Heart Attack: గుండె స్తంభనా? గుండెపోటా?

ఇటీవల చిన్నవయసువారూ గుండెజబ్బులతో ఉన్నట్టుండి కుప్పకూలటం ఎక్కువైంది. దీనికి హఠాత్తుగా గుండె స్తంభించటం (కార్డియాక్‌ అరెస్ట్‌), గుండెపోటు (హార్ట్‌ ఎటాక్‌) కారణం కావొచ్చు.

Updated : 31 Jan 2023 09:53 IST

ఇటీవల చిన్నవయసువారూ గుండెజబ్బులతో ఉన్నట్టుండి కుప్పకూలటం ఎక్కువైంది. దీనికి హఠాత్తుగా గుండె స్తంభించటం (కార్డియాక్‌ అరెస్ట్‌), గుండెపోటు (హార్ట్‌ ఎటాక్‌) కారణం కావొచ్చు. చాలామంది రెండూ ఒకటేనని భావిస్తుంటారు. నిజానికివి వేర్వేరు సమస్యలు.


గుండె స్తంభించటం అంటే?

గుండె పనితీరు అస్తవ్యవస్తమై, హఠాత్తుగా కొట్టుకోవటం ఆగటాన్ని కార్డియాక్‌ అరెస్ట్‌ అంటారు.  దీన్ని ఒకరకంగా ఇంట్లో విద్యుత్‌ తీగల్లో తలెత్తే షార్ట్‌ సర్క్యూట్‌తో పోల్చుకోవచ్చు.

గుండెలోని విద్యుత్‌ వ్యవస్థ గతి తప్పటం ద్వారా కార్డియాక్‌ అరెస్ట్‌ ప్రేరేపితమవుతుంది. దీంతో గుండె లయ అస్తవ్యస్తమవుతుంది (అరిత్మియా). ఫలితంగా గుండె రక్తాన్ని పంప్‌ చేసే ప్రక్రియ దెబ్బతింటుంది. అప్పుడు మెదడు, ఊపిరితిత్తులు, ఇతర అవయవాలకు గుండె రక్తాన్ని పంప్‌ చేయలేక చతికిల పడుతుంది. 

ఏం జరుగుతుంది? 

గుండె స్తంభించిన మరుక్షణమే వ్యక్తి స్పృహ కోల్పోతాడు. శ్వాస ఆగుతుంది. లేదూ ఎగపోస్తున్నట్టు కనిపించొచ్చు. తక్షణం చికిత్స అందకపోతే నిమిషాల్లోనే ప్రాణాపాయం సంభవించొచ్చు. 

ఏం చేయాలి? 

కార్డియాక్‌ అరెస్ట్‌ వచ్చిన కొద్ది నిమిషాల్లోపు చికిత్స అందితే కోలుకునే అవకాశముంది. ముందుగా అత్యవసర చికిత్స నంబరుకు ఫోన్‌ చేయాలి. ఆటోమేటెడ్‌ ఎక్స్‌టర్నల్‌ డిఫ్రిబిలేటర్‌ (ఏఈడీ) అందుబాటులో ఉంటే వెంటనే ఉపయోగించాలి. దీన్ని ఛాతీకి తాకిస్తే గుండెకు విద్యుత్‌ షాక్‌ తగిలి, తిరిగి కొట్టుకుంటుంది. ఏఈడీ అందుబాటులో లేనట్టయితే కార్డియో పల్మనరీ రిససిటేషన్‌ (సీపీఆర్‌) ఆరంభించాలి. ఇందులో ఛాతీ మధ్యలో అరచేతితో పదే పదే గట్టిగా నొక్కుతూ, పైకి తీయాల్సి ఉంటుంది. ఇది గుండె తిరిగి కొట్టుకోవటానికి సాయం చేస్తుంది. అంబులెన్స్‌ రాగానే వెంటనే ఆసుపత్రికి తరలించాలి. 

మరణానికి ప్రధాన కారణం 

ఏటా ఎంతో మంది కార్డియాక్‌ అరెస్ట్‌కు బలవుతున్నారు. దీని బారినపడుతున్నవారిలో సుమారు మూడొంతుల మందికి ఇది ఇంట్లోనే సంభవిస్తోంది. 


గుండెపోటు అంటే?

గుండెకు రక్త ప్రసరణ ఆగినప్పుడు గుండెపోటు తలెత్తుతుంది. దీన్ని  నీటి గొట్టాల్లో ఏర్పడే అడ్డంకిగా అనుకోవచ్చు.

గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనిలో పూడికలు ఏర్పడినప్పుడు రక్త ప్రసరణ దెబ్బతింటుంది. పూడిక రక్తనాళాన్ని పూర్తిగా మూసేస్తే ఆ భాగానికి ఆక్సిజన్‌తో కూడిన రక్త సరఫరా నిలిచిపోతుంది. పూడికను వెంటనే తొలగించి, రక్తనాళాన్ని తిరిగి తెరవకపోతే గుండె కండరం క్షీణించటం మొదలవుతుంది. 

ఏం జరుగుతుంది? 

గుండెపోటు బారినపడ్డవారిలో ఛాతీలో, ఛాతీ పైభాగంలో తీవ్రమైన నొప్పి.. అసౌకర్యం, శ్వాస సరిగా తీసుకోలేకపోవటం, చల్లటి చెమటలు పట్టటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వాంతి కావొచ్చు. లేదూ వికారంగానూ ఉండొచ్చు. చాలామందిలో లక్షణాలు నెమ్మదిగా మొదలవుతుంటాయి. గంటల కొద్దీ కొనసాగుతూ వస్తాయి. కొన్నిసార్లు ఇవి హఠాత్తుగానూ కనిపించొచ్చు. కార్డియాక్‌ అరెస్ట్‌ మాదిరిగా హార్ట్‌ ఎటాక్‌లో గుండె ఆగిపోదు. పనిచేస్తూనే ఉంటుంది. చికిత్స అందటం ఎంత ఆలస్యమైతే గుండె అంత ఎక్కువగా దెబ్బతింటూ వస్తుంది. 

* మగవారిలో కన్నా ఆడవారిలో గుండెపోటు లక్షణాలు భిన్నంగా ఉండొచ్చు. వీరిలో ఆయాసం, వాంతి, వికారం, వీపులో లేదా దవడ నొప్పి వంటివి ప్రధానంగా కనిపిస్తుంటాయి. 

ఏం చేయాలి? 

ప్రతిక్షణమూ అమూల్యమే. గుండెపోటు లక్షణాలు కనిపించిన వెంటనే అత్యవసర నంబరుకు ఫోన్‌ చేయాలి. లేదూ తక్షణం ఆసుపత్రికి తరలించాలి. అంబులెన్స్‌ సిబ్బంది వెంటనే చికిత్స ఆరంభిస్తారు. గుండె ఆగిపోయినా తిరిగి పనిచేసేలా చూస్తారు. ఛాతీ నొప్పితో వచ్చినవారిని వెంటనే ఆసుపత్రిలో చేర్చుకుంటారు కూడా.


రెండింటికీ సంబంధమేంటి? 

గుండెపోటుతో కార్డియాక్‌ అరెస్ట్‌ తలెత్తొచ్చు. కార్డియాక్‌ అరెస్ట్‌ బారిన పడుతున్నవారిలో గుండెపోటే ప్రధాన కారణంగా కనిపిస్తుంటుంది. ఎందుకంటే గుండెపోటు ఆరంభంలో విద్యుత్‌ వ్యవస్థ అస్తవ్యస్తమవుతుంది. గుండెపోటు వచ్చాక తొలి గంటలో కుప్పకూలటానికి కారణమిదే. చాలామంది దీన్ని తీవ్ర గుండెపోటుగానూ భావిస్తుంటారు. స్వల్ప గుండెపోటులోనూ దెబ్బతిన్న కండరంలో, మిగతా కండరంలో విద్యుత్‌ వ్యవస్థ పనితీరు మారుతుంది. దీంతో అక్కడ షాక్‌ కొట్టినట్టయ్యి గుండె లయ దెబ్బతిని, పంపింగ్‌ వ్యవస్థ అస్తవ్యవస్తమవుతుంది. క్రమ క్రమంగా పని చేయటమూ మానేస్తుంది. మూడు సెకండ్ల కన్నా ఎక్కువసేపు గుండె కొట్టుకోకపోతే వెంటనే కుప్పకూలిపోతారు.


 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు