‘ఒత్తిడి’ ఒక భ్రాంతి!

ఆధునిక సమాజం ఒత్తిడికి చిత్తవుతోంది! చిన్నా చితకా సవాళ్లకే చతికిల పడిపోతోంది. చదువు, విజ్ఞానం, సమాజంలో మంచి పేరు, పలుకుబడి వంటివేవీ దీన్ని అడ్డుకోలేకపోతున్నాయి.

Updated : 10 Jan 2023 04:34 IST

ఆధునిక సమాజం ఒత్తిడికి చిత్తవుతోంది! చిన్నా చితకా సవాళ్లకే చతికిల పడిపోతోంది. చదువు, విజ్ఞానం, సమాజంలో మంచి పేరు, పలుకుబడి వంటివేవీ దీన్ని అడ్డుకోలేకపోతున్నాయి. సామాన్యుల దగ్గరి నుంచి విద్యార్థులు, ఉన్నత విద్యావంతులు, మేధావులు, అధికారులు, కార్పొరేట్‌ దిగ్గజాల వరకూ అంతా మానసిక ఒత్తిడి కోరల్లో చిక్కుకొని నలుగుతుండటమే దీనికి నిదర్శనం. దీంతో ఆందోళన, కుంగుబాటు, గుండెజబ్బులు, పక్షవాతం వంటి మానసిక, శారీరక సమస్యలెన్నో చుట్టుముడుతున్నాయి కూడా. తీవ్ర భావోద్వేగాలను తట్టుకోలేక ఆత్మహత్యలకు ఒడిగడుతున్న సంఘటనలకూ కొదవలేదు. నిరాశా నిస్పృహల వలయంలోంచి బయటకు రాలేక దురలవాట్లకు బానిసలవుతున్నవారికీ లెక్కలేదు. ఎందుకిలా? మన సమాజం ఒత్తిడి గాలికి కొట్టుకుపోతుండటానికి కారణమేంటి? దీనికి పరిష్కారమార్గమేది? మానసిక ఒత్తిడిపై విస్తృత పరిశోధన చేసిన డాక్టర్‌ కిరణ్‌ దింట్యాల ముందు సుఖీభవ ఇవే ప్రశ్నలు ఉంచింది. అమెరికాలో పబ్లిక్‌ హెల్త్‌లో మాస్టర్‌ డిగ్రీలో భాగంగా స్ట్రెస్‌ మేనేజ్‌మెంట్‌లో నైపుణ్యాలు సాధించి.. శాన్‌ డియాగోలో ఇంటర్నల్‌ మెడిసిన్‌ వైద్యుడిగా పనిచేస్తూ.. ఒత్తిడి నుంచి బయటపడటానికి ఎంతోమందికి ఆచరణీయ పరిష్కార మార్గాలు సూచిస్తూ, డాక్టర్‌ కామ్‌గా పేరు తెచ్చుకున్న ఆయన వెలిబుచ్చిన అభిప్రాయాలు ఇవీ..


* ఒత్తిడి కేవలం మనసుకే పరిమితమా? 

* ఏదో ఆందోళనగా అనిపించటం, అసంతృప్తితో ఉండటాన్ని చాలామంది ఒత్తిడిగా భావిస్తుంటారు. నిజానికిది మానసిక సమస్య మాత్రమే కాదు. అనుబంధాల దగ్గర్నుంచి ఆరోగ్యం వరకూ జీవితంలో చాలా పార్శ్వాలను స్పృశిస్తుంది. మనిషికి ఎంతో కొంత ఒత్తిడి సహజం. ఇది పరిణామ క్రమం నుంచే సంక్రమించింది. ప్రమాదకర పరిస్థితి ఎదురైనప్పుడు దాన్ని ఎదుర్కోవటానికో, అక్కడి నుంచి తప్పించుకోవటానికో ప్రయత్నిస్తుంటాం. ఈ సమయంలో అడ్రినలిన్‌ వంటి హార్మోన్లు పెద్ద ఎత్తున విడుదలై అవసరమైన శక్తిని సమకూరుస్తాయి. గుండె వేగం పెరగటం, రక్త ప్రసరణ పుంజుకోవటం వంటివన్నీ దీనిలోని భాగాలే. దీన్నే అక్యూట్‌ స్ట్రెస్‌ అంటారు. ఇది అక్కడితోనే ఆగిపోతుంది. ప్రమాదం తప్పిపోయాక మామూలు స్థితికి చేరుకుంటాం. కానీ కొందరిలో ప్రమాదకర పరిస్థితులేవీ లేకపోయినా రోజులు, వారాలు, నెలల తరబడి వెంటాడుతూ వస్తుంది. దీన్నే దీర్ఘకాలిక (క్రానిక్‌) ఒత్తిడి అంటారు. మధుమేహం, గుండెపోటు, పక్షవాతం, అధిక రక్తపోటు, క్యాన్సర్ల వంటి దీర్ఘకాలిక జబ్బులు రావటానికో, అవి తీవ్రం కావటానికో 80% వరకు ఇదే కారణమవుతోంది.


* మానసిక ఒత్తిడిని ప్రత్యేకంగా తగ్గించుకోవాల్సిన అవసరముందా? 

* తప్పకుండా ఉంది. తమకు తాము ప్రశాంత స్థితిని పొందలేనివారు నిపుణుల సాయం తీసుకోవటంలో తప్పులేదు. మానసిక సమస్యలకు చికిత్స తీసుకోవటాన్ని నామోషీగా భావించొద్దు. మొగ్గలోనే తుంచేస్తే పెద్ద సమస్యగా మారకుండా చూసుకోవచ్చు. ఒత్తిడిని తగ్గించుకోగలిగితే లక్ష్యాన్ని తేలికగా చేరుకోగలుగుతారు. సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. పనిలో నైపుణ్యం, ఉత్పాదకత పెరుగుతాయి. ఆరోగ్యం మెరుగవుతుంది. కాబట్టి మానసిక ఒత్తిడిని తగ్గించుకోవటానికి ప్రయత్నించటం నేటి తక్షణావసరంగా మారిందనటంలో ఎలాంటి సందేహం లేదు. ఒక అలవాటు జీవితాన్ని మార్చేస్తుంది. అది మానసిక ప్రశాంతతను చేకూర్చేదయితే ఇంకా మంచిది. దీన్ని ఒక అలవాటుగా మలచుకుంటే జీవితమే మారిపోతుంది.


* ప్రస్తుతం ఆత్మహత్యలు పెద్ద సమస్యగా మారాయి. విద్యార్థులు, రైతులు.. ఉన్నత విద్యావంతులు, వ్యాపార వేత్తలూ వీటికి పాల్పడుతున్నారు. వీటికి పరిష్కార మార్గమేదైనా ఉందా? 

* చదువుల ఒత్తిడిని తట్టుకోలేక.. ఇంజినీరో, డాక్టరో కాలేకపోయామనే నిరాశతో ఎంతోమంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం చూస్తున్నాం. రైతులు, కొందరు పారిశ్రామిక వేత్తలూ దీనికి ఒడిగడుతున్నారు. ఇది చాలా విచారకరం. ఆర్థిక సమస్యలైనా, పోటీని ఎదుర్కోలేని బలహీనతైనా.. కారణమేదైనా గానీ ఆత్మహత్యలకు మూలం మానసికంగా కుంగిపోవటమే. దీన్నుంచి బయటపడటానికి ఆశ, నమ్మకం, ఓపిక, ఒడుదొడుకులను ఎదుర్కొనే సామర్థ్యాన్ని కలిగుండటం ఎంతైనా అవసరం. కష్టాల్లో, బాధల్లో ఉన్నప్పుడు చప్పున పరిష్కారం తట్టకపోవచ్చు. ప్రతికూల ఆలోచనలతో ఉన్నప్పుడు అన్ని దారులూ మూసుకుపోయినట్టే అనిపిస్తుంది. ఆ క్షణంలో పరిష్కారం కనిపించకపోవచ్చు గానీ అసలు పరిష్కారమే లేదని అనుకోవటం తప్పు. గంట తర్వాతో, రోజు తర్వాతో.. వారం, నెల తర్వాతో ఏదో ఒక సమయంలో తప్పకుండా పరిష్కార మార్గం లభిస్తుంది. కాబట్టి ఎన్నడూ ఆశావహ దృక్పథాన్ని, నమ్మకాన్ని వదులుకోవద్దు. ప్రతికూల భావనల నుంచి బయటపడితే ఆత్మహత్య ఆలోచన దానంతటదే మాయమవుతుంది.


* ఆధునిక జీవన విధానం ఒత్తిడికి దారితీస్తోందా? ఒత్తిడితో జీవనశైలి అస్తవ్యస్తమవుతోందా? 

* ఒత్తిడి, జీవనశైలి రెండూ ఒకదానిపై మరోటి ప్రభావం చూపుతాయి. ఆధునిక జీవనశైలి ఒత్తిడికి కారణమవుతున్న మాట నిజమే. పొద్దున లేచింది మొదలు ఉరుకులు, పరుగులు. సాయంత్రం ఇంటికి వచ్చాక ఒకప్పటిలా విశ్రాంతిగా ఉండటమూ కుదరటం లేదు. సామాజిక మాధ్యమాల వెల్లువతో ఇప్పుడు ప్రపంచంలో ఏమూల ఏం జరిగినా క్షణాల్లో తెలిసిపోతోంది. ఇది కొంతవరకు మంచిదే కావొచ్చు గానీ అత్యాచారాలు, హత్యలు, విద్వేషాల వంటి ప్రతికూల అంశాలు మనసు మీద తెలియకుండానే విపరీత ప్రభావం చూపుతాయి. లేనిపోని భయాలు, ఆందోళనలకు దారితీస్తాయి. గతి తప్పిన జీవనశైలీ దీనికి ఆజ్యం పోస్తోంది. ఏమాత్రం సమయం దొరికినా ఫోన్‌లో తల దూర్చటమే. ఏమేం మెయిళ్లు వచ్చాయి? సామాజిక మాధ్యమాల్లో ఎవరు పోస్టులు పెట్టారు? మనం పెట్టిన పోస్టులకు ఎన్ని లైకులు వచ్చాయి? అని చూసుకోవటమే. ఇలాంటి పరిణామాలన్నీ మానసిక ఒత్తిడిని పెంచుతున్నాయి. వ్యక్తిగత సంబంధాలు దెబ్బతినటమూ చూస్తున్నాం.


* సమాజంలో నైతిక విలువలు పడిపోవటానికీ ఒత్తిడికీ సంబంధముందా? 

* గమనించినా, గమనించకపోయినా మనం చేసే పనులన్నింటికీ ప్రతిచర్య ఉంటుంది. ఒక తప్పు చేస్తే దాని పర్యవసానం వెంటనే కనిపించకపోవచ్చు. కానీ అది మనసును వెంటాడుతూనే వస్తుంది. ప్రతికూల ఆలోచనలకు, భావనలకు కారణమవుతుంది. నైతిక విలువలను పట్టించుకోరు. షరతులతో కూడిన ఆనందాన్ని పొందటానికి కొందరు శక్తికి మించిన పనులు మీదేసుకోవచ్చు. అడ్డదారుల్లో సంపాదించాలనీ అనుకోవచ్చు. వందల కోట్లు, వేల కోట్లు ఉన్నవారూ అక్రమాలకు, అన్యాయాలకు పాల్పడటానికి ఇదీ ఒక కారణమే. సాధారణంగా సంతోషం, ఆనందం కొరవడినవారే నేరాలకు పాల్పడుతుంటారు. కోపంలోనో, ఆవేశంతోనో, ఇష్టం లేకపోవటంతోనో వీటికి ఒడిగడుతుంటారు. తీవ్ర మానసిక ఒత్తిడి, వేదన, క్షోభను తగ్గించుకోవటానికి కొందరు పొగ, మద్యం, మాదక ద్రవ్యాల వంటి వ్యసనాలకూ లోనవుతుంటారు. ఇలాంటి తప్పుడు ప్రయత్నాలు ఒత్తిడిని ఇంకాస్త ఎక్కువ చేస్తున్నాయి. నేటి తరం పిల్లలు తమకు ఇంట్లో లభించని ప్రేమ, ఆప్యాయతలను సామాజిక మాధ్యమాల్లో వెతుక్కోవటానికీ ప్రయత్నిస్తున్నారు. ఇది ఆన్‌లైన్‌ వ్యసనానికి కారణమవుతోంది. మాదక ద్రవ్యాలు తీసుకున్నప్పుడు మెదడులో ప్రేరేపితమయ్యే భాగాలే సామాజిక మాధ్యమాల్లో లైకో, కామెంటో వచ్చినప్పుడు ఉత్తేజితం అవుతున్నట్టు అధ్యయనాలు చెబుతుండటం గమనార్హం.


* చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రస్తుతం ఎంతోమంది ఒత్తిడికి గురవుతుండటానికి కారణమేంటి? 

* ఒక్కమాటలో చెప్పాలంటే ఒత్తిడిని నియంత్రించుకునే విధానం తెలియకపోవటం. జీవితంలో ఆటు పోట్లు ఎన్నో ఎదురవుతుంటాయి. వీటిని ఎలా ఎదుర్కోవాలో, ఏం చేయాలో తెలియకపోతే ఒత్తిడి తప్పదు. మానసిక, సామాజిక సమస్యలకు దారితీస్తోంది ఇదే. జీవితంలో సమతుల్యత దెబ్బతినకుండా ఆనందాన్ని, విజయాన్ని సాధించటమెలాగో నేర్చుకుంటే వీటికి చాలావరకు దూరంగా ఉండొచ్చు. కాబట్టి ఒత్తిడి నియంత్రణకు శిక్షణ అవసరం. దీన్ని చిన్నప్పటి నుంచే బడిలో ప్రత్యేకంగా బోధించాల్సిన అవసరముంది. వారానికోసారి శిక్షణ ఇచ్చినా చాలు. పదో తరగతికి వచ్చేసరికి చాలా విషయాలు నేర్చుకుంటారు. కాలేజీలు, కార్యాలయాల్లోనూ నేర్పించాలి. ఒత్తిడి అంటే ఏంటి? ఎక్కడి నుంచి పుట్టుకొస్తుంది? ఒత్తిడి ఎదురైనప్పుడు ఎలా అధిగమించాలి? అనేవి అవగతమైతే ఆత్మస్థైర్యం ఇనుమడిస్తుంది. సవాళ్లను స్వీకరించటం, ఎదుర్కోవటం అబ్బుతుంది. ఆనందంగా జీవించటం అలవడుతుంది.  


* పేరు ప్రతిష్ఠలు, సిరి సంపదలు గలవారూ ఎందుకు ఒత్తిడికి లోనవుతున్నారు? 

* సెలబ్రిటీలనే కాదు. మనలో చాలామంది సహజమైన ఆనంద, ప్రశాంత స్థితికి దూరమవు తుండటమే ఒత్తిడికి ప్రధాన కారణం. మనమంతా సహజమైన ఆనంద స్థితిలోనే పుడతాం. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ శిశువులే. వారిది షరతుల్లేని ఆనందం. పెరిగే కొద్దీ ఈ ధోరణి మారుతుంది. ఐదారేళ్లలో ఫలానా బొమ్మ ఉంటేనే ఆనందంగా ఉండొచ్చు. టీనేజ్‌కు వచ్చాక బైక్‌ ఉంటేనే సంతోషం అనిపించొచ్చు. వయసు మీద పడుతున్నకొద్దీ ఉద్యోగం, జీవిత భాగస్వామి, కారు, ఇల్లు, సంపాదన.. ఇలా షరతుల జాబితా పెరుగుతూ వస్తుంది. కోరికలు, లక్ష్యాలు, ఆశలు, ఆశయాలు ఉండటం తప్పు కాదు. వీటి కోసం ప్రయత్నించటమూ తప్పు కాదు. కానీ కోరింది దక్కితేనే ఆనందంగా ఉంటామనుకోవటమే సమస్య. కోరికలకు అంతులేదు. ఒక కారు కొన్నాక మరోటి కొనాలని అనుకోవచ్చు. మరింత విలాసవంతమైన కారు కావాలనీ కలలు కనొచ్చు. ఇదే సహజ ఆనందాన్ని, సంతోషాన్ని దూరం చేస్తోంది. చివరికి ఒత్తిడికి లోనై, తీవ్ర నిరాశా నిస్పృహల్లో కూరుకుపోయి అఘాయిత్యాలకు పాల్పడేలా చేస్తోంది. సెలబ్రిటీలయినా, పెద్ద పెద్ద వ్యాపార సామ్రాజ్యాలను స్థాపించినవారైనా దీనికి మినహాయింపు కాదు. ఆనందం ఎక్కడో కాదు.. అది మనలోనే ఉందని, మనలోంచే పుట్టుకొస్తుందనే సత్యాన్ని గ్రహించకపోవటం పెద్ద లోపం.


* మానసిక ఒత్తిడి అంతర్గతమా? బయటి అంశాలు ప్రోత్సహిస్తాయా? 

* నిజం చెప్పాలంటే ఒత్తిడి ఒక భ్రాంతి! ఎందుకంటే మానసిక ఒత్తిడికి దారితీస్తున్నాయని భావిస్తున్న అంశాలన్నీ మనం నియత్రించుకోదగినవే! ఆఫీసులో బాస్‌ కోప్పడి ఉండొచ్చు. ఇంట్లో గొడవ పడి ఉండొచ్చు. అంతమాత్రాన ఒత్తిడికి గురికావాల్సిన అవసరమేమీ లేదు. వాటికి మనం ప్రతిస్పందించే తీరే ఒత్తిడిని నిర్ణయిస్తుంది. జీవితంలో అనూహ్య ఘటనలు జరుగుతూనే ఉంటాయి. కొందరు వీటిని తేలికగా తీసుకుంటారు. కానీ కొందరు వారాలు, నెలలు దాటినా వాటి గురించే ఆలోచిస్తుంటారు. ఇదే మానసిక ఒత్తిడికి దారితీస్తుంది.


* మానసిక ఒత్తిడిని తగ్గించుకోవటానికి మీరు సూచించే మార్గమేంటి? 

* ఒత్తిడిని తగ్గించుకోవటానికి పీఈటీ చికిత్సను రూపొందించాను. పీ అంటే మూడు ప్రిన్సిపల్స్‌ (సూత్రాలు).. ఈ అంటే రెండు ఎక్సర్‌సైజులు (వ్యాయామాలు).. టీ అంటే ఒక పద్ధతి (టెక్నిక్‌). దీని ఉద్దేశం తక్కువ సమయంలోనే ఎక్కువ ఫలితం సాధించటం. మన జీవగమనానికి మనసు, ఆలోచన, స్పృహ.. ఈ మూడూ ముఖ్యమైన సూత్రాలు. మనసును కారుతో పోల్చుకోవచ్చు. ఇంజిన్‌ చెడిపోతే కారు ముందుకు కదలదు. అలాగే మనసు సరిగా పనిచేయకపోతే జీవితం గతి తప్పుతుంది. నదిలో నీరు మాదిరిగా మన మదిలో ఆలోచనలు స్వేచ్ఛగా ప్రవహిస్తుంటాయి. అలా సాగుతున్నంత వరకు ఆనందంగా, ప్రశాంతంగా ఉంటాం. అలా కాకుండా ఆలోచనలు అలాగే పేరుకుంటే సమస్యగా పరిణమిస్తుంది. నీరు నిలిచిపోతే చెడిపోయినట్టుగా వీడని ఆలోచనలు మనసును అస్తవ్యస్తం చేస్తాయి. అంటే ఆలోచనలను కారును చేరాల్సిన గమ్యానికి తీసుకెళ్లే స్టీరింగ్‌ చక్రమని అనుకోవచ్చు. ఇక స్పృహ అనేది పరిస్థితులకు తగ్గట్టుగా స్పందించేలా చేస్తుంది. ఇంజిన్‌, స్టీరింగ్‌ వీల్‌ బాగున్నా.. దారి స్పష్టంగా కనిపించకపోతే ప్రయాణం సరిగా సాగదు. లక్ష్యాన్ని చేరుకోవటం కష్టమవుతుంది. కాబట్టి ముందుగా ఆలోచనలన సరళిని మార్చటానికి, ప్రతికూల ఆలోచనల నుంచి దృష్టిని మళ్లించటానికి, లక్ష్యాన్ని స్పష్టంగా గుర్తించటానికే ప్రాధాన్యం ఇస్తాను. అప్పటికీ ఫలితం కనిపించకపోతే, ఆలోచనలను నియంత్రించుకోలేకపోతే రిలాక్సేషన్‌ వ్యాయామాలు సూచిస్తాను. వీటిల్లో ఒకటి- విశ్రాంతిగా కూర్చొని, మనసులోని ఆలోచనలన్నింటినీ పక్కనపెట్టి గాఢంగా శ్వాస తీసుకొని, నెమ్మదిగా వదలటం. రెండోది- రోజువారీ పనులు చేసుకుంటూనే శ్వాస, ఆలోచనల మీద దృష్టి పెట్టటం. టెక్నిక్‌ విషయానికి వస్తే- ఏబీసీ కామింగ్‌ పద్ధతి మేలు చేస్తుంది. తిన్నగా కూర్చొని ‘నేను ప్రశాంతంగా ఉన్నాను, ఆనందంగా ఉన్నాను’ అని అనుకోవటం.. గాఢంగా శ్వాస తీసుకోవటం.. కనుబొమల మధ్య దృష్టిని నిలపటం ఇందులోని కీలకాంశం. మనం ఏ ఆలోచన మీద దృష్టి పెడతామో అది మన వాస్తవ స్వభావంగా మారుతుంది. మనసులో ప్రతికూల భావనలు మెదులుతుంటే విచారం, నిరాశ, నిస్పృహలు మొదలవుతాయి. దృష్టిని మళ్లిస్తే ప్రతికూల ఆలోచనల నుంచి తప్పించుకోవచ్చు. సానుకూల భావనలుగా మార్చుకోవచ్చు. ఇందుకు ఈ పీఈటీ పద్ధతి ఉపయోగపడుతుంది. దీన్ని రోజూ 15, 20 నిమిషాలు చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.


 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని