Graduates: చదువుకు తగిన ఉద్యోగం రాకపోతే?

చాలామంది ఎదుర్కొనే ప్రశ్న ఇది... భారీగా ఫీజు కట్టి,  కష్టపడి చదివి, పట్టా పుచ్చుకుని బయటకు వస్తే... తీరా ఆ చదివిన చదువుకు తగిన ఉద్యోగం రాదు! ఒకపక్క ఖాళీగా ఉండలేక ఒత్తిడి, మరోపక్క సరైన ఉద్యోగం కనపడక డీలా.

Updated : 02 Mar 2023 07:28 IST

చాలామంది ఎదుర్కొనే ప్రశ్న ఇది... భారీగా ఫీజు కట్టి,  కష్టపడి చదివి, పట్టా పుచ్చుకుని బయటకు వస్తే... తీరా ఆ చదివిన చదువుకు తగిన ఉద్యోగం రాదు! ఒకపక్క ఖాళీగా ఉండలేక ఒత్తిడి, మరోపక్క సరైన ఉద్యోగం కనపడక డీలా. ఇలాంటి సమయాల్లో ఏం చేయొచ్చు? దీన్ని ఎలా ఎదుర్కోవాలి?

లాంటి క్లిష్ట పరిస్థితుల్లో నుంచి మనల్ని మనం బయటపడేసుకునేలా చిన్నచిన్న మార్పులు, ప్రయత్నాలు చేస్తూ ఉండాలి. ఏదేమైనా ఒత్తిడికి లోను కాకుండా విజయం సాధించేందుకు ప్రయత్నించాలి.

* ఒక్కసారి రెజ్యూమెను తరచి చూడండి. కేవలం చదువు, ఇతర వివరాల సమాచారంతో బోరింగ్‌గా ఉందా లేక ఆసక్తి కలిగించేలా ఒక్క విషయం అయినా అనిపిస్తోందా అన్నది కంపెనీల కోణం నుంచి ఆలోచించండి. ఎవరైనా మనల్ని ఎందుకు ఉద్యోగంలోకి తీసుకోవాలి అనే ప్రశ్న మనకు మనమే వేసుకుంటే... ఆ సమాధానంలోంచి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. దానికి తగిన విధంగా రెజ్యూమెను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేసుకుంటూ ఉండండి. ఇతరులకంటే భిన్నంగా కనిపించేలా ప్రయత్నించండి.

* సంస్థలకు పంపే కవర్‌ లెటర్స్‌, ఈ-మెయిల్స్‌ను జాగ్రత్తగా గమనించండి. అవి అవతలివారిని చదివించేలా ఉండాలి. వారి వెబ్‌సైట్‌లో మనం ఏం చూశాం, ఎందుకు సంప్రదించాం, వారికి ఏం చేయగలం అనే విషయాన్ని తెలియజేసేలా క్లుప్తంగా, స్పష్టంగా ఉండాలి. అప్పుడు ఎదుటివ్యక్తి తిరిగి సమాధానం ఇచ్చేందుకు ఎక్కువ ఆస్కారం ఉంటుంది.

* కేవలం దరఖాస్తులు పంపడమే కాకుండా, ఇంకేం చేయవచ్చో ఆలోచించండి. నియామకాలు జరుగుతున్నట్లు ప్రకటించకపోయినా కంపెనీలను సంప్రదించడం, నెట్‌వర్క్‌ మీటింగ్స్‌కు హాజరుకావడం, అవసరమైతే ఊరు మారడం, ఏదైనా కోర్సు నేర్చుకోవడం... ఏం చేస్తే ఇప్పుడున్న పరిస్థితి మెరుగవుతుందో అంచనా వేయండి.

* మౌఖిక పరీక్షను ఎదుర్కోవడం గురించి మరింత బాగా నేర్చుకోండి. ఎంత చక్కటి అకడమిక్‌ స్కోరు, రెజ్యూమె ఉన్నా ఇంటర్వ్యూ సరిగ్గా ఇవ్వకపోతే ఉద్యోగం పొందే అవకాశాలు గణనీయంగా పడిపోతాయి. చక్కగా మాట్లాడటం, సరైన బాడీ లాంగ్వేజ్‌ కలిగి ఉండటం, ఇంటర్వ్యూలో పాటించాల్సిన ఇతర నియమాలు, టిప్స్‌ను తెలుసుకోవడం ద్వారా ఉద్యోగవకాశాలు మెరుగుపడతాయి.

* కేవలం నిర్దేశించుకున్న ఉద్యోగమే కాకుండా... దానికి అనుబంధంగా ఏదైనా ఫీల్డ్‌లో ఉద్యోగం దొరుకుతుందేమో ప్రయత్నించండి. కొంతకాలం తర్వాత మారే అవకాశం ఉంటుంది కదా! ముందైతే జాబ్‌ దొరకడం ముఖ్యం.  

* జాబ్‌ మార్కెట్లో ఎన్నో ఓపెనింగ్స్‌ ఉంటాయి. అందులో మనకు నప్పే వాటిని, మనకు ప్రాధాన్యం దక్కే వాటిని ఎంచుకోవడం కూడా ముఖ్యమే. అప్పుడే ఆ ఉద్యోగం అందుకునే వీలుంటుంది. ప్రొఫైల్‌కు వీలైనంత దగ్గరగా అనిపించిన ఉద్యోగాలకు దరఖాస్తు చేస్తే తిరిగి జవాబు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి.

* అన్నింటికీ మించి నిరుత్సాహపడొద్దు. ప్రతి ఒక్కరికీ క్యాంపస్‌లలోనే ఉద్యోగాలు వచ్చేయవు. చాలామందికి చదువు పూర్తవ్వడానికీ, ఉద్యోగంలో చేరడానికీ మధ్య ఒక క్లిష్టమైన సంధి దశ ఉంటుంది. ఆ సమయంలో ఎంత ఓపిగ్గా ప్రయత్నిస్తే అంత బాగా కెరియర్‌ను రూపొందించుకున్నవాళ్లం అవుతాం!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని