psoriasis: పొలుసులకు సెలవిక!

అందంగా, నిగనిగలాడుతూ కనిపించాల్సిన చర్మం మీద ఎర్రగా, మందంగా మచ్చలు ఏర్పడితే? తెల్లటి పొలుసులు ఏర్పడి, పొట్టుగా రాలుతుంటే? ఎవరికైనా బాధగానే ఉంటుంది. సొరియాసిస్‌ ఇలాగే కలచివేస్తుంది. ఇదేమీ అంటువ్యాధి కాదు. సాధారణంగా ప్రాణాపాయానికీ దారితీయదు. కానీ దీర్ఘకాలం వేధిస్తుంది.

Published : 21 May 2024 00:07 IST

అందంగా, నిగనిగలాడుతూ కనిపించాల్సిన చర్మం మీద ఎర్రగా, మందంగా మచ్చలు ఏర్పడితే? తెల్లటి పొలుసులు ఏర్పడి, పొట్టుగా రాలుతుంటే? ఎవరికైనా బాధగానే ఉంటుంది. సొరియాసిస్‌ ఇలాగే కలచివేస్తుంది. ఇదేమీ అంటువ్యాధి కాదు. సాధారణంగా ప్రాణాపాయానికీ దారితీయదు. కానీ దీర్ఘకాలం వేధిస్తుంది. దీన్ని అంచనా వేయటమూ కష్టమే. ఎప్పుడు ఉద్ధృతమవుతుందో, ఎప్పుడు తగ్గుతుందో తెలియదు. ఇది రోజువారీ జీవితాన్నీ ప్రభావితం చేస్తుంది. నలుగురిలోకి వెళ్లటానికి నామోషీ పడేలా చేసి, మానసికంగానూ కుంగదీస్తుంది. మంచి విషయం ఏంటంటే- కొత్త చికిత్సల పుణ్యమాని ఇదిప్పుడు దాదాపు నయం చేయగల స్థితికి వచ్చింది. స్టిరాయిడ్‌ లేపనాలు, రోగనిరోధకశక్తిని అణచిపెట్టే మాత్రలు, వినూత్న బయలాజికల్‌ ఔషధాలు ఎంతోమందికి కొత్త జీవితాన్ని ప్రసాదిస్తున్నాయి. అయితే అపోహలు, భయాలకు తావివ్వకుండా అవగాహన కలిగుండటం ముఖ్యం. సొరియాసిస్‌ ఎందుకొస్తుంది? ఎందుకు ఉద్ధృతమవుతుంది? చేయకూడనివి, చేయాల్సినవి ఏంటి? అనేవి తెలుసుకోవటం మంచిది.

రీరానికి చర్మం పెట్టని కోట. పైకి ఒకేలా కనిపించినా ఇందులో నాలుగు పొరలుంటాయి. ఇది ఎప్పటికప్పుడు నిత్య నూతనంగానూ మారుతుంది. చర్మంలో నిరంతరం పాత కణాలు రాలిపోతుంటాయి. వీటి స్థానంలో కింది పొరల్లోంచి కొత్త కణాలు వచ్చి చేరుతుంటాయి. ఇవి పైపొరకు చేరుకోవటానికి సాధారణంగా 30-40 రోజులు పడుతుంది. కానీ సొరియాసిస్‌లో కొత్త కణాలు అతి వేగంగా, ఇబ్బడి ముబ్బడిగా పుట్టు కొస్తుంటాయి. కేవలం 3, 4 రోజుల్లోనే పైకి వచ్చేస్తాయి. ఇవి ఒకదగ్గర పోగుపడుతూ మందంగా, పొలుసులుగా ఏర్పడతాయి. పొట్టుపొట్టుగా రాలుతుంటాయి. క్రమంగా చర్మం లోపలి పొరల్లో కొత్త, సూక్ష్మ రక్తనాళాలు పుట్టుకొస్తాయి. ఇవి పొలుసులను ప్రోత్సహించటతో పాటు ఎర్రటి మచ్చలకూ దారితీస్తాయి. సమస్య ఉద్ధృతమవుతుంది.

లక్షణాలు- రకాలను బట్టి

సొరియాసిస్‌లో ప్రధానంగా తెల్లటి పొలుసులతో కూడిన లేత గులాబీ లేదా ఎర్రటి రంగులో మందమైన మచ్చలు.. మంట, దురద, నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. ఇవి సొరియాసిస్‌ రకాలను బట్టి ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటాయి.

ప్లాక్‌ సొరియాసిస్‌: అతి ఎక్కువగా కనిపించే రకం ఇదే. ఇందులో తెల్లటి పొలుసులతో కూడిన మందమైన ఎర్రటి మచ్చలు ఏర్పడతాయి. ఇవి కొన్నిభాగాల్లోనే.. ముఖ్యంగా మోచేతులు, మోకాళ్లలో కనిపిస్తాయి. ఇందులో ముఖ్యంగా నొప్పి, మంట ఉంటాయి.

నెయిల్‌ సొరియాసిస్‌: ఇందులో గోళ్ల రంగు, ఆకారం మారతాయి. గోళ్ల మీద చిన్న గుంతలు ఏర్పడతాయి. క్రమంగా గోళ్లు మందమవుతాయి. మాడిపోయి, నల్లగా అవుతాయి. కొన్నిసార్లు గోళ్లు ఊడిపోవచ్చు.

స్కాల్ప్‌ సొరియాసిస్‌: దీన్ని చాలామంది చుండ్రుగా పొరపడుతుంటారు. సాధారణంగా చుండ్రు తలంతా కనిపిస్తుంది. దీని పొలుసులు కాస్త జిడ్డుగా ఉంటాయి. కానీ సొరియాసిస్‌ తల మీద అక్కడక్కడా మచ్చల్లా, పెద్ద పొక్కుల మాదిరిగా తెల్లగా ఉంటుంది. పొలుసులు తెల్లగా, పొడి పొడిగా ఉంటాయి.

గట్టేట్‌ సొరియాసిస్‌: ఇది పిల్లల్లోనే ఎక్కువ. చాలావరకూ గొంతునొప్పి వంటి ఇన్‌ఫెక్షన్ల తర్వాతే మొదలవుతుంది. కొన్నిరకాల అధిక రక్తపోటు మందులతోనూ రావొచ్చు. ఇందులో గులాబీ-ఎరుపు రంగులో చిన్న చిన్న మచ్చలు ఏర్పడతాయి. ఇవి మెడ, చేతుల పైభాగం, తొడలు, మాడు మీద కనిపిస్తాయి. ఈ రకం సమస్య కొందరికి చికిత్స తీసుకోక పోయినా కొన్ని వారాల్లో తగ్గొచ్చు. కొందరిలో ఇది ప్లాక్‌ సొరియాసిస్‌గానూ మారొచ్చు.

సొరియాటిక్‌ ఆర్థ్రయిటిస్‌: సొరియాసిస్‌ బారినపడ్డవారిలో 10-30 శాతం మందిలో కీళ్ల మీదా ప్రభావం పడుతుంది. దీంతో కీళ్లు వాస్తాయి. మోచేయి, మోకాలి కీళ్లు.. తుంటి ఎముక, వెన్నెముక వంటివీ దెబ్బతినొచ్చు.

పశ్చులర్‌ సొరియాసిస్‌: ఇందులో ఎర్రటి మచ్చల మధ్యలో చీము పొక్కులు ఏర్పడతాయి. కొద్దిరోజులకు పొక్కులు తగ్గినా మళ్లీ మళ్లీ వస్తుంటాయి. చాలావరకూ చేతులు, పాదాల వంటి భాగాల్లోనే ఇది కనిపిస్తుంది. కొందరికి ఒళ్లంతా విస్తరించొచ్చు. దీంతో జ్వరం, చలి, వికారం, గుండె వేగం పెరగటం, కండరాల బలహీనత వంటివీ తలెత్తుతాయి. దీనికి సత్వర చికిత్స అవసరం.

పామో, ప్లాంటార్‌ సొరియాసిస్‌: ఇది అరికాళ్లు, అరచేతుల్లోనే వస్తుంది. అరుదుగా ఇతర భాగాలకు వ్యాపించొచ్చు. ఇందులో అరచేతులు, అరికాళ్ల చర్మం మందంగా మారుతుంది. చిన్న చిన్న పగుళ్లు ఏర్పడతాయి.

ఎరిథ్రోడెర్మిక్‌ సొరియాసిస్‌: అరుదే అయినా ఇది తీవ్రమైన సమస్య. సాధారణంగా శరీరంలో సగానికన్నా ఎక్కువగా విస్తరిస్తుంది. ఎక్కువగా రక్తం సరఫరా కావటం వల్ల చర్మం ఎర్రగా, వేడిగా అవుతుంది. మంట, దురద తీవ్రంగా ఉంటాయి. కొందరిలో కొద్దికాలమే ఉండి, పోవచ్చు. కొందరిలో దీర్ఘకాలం కొనసాగొచ్చు. ఈ రకం సొరియాసిస్‌కు వెంటనే చికిత్స చేయాల్సి ఉంటుంది.

ఇన్‌వర్స్‌ సొరియాసిస్‌: ఇది ఛాతీ, చంకలు, గజ్జల వంటి చర్మం ముడతలు పడే చోట వస్తుంది. ఇందులో చర్మం నున్నగా, ఎర్రగా అవుతుంది. పొలుసులు కొద్దిగానే ఉండొచ్చు. కొందరిలో అసలు ఉండకపోవచ్చు. ఇది చర్మం రాపిడి, చెమట మూలంగా తీవ్రమవుతుంది.  

ఫేస్‌ సొరియాసిస్‌: సుమారు 10-20% మందిలో కనిపిస్తుంది. ఇందులో కళ్లు, నోరు, చెవుల చుట్టూ.. నుదురు మీద ఎర్రటి మచ్చలు, సన్నటి పొలుసులు ఏర్పడతాయి.

ఎందుకొస్తుంది?

సొరియాసిస్‌ బారినపడ్డవారంతా అడిగే మొదటి ప్రశ్న తమకు ఎందుకొచ్చిందనే. దీనికి కచ్చితమైన సమాధానం ఇప్పటికీ తెలియదు. రోగనిరోధకశక్తి పొరపాటున మన చర్మకణాల మీదే దాడిచేయటం కారణం కావొచ్చన్నది పరిశోధకుల అభిప్రాయం. కొందరిలో వంశ పారంపర్యంగా సంక్రమించే జన్యువులూ కారణం కావొచ్చు. అయితే జన్యువులున్నా అందరికీ సొరియాసిస్‌ రావాలనేమీ లేదు. జబ్బు గలవారిలో చాలామందిలో ఇలాంటి జన్యువులేవీ ఉండవు కూడా. ఇది ఎవరికైనా, ఏ వయసులోనైనా రావొచ్చు. అయితే పెద్దవారిలో ఎక్కువ. మనదేశంలో సుమారు 3 కోట్ల మంది దీంతో బాధ పడుతున్నారని అంచనా.

జీవనశైలి జాగ్రత్తగా..

మందులు వేసుకుంటున్నా, చికిత్సలు తీసుకుంటున్నా జీవనశైలి విషయంలో తగు జాగ్రత్తలు పాటించటం తప్పనిసరి. దీంతో రోజువారీ జీవితాన్ని హాయిగా గడపొచ్చు.

 • ముందుగా భయపడటం మానెయ్యాలి. ఇదేమీ ప్రమాదకరమైంది కాదు, అంటువ్యాధి కాదని గుర్తించాలి. పెళ్లి చేసుకోవటానికి, పిల్లలను కనటానికి ఇబ్బందేమీ ఉండదని తెలుసుకోవాలి.
 • బరువు ఎక్కువగా గలవారు తగ్గేలా చూసుకోవాలి.
 • మధుమేహం గలవారు అదుపులో ఉంచుకోవాలి
 • శాకాహారం తినటం మంచిది. తాజా పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువగా తినాలి. మాంసాహారులైతే మితం పాటించాలి. చేపలు మేలు చేస్తాయి.
 • పాలు, పాలతో చేసే పన్నీరు వంటి పదార్థాలు ఎక్కువగా తీసుకోవద్దు. కానీ పెరుగు తింటే ఇబ్బందేమీ ఉండదు.   
 • మద్యం, పొగ తాగటం వంటి దురలవాట్లుంటే మానెయ్యాలి
 • రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం మంచిది.
 • గాయాలు, దెబ్బలు తగలకుండా చూసుకోవాలి.
 • మరీ వేడి నీటితో స్నానం చేయొద్దు. మృదువైన సబ్బులు వాడుకోవాలి.
 • పొలుసులను గట్టిగా రుద్దొద్దు. మాడు లేదా మచ్చల మీది నుంచి పొలుసులను లాగొద్దు. లాగినకొద్దీ పొలుసులు వస్తూనే ఉంటాయి. కొత్త మచ్చలు ఏర్పడే ప్రమాదమూ ఉంది. చికిత్సల ప్రభావమూ తగ్గొచ్చు.
 • క్రమం తప్పకుండా మాయిశ్చరైజర్లు రాసుకోవాలి. అయితే శరీరానికి సరిపడిన.. రంగు, వాసన, ప్రిజర్వేటివ్స్‌ లేని మాయిశ్చరైజర్‌ ఎంచుకోవాలి.
 • రోజూ 10-15 నిమిషాలు ఒంటికి ఎండ తగిలేలా చూసుకోవాలి. కానీ తీవ్రమైన ఎండలోకి వెళ్లొద్దు.
 • మానసిక ఒత్తిడి తగ్గించుకోవాలి. జబ్బు గురించే కాదు.. దేని గురించీ అతిగా ఆలోచించొద్దు. యోగా, ధ్యానం, ప్రాణాయామం వంటివి మానసిక ప్రశాంతతకు తోడ్పడతాయి.

చికిత్సలు- రకరకాలు

సొరియాసిస్‌ మొండి సమస్యే అయినా అదుపులో ఉంచుకోవచ్చు. దీనికి రకరకాల మందులు, అధునాతన చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కొన్ని కొత్త చర్మకణాల వృద్ధిని అడ్డుకుంటే.. మరికొన్ని దురద, చర్మం పొడిబారటం వంటి ఇబ్బందుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. సొరియాసిస్‌ రకం, తీవ్రత, వయసు, సమస్య ఉన్న చోటు, ఇతరత్రా జబ్బులను దృష్టిలో ఉంచుకొని మందులను ఇవ్వాల్సి ఉంటుంది.

లేపనాలు: మచ్చలు చిన్నగా, ఒకట్రెండు చోట్ల ఉంటే కార్టికో స్టిరాయిడ్‌ లేపనాలతో ఉపశమనం లభిస్తుంది. ఇవి కణ విభజనను నెమ్మదింపజేస్తాయి. పొలుసులు, వాపు, దురద తగ్గుతాయి. స్టిరాయిడ్లకు శాలిసైలిక్‌ యాసిడ్, రెటినాయిడ్స్, టాక్రోలిమస్, విటమిన్‌ డి వంటివి కలిపిన పూత మందులూ మేలే. అయితే ఏయే మిశ్రమాల లేపనాలు ఇవ్వాలనేది పొలుసుల తీరును బట్టి ఆధారపడి ఉంటుంది. శాలిసైలిక్‌ యాసిడ్‌ పొలుసులను నిర్మూలిస్తుంది. కాళ్లు, చేతుల్లో వచ్చే సొరియాసిస్‌కు రెటినాయిడ్‌ క్రీములు ఉపయోగపడతాయి. ముఖం మీద, జననాంగాల్లో వచ్చే పొలుసులకు ముందు స్టిరాయిడ్‌ లేపనాలు వాడొద్దు. వీటితో చర్మం మరింత పలుచబడి, ఎర్రగా అవుతుంది. జననాంగాల్లో వచ్చే సొరియాసిస్‌లో పొలుసులు ఉండవు. అందువల్ల శాలిసైలిక్‌ యాసిడ్‌ పనికిరాదు. వీరికి ఎరుపు తగ్గేంతవరకు టాక్రోలిమస్‌ పూతమందు సూచిస్తారు. అవసరమైతేనే తక్కువ మోతాదు స్టిరాయిడ్‌ లేపనాలు ఇస్తారు. ముఖానికి క్రిసబొరాల్, టొఫాసిటినిబ్‌ పూతమందులు ఉపయోగ పడతాయి. తలలో కోల్‌ తార్, శాలిసైలిక్‌యాసిడ్‌తో కూడిన లేపనాలు బాగా పనిచేస్తాయి. తక్కువ మోతాదు స్టిరాయిడ్‌ షాంపూలూ ఉపయోగపడతాయి.  

మందులు: సొరియాసిస్‌ శరీరంలో 20% కన్నా ఎక్కువగా విస్తరిస్తే మాత్రలు ఇవ్వాల్సి ఉంటుంది. రోగనిరోధకశక్తి బాగుండి... మధుమేహం, థైరాయిడ్‌ వంటి సమస్యలేవీ లేనివారికి మెథట్రిక్సేట్‌ మాత్రలు ఇవ్వచ్చు. పిల్లలకైతే సైక్లోస్పోరిన్‌ బాగా పనిచేస్తుంది.  
ఫొటోథెరపీ: రోగనిరోధకశక్తి తక్కువగా గలవారికి, మాత్రలతో ఫలితం కనిపించని వారికి, ఇతరత్రా సమస్యలు గలవారికి, మాత్రలు ఇవ్వటం కుదరనివారికి న్యారోబ్యాండ్‌ ఫొటోథెరపీ బాగా ఉపయోగ పడుతుంది. విటమిన్‌ ఏ మాత్రలు వేసుకున్నాక ఫొటోథెరపీ తీసుకుంటే మంచి ఫలితాలు కనిపిస్తాయి. కానీ సంతానాన్ని కనాలని అనుకునేవారికి, గర్భిణులకు, పాలిచ్చే తల్లులకు, 15 ఏళ్ల కన్నా చిన్నవారికి, 40 ఏళ్లు పైబడ్డవారికి, కంటి సమస్యలు గలవారికి విటమిన్‌ ఏ లోపలికి ఇవ్వటం కుదరదు. ఇలాంటివారు విటమిన్‌ ఏ లేపనాన్ని చర్మానికి రాసుకొని ఫొటోథెరపీ తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో అంతగా ఫలితం కనిపించకపోతే లేజర్‌ చికిత్స అవసరమవుతుంది.

బయలాజికల్స్‌: లేపనాలు, మాత్రలు, ఫొటోథెరపీ వంటి వేటితోనూ ప్రయోజనం కనిపించకపోతే బయలాజికల్‌ ఇంజెక్షన్లు ఉపయోగపడతాయి. ఇవి కణ విభజనకు తోడ్పడే మార్గాలను అడ్డుకుంటాయి. అందువల్ల సత్వరం ఫలితం కనిపిస్తుంది. అయితే రోగనిరోధకశక్తి బాగున్నవారికి.. ఇన్‌ఫెక్షన్లు లేనివారికి.. కాలేయం, కిడ్నీల వంటి అవయవాలు ఆరోగ్యంగా ఉన్నవారికి మాత్రమే వీటిని ఇవ్వాల్సి ఉంటుంది.

స్టిరాయిడ్‌ మాత్రలొద్దు

సొరియాసిస్‌కు స్టిరాయిడ్‌ లేపనాలు ఉపయోగపడతాయి గానీ స్టిరాయిడ్‌ మాత్రలతో ఎలాంటి ప్రయోజనం ఉండదు. శరీరమంతా ఎర్రబడే ఎరిథ్రోడెర్మిక్‌ సొరియాసిస్‌ గలవారికి మాత్రమే స్టిరాయిడ్‌ మాత్రలు అవసరం. ఈ విషయం తెలియక చాలామంది సొంతంగా స్టిరాయిడ్‌ మాత్రలను కొనుక్కొని వేసు కుంటుంటారు. ఇది ప్రమాదం. అనవసరంగా స్టిరాయిడ్‌ మాత్రలు వాడితే సమస్య మరింత తీవ్రమవుతుందని అందరూ తెలుసుకోవాలి.

ప్రేరకాలతో జాగ్రత్త

సొరియాసిస్‌ గల చాలామందిలో ఏదో ఒక దాంతో లక్షణాలు మొదలవటమో, తీవ్రం కావటమో చూస్తుంటాం. ఇలాంటి ప్రేరకాలను గుర్తించి, వాటి విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది.

 • గాయాలు: చర్మం కోసుకుపోవటం, గీసుకుపోవటం, కీటకాలు కుట్టటం, ఎండ వేడికి కమలటం వంటివి పొలుసులను ప్రేరేపించొచ్చు. దీన్నే కోబ్నర్‌ ప్రతిస్పందన అంటారు.
 • దురలవాట్లు: మద్యం, పొగ తాగటం వంటి వ్యసనాలు.
 • చర్మం పొడిబారటం
 • మానసిక ఒత్తిడి
 • హార్మోన్ల మార్పులు: ముఖ్యంగా మహిళల్లో యుక్తవయసులో, గర్భం ధరించినప్పుడు, నెలసరి నిలిచినప్పుడు ఒంట్లో తలెత్తే హార్మోన్ల మార్పులు కారణమవుతుంటాయి.
 • ఇన్‌ఫెక్షన్లు: జలుబు, గొంతునొప్పి వంటి పై శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లు. కొందరిలో గొంతు ఇన్‌ఫెక్షన్‌ అనంతరం గటేట్‌ రకం సొరియాసిస్‌ తలెత్తొచ్చు. ముఖ్యంగా పిల్లల్లో, యుక్తవయసులో దీన్ని చూస్తుంటాం.
 • జబ్బులు: హెచ్‌ఐవీ వంటి రోగనిరోధకశక్తితో ముడిపడిన జబ్బులు.
 • మందులు: కొన్నిరకాల అధిక రక్తపోటు, మలేరియాను తగ్గించే మందులు.. ఐబూప్రొఫెన్‌ వంటి నొప్పి మందులు, మానసిక సమస్యలకు వాడే లిథియం వంటివి పొలుసులను ప్రేరేపించొచ్చు.
 • వాతావరణం: అధిక వేడి లేదా చల్లదనం వంటివి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని