర్శకత్వంలో రూపొందిన టైమ్‌ ట్రావెల్‌ మూవీ ‘మార్క్‌ ఆంటోనీ’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబరు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఓ ఆంగ్ల మీడియాకు వచ్చిన ఇంటర్వ్యూలో విశాల్‌ మాట్లాడారు. ‘పెళ్లెప్పుడు’ అన్న ప్రశ్నకు పైవిధంగా స్పందించారు. ప్రతి దానికి ఒక సమయం ఉంటుందని అన్నారు.

‘‘సాధారణంగా నేను వివాదాలపై స్పందించను. ఇటీవల తప్పనిసరి పరిస్థితుల్లో ఒక ట్వీట్‌ చేశాను. నటి లక్ష్మీ మేనన్‌ను నేను పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఇది నాకు సంబంధించిన విషయం మాత్రమే కాదు, అవతలి అమ్మాయి భవిష్యత్‌ కూడా ఉంది. నేను స్పందించకపోతే, ఆమె వ్యక్తిగత జీవితంపై ప్రభావం చూపుతుంది. నా గురించి ఏ విషయమైనా మీరు ఫోన్‌ చేసి అడగవచ్చు. గతంలో చాలా మందిని పెళ్లి చేసుకుంటున్నట్లు వార్తలు రాశారు. నిజం చెప్పాలంటే నా 19ఏళ్ల కెరీర్‌లో ఇప్పటివరకూ 12మందిని పెళ్లి చేసుకున్నట్లు రాశారు. చిన్నప్పటి నుంచి నాకు సంబంధించిన విషయాలు పేపర్‌లో వస్తే, కట్‌ చేసి భద్రపరచడం మా నాన్నగారికి అలవాటు. అలా ఒకరోజు ఏదో పేపర్‌ కట్‌ చేస్తుంటే, ‘ఏం చేస్తున్నారు’ అని అడిగా, ‘లక్ష్మీ మేనన్‌తో నీకు పెళ్లి అని వార్త వచ్చింది’ అన్నారు. అలా ఆ విషయం నాకు తెలిసింది. హీరోయిన్‌లలో నాకు మంచి స్నేహితులు ఉన్నారు. ఎప్పుడైనా భోజనానికో, సినిమాకో వెళ్దామని వాళ్లు అడిగితే, నేను వద్దనే చెబుతాను. బయట జంటగా కనిపిస్తే, డేటింగ్‌లో ఉన్నామని వార్తలు రాసేస్తారు. అందుకే మా ఇంట్లో భోజనం చేసి, సరదాగా కబుర్లు చెప్పుకొంటాం. తెలుగు ఇండస్ట్రీలోనూ రానా, నితిన్‌, నాని నాకు క్లోజ్‌ ఫ్రెండ్స్‌’’అని విశాల్‌ చెప్పుకొచ్చారు.

గతంలో జాతీయ అవార్డులపై తాను చేసిన వ్యాఖ్యలకు కూడా విశాల్‌ వివరణ ఇచ్చారు. అవార్డులకు తాను వ్యతిరేకంగా కాదని తెలిపారు. ‘‘జాతీయ అవార్డులను కించ పరిచేలా నేనెప్పుడూ వ్యాఖ్యలు చేయను. అవార్డులు ఇచ్చే విషయంలో నా దృష్టి కోణం అది. అసలు అవార్డులపై నాకు నమ్మకం లేదు. అవార్డైనా, రివార్డైనా ప్రేక్షకులు ఇచ్చేది. సినిమా పరిశ్రమకు ప్రతి శుక్రవారం రివార్డు అనేది ఉంటుంది. ప్రేక్షకులు ఆదరించబట్టే నేను, నా కుటుంబం మూడు పూటలా తినగలుగుతున్నాం. వచ్చిన నామినేషన్స్‌లో నుంచి ఫలానా వ్యక్తి ఉత్తమ నటుడు అని, కోట్ల మంది అభిప్రాయాన్ని పది, పన్నెండు మంది కూర్చొని ఎలా నిర్ణయిస్తారు. 40 కోట్ల మంది అభిప్రాయాన్ని నలుగురు ఎలా డిసైడ్‌ చేస్తారు’’ అని విశాల్‌ అభిప్రాయపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని