పిత్తాశయంలో రాయి ఇప్పుడు సర్జరీ చేయించుకోవచ్చా?

నాకు 27 ఏళ్లు. గత సంవత్సరం గర్భిణిగా ఉన్నప్పుడు కడుపులో కుడివైపు నొప్పి వచ్చింది. స్కానింగ్‌ రిపోర్టు నార్మల్‌గా వచ్చింది. జనవరిలో కాన్పు అయ్యింది.

Published : 21 Mar 2023 00:18 IST

సమస్యసలహా

సమస్య: నాకు 27 ఏళ్లు. గత సంవత్సరం గర్భిణిగా ఉన్నప్పుడు కడుపులో కుడివైపు నొప్పి వచ్చింది. స్కానింగ్‌ రిపోర్టు నార్మల్‌గా వచ్చింది. జనవరిలో కాన్పు అయ్యింది. అనంతరం మళ్లీ నొప్పి ఎక్కువగా వచ్చింది. మరోసారి స్కాన్‌ చేయగా గాల్‌బ్లాడర్‌లో 10 ఎం.ఎం. సైజు రాయి ఉన్నట్టు తేలింది. కాలేయ సామర్థ్య పరీక్ష రిపోర్టులు నార్మల్‌గా ఉన్నాయి. నేను బాలింతను కాబట్టి ఇప్పుడు ల్యాప్రోస్కోపీ పద్ధతిలో సర్జరీ చేయించుకోవచ్చా? ఏమైనా సమస్యలు వస్తాయా?

లక్ష్మి

సలహా: మీరు పొట్టలో కుడివైపు నొప్పి వస్తుందన్నారు. కానీ అది పైభాగంలో వస్తోందో లేదో తెలియజేయలేదు. పిత్తాశయం(గాల్‌బ్లాడర్‌)లో రాయి ఉంటే సాధారణంగా పొట్ట పైభాగాన, కుడివైపున నొప్పి వస్తుంది. కాబట్టి ముందుగా పిత్తాశయ రాయితో వస్తున్న నొప్పేనా? కాదా? అనేది నిర్ధారించటం ముఖ్యం. కొన్ని సందర్భాలలో పైత్యరస నాళంలోకి (సీబీడీ) రాయి జారటంతోనూ, పాంక్రియాస్‌ వాపు (పాంక్రియాటైటిస్‌) మూలంగానూ నొప్పి రావొచ్చు. లివర్‌ ఫంక్షన్‌ పరీక్షలు.. అమైలేజ్‌, లైపేజ్‌ మోతాదుల పరీక్షలతో ఈ సమస్యలను నిర్ధారించొచ్చు. అల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌ పరీక్షలో పైత్యరస నాళం సైజు పెరిగితే రాయి ఉందనటానికి సంకేతం. అలాగే పాంక్రియాటైటిస్‌ సమస్యనూ అల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌తో నిర్ధారించొచ్చు. ఇలాంటి సమస్యలు ఉన్నట్టయితే ముందుగా వీటికి చికిత్స చేయటం ముఖ్యం. మీరు గ్యాస్ట్రో ఎంటెరాలజిస్టును సంప్రదించి, అవసరమైన పరీక్షలు చేయించుకోవటం ముఖ్యం. ఇతరత్రా సమస్యలేవీ లేవని, నొప్పి పిత్తాశయ రాళ్లతోనే వస్తున్నట్టు నిర్ధారణ అయితే రాయి సైజుతో సంబంధం లేకుండా సర్జరీ చేయించుకోవటమే మంచిది. కాన్పు తర్వాత శస్త్రచికిత్స చేయించుకోవటానికి ఇబ్బందేమీ ఉండదు. మత్తుమందును (అనస్తీషియా) తట్టుకునే సామర్థ్యం ఉందో లేదో చూసి సర్జరీని నిర్ణయిస్తారు.


మీ ఆరోగ్య సమస్యలను, సందేహాలను మా ఈమెయిల్‌ sukhi@eenadu.in కు పంపొచ్చు.


 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని