Civils exam: సివిల్స్‌ పరీక్ష ఎప్పుడు రాస్తే మేలు?

డిగ్రీ చదువుతున్నాను. సివిల్‌ సర్వెంట్‌ కావాలనుంది. డిగ్రీ తర్వాత సివిల్స్‌ రాయనా? పీజీ చేస్తూ రాయనా? 

Published : 23 May 2024 00:11 IST

డిగ్రీ చదువుతున్నాను. సివిల్‌ సర్వెంట్‌ కావాలనుంది. డిగ్రీ తర్వాత సివిల్స్‌ రాయనా? పీజీ చేస్తూ రాయనా?

డి.రాజేష్‌

ప్రస్తుతం మీరు డిగ్రీ చదువుతున్నారు అంటే మీ వయసు 21 సంవత్సరాల లోపే ఉండొచ్చు. సివిల్‌ సర్వీసెస్‌ పరీక్ష రాయడానికి జనరల్‌ కేటగిరీకి చెందినవారికి గరిష్ఠ పరిమితి 32 సంవత్సరాలు. ఓబీసీలకు 35 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీలకు 37 సంవత్సరాలు. గరిష్ఠ వయసులోగా.. జనరల్‌ కేటగిరీవారు 6 సార్లు, ఓబీసీలు 9, ఎస్సీ, ఎస్టీలు ఎన్నిసార్లైనా పరీక్ష రాసుకోవచ్చు. మీ సామాజిక నేపథ్యాన్ని బట్టి మీ గరిష్ఠ వయః పరిమితి, గరిష్ఠ అవకాశాలను నిర్థరించుకోండి. సివిల్‌ సర్వీసెస్‌ పరీక్ష రాసేవారు ఐదు రకాలుగా ఉంటారు.

1) డిగ్రీ పూర్తి చేయగానే సివిల్స్‌ కోచింగ్‌ తీసుకొని మూడు, నాలుగు ప్రయత్నాలు చేసి, ఆ ప్రయత్నాల్లో విఫలమైతే అప్పుడు పీజీలో చేరేవారు.
2) డిగ్రీ తర్వాత నేరుగా పీజీ పూర్తిచేసి అనంతరం సివిల్స్‌ ప్రయత్నాలు చేసేవారు.
3) డిగ్రీ తర్వాత పీజీ చేస్తూ సివిల్స్‌ రాసేవారు.
4) డిగ్రీ, పీజీల తర్వాత పీహెచ్‌డీ చేస్తూ సివిల్స్‌ రాసేవారు.
5) డిగ్రీ అయ్యాక ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం పొంది కొంతకాలం కొనసాగి, సెలవు పెట్టి సివిల్స్‌ రాసేవారు.

అభ్యర్థి తన ఆర్థిక పరిస్థితులు, కుటుంబ సహకారం, సివిల్స్‌పై ఉన్న ఇష్టం, డిగ్రీలో చదివిన సబ్జెక్టులు, సివిల్స్‌ కోసం ఎంచుకునే ఆప్షనల్‌ సబ్జెక్ట్‌ లాంటివి పరిగణనలోకి తీసుకొని నిర్ణయానికి రావాలి. ఈ ఐదు రకాల అభ్యర్థుల్లో ప్రతి రకానికీ కొన్ని సానుకూలతలూ, ప్రతికూలతలూ ఉంటాయి.

మీ విషయానికి వస్తే - ప్రస్తుతం డిగ్రీలో చదువుతున్న సబ్జెక్టులు, ఇప్పటివరకు మీ సివిల్స్‌ సన్నద్ధత, తీసుకోబోయే ఆప్షనల్‌ సబ్జెక్ట్, కుటుంబ ఆర్థిక స్తోమత లాంటి విభిన్న అంశాలను దృష్టిలో పెట్టుకొని సరైన నిర్ణయం తీసుకోండి. చివరిగా.. సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షను పీజీ/ పీహెచ్‌డీతో కలిపి కాకుండా కనీసం రెండేళ్ల సన్నద్ధతమీదే పూర్తి దృష్టి పెట్టి, ఆ తర్వాత మొదటి ప్రయత్నం చేస్తే మెరుగైన ఫలితాలకు ఆస్కారముంది.

ఆర్థిక పరిస్థితులు, కుటుంబ సహకారం, సివిల్స్‌పై ఉన్న ఇష్టం, డిగ్రీలో చదివిన సబ్జెక్టులు, సివిల్స్‌ కోసం ఎంచుకునే ఆప్షనల్‌ సబ్జెక్ట్‌ లాంటివి పరిగణనలోకి తీసుకొని నిర్ణయానికి రావాలి. 

ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని