చిన్ని గుండె అదురుతోంది

ఒకబ్బాయి. పుట్టినరోజు వేడుకలో చాక్లెట్లు, కేకులు, ఐస్‌క్రీమ్‌ బాగా తిన్నాడు. పడుకునేవరకు బాగానే ఉన్నాడు. అర్ధరాత్రి గుండె దడదడమని కొట్టుకోవటం మొదలెట్టింది

Updated : 28 Nov 2023 09:53 IST

ఒకబ్బాయి. పుట్టినరోజు వేడుకలో చాక్లెట్లు, కేకులు, ఐస్‌క్రీమ్‌ బాగా తిన్నాడు. పడుకునేవరకు బాగానే ఉన్నాడు. అర్ధరాత్రి గుండె దడదడమని కొట్టుకోవటం మొదలెట్టింది. వెంటనే ఆసుపత్రికి తీసుకొచ్చారు. అప్పుడు గుండె నిమిషానికి 220 సార్లు కొట్టుకుంటోంది!


ఒకమ్మాయి. బడిలో డ్యాన్స్‌ చేసింది. విశ్రాంతి తీసుకునేప్పుడు గుండెలో దడ మొదలైంది. తర్వాత స్పృహ తప్పి, పడి పోయింది. ఆసుపత్రికి తీసుకొచ్చాక పరీక్షిస్తే గుండె చాలా వేగంగా కొట్టుకుంటున్నట్టు తేలింది.

- ఇటీవల ఇలాంటి ఘటనలెన్నో వెలుగు చూస్తున్నాయి. అభం శుభం తెలియని ఎంతోమంది చిన్నారులు గుండెదడతో సతమతమవటం కలవరం కలిగిస్తోంది. వీరికి సత్వర చికిత్స చాలా ముఖ్యం. లేకపోతే శరీరానికి శ్రమ కలిగించే పనులు చేస్తున్నప్పుడు హఠాత్తుగా కళ్లు తిరిగి, సొమ్మసిల్లొచ్చు. కొన్నిసార్లు ప్రాణాపాయమూ సంభవించొచ్చు. కాబట్టి నిర్లక్ష్యం చేయటానికి లేదు.


గుండె ప్రధానమైన పని

ఊపిరితిత్తుల్లోంచి ఆక్సిజన్‌తో కూడిన రక్తాన్ని స్వీకరించి, శరీరానికి పంప్‌ చేయటం. తిరిగి ఆయా భాగాల నుంచి వచ్చే రక్తాన్ని ఊపిరితిత్తుల్లోకి చేరవేయటం. ఇది తల్లి కడుపులో పిండం ఏర్పడ్డాక ఐదో వారం దాటగానే కొట్టుకోవటం మొదలెడుతుంది. ఇదో నిరంతర ప్రక్రియ. ఇందులో గుండెలోని విద్యుత్తు వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుంది. మన గుండెలోని కుడి కర్ణిక (పైగది) మీదుండే సైనోఏట్రియల్‌ (ఎస్‌ఏ) నోడ్‌ను విద్యుత్తు ‘తయారీ కేంద్రం’ అనుకోవచ్చు. ముందుగా దీనిలోని ప్రత్యేక కణాల నుంచి ఉత్పత్తయ్యే విద్యుత్తు సంకేతం పైగదులు రెండింటినీ సంకోచించేలా చేసి, జఠరికల్లోకి (కింది గదులు) రక్తాన్ని పంప్‌ చేయిస్తుంది. అనంతరం ఈ విద్యుత్తు సంకేతం గుండె మీద మధ్యలో ఉండే ఏట్రియోవెంట్రిక్యులర్‌ (ఏవీ) నోడ్‌కు చేరుకుంటుంది. దీన్ని సబ్‌స్టేషన్‌ అనుకోవచ్చు. ఇది లెఫ్ట్‌, రైట్‌ బండిళ్లు.. పర్కంజీ పోచల ద్వారా జఠరికలకు విద్యుత్తు సరఫరా చేస్తుంది. అనంతరం ఏవీ నోడ్‌ మరో విద్యుత్‌ సంకేతాన్ని జఠరికలకు పంపుతుంది. దీంతో జఠరికలు గుండెలోని రకాన్ని మొత్తం శరీరంలోకి పంప్‌ చేస్తాయి. ఇక్కడితో ఒక ఆవర్తనం పూర్తవుతుంది. తిరిగి కొత్త విద్యుత్‌ సంకేతం పుట్టటం, ప్రసరించటం మొదలవుతాయి. సాధారణంగా నిమిషానికి 72 సార్లు విద్యుత్‌ సంకేతాలు పుట్టుకొస్తుంటాయి కాబట్టే గుండె నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుంది. చిన్న పిల్లల్లోనైతే 100 నుంచి 120 సార్లు కొట్టుకుంటుంది.

అంతా క్రమబద్ధంగా..

గుండెలో విద్యుత్తు ఉత్పత్తి, ప్రసరణ అంతా క్రమ పద్ధతిలో సాగుతుంది. ఎక్కువ తక్కువలు కాకుండా అన్నిచోట్లా నియంత్రణ వ్యవస్థలు పనిచేస్తాయి. ఎస్‌ఏ నోడ్‌ నిరంతరం ఎవీ నోడ్‌ను అదుపులో ఉంచుతుంది. ఏవీ నోడేమో లెఫ్ట్‌, రైట్‌ బండిళ్లను.. పర్కంజీ పోచలను నియంత్రిస్తుంది. ఎస్‌ఏ నోడ్‌ దెబ్బతింటే ఏవీ నోడ్‌ ఒక్కటే పని చేస్తుంది. కాకపోతే దీన్నుంచి విద్యుత్తు తక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఏవీ నోడ్‌ దెబ్బతిన్నదనుకోండి, ఎస్‌ఏ నోడ్‌లో విద్యుత్తు తయారైనా పనికిరాదు. ఇలాంటప్పుడు గుండె కండరమే కొంత విద్యుత్తును తయారుచేస్తుంది. ఇలా గుండెలో ప్రతి ఒక్క భాగమూ విద్యుత్తును తయారు చేసే సామర్థ్యం కలిగుంటాయి. నియంత్రిత వ్యవస్థలతో ఇవన్నీ అదుపులో ఉంటాయి. అవసరమైనప్పుడు రంగంలోకి దిగుతాయి. ఏదైనా ప్రమాదకర పరిస్థితి ఎదురైనప్పుడు నాడుల నుంచి ఎస్‌ఏ నోడ్‌కు సమాచారం అందుతుంది. అప్పుడు విద్యుత్తు ఉత్పత్తి ఎక్కువై గుండె వేగం పెరుగుతుంది. జ్వరం వచ్చినప్పుడు కూడా మన శరీర ఉష్ణోగ్రతకు అనుగుణంగా స్పందించే గ్రాహకాల నుంచి ఎస్‌ఏ నోడ్‌కు సమాచారం అందటం వల్ల గుండె వేగం పెరుగుతుంది. పరుగెత్తు తున్నప్పుడూ శరీరానికి అవసరమైన శక్తి కోసం ఎస్‌ఏ నోడ్‌ ఎక్కువ విద్యుత్తును తయారుచేస్తుంది. దీంతో రక్త సరఫరా పుంజుకుంటుంది. నిద్ర పోతున్నప్పుడు, విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు గుండె వేగంగా కొట్టుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి విద్యుత్తు ఉత్పత్తి తగ్గి, గుండె వేగం 60 కన్నా తక్కువకు పడిపోతుంది. ఇలా శరీర అవసరాలకు అనుగుణంగా గుండెలో విద్యుత్తు వ్యవస్థ పనిచేస్తుంది. ఇందులో ఎక్కడ సమస్య తలెత్తినా గుండె లయ గతి తప్పొచ్చు. మామూలు కన్నా చాలా వేగంగా (టెకీకార్డియా).. లేదూ నెమ్మదిగా (బ్రాడీకార్డియా) కొట్టుకోవచ్చు. దీన్నే అరీత్మియా అంటారు. ఇందులో గుండె లయ అస్తవ్యస్తం కావటమే కాదు.. గుండె సామర్థ్యమూ తగ్గుతుంది.

ఎందుకొస్తుంది?

గుండె లయ తప్పటానికి రకరకాల అంశాలు దోహదం చేయొచ్చు. చాలామందిలో పెద్దగా కారణాలేవీ కనిపించవు. కానీ కొందరిలో గుండె కండరం మందం కావటం, పుట్టుకతో గుండె లోపాలు, కర్ణికలు పెద్దగా ఉండటం, జన్యుపరంగా తలెత్తే లాంగ్‌ క్యూటీ సిండ్రోమ్‌, అరిత్మోజెనిక్‌ రైట్‌ వెంట్రికల్‌ సిండ్రోమ్‌ వంటి సమస్యలు, కొన్నిరకాల మందులు, రక్తంలో ఖనిజ లవణాల సమతుల్యత లోపించటం, జ్వరం, ఒంట్లో నీరు తగ్గటం, మానసిక ఒత్తిడి, నిద్రలేమి, వైరల్‌ లేదా బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్ల వంటివి గుండె లయను దెబ్బతీయొచ్చు. కొందరికి పెద్దవారిలో మాదిరిగా గుండెపోటు వచ్చి కణజాలంలో మచ్చ ఏర్పడొచ్చు. దెబ్బతిన్న, బాగున్న కండరం మధ్యభాగంలోని కణాలు అతి చురుకుగా స్పందించటం వల్ల గుండె వేగం పెరుగుతుంది. దీంతో శరీరానికి రక్తం సరిగా సరఫరా కాదు. ఫలితంగా తల తిరిగి, స్పృహ తప్పొచ్చు. కొందరు నిమిషాల్లోనే మరణించే ప్రమాదమూ ఉంది. అందుకే ఈ సమస్య గల పిల్లలు డ్యాన్స్‌, వ్యాయామం చేస్తూ చేస్తూ ఉన్నట్టుండి కుప్పకూలుతుంటారు.

సమస్య రకరకాలు

గుండె లయ తప్పటం ఒక్కటే సమస్య అయినా విద్యుత్తు వ్యవస్థ గాడి తప్పిన భాగాన్ని, తీరును బట్టి రకరకాలుగా వర్గీకరించొచ్చు.
కర్ణికల్లో మొదలయ్యేవి: వీటిల్లో ఏవీ నోడల్‌ రీఎంట్రాంట్‌ టెకీకార్డియా (ఏవీఎన్‌ఆర్‌టీ), ఏట్రియల్‌ ఫ్లట్టర్‌, ఏట్రియల్‌ ఫిబ్రిలేషన్‌ ప్రధానమైనవి. ఏవీ ఎన్‌ఆర్‌టీలో స్విచ్చు ఆన్‌ చేసినట్టుగా గుండె వేగం హఠాత్తుగా పెరుగుతుంది. అన్నింటికన్నా ఎక్కువగా కనిపించేది ఇదే. ఎస్‌ఏ నోడ్‌ నుంచి వేరే దారిలో గుండెకు నేరుగా విద్యుత్తు సరఫరా అయ్యేవారిలోనూ (డబ్ల్యూపీడబ్ల్యూ సిండ్రోమ్‌) ఇది కనిపిస్తుంది. ఏట్రియల్‌ ఫ్లట్టర్‌లో పెరిగిన గుండె వేగం తగ్గకుండా కొనసాగుతూ వస్తుంది. కొందరిలో గుండె నిమిషానికి 250 నుంచి 350 సార్లు కొట్టుకోవచ్చు. ఇక ఏట్రియల్‌ ఫిబ్రిలేషన్‌లో కర్ణికల్లో ప్రతి కండరం దానికదే కొట్టుకుంటుంది.  
జఠరికల్లో మొదలయ్యేవి: కొందరిలో విద్యుత్‌ సంకేతం అందకముందే జఠరికలో గుండె స్పందన మొదలవ్వచ్చు (ప్రిమెచ్యూర్‌ వెంట్రిక్యులార్‌ కంట్రాక్షన్‌). దీనికి భయపడాల్సిన పనిలేదు. చికిత్సా అవసరం లేదు. అరుదే అయినా కొందరిలో జఠరికల్లోని కణాలు వాటంతటవే విద్యుత్తును వెదజల్లొచ్చు (వెంట్రిక్యులార్‌ టెకీ కార్డియా). జఠరికల్లోనూ ప్రతి కండరం దానికదే కొట్టుకోవచ్చు (వెంట్రిక్యులార్‌ ఫిబ్రిలేషన్‌). ఇవి చాలా ప్రమాద కరమైనవి. వీటికి జన్యు సమస్యల వంటివి కూడా కారణమవుతాయి.


అవసరమైతే అబ్లేషన్‌

నూటికి 90 మంది పిల్లలకు మందులతోనే సమస్య కుదురుకుంటుంది. కానీ 10 మందిలో మళ్లీ మళ్లీ రావొచ్చు. నవజాత శిశువులు, చిన్నపిల్లలకైతే మందులనే కొనసాగిస్తారు. అదే కాస్త పెద్ద పిల్లలైతే గుండెలో అసాధారణంగా విద్యుత్తు పుట్టుకొచ్చే భాగాన్ని కాల్చేయాల్సి (అబ్లేషన్‌) ఉంటుంది. వీరికి ముందుగా తుంటి లేదా మెడ వద్ద ఉండే రక్తనాళం ద్వారా లోపలికి తీగలను జొప్పించి, గుండెలో అసాధారణ విద్యుత్తు ఎక్కడి నుంచి వస్తుందో గుర్తిసారు (ఎలక్ట్రోఫిజియాలజికల్‌ స్టడీ). అనంతరం బయటి నుంచి విద్యుత్తు పంపించి, గుండెలో అదనపు విద్యుత్తు పుట్టుకొస్తున్న భాగం చుట్టూరా కాల్చేస్తారు (రేడియోఫ్రీక్వెన్సీ అబ్లేషన్‌). అతి చల్లటి సెలైన్‌ ధారతోనూ కాల్చేయొచ్చు (క్రయో అబ్లేషన్‌). దీంతో ఆ భాగం నుంచి పుట్టుకొచ్చే విద్యుత్తు ప్రసారం కావటం ఆగుతుంది. ప్రస్తుతం వీటి కోసం 3డీ నావిగేషన్‌, కార్టూ సిస్టమ్‌ వంటి అధునాతన పద్ధతులూ అందుబాటులోకి వచ్చాయి. మందులు ఆపగానే సమస్య తిరిగి వస్తున్నవారికి, డబ్ల్యూపీడబ్ల్యూ సిండ్రోమ్‌ గలవారికి, రిఫ్రాక్టరీ ఏట్రియల్‌ టెకీ కార్డియా, ఏట్రియల్‌ ఫ్లట్టర్‌ గలవారికి అబ్లేషన్‌ తప్పనిసరి. చికిత్స అనంతరం పిల్లలు అందరిలాగానే హాయిగా గడపొచ్చు. ఆటలాడొచ్చు, వ్యాయామం చేయొచ్చు, సైకిల్‌ తొక్కొచ్చు, కొండలు ఎక్కొచ్చు. ఎలాంటి ఇబ్బందీ ఉండదు.


ఒక్కొక్కరిలో ఒక్కోలా

పిల్లల్లో అరీత్మియా ఎప్పుడైనా రావొచ్చు. తల్లి కడుపులో ఉండగానే రావొచ్చు. పుట్టిన వెంటనే రావొచ్చు. శిశువుల్లో, చిన్నారుల్లో, పెద్ద పిల్లల్లో ఎవరికైనా రావొచ్చు. పెద్ద పిల్లలైతే ‘గుండె వేగంగా కొట్టుకుంటోంది, అదురుతోంది. తల తిరుగుతున్నట్టు, తేలి పోతున్నట్టు, స్పృహ కోల్పోతున్నట్టు అనిపిస్తోంది’ అని చెప్పగలరు. కానీ శిశువులు, చిన్నారులు చెప్పలేరు. పిండస్థ దశలోనూ పైకేమీ తెలియదు. కాబట్టి జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది.

గర్భస్థ శిశువులో

పిండంలో గుండె వేగం నిమిషానికి 220 కన్నా పెరిగితే టెకీ అరీత్మియా అంటారు. దీంతో గుండె చుట్టూ, కడుపులో, ఛాతీలో నీరు చేరుతుంది. బిడ్డ మొత్తం ఉబ్బిపోవచ్చు. ఫలితంగా కదలికలు తగ్గొచ్చు (హైడ్రాప్స్‌ ఫిటాలిస్‌). సమస్యను గుర్తించి, చికిత్స చేయకపోతే బిడ్డ కడుపులోనే చనిపోయే ప్రమాదముంది. అల్ట్రాసౌండ్‌ పరీక్షతో దీన్ని గుర్తించొచ్చు.
చికిత్స: తల్లికి నోటి ద్వారా డిగాక్సిన్‌, సొటలాల్‌, ఫ్లెకనైడ్‌ వంటి మాత్రలు ఇస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. కొన్నిసార్లు తల్లి కడుపు మీది నుంచి సూది ద్వారా బిడ్డ తొడకు ఇంజెక్షన్‌ ఇవ్వాల్సి రావొచ్చు. దీంతో కొద్ది గంటల్లోనే గుండె వేగం అదుపులోకి వస్తుంది. బిడ్డ ఒంట్లో ద్రవాల మోతాదు తగ్గుతుంది. ఈలోపు తల్లి తీసుకున్న మందుల ప్రభావమూ మొదలవుతుంది. కాన్పు సజావుగా అవటానికి అవకాశముంది. 

నవజాత శిశువుల్లో

పుట్టిన తర్వాత నెలలోపు పిల్లల్లో గుండె వేగం పెరిగితే పాలు తాగరు. ఆయాస పడతారు. డొక్కలు ఎగరేస్తారు. శిశువు ఛాతీ మీద చేయి పెడితే గుండె వేగంగా కొట్టుకోవటం కనిపిస్తుంది. వీరికి వెంటనే చికిత్స చేస్తే త్వరగా కుదురుకుంటారు. అయితే తల్లిదండ్రులకు సమస్య గురించి తెలియక పోవటం వల్ల చాలామంది గుండె బాగా దెబ్బతిన్నాక ఆసుపత్రికి తీసుకొస్తుంటారు. ఇది ప్రమాదకరం. చికిత్స ఆలస్యమైతే కొన్నిసార్లు గుండె స్తంభించొచ్చు, గుండె పనితీరు మందగించొచ్చు. కాబట్టి బిడ్డ పాలు తాగకపోవటం, ఆయాస పడటం వంటివి గమనిస్తే ఒకసారి ఛాతీ మీద చేయి పెట్టి గుండె వేగాన్ని పరిశీలించటం ముఖ్యం. ఏదైనా అనుమానం వస్తే వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలి. ఈసీజీ తీస్తే సమస్య బయటపడుతుంది.

చికిత్స: శిశువుల్లో అరీత్మియాకు అడినోసిన్‌ ఇంజెక్షన్‌, ప్రొప్రనోలాల్‌ మాత్రలు ఉపయోగపడతాయి. దాదాపు 80% మందికి ఒక్క అడినోసిన్‌ ఇంజెక్షన్‌తోనే మంచి ఫలితం కనిపిస్తుంది. మందులతో ఫలితం కనిపించకపోతే గుండెకు స్వల్ప మోతాదులో విద్యుత్‌ షాక్‌ ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో అస్తవ్యస్తమైన గుండె విద్యుత్‌ వ్యవస్థ తిరిగి కుదురుకుంటుంది.

పెద్ద పిల్లల్లో

గుండె వేగం పెరిగితే పెద్ద పిల్లలు గుర్తించగలరు. గుండె టకటకా కొట్టుకుంటోందని చెబుతుంటారు. బడిలో పరుగెత్తి, విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు గుండె వేగంగా కొట్టుకుంటోందని, చాలాసేపటికి గానీ తగ్గటం లేదని అంటుంటారు. ఇంకాస్త పెద్ద పిల్లలైతే కళ్లు తిరుగుతున్నాయని, అప్పుడు గుండె వేగంగా కొట్టుకుంటోందని చెబుతుంటారు. ఒకోసారి సొమ్మసిల్లిపోవచ్చు. పరిస్థితి కుదురుకున్నాక కాసేపటికి తిరిగి స్పృహలోకి రావొచ్చు. కొందరిలో మెడ పక్కల రక్తనాళాలూ కొట్టుకోవచ్చు. అక్కడ చేయి పెట్టి చూస్తే తెలుస్తుంది కూడా. గుండె వేగంగా కొట్టుకున్న తర్వాత బాగా చెమట్లు పడతాయి. తీవ్ర నీరసం ముంచుకొస్తుంది.
నిర్ధరణ ఎలా?: గుండె వేగం నిమిషానికి 160 దాటితే లెక్కించటం అసాధ్యం. అందువల్ల మానిటర్‌ మీద పెట్టి ఈసీజీ తీయాల్సి ఉంటుంది. ఇందులో గుండె వేగంతో పాటు దానికి కారణమేంటనేదీ చూచాయగా తెలుస్తుంది. కొన్నిసార్లు ఈసీజీలోనూ ఆనవాళ్లు బయట పడకపోవచ్చు. ఇలాంటివారికి టీఎంటీ, హోల్టర్‌, ఈవెంట్‌ రికార్డర్‌ పరీక్షలతో సమస్యను నిర్ధరిస్తారు.
చికిత్స: వీరికి ఇంజెక్షన్‌ రూపంలో అడినోసిన్‌ మందు ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో చాలామందికి కొద్ది నిమిషాల్లోనే మంచి ఫలితం కనిపిస్తుంది. దీంతో పాటు ప్రొప్రనోలాల్‌ మాత్రలూ అవసర మవుతాయి. కొందరికి డిల్టియాజెమ్‌ ఇంజెక్షన్‌ అవసరమవుతుంది. ఈ మందులతో కుదురుకోకపోతే ఇతర చికిత్సలు చేయాల్సి ఉంటుంది. సృహలో ఉండి, రక్తపోటు నియంత్రణలో గలవారికి సెలైన్‌లో అమియోడోరాన్‌ ఇంజెక్షన్‌ కలిపి ఇస్తారు. దీంతో 2-8 గంటల్లో గుండె వేగం మామూలు స్థితికి వస్తుంది. ఒకవేళ పిల్లలు షాక్‌కు గురై, మాట్లాడలేని స్థితిలో ఉన్నట్టయితే వెంటనే గుండెకు డీసీ షాక్‌ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది గుండెలో గతి తప్పిన విద్యుత్తు వ్యవస్థను అణచివేస్తుంది. అప్పుడు సైనస్‌ నోడ్‌ పని చేయటం మొదలెట్టి, గుండె వేగం తగ్గుతుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని