iPhone: అమెరికాతో పోలిస్తే ‘మేడిన్‌ ఇండియా’ ఐఫోనే కాస్ట్‌లీ!

iPhone 15 price in India: ఇతర దేశాలతో పోలిస్తే దేశీయంగా తయారైన ఐఫోన్‌ ధరలే అధికంగా ఉన్నాయి. దీనికి అనేక కారణాలు ఉన్నాయి.

Published : 15 Sep 2023 02:15 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టెక్‌ లవర్స్‌ ఎంతగానో ఎదురుచూసిన యాపిల్‌ లేటెస్ట్‌ ఐఫోన్లు విడుదలయ్యాయి. ఐఫోన్‌ 15 సిరీస్‌ (iPhone 15) విక్రయాలు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఐఫోన్‌ 15, 15 ప్లస్‌, 15 ప్రో, 15 ప్రో మ్యాక్స్‌ దేశీయ ధరలను సైతం యాపిల్‌ ప్రకటించింది. అయితే, అమెరికా, దుబాయ్‌తో పోలిస్తే భారత్‌లోనే ధర ఎక్కువ. పైగా దేశంలో తయారయ్యే ఐఫోన్ల ధరలు కూడా ఆయా దేశాలతో పోల్చినప్పుడు అధికంగా ఉండడం గమనార్హం.

ఐఫోన్‌ 15 మోడల్‌ ధరను యాపిల్‌ అమెరికాలో 799 డాలర్లుగా ప్రకటించింది. అదే మోడల్ భారత్‌ ధర రూ.79,900గా యాపిల్‌ పేర్కొంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 83 అనుకుంటే రూ.66 వేలు అవుతుంది. కానీ, దీని ధర దాదాపు 20 శాతం అధికంగా ఉండడం గమనార్హం. అరబ్‌ ఎమిరేట్స్‌ దిర్హమ్‌లలో దీని ధర 3,399 కాగా.. భారత రూపాయాల్లోకి (22 రూపాయలు = 1 దిర్హమ్‌) మారిస్తే రూ.76 వేలు అవుతుంది. దుబాయ్‌తో పోల్చినా భారత్‌లోనే ధర ఎక్కువన్నమాట. ఐఫోన్‌ 15 ప్లస్‌ మోడల్‌దీ అదే పరిస్థితి.

యాపిల్‌పై శాంసంగ్‌ సెటైర్‌.. స్పైడర్‌మ్యాన్‌ లుక్‌తో నెటిజన్ల మీమ్స్‌!

అదే ఐఫోన్‌ 15 ప్రో మ్యాక్స్‌ బేస్‌ మోడల్‌ విషయానికొస్తే.. దీని ధరను అమెరికాలో 1,199గా యాపిల్‌ పేర్కొంది. దీన్ని భారత కరెన్సీలోకి కన్వర్ట్‌ చేస్తే దీని ధర రూ.99 వేలు అవుతుంది. కానీ, భారత్‌లో ఈ మోడల్‌ ధర రూ.1.59 లక్షలుగా యాపిల్‌ పేర్కొంది. అంటే దాదాపు 50 శాతం అధికం. దుబాయ్‌లో ఈ మోడల్‌ ధర 5,099 దిర్హమ్‌లు కాగా.. భారత కరెన్సీలోకి మారిస్తే 1.15 లక్షలే అవుతుంది.

ఎందుకీ తేడా?

వాస్తవానికి ఐఫోన్‌ 15ను భారత్‌లో ఫాక్స్‌కాన్‌ సంస్థ తయారు చేస్తోంది. ఐఫోన్‌ 15 ప్లస్‌నూ త్వరలో దేశీయంగా తయారు చేయనుంది. అయితే, ఐఫోన్‌ 15 ప్రో, ఐఫోన్‌ 15 ప్రో మ్యాక్స్‌ మోడళ్లు మాత్రం దిగుమతి అవుతాయి. ముందు 15 గురించి మాట్లాడుకుంటే.. దేశీయంగా తయారైనా ఉపకరణాలకు ఫాక్స్‌కాన్‌ సంస్థ దిగుమతి చేసుకుంటుంది. దీంతో వాటికి దిగుమతి సుంకం చెల్ల్లించాల్సి ఉంటుంది. డిస్‌ప్లే, ప్రాసెసర్‌, డయోడ్లు, ట్రాన్సిస్టర్స్‌ వంటి పార్టులకు దిగుమతి సుంకం వర్తిస్తుంది. వీటితో తయారైన యాపిల్‌ ఫోన్‌కు 18 జీఎస్టీ అదనం. ఇక ప్రో మోడళ్ల విషయానికొస్తే.. లగ్జరీ కార్ల మాదిరిగా వీటికి 22 శాతం దిగుమతి సుంకం, 2 శాతం సోషల్‌ వెల్ఫేర్‌ సర్‌ఛార్జిని ప్రభుత్వం విధిస్తుంది. దీనికి 18 శాతం జీఎస్టీ అదనం. అలా విదేశాల్లో తయారై దిగుమతి అయిన మోడళ్లకు దాదాపు 40 శాతం పన్ను వర్తిస్తుంది. వెరసి ప్రో మోడళ్ల ధరలు మరింత ఎక్కువగా ఉంటాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని