కళ్లకు వయసు దెబ్బ !

మొదట్లో పెద్దగా మార్పులేవీ గమనించకపోవచ్చు. దగ్గరి వస్తువులు, పుస్తకంలో అక్షరాలు అస్పష్టంగా కనిపించొచ్చు. కంటికి కాస్త దూరంగా పెట్టుకొని చూడాల్సి రావొచ్చు. మిరుమిట్లు గొలిపే లైట్ల వెలుగు కళ్లకు అసౌకర్యం కలిగించొచ్చు

Updated : 05 Dec 2023 07:10 IST

మొదట్లో పెద్దగా మార్పులేవీ గమనించకపోవచ్చు. దగ్గరి వస్తువులు, పుస్తకంలో అక్షరాలు అస్పష్టంగా కనిపించొచ్చు. కంటికి కాస్త దూరంగా పెట్టుకొని చూడాల్సి రావొచ్చు. మిరుమిట్లు గొలిపే లైట్ల వెలుగు కళ్లకు అసౌకర్యం కలిగించొచ్చు. లేదూ మసక వెలుగులో చదవటం కష్టం కావొచ్చు. నల్లటివి అనుకొని నీలం రంగు సాక్సు ధరించొచ్చు. ఇవన్నీ వయసు మీద పడుతున్నకొద్దీ తలెత్తే కంటి సమస్యలకు నిదర్శనాలే. వృద్ధుల సంఖ్య పెరుగుతున్నకొద్దీ వీటితో బాధపడుతున్నవారూ ఎక్కువవుతున్నారు. అయినా కూడా తగు జాగ్రత్తలతో చూపును కాపాడుకోవచ్చు. తీవ్ర జబ్బులుగా మారకుండా చూసుకోవచ్చు. కాబట్టి వయసుతో పాటు ముంచుకొచ్చే కంటి సమస్యలు, లక్షణాలు, ముప్పు కారకాలు, చికిత్సల గురించి తెలుసుకొని ఉండటం మంచిది.

చత్వారం

దాదాపు అందరూ ఎదుర్కొనే సమస్య. చాలామందిలో 40 ఏళ్లు దాటగానే పలకరించేస్తుంది. అక్షరాల వంటివి దగ్గరి నుంచి సరిగా కనిపించవు. అల్లుకు పోయినట్టు కనిపిస్తాయి. దీంతో పుస్తకాలు, పత్రికలను కళ్లకు కాస్త దూరం పెట్టుకొని చదువుతుంటారు. చదవటం, దుస్తులు కుట్టటం వంటి పనులు చేశాక కళ్లు అలసి పోయినట్టు అనిపించొచ్చు. కొందరికి తలనొప్పిగానూ ఉండొచ్చు.

ఎందుకొస్తుంది?

దీనికి ప్రధాన కారణం వయసు మీద పడటమే. ఎవరికైనా రావొచ్చు. మన కళ్ల ముందు పారదర్శకమైన కటకం ఉంటుంది. వస్తువుల మీద దృష్టి కేంద్రీకృతం కావటానికి అనుగుణంగా వంగే ఇది కళ్ల వెనకాల రెటీనా మీద దృశ్యాలు ఏర్పడేలా చేస్తుంది. దీని సాగే గుణం మూలంగానే దూరం, దగ్గరి వస్తువులను చూడగలుగుతున్నాం. అయితే వయసు మీద పడుతున్నకొద్దీ కటకం గట్టిపడుతూ వస్తుంటుంది. నిజానికిది 20ల్లోనే మొదలవుతుంది. క్రమంగా 40 ఏళ్లు వచ్చేసరికి లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి. మధుమేహం, మల్టిపుల్‌ స్క్లెరోసిస్‌, గుండెజబ్బుల వంటివీ చత్వారం ముప్పు పెరిగేలా చేయొచ్చు. కుంగుబాటు, అలర్జీ మందులు.. మూత్రం ఎక్కువగా వచ్చేలా చేసే మందులూ మరింత ముందుగా దీన్ని తెచ్చిపెట్టొచ్చు.
చికిత్స: చత్వారానికి కళ్లద్దాలు వాడుకుంటే చాలు. మధుమేహం వంటి సమస్యలుంటే అదుపులో ఉంచుకోవాలి.


కళ్లు పొడిబారటం

కళ్లు ఎండిపోవటం, మంట, దురద, చూపు మసక బారటం, కాంతిని తట్టుకోలేకపోవటం, కళ్లు అలసిపోవటం.. ఇలాంటివన్నీ కళ్లు పొడిబారటానికి లక్షణాలే. ఇది వయసు మీరినవారిలో ఎక్కువ. మగవారిలో కన్నా మహిళల్లో మరింత అధికం. వృద్ధాప్యంతో పాటు కొన్నిరకాల మందులు, జబ్బులు, పర్యావరణ ప్రభావాల వంటివి దీనికి దోహదం చేస్తుంటాయి.

ఎందుకొస్తుంది?

కన్నీరు ఉత్పత్తి తగ్గటం ప్రధాన కారణం. మనం రెప్పలు ఆడించిన ప్రతిసారీ కంటి ఉపరితలం మీద కన్నీరు విస్తరిస్తుంది. ఇది కళ్లు తడిగా ఉండటానికి, ఇన్‌ఫెక్షన్‌ ముప్పు తగ్గటానికి, బయటి వస్తువులు పడితే బయటకు పంపటానికి, కంటి ఉపరితలం మృదువుగా, స్పష్టంగా ఉండటానికి తోడ్పడుతుంది. ఎక్కువగా ఉన్న కన్నీరు కను రెప్పల చివర్లోని మార్గాల ద్వారా ముక్కులోకి వచ్చేస్తుంది. తగినంత కన్నీరు ఉత్పత్తి కాకపోయినా, త్వరగా ఆవిరైనా కళ్లు పొడిబారటానికి దారితీస్తుంది. ఇందులో కన్నీటి నాణ్యత కూడా కీలక పాత్ర పోషిస్తుంది. కన్నీరు నూనె, నీరు, జిగురు.. ఇలా మూడు పొరలుగా ఉంటుంది. మృదువైన నూనె పొర కన్నీటి పొరను త్వరగా ఆవిరి కాకుండా చూస్తుంది. జిగురు పొర కంటి ఉపరితలం మీద సమానంగా విస్తరించటానికి తోడ్పడుతుంది. ఒకవేళ కన్నీరు త్వరగా ఆవిరి అయినా, సమానంగా విస్తరించకపోయినా సమస్యగా పరిణమిస్తుంది. వయసు మీద పడ్డవారిలో కన్నీటి ఉత్పత్తితో పాటు నాణ్యత కూడా తగ్గుతుంది.
చికిత్స: కృత్రిమ కన్నీటి చుక్కలు, కన్నీరు ఉత్పత్తిని పెంచే చుక్కల మందులు మేలు చేస్తాయి. గోరువెచ్చటి నీటిలో చేతి రుమాలును ముంచి, గట్టిగా పిండి.. దాన్ని కళ్ల మీద పెట్టుకున్నా మంచిదే. ఇది కళ్లు మండటం వంటి ఇబ్బందులను తగ్గిస్తుంది. చదువుతున్నప్పుడు, కంప్యూటర్‌ మీద పనిచేస్తున్నప్పుడు తరచూ రెప్పలు ఆడించటం.. ఇంట్లో, పనిచేసే చోట గాలిలో తేమ ఎక్కువగా ఉండేలా చేసుకోవటం.. ఒమేగా 3 కొవ్వు ఆమ్లాల మాత్రలు వేసుకోవటం.. తగినంత నీరు తాగటం.. కళ్లలోకి నేరుగా గాలి తాకకుండా చూసుకోవటం వంటి జీవనశైలి మార్పులూ ఉపయోగపడతాయి.


శుక్లాలు

వృద్ధుల్లో తరచూ కనిపించే జబ్బు. ఇది 75 ఏళ్లు వచ్చేసరికి దాదాపు సగం మందిలో కనిపి స్తుంటుంది. సమస్య చిన్నగా ఉన్నప్పుడు చూపు మీద పెద్దగా ప్రభావం చూపదు. కానీ తీవ్రమైతే చూపు మసకబారుతుంది. రాత్రిపూట సరిగా చూడలేకపోవచ్చు. మరీ ప్రకాశమైన లైట్లు కూడా ఇబ్బంది కలిగిస్తాయి. లైట్ల చుట్టూ కాంతి వలయం పెద్దగా కనిపిస్తుంది. కొందరికి రంగులూ సరిగా కనిపించకపోవచ్చు.

ఎందుకొస్తుంది?

శుక్లాలకు మూలం కంటి కటకం మబ్బుగా అవటం. వయసు మీద పడుతున్నకొద్దీ దీనిలో మార్పులు తలెత్తుతుంటాయి. మధుమేహం, అధిక రక్తపోటు వంటి కొన్ని జబ్బులూ కారణం కావొచ్చు. దీర్ఘకాలంగా స్టిరాయిడ్‌ మందుల వాడకంతోనూ రావొచ్చు. ఎండకు ఎక్కువగా గురికావటం, పొగ తాగటం, మద్యపానం, ఊబకాయంతోనూ ముప్పు పెరగొచ్చు. గతంలో కళ్లకు దెబ్బలు తగలటం, కంటికి శస్త్రచికిత్స చేయించుకోవటం వంటివీ శుక్లాలకు దారితీయొచ్చు.
చికిత్స: శుక్లాలను తొలగించే శస్త్రచికిత్స బాగా ఉపయోగపడుతుంది. ఇందులో మబ్బుగా అయిన కంటి కటకాన్ని తొలగించి, దాని స్థానంలో కృత్రిమ కటకాన్ని అమరుస్తారు.


డయాబెటిక్‌ రెటినోపతి

ఇది మధుమేహం మూలంగా వచ్చే జబ్బు. మధుమేహానికి చికిత్స తీసుకోనివారు, గ్లూకోజు అదుపులో లేనివారిలో  దీన్ని చూస్తుంటాం.
సాధారణంగా మొదట్లో ఎలాంటి లక్షణాలూ ఉండవు. కొందరిలో చదవటంలో ఇబ్బంది, దూరం వస్తువులను చూడలేకపోవటం వంటివి తలెత్తుతుంటాయి. ఈ లక్షణాలు వస్తూ, పోతుండొచ్చు కూడా. సమస్య తీవ్రమైతే కంటి ముందు నల్లటి మచ్చలు తేలుతున్నట్టు అనిపించొచ్చు. రాత్రిపూట చూడటం కష్టం కావొచ్చు.

చికిత్స: లేజర్‌ శస్త్రచికిత్సతో లీక్‌ అవుతున్న రక్తనాళాలను మూసేయటం, కంట్లోకి ఇంజెక్షన్లు ఇవ్వటం మేలు చేస్తాయి. అవసరమైతే శస్త్రచికిత్స చేస్తారు. ఇందులో కంటి గోడకు చిన్న రంధ్రం చేసి, పరికరం ద్వారా లోపల పేరుకున్న ద్రవాన్ని లాగేస్తారు. దెబ్బతిన్న రెటీనాను మరమ్మతు చేస్తారు. రెటీనా కదిలిపోతే దాన్ని కుదురుగా, స్థిరంగా ఉంచటానికి ప్రయత్నిస్తారు. సమస్య తీవ్రమైతే చూపు పోయే ప్రమాదముంది కాబట్టి మధుమేహం గలవారు తరచూ కంటి డాక్టర్‌ను సంప్రదించటం మంచిది.

ఎందుకొస్తుంది?

దీర్ఘకాలంగా రక్తంలో గ్లూకోజు ఎక్కువగా ఉండటం వల్ల రెటీనాలోని సూక్ష్మ రక్తనాళాలు దెబ్బతింటాయి. దీంతో ద్రవం, రక్తం కళ్లలోకి లీక్‌ అవుతాయి. దెబ్బతిన్న రక్తనాళాల స్థానంలో కొత్త రక్తనాళాలు పుట్టుకొస్తాయి. ఇవి సరిగా పనిచేయవు. ఈ కొత్త రక్తనాళాల్లోంచి ద్రవం, రక్తం తేలికగా లీక్‌ అయ్యే అవకాశముంది.


మాక్యులా క్షీణత

వృద్ధాప్యంలో వచ్చే మరో పెద్ద సమస్య మాక్యులా క్షీణత (ఏఎండీ). దీంతో క్రమంగా చూపు తగ్గుతుంది. ముఖ్యంగా మధ్యలోని దృశ్యాలు సరిగా కనిపించవు. ముఖాలను గుర్తించటంలో ఇబ్బంది పడొచ్చు. తిన్నటి రేఖలు వంగినట్టు కనిపించొచ్చు. చదవటం వంటి పనులు చేస్తున్నప్పుడు ఎక్కువ కాంతి అవసరమవుతుంది. అక్షరాల వంటివి మసకగా కనిపిస్తాయి. దృశ్యాలను చూస్తున్నప్పుడు మధ్యలో మసక మసకగా చుక్క లేదా ఖాళీ భాగం కనిపించొచ్చు. కొందరికి చూపు పూర్తిగా పోవచ్చు కూడా.

ఎందుకొస్తుంది?

మాక్యులా అనేది రెటీనా మధ్యలో గుండ్రంగా ఉండే మచ్చలాంటి భాగం. కంటికి ఎదురుగా ఉండే దృశ్యాలు స్పష్టంగా చూడటానికి తోడ్పడేది ఇదే. కొందరిలో ఇది క్షీణించొచ్చు. చాలావరకిది వృద్ధాప్యంతోనే ముడిపడి ఉంటుంది. కొందరికి వంశపారంపర్యంగానూ రావొచ్చు. పొగ తాగేవారికీ దీని ముప్పు ఎక్కువే. ఊబకాయులకు వచ్చే అవకాశమూ ఎక్కువేనని పరిశోధనలు చెబుతున్నాయి. అంతేకాదు.. వీరికి ఒకమాదిరి మాక్యులా క్షీణత మరింత తీవ్రస్థాయికీ చేరుకోవచ్చు. గుండె లేదా రక్తనాళాల సమస్యలు గలవారికీ ప్రమాదం పొంచి ఉండొచ్చు.
చికిత్స: దురదృష్టవశాత్తూ మాక్యులా క్షీణతను నయం చేసే చికిత్సేదీ లేదు. ఇంజెక్షన్లు, లేజర్‌ చికిత్స వంటివి సమస్య త్వరగా ముదరకుండా కాపాడతాయి. కొన్నిరకాల విటమిన్లు, ఖనిజాలు సైతం సమస్య తీవ్రం కాకుండా కాపాడుతున్నట్టు అధ్యయనాల్లో తేలింది. పాలకూర వంటి ఆకుకూరలు, చేపలు తినేవారిలో తీవ్ర ఏఎండీ తక్కువని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆకుకూరల్లోని ల్యూటీన్‌, జియాగ్జాంతీన్‌ చాలా మేలు చేస్తాయి.


నీటికాసులు

చూపును నెమ్మదిగా కొల్లగొట్టే సమస్య ఇది. తొలిదశలో ఎలాంటి లక్షణాలూ ఉండవు. కానీ సమస్య ముదురుతున్నకొద్దీ చుట్టుపక్కల నుంచి మధ్యలోకి చూపు కోల్పోతూ వస్తుంది. చుట్టుపక్కల చూపు పోవటం వల్ల గొట్టంలోంచి చూస్తున్నట్టు అనిపిస్తుంది. దీని గురించి తెలియకపోవటం వల్ల తీవ్రమయ్యేవరకూ చాలామందిలో నీటికాసులను గుర్తించలేకపోతున్నారు.

ఎందుకొస్తుంది?

నీటికాసులకు మూలం కంట్లో ఒత్తిడి (ఇంట్రాఆక్యులర్‌ ప్రెషర్‌) పెరగటం. ఇది దృశ్యనాడిని దెబ్బతీస్తుంది. ఫలితంగా చూపు తగ్గుతుంది. 55 ఏళ్లు పైబడినవారికి దీని ముప్పు ఎక్కువ. అప్పటికే కుటుంబంలో ఎవరికైనా నీటికాసులు వచ్చి ఉండటం.. మధుమేహం, అధిక రక్తపోటు, పార్శ్వనొప్పి, సికిల్‌ సెల్‌ అనీమియా వంటి జబ్బులు.. కంటికి దెబ్బలు తగలటం వంటివీ దీనికి కారణం కావొచ్చు.
చికిత్స: కంట్లో ఒత్తిడిని తగ్గించే చుక్కల మందులు, లేజర్‌ చికిత్సలు మేలు చేస్తాయి. దృశ్యనాడి మరింత దెబ్బతినకుండా కాపాడతాయి. వీటితో ఫలితం లేకపోతే శస్త్రచికిత్స అవసరమవుతుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని