పాత జలుబు కొత్తగా..

ఇదిగో జలుబు అంటే అదిగో కరోనా అన్నట్టుగా మారింది పరిస్థితి. ఏ కొత్త వైరస్‌ విజృంభించినా మహమ్మారిలా మారుతుందేమోననే వణికిపోతున్నాం. కొవిడ్‌ అంతలా భయపెట్టింది! అందుకేనేమో మామూలుదైన హెచ్‌3ఎన్‌2 వైరస్‌కూ ఇప్పుడు బెంబేలెత్తిపోతున్నాం. నిజానికి అంత ఆందోళన అవసరం లేదు. కొవిడ్‌లా ఇదేమీ కొత్తది కాదు. ఏటా వచ్చే సీజనల్‌ ఫ్లూనే. అలాగని అసలే ప్రమాదం లేదనుకోలేం. కొందరికి తీవ్రంగానూ పరిణమించొచ్చు. కాబట్టి జాగ్రత్త అవసరం.

Updated : 14 Mar 2023 09:27 IST

ఇదిగో జలుబు అంటే అదిగో కరోనా అన్నట్టుగా మారింది పరిస్థితి. ఏ కొత్త వైరస్‌ విజృంభించినా మహమ్మారిలా మారుతుందేమోననే వణికిపోతున్నాం. కొవిడ్‌ అంతలా భయపెట్టింది! అందుకేనేమో మామూలుదైన హెచ్‌3ఎన్‌2 వైరస్‌కూ ఇప్పుడు బెంబేలెత్తిపోతున్నాం. నిజానికి అంత ఆందోళన అవసరం లేదు. కొవిడ్‌లా ఇదేమీ కొత్తది కాదు. ఏటా వచ్చే సీజనల్‌ ఫ్లూనే. అలాగని అసలే ప్రమాదం లేదనుకోలేం. కొందరికి తీవ్రంగానూ పరిణమించొచ్చు. కాబట్టి జాగ్రత్త అవసరం.

ఏటా కాలాల వారీగా వచ్చే ఫ్లూ మనదేశంలో అంత ప్రమాదకరమైంది కాదు. దీన్ని అంతగా పట్టించుకునేవారూ కాదు. స్వైన్‌ఫ్లూ రాకతో ఇదెంత ప్రమాదకరమైందో తెలిసొచ్చింది. అది కొందరిలో న్యూమోనియాకు దారితీయటం, ప్రాణాంతకంగా పరిణమించటం తెలిసిందే. అప్పటి నుంచీ ఫ్లూ విషయంలో నిర్లక్ష్యం తగదనే అవగాహన పెరిగింది. ఆసుపత్రుల్లోనూ ప్రత్యేకించి దీనిపై దృష్టి సారిస్తున్నారు. ప్రస్తుతం హెచ్‌3ఎన్‌2 కొత్తగా విజృంభిస్తుండటంతో కలకలం మొదలైంది. కాలాల వారీగా వచ్చే ఫ్లూలో ఇదొకరకం. ఫ్లూ జ్వరాలకు కారణమయ్యే హ్యూమన్‌ ఇన్‌ఫ్లూయెంజా వైరస్‌లలో ఎ, బి, సి, డి అని నాలుగు రకాలున్నాయి. సీజనల్‌ ఫ్లూ ఎక్కువగా ఎ రకం వైరస్‌లతోనే వస్తుంటుంది. బి రకం, సి రకం వైరస్‌లతో వచ్చే ఫ్లూ అంత ప్రమాదకరం కాదు.

ఇక డి రకం వైరస్‌ పశువుల్లోనే కనిపిస్తుంటుంది. ఇన్‌ఫ్లూయెంజా ఎ రకంలోనూ కొన్ని ఉపజాతులున్నాయి. వీటిల్లో స్వైన్‌ఫ్లూ కారక హెచ్‌1ఎన్‌1తో పాటు ప్రస్తుత హెచ్‌3ఎన్‌2 జాతులు ఎక్కువగా వ్యాప్తిలో ఉన్నాయి. స్వైన్‌ఫ్లూ క్రమంగా సీజనల్‌ ఫ్లూగా మారిపోయింది. ఇప్పుడు హెచ్‌3ఎన్‌2 ఉద్ధృతంగా మారటం మొదలెట్టింది. దీన్ని 1968లోనే మనుషుల్లో గుర్తించారు. ఇన్‌ఫ్లూయెంజా ఎ వైరస్‌ ఉపరితలం మీద హెమాగ్లుటినిన్‌ (హెచ్‌ఏ), న్యూరామినిడేజ్‌ (ఎన్‌ఏ) అని రెండు ప్రొటీన్లు ఉంటాయి. హెచ్‌ఏలో 18, ఎన్‌ఏలో 11 వేర్వేరు  ఉపరకాలుంటాయి. వీటిని హెచ్‌1, హెచ్‌2.. ఎన్‌1, ఎన్‌2 ఇలా సంఖ్యలతో గుర్తిస్తారు. ఈ రెండు రకాల ప్రొటీన్ల జాతులతోనే హెచ్‌3ఎన్‌2 పుట్టుకొచ్చింది. మొదట్లో మహమ్మారిగా విరుచుకుపడినా.. క్రమంగా మామూలు ఫ్లూగా మారింది. అయితే అప్పుడప్పుడు జన్యు పదార్థాల కలయిక మూలంగా లోలోపల దీని జన్యువుల అమరిక మారిపోతుంటుంది. దీంతో అది సరికొత్తగా మారుతుంది. కొత్త శక్తులతో విజృంభిస్తుంది. త్వరగానూ వ్యాపిస్తుంది. ఇప్పుడు చూస్తున్న హెచ్‌3ఎన్‌2 వైరస్‌ ఇలాంటిదే. కొవిడ్‌ నివారణలో భాగంగా గత మూడేళ్లుగా మాస్కులు ధరించటం వంటి జాగ్రత్తలు తీసుకున్నాం. దీంతో ఒక్క కొవిడ్‌ మాత్రమే కాదు, ఇతరత్రా శ్వాసకోశ సమస్యల నుంచీ రక్షణ లభించింది. ముఖ్యంగా ఫ్లూ వ్యాప్తి గణనీయంగా తగ్గింది. ఇది మంచి పరిణామమే. కానీ సీజనల్‌ ఫ్లూతో ఒంట్లో పుట్టుకొచ్చే యాంటీబాడీల రక్షణ కొరవడి ఉండొచ్చు. దీనికి సంబంధించిన సామూహిక రోగనిరోధక సంతరించి ఉండకపోవచ్చు. ఇప్పుడు హెచ్‌3ఎన్‌2 ఎక్కువ కావటానికి ఇదీ ఒక కారణం కావొచ్చు.

జాగ్రత్త అవసరం

హెచ్‌3ఎన్‌2 వైరస్‌ పాతదే కావొచ్చు. కానీ జన్యు ఉత్పరివర్తనాల మూలంగా కొత్తగా మారింది. దీని ప్రవర్తన, తీరుతెన్నుల గురించి ఇంకా పూర్తిగా తెలియదు. కొన్నిచోట్ల మరణాలూ నమోదవుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా దగ్గు, గొంతునొప్పి, ఒళ్లునొప్పులు, జ్వరం వంటి ఫ్లూ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. సొంతంగా మందులు కొనుక్కొని వాడొద్దు. ముఖ్యంగా యాంటీబయాటిక్‌ మందులు అసలే వాడొద్దు. ఇవి వైరల్‌ ఇన్‌ఫెక్షన్లను తగ్గించవు. అవసరమైతే డాక్టర్లు ఒసాల్టమవిర్‌ వంటి యాంటీవైరల్‌ మందులు సూచిస్తారు. వీటిని ఐదు రోజుల పాటు కచ్చితంగా వాడుకోవాలి. ఇవి అన్నిరకాల ఫ్లూ వైరస్‌లను సమర్థంగా అడ్డుకుంటాయి. హెచ్‌3ఎన్‌2 ఇన్‌ఫెక్షన్‌నూ ఇవి బాగానే తగ్గిస్తున్నట్టు ఇప్పటివరకు చేసిన చికిత్స అనుభవాలు చెబుతున్నాయి. ఈ మందులను దుర్వినియోగం చేయొద్దు. ఎన్ని రోజుల వరకు సూచిస్తే అన్ని రోజులు వేసుకోవాలి. మధ్యలో మానేస్తే వైరస్‌ మందులను తట్టుకునే సామర్థ్యాన్ని సంతరించుకుంటుంది. ఇది ఇతరులకు సోకితే మందులు వేసినా ఫలితం కనిపించదు.  

* ఫ్లూ ప్రమాదకరంగా పరిణమించే అవకాశం గలవారు ముందుజాగ్రత్త చికిత్స (కీమోప్రొఫైలాక్సిస్‌ ఫర్‌ ఫ్లూ) కూడా తీసుకోవచ్చు. ఇందులో యాంటీవైరల్‌ మందులను రోజూ ఒక మోతాదు చొప్పున 14 రోజుల పాటు వేసు కోవాల్సిఉంటుంది.

మూడు నెలల కిందటే..

ఇప్పుడు హెచ్‌3ఎన్‌2 పేరు ఎక్కువగా వినిపిస్తోంది గానీ ఇది మూడు నెలల క్రితం నుంచే విజృంభిస్తోంది. ఆర్‌టీపీసీఆర్‌, జన్యు విశ్లేషణ పరీక్షలు అన్నిచోట్ల అందుబాటులో లేకపోవటం వల్ల కచ్చితంగా వైరస్‌ను గుర్తించటం సాధ్యం కాలేదు. లక్షణాలను బట్టే ఫ్లూ చికిత్స చేస్తూ వస్తున్నారు. ఎందుకంటే వైరస్‌ పరీక్ష చేసి, ఫలితాలు వచ్చేసరికే కొందరిలో తీవ్రం కావచ్చు. ఇటీవల హెచ్‌3ఎన్‌2 కేసులు కొన్ని రాష్ట్రాల్లో ఎక్కువ కావటం, కొందరు మృత్యువాత పడటంతో ఆందోళన, భయం నెలకొన్నాయి.

లక్షణాలు ఇవీ..

హెచ్‌3ఎన్‌2 చాలా త్వరగా వ్యాపిస్తుంది. వైరస్‌ సోకిన ఒకట్రెండు రోజుల్లోనే దీని లక్షణాలు మొదలవుతాయి. ఇందులో జ్వరం, ఒళ్లునొప్పులు, గొంతునొప్పి, దగ్గు, తుమ్ములు, ముక్కు కారటం వంటి మామూలు ఫ్లూ లక్షణాలే ఉంటాయి. కొందరికి నీళ్ల విరేచనాలు, వాంతులు పట్టుకోవచ్చు. కొందరికి ఫిట్స్‌ కూడా రావొచ్చు. కాకపోతే ఇందులో ఎక్కువ రోజుల పాటు దగ్గు, రెండు వారాల పాటు బలహీనత వేధిస్తున్నట్టు కనిపిస్తోంది. సాధారణంగా జలుబులో జ్వరం ఉండదు. ఏదో నలతగా ఉంటుందంతే. ఒళ్లునొప్పులూ అంతగా ఉండవు. కానీ ఫ్లూలో ఒళ్లునొప్పులు, జ్వరం ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ఎవరిలోనైనా జలుబు లక్షణాలతో పాటు జ్వరం (101 డిగ్రీల ఫారన్‌హీట్‌ కన్నా ఎక్కువ), బాగా ఒళ్లునొప్పులు ఉన్నట్టయితే ఫ్లూగా భావించాలి. గొంతునొప్పి వంటి ఇబ్బందులు చాలా త్వరగా తీవ్రమవుతుంటాయి కూడా. వీటి ఆధారంగా ఫ్లూను అనుమానించొచ్చు.

ఎవరికి వస్తుంది?

చిన్నపిల్లలు, యువతీ యువకులు, వృద్ధులు, ఆడవారు, మగవారు అనే తేడా లేకుండా హెచ్‌3ఎన్‌2 ఎవరికైనా రావొచ్చు. కాకపోతే బయట ఎక్కువగా తిరిగేవారికి ముప్పు అధికం. వీరి ద్వారా ఇంట్లో ఉన్నవారికీ సోకుతుంది.

తేలికగానే తగ్గుతుంది గానీ..

చాలామందికి తేలికగానే తగ్గుతుంది. ఐదారు రోజులు జలుబు లక్షణాలుండి దానంతటదే తగ్గొచ్చు. మంచి ఆరోగ్యంతో ఉన్నవారికి ఫ్లూ ఎలాంటి ఇబ్బంది కలిగించదు. ఇది వచ్చినట్టయినా తెలియకపోవచ్చు. కొందరికి మాత్రం తీవ్రంగా పరిణమించొచ్చు. ఫ్లూ చాలావరకు పై శ్వాసకోశ వ్యవస్థకే పరిమతమవుతుంది. కొన్నిసార్లు ఇది ఊపిరితిత్తుల్లోకీ విస్తరించి, న్యుమోనియాకు దారితీయొచ్చు. దీంతో రక్తంలో ఆక్సిజన్‌ శాతం పడిపోతుంది. సత్వరం సరైన చికిత్స అందకపోతే ప్రాణాపాయానికీ దారితీయొచ్చు. ఐదేళ్ల లోపు పిల్లలకు, గర్భిణులకు, 65 ఏళ్లు పైబడ్డవారికి, అలాగే మధుమేహం, అధిక రక్తపోటు, గుండెజబ్బులు, ఆస్థమా వంటి ఇతరత్రా సమస్యలు గలవారికి తీవ్రంగా మారొచ్చు. రోగనిరోధకశక్తి తగ్గినవారికి, స్టిరాయిడ్‌ మందులు వాడేవారికి, రుమటాయిడ్‌ ఆర్థ్రయిటిస్‌ వంటి ఆటోఇమ్యూన్‌ జబ్బులు గలవారికి, క్యాన్సర్‌తో బాధపడేవారికి, క్యాన్సర్‌ చికిత్స తీసుకునే వారికి, హెచ్‌ఐవీ గలవారికి కూడా ప్రమాదకరంగా మారే అవకాశముంది.

కొవిడ్‌ అంత తీవ్రం కాదు

హెచ్‌3ఎన్‌2 కాలాల వారీగా వచ్చే సమస్య. ఇది మన వాతావరణంలో చాలాకాలంగా ఉన్నదే. కాబట్టి కొవిడ్‌ మాదిరిగా తీవ్రమయ్యే అవకాశం లేదు. కొవిడ్‌కు చికిత్స లేదు గానీ హెచ్‌3ఎన్‌2 ఇన్‌ఫెక్షన్‌ను నయం చేసే మంచి యాంటీవైరల్‌ మందులు అందుబాటులో ఉన్నాయి. ఎప్పటి నుంచో టీకా అందుబాటులో ఉంది. కాబట్టి ఒకవేళ ఎక్కువగా వ్యాపించినా భయం అవసరం లేదు. సాధారణంగా మనదేశంలో ఫ్లూ వర్షాకాలం తర్వాత ఒకసారి.. జనవరి-మార్చి నెలల్లో రెండోసారి ఎక్కువగా కనిపిస్తుంటుంది. దీన్ని బట్టి చూస్తే మార్చిలో హెచ్‌3ఎన్‌2 ఉద్ధృతి తగ్గే అవకాశముందని ఆశించొచ్చు.

ఎలా వ్యాపిస్తుంది?

తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు, మాట్లాడినప్పుడు వెలువడే తుంపర్ల ద్వారా వైరస్‌ ఒకరి నుంచి మరొకరికి సోకుతుంది. అందువల్ల గుంపులోకి వెళ్లొద్దు. ఇతరులకు మీటరు దూరంలో ఉండటం మంచిది. ముఖానికి మాస్కు ధరించాలి. చేతులను తరచూ సబ్బుతో శుభ్రం చేసుకోవాలి. కళ్లు, ముక్కు, నోటికి చేతులను తాకనీయొద్దు. కరచాలనం, కౌగిలించుకోవటం వద్దు. కొవిడ్‌ మాదిరిగానే ఫ్లూ విషయంలోనూ నివారణ చర్యలు పాటించాలి.

ఏం చేయాలి?

జలుబు లక్షణాలు కనిపిస్తే వీలైనంతవరకు ఇంట్లోనే ఉండాలి. ఇంట్లోనూ లక్షణాలు తగ్గేంతవరకు కుటుంబసభ్యులతో సన్నిహితంగా మెలగొద్దు. ద్రవాలు ఎక్కువగా తీసుకోవాలి. జ్వరం, ఒళ్లునొప్పులు తగ్గటానికి పారాసిటమాల్‌ మాత్రలు వేసుకోవచ్చు. అయితే నొప్పి నివారణ మందులు వాడొద్దు. రక్తంలో ఆక్సిజన్‌ మోతాదులు చూసుకోవాలి. ఆక్సిజన్‌ తగ్గుతుంటే వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి.

టీకా రక్షణ

ఫ్లూ నివారణకు ఎప్పటి నుంచో టీకా అందుబాటులో ఉంది. ప్రతి సంవత్సరం ఫ్లూ వైరస్‌లు మారిపోతుంటాయి. కొత్త రకాలు పుట్టుకొస్తుంటాయి. అందుకే ప్రపంచ ఆరోగ్యసంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తిలో ఉన్న ఫ్లూ వైరస్‌ రకాలను పరిశీలించి, ప్రయోగశాలల్లోంచి వాటి జన్యుక్రమాన్ని తీసుకొని టీకా రూపకల్పనను నిర్దేశిస్తుంది. టీకాలో ఏ వైరస్‌లకు సంబంధించిన యాంటీజెన్‌లు ఉండాలో సూచిస్తుంది. దీని ఆధారంగా ఫ్లూ టీకాను తయారుచేస్తారు. ఇందులో ఇన్‌ఫ్లూయెంజా ఎ రకానికి చెందిన 2 ఉపజాతులు (ప్రస్తుత హెచ్‌1ఎన్‌1, హెచ్‌3ఎన్‌2).. అలాగే ఇన్‌ఫ్లూయెంజా బి రకానికి చెందిన 2 ఉపజాతుల యాంటీజెన్లు ఉంటాయి. ఈ నాలుగు యాంటీజెన్లు గల టీకాను తీసుకోవటం మంచిది. మరో విషయమూ గమనించాలి. ఉత్తరార్ధ గోళం (ఎన్‌హెచ్‌), దక్షిణార్ధ గోళం (ఎస్‌హెచ్‌) ప్రాంతాలకు వేర్వేరుగా ఫ్లూ టీకాను తయారుచేస్తుంటారు. వీటిల్లో కొన్ని తేడాలుంటాయి. మనం ఎస్‌హెచ్‌ ప్రాంత టీకాను వాడుకోవటమే మేలని నిపుణులు చెబుతున్నారు. ఫ్లూ టీకా వేసుకుంటే వైరస్‌ బారినపడకుండా కాపాడుకోవచ్చు. ఒకవేళ ఇన్‌ఫెక్షన్‌ తలెత్తినా తీవ్రం కాదు. ఎన్నో ప్రయోగ పరీక్షల అనంతరం రూపొందించిన టీకా కాబట్టి సురక్షితం. ఆరు నెలలు దాటిన పిల్లల దగ్గరి నుంచి పెద్దవాళ్లంతా టీకా వేసుకోవాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు