వినికిడి లోపంతో చెవిలో మోత!

 కొందరికి చెవిలో నిరంతరం మోత వినిపిస్తుంటుంది (టినిటస్‌). దీనికి కచ్చితమైన కారణమేంటన్నది తెలియదు. సాధారణంగా అప్పటికే వినికిడి లోపం గలవారిలో చెవిలో మోత వినిపిస్తుంటుందని భావిస్తుంటారు. కానీ ప్రామాణిక వినికిడి పరీక్షల్లో రాణించినా కొందరిలో ఈ సమస్య కనిపిస్తుంటుంది.

Published : 05 Dec 2023 00:58 IST

 కొందరికి చెవిలో నిరంతరం మోత వినిపిస్తుంటుంది (టినిటస్‌). దీనికి కచ్చితమైన కారణమేంటన్నది తెలియదు. సాధారణంగా అప్పటికే వినికిడి లోపం గలవారిలో చెవిలో మోత వినిపిస్తుంటుందని భావిస్తుంటారు. కానీ ప్రామాణిక వినికిడి పరీక్షల్లో రాణించినా కొందరిలో ఈ సమస్య కనిపిస్తుంటుంది. పరీక్షల్లో శ్రవణనాడి లోపం బయటపడకపోవటమే.. అంటే అదృశ్య వినికిడి లోపం దీనికి కారణం కావొచ్చని భావిస్తున్నారు. దీన్ని మసాచుసెట్స్‌ ఐ అండ్‌ ఇయర్‌ ఇన్ఫర్మరీ తాజా అధ్యయనం మరింత బలపరుస్తోంది. చెవిలో మోతను కొన్నిసార్లు ఫాంటమ్‌ లింబ్‌ సిండ్రోమ్‌తో (కాళ్లు, చేతులు లేకపోయినా అక్కడ నొప్పి పుడుతున్న భావన కలగటం) పోలుస్తుంటారు. ఒకరకంగా దీన్ని ఫాంటమ్‌ సౌండ్‌ అనుకోవచ్చు. లోపించిన వినికిడిని భర్తీ చేసుకోవటానికి మెదడు తన పనితీరును పెంచుకునే ప్రయత్నంలో భాగంగా లేని చప్పుడును వింటున్న భావన కలిగిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. చెవిలో మోత అసలే లేనివారు, అప్పుడు మోత వినిపించేవారు, నిరంతరం మోత వినిపించేవారు.. ఇలా రకరకాల వ్యక్తులను ఎంచుకొని అధ్యయనం చేశారు. ప్యూర్‌ టోన్‌ పరీక్షలో అందరికీ వినికిడి మామూలుగానే ఉన్నట్టు బయటపడింది. కానీ లోపలి చెవిలో శ్రవణ నాడి లోపాన్ని గుర్తించే ఎలక్ట్రోడ్‌ పరీక్షకు తక్కువగా స్పందించటం గమనార్హం. అలాగే మస్తిష్క మూలంలో చురుకుదనమూ పెరిగింది. చెవిలో మోత గలవారు నిద్రలేమి, ఒంటరితనం, ఆందోళన, కుంగుబాటు వంటి సమస్యలకూ గురవుతుంటారు. ఇది పనిలో నైపుణ్యాన్ని, రోజువారీ జీవితాన్ని విపరీతంగా ప్రభావితం చేస్తుంది. అందువల్ల దీన్ని పూర్తిగా అర్థం చేసుకోగలిగితేనే చికిత్స సాధ్యం అవుతుంది. ఇందుకు తాజా అధ్యయనంతో ఒక ముందడుగు పడినట్టయ్యింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని