మధ్యవయసు ‘అనాసక్తి’

మహిళల్లో నెలసరి నిలవటం (మెనోపాజ్‌) రకరకాలుగా ప్రభావం చూపుతుంది. మధ్యవయసులో శృంగారం మీద ఆసక్తి తగ్గటానికి ఇదొక కారణం.

Published : 05 Dec 2023 01:17 IST

మహిళల్లో నెలసరి నిలవటం (మెనోపాజ్‌) రకరకాలుగా ప్రభావం చూపుతుంది. మధ్యవయసులో శృంగారం మీద ఆసక్తి తగ్గటానికి ఇదొక కారణం. రోజువారీ ఎదురయ్యే ఒత్తిళ్లూ శృంగారాసక్తిని దెబ్బతీస్తున్నాయని లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ హైజీన్‌ అండ్‌ ట్రాపికల్‌ మెడిసిన్‌, యూనివర్సిటీ ఆఫ్‌ గ్లాస్గో అధ్యయనంలో వెల్లడైంది. ఇందులో భాగంగా పరిశోధకులు 45 నుంచి 59 ఏళ్ల మధ్యలో ఉన్న మహిళలను ప్రశ్నించి, సమాచారాన్ని విశ్లేషించారు. శృంగారం మీద ఆసక్తి తగ్గటానికి, తక్కువగా శృంగారంలో పాల్గొనటానికి ప్రధాన కారణం ఉద్యోగం, పిల్లల పెంపకం, ఇంట్లో పెద్దవాళ్లను కనిపెట్టుకోవటం, ఆరోగ్య సమస్యలు, ఇంటి పనులన్నీ భుజాన వేసుకోవటం వంటి రోజువారీగా ఎదురయ్యే ఒత్తిళ్లేనని మహిళలు చెప్పటం గమనార్హం. సాధారణంగా మధ్యవయసులో తక్కువగా శృంగారంలో పాల్గొనటం సహజమేనని చాలామంది భావిస్తుంటారు. కానీ శృంగార తృప్తికి ఎన్నిసార్లు పాల్గొంటున్నామనేది ముఖ్యం కాదని పరిశోధకులు చెబుతున్నారు. భాగస్వాముల మధ్య సాన్నిహిత్యమే ఎక్కువ తృప్తిని కలిగిస్తుండటం విశేషం. తమకు భాగస్వామి అండగా ఉన్నారనే ధైర్యం ఇందులో కీలకపాత్ర పోషిస్తోందని పరిశోధకులు వివరిస్తున్నారు. కాబట్టి పని ఒత్తిళ్లతో సతమతమవుతున్నప్పుడు, వాటి నుంచి బయటపడటం కష్టంగా అనిపిస్తున్నప్పుడు మానసిక నిపుణుల సహాయం తీసుకోవటం మంచిదని సూచిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని