నిరోధక శక్తిపై ఒత్తిడి!

నమ్మినా నమ్మకపోయినా మానసిక ఒత్తిడంతా చెడ్డదేమీ కాదు. నిజానికి అప్పటికప్పుడు తలెత్తే ఒత్తిడి మనల్ని కాపాడుతుంది. అప్రమత్తంగా ఉంచుతుంది.

Published : 05 Dec 2023 01:12 IST

నమ్మినా నమ్మకపోయినా మానసిక ఒత్తిడంతా చెడ్డదేమీ కాదు. నిజానికి అప్పటికప్పుడు తలెత్తే ఒత్తిడి మనల్ని కాపాడుతుంది. అప్రమత్తంగా ఉంచుతుంది. ప్రమాదాల నుంచి బయటపడటానికి, లక్ష్యాలను చేరుకోవటానికి అవసరమైన శక్తిని అందిస్తుంది. కానీ దీర్ఘకాలంగా కొనసాగుతూ వస్తుంటేనే ఇబ్బంది. ఒత్తిడికి గురైనప్పుడు ఒంట్లో కార్టిజోల్‌ హార్మోన్‌ పెద్దఎత్తున పుట్టుకొస్తుంది. స్వల్పకాలంలో ఇది రోగనిరోధకశక్తిని ఉత్తేజితం చేసి వాపు ప్రక్రియ(ఇన్‌ఫ్లమేషన్‌)ను అదుపులో ఉంచుతుంది. అదే ఒత్తిడి దీర్ఘకాలం కొనసాగితే శరీరం క్రమంగా రక్తంలో అధికంగా ఉన్న కార్టిజోల్‌ మోతాదులకు అలవడుతుంది. ఇది కణాల్లో స్వల్పంగా వాపుప్రక్రియ ప్రేరేపితం కావటానికి దారులు తెరుస్తుంది. మరోవైపు దీర్ఘకాల ఒత్తిడి మూలంగా ఇన్‌ఫెక్షన్‌తో పోరాడే లింఫోసైట్స్‌ అనే తెల్ల రక్తకణాల మోతాదులు తగ్గుతాయి. సుదీర్ఘంగా వాపు ప్రక్రియ ఎక్కువ స్థాయిలో ఉంటూ వస్తుందంటే రోగనిరోధక వ్యవస్థ సక్రమంగా పనిచేయటం లేదనే అర్థం. ఇది అధిక బరువు, గుండె సమస్యలు, సోరియాసిస్‌, కీళ్లనొప్పులు, పేగు పూత వంటి రకరకాల జబ్బులకు దారితీస్తుంది. కాబట్టి దీర్ఘకాలంగా మానసిక ఒత్తిడితో బాధపడుతున్నట్టు గమనిస్తే వెంటనే చికిత్స తీసుకోవటం మంచిది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని