రెటీనా రంధ్రం పూడ్చకపోతే?

నాకు 72 ఏళ్లు. మూడు నెలల క్రితం కుడి కంటికి శుక్లాల ఆపరేషన్‌ చేశారు. చూపు మెరుగు కాలేదు. స్కానింగ్‌ చేయగా రెటీనాకు రంధ్రం పడిందని తేలింది

Published : 07 Mar 2023 00:23 IST

సమస్య: నాకు 72 ఏళ్లు. మూడు నెలల క్రితం కుడి కంటికి శుక్లాల ఆపరేషన్‌ చేశారు. చూపు మెరుగు కాలేదు. స్కానింగ్‌ చేయగా రెటీనాకు రంధ్రం పడిందని తేలింది. దీన్ని పూడ్చటానికి మరో ఆపరేషన్‌ చేయాలన్నారు. కానీ నా వయసును బట్టి చూపు మెరుగు పడకపోవచ్చని అంటున్నారు. ఈ వయసులో నేను ఈ ఆపరేషన్‌ చేయించుకోవాలా? రెటీనా రంధ్రం పూడ్చకపోతే ఏవైనా ఇబ్బందులుంటాయా?
కె. సుభాష్‌ చంద్రబోస్‌, హైదరాబాద్‌

సలహా: మనకు చూపు కనిపించటానికి తోడ్పడేది రెటీనానే. ఇది దృశ్యాలను గ్రహించి, వాటిని విద్యుత్‌ సంకేతాల రూపంలో దృశ్యనాడి ద్వారా మెదడుకు చేరవేస్తుంది. దీనికి రంధ్రం పడితే చూపు దెబ్బతింటుంది. రెటీనాలో చాలావరకు మాక్యులా అనే మధ్యభాగంలో రంధ్రం పడుతుంటుంది. అధిక రక్తపోటు, మధుమేహం గలవారికి దీని ముప్పు ఎక్కువ. మాక్యులార్‌ ఎడీమా కూడా కారణం కావొచ్చు. ఇందులో రెటీనా క్రమంగా ఉబ్బుతూ.. ఉన్నట్టుండి రంధ్రం పడుతుంది. దీన్ని పూడ్చితే చూపు మెరుగయ్యే అవకాశముంది. అయితే రంధ్రం ఎప్పుడు పడింది? ఎంత పెద్దగా ఉంది? అనే వాటిని బట్టి ఇది ఆధారపడి ఉంటుంది. స్కానింగ్‌ చేస్తే రంధ్రం సైజు, అంచులను బట్టి రంధ్రం ఎప్పుడు పడిందనేది తెలుస్తుంది. ఇటీవలే పడ్డ రంధ్రాన్ని పూడ్చితే కొంతవరకు చూపు మెరుగవుతుంది. అదే రంధ్రం పెద్దగా ఉన్నా, అది చాలాకాలం ఉన్నా చూపు మెరుగయ్యే అవకాశం తక్కువ. మీ వయసుకూ రంధ్రం పూడ్చటానికి చేసే ఆపరేషన్‌కూ సంబంధం లేదు. పెద్ద వయసైనా చేయించుకోవచ్చు. ఒకవేళ ఆపరేషన్‌ చేయించుకోనట్టయితే ప్రతి మూడు నెలలకోసారి డాక్టర్‌ను సంప్రదించి, పరిస్థితి ఏంటన్నది పరీక్షించు కోవాల్సి ఉంటుంది. అలాగే అధిక రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలుంటే మందులు వాడుకుంటూ నియంత్రణలో ఉంచుకోవాలి. రంధ్రం పెద్దగా అవుతూ, చూపు తగ్గుతూ వస్తుంటే మాత్రం ఆపరేషన్‌ చేయించుకోవాల్సి ఉంటుంది.


మీ ఆరోగ్య సమస్యలను, సందేహాలను పంపాల్సిన ఈమెయిల్‌ చిరునామా:  sukhi@eenadu.in


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని