పడితే ప్రమాదమే!

మన శరీర భవనానికి పునాది తుంటే. వెన్నెముక, అవయవాల వంటివి స్థిరంగా ఉండటానికి ఇదే ఆధారం. మనం నడవటం, గెంతటం, పరుగెత్తటం వంటివన్నీ తేలికగా చేస్తున్నామంటే అంతా దీని కీళ్ల చలవే.

Updated : 12 Dec 2023 07:14 IST


మనదగ్గర 65 ఏళ్లు పైబడ్డవారిలో 30% మంది కింద పడిపోయి గాయాల  పాలవుతున్నారు. వీరిలో 10-15% మంది తుంటి విరగటం మూలంగా బాధపడుతున్నారు.

మన శరీర భవనానికి పునాది తుంటే. వెన్నెముక, అవయవాల వంటివి స్థిరంగా ఉండటానికి ఇదే ఆధారం. మనం నడవటం, గెంతటం, పరుగెత్తటం వంటివన్నీ తేలికగా చేస్తున్నామంటే అంతా దీని కీళ్ల చలవే. ఇవి బంతి-గిన్నె మాదిరిగా ఒకదానిలోకి మరోటి ఒదిగి పోయి రకరకాల దిశల్లో కదులుతాయి. నిల్చున్నప్పుడు, కూర్చున్నప్పుడు శరీర బరువును మోస్తుంటాయి. ఇలా నిరంతరం శ్రమించటం వల్ల వయసు మీద పడుతున్నకొద్దీ తుంటి కీళ్లు దెబ్బతినే ప్రమాదమూ ఎక్కువే. చిన్న గాయాలూ పెను శాపంగా పరిణమిస్తాయి. ఇటీవల బాత్రూమ్‌లోనో, ఇంట్లోనో జారిపడటం, తుంటి ఎముక విరగటం పెద్ద సమస్యగా మారుతోంది. దీన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేయటానికి లేదు. చికిత్స ఆలస్యమైతే మంచానికే పరిమితమయ్యే ప్రమాదముంది. వీపులో పుండ్లు పడటం, కాళ్లలో రక్తం గడ్డల వంటివి ప్రాణాంతకంగానూ పరిణమించొచ్చు. కాబట్టి తుంటి విరగటానికి కారణాలు, చికిత్సల ప్రాధాన్యం గురించి తెలుసుకొని ఉండటం మంచిది. అసలు పరిస్థితి అంతవరకూ రాకుండా ముందు నుంచే జాగ్రత్త పడటం ఇంకా ఉత్తమం.

తుంటి విరిగితే జీవితమే కుప్పకూలుతుంది. పైకి లేవటమే కష్టమైపోతుంది. ఎందుకంటే తుంటి ఎముక అతుక్కోవటం కష్టం మరి. నిజానికి ఎముకకు తనకు తానే అతుక్కునే గుణముంటుంది. విరిగిన ముక్కలను దగ్గరకు చేర్చి, కదలకుండా కట్టు కడితే వాటంతటవే అతుక్కుంటాయి. కానీ తుంటి ఎముక అలా కాదు. శరీరాన్ని మోసేది కావటం వల్ల దీన్ని కదలకుండా ఉంచటం కష్టం. దీని పైభాగం వంపు తిరిగి ఉంటుంది. ఇది రకరకాల దిశల్లో కదులుతుంది. కాబట్టి విరిగిన ముక్కలను కలిపి ఉంచటం పెద్ద సమస్య. ఒకవేళ కలిపి ఉంచినా అతికే అవకాశం అంతంతే. తుంటి కీలుకు రక్త ప్రసరణ తక్కువ. మరోవైపు కీలులోని ద్రవమూ అక్కడికి వచ్చి చేరుతుంటుంది. ఇవన్నీ అతక్కుండా చేస్తాయి. కాబట్టి దీనికి సత్వరం సరైన చికిత్స అవసరం. లేకపోతే పూర్తిగా మంచానికే పరిమితం కావొచ్చు. అనతికాలంలోనే ప్రాణాపాయమూ సంభవించొచ్చు. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఒకప్పుడు తుంటి విరిగితే ఇక అంతే అనుకునేవారు. అదృష్టం కొద్దీ ఇప్పుడు తుంటి కీలు మార్పిడి వంటి అధునాతన శస్త్రచికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. ఇవి మర్నాటి నుంచే లేచి నిల్చొని, నడిచేలా చేస్తున్నాయి. ఎంతోమంది ప్రాణాలు కాపాడుతున్నాయి. కాకపోతే వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లి, చికిత్స చేయించటమే కీలకం.


బాత్రూమ్‌లో పడటమే ఎక్కువ

వృద్ధుల్లో చాలావరకు బంతి కీలు వద్ద (నెక్‌ ఆఫ్‌ ఫీమర్‌) ఎముక విరుగుతుంటుంది. కొందరికి దీనికి కాస్త కింద విరగొచ్చు (ఇంటర్‌ట్రొకాంటెరిక్‌ ఫ్రాక్చర్‌). చాలామంది కింద పడితేనే తుంటి విరుగుతుందని భావిస్తుంటారు. కానీ ముందు తుంటి విరిగి, తర్వాత కూలబడే అవకాశమూ ఉంది. వృద్ధుల్లో ఎముకలు గుల్లబారటం (ఆస్టియోపోరోసిస్‌) దీనికి కారణం. వీరిలో ఎముక చాలా బలహీనంగా అవుతుంది. ఉన్నట్టుండి పక్కలకు తిరిగినప్పుడో, తూలినప్పుడో తుంటిలో బలహీనంగా ఉండే భాగం పుటుక్కున విరిగిపోవచ్చు. కొద్దిగా పక్కలకు తిరిగినా.. కాస్త ముందుకు తూలినా, బాత్రూమ్‌లో కాలు జారినా ప్రమాదమే. నిజానికి చాలామందికి బాత్రూమ్‌లో పడిపోవటం మూలంగానే తుంటి విరుగుతుంటుంది. అదీ అర్ధరాత్రుల్లోనే ఎక్కువగా చూస్తుంటాం. దీనికి రకరకాల అంశాలు కారణమవుతుంటాయి.

 •  వృద్ధాప్యంలో కొందరు రాత్రిపూట తరచూ మూత్ర విసర్జనకు లేస్తుంటారు. కొందరు మూత్రం అసలే ఆపుకోలేకపోవచ్చు. నిద్రలోంచి హఠాత్తుగా లేచి, నిల్చున్నప్పుడు కొన్నిసార్లు రక్తపోటు పడిపోవచ్చు. దీంతో బాత్రూమ్‌కు వెళ్లేటప్పుడో, వెళ్లిన తర్వాతో కింద పడిపోవచ్చు.
 •  వృద్ధులు అధిక రక్తపోటు, మధుమేహం, నిద్రలేమి, కుంగుబాటు వంటి సమస్యలకు రకరకాల మందులు వాడుతుంటారు. వీటితోనూ తూలటం, తలతిరగటం వంటి దుష్ప్రభావాలు తలెత్తొచ్చు. ఫలితంగా కింద పడిపోవచ్చు.  
 •  పార్కిన్సన్స్‌ వంటి నాడీ సమస్యలు గలవారిలో కదలికలు సరిగా సాగక కింద పడే ప్రమాదముంది. గుండెజబ్బులు, గుండె లయ అస్తవ్యస్తం కావటం వంటి సమస్యలు గలవారు ఉన్నట్టుండి కళ్లు తిరిగి, కింద పడొచ్చు.
 •  చూపు మందగించటమూ కారణమే. గ్లకోమా, శుక్లాల వంటి సమస్యలతో కళ్లు సరిగా కనిపించక ఎంతోమంది కింద పడుతుంటారు.
 •  అతిగా మద్యం తాగటమూ ప్రమాదమే. మద్యం మత్తులో చాలామంది రాత్రిపూట బాత్రూమ్‌లో పడిపోవటం చూస్తుంటాం.
 •  బాత్రూమ్‌లో గచ్చు తడిగా ఉండటం వల్ల కాలు జారొచ్చు. డోర్‌మ్యాట్‌లు జారటమూ కారణం కావొచ్చు.
 •  వయసు మీద పడుతున్నకొద్దీ కండరాలు బలహీనమవుతాయి. దీంతో నడక మారుతుంది. పాదాలకు పట్టుతప్పుతుంది. మరోవైపు మోకీళ్లు అరగటం వల్ల నడిచే తీరూ మారుతుంది. ఒక పక్కకు వంగిపోయి నడుస్తుంటారు. ఇవీ కింద పడటానికి దారితీస్తాయి. వృద్ధుల్లో చాలామందికి విటమిన్‌ డి, క్యాల్షియం లోపం ఉంటుంది. ఫలితంగా ఎముకలు బలహీనమై త్వరగా విరిగే అవకాశముంది. దీర్ఘకాలంగా స్టిరాయిడ్స్‌ వాడేవారికీ ఎముక విరిగే ముప్పు పెరుగుతుంది.
 •  పొగతాగే అలవాటు గలవారిలో రక్తనాళాల లోపలి మార్గం సన్నబడుతుది. దీంతో పోషకాలు అందక ఎముక బలహీనపడుతుంది. దీంతో తేలికగా విరిగే ప్రమాదముంది.

  లక్షణాలు ఇవీ..

 •  కింది నుంచి పైకి లేవలేకపోవటం, ఏమాత్రం నడవలేక పోవటం.
 • తుంటి భాగంలో లేదా గజ్జల్లో విపరీతమైన నొప్పి.
 •  గాయమైన వైపున కాలి మీద బరువు వేయలేకపోవటం.
 •  కాలు కురచగా అవటం, బయటి వైపునకు తిరగటం.
 •  తుంటి చుట్టూరా కమలటం, వాపు తలెత్తటం.

- ఇలాంటి లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం తాత్సారం చేయరాదు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలి. అయితే తుంటి విరిగినవారిని ఎలా పడితే అలా ఎత్తకూడదు. నడుం దగ్గర చేయి వేసి ఎత్తి పట్టుకోవాలి. స్ట్రెచర్‌ మీద పడుకోబెట్టి, ఆసుపత్రికి తరలించాలి. తుంటి భాగానికి దెబ్బతగిలిన చోట ఎక్స్‌రే, సీటీస్కాన్‌ తీస్తే సమస్య బయటపడుతుంది. విరిగిన చోటును బట్టి చికిత్స ఆధారపడి ఉంటుంది.


మణికట్టు, వెన్నెముక కూడా..

కింద పడితే తుంటే కాదు.. చేయి మీద బరువు మోపటం వల్ల మణికట్టూ విరగొచ్చు. కింద కూల బడ్డప్పుడు వెన్నెముక మీద ఒత్తిడి పడి, వెన్నుపూసలూ విరగొచ్చు. కొందరికి తలకూ దెబ్బలు తగలొచ్చు. మెదడులో రక్తస్రావమై కోమాలోకి వెళ్లిపోవచ్చు. మణికట్టు విరిగితే వైర్లు లేదా ప్లేటు, స్క్రూలతో సరిచేస్తారు. అవసరమైతే సిమెంట్‌ పట్టీ కూడా వేస్తారు. వెన్నెముక విరిగితే రాడ్లు, స్క్రూలతో బిగిస్తారు.


శస్త్రచికిత్స తప్పనిసరి

తుంటి ఎముక విరిగితే శస్త్రచికిత్స చేసి సరి చేయటం తప్పనిసరి. బంతి కీలు సమీపంలో విరిగితే అతుక్కోవటం దాదాపు అసాధ్యం. ఎముక మధ్యలోని రక్తనాళాలు తెగిపోతే.. బంతి చివరి వరకు రక్త సరఫరా అవదు. అది క్రమేమీ కుళ్లిపోతుంది.  కాబట్టి దాన్ని తొలగించి, కృత్రిమ కీలును అమర్చాల్సి ఉంటుంది. కొందరికి విరిగిన బంతిని తొలగించి కొత్త బంతిని బిగించాల్సి (హెమీఆర్థ్రోప్లాస్టీ హిప్‌) రావొచ్చు. అవసరమైతే కొందరికి బంతి, గిన్నె రెండూ మార్చాల్సి రావొచ్చు (టోటల్‌ హిప్‌ రిప్లేస్‌మెంట్‌). వీటిల్లో ఏదైనా మంచిదే గానీ మనదగ్గర ఎక్కువగా బంతినే మారుస్తుంటారు. కృత్రిమ బంతికి దిగువన చిన్న కాండం లాంటి భాగం ఉంటుంది. దీన్ని తొడ ఎముకలో పెట్టి, సిమెంటుతో అతికిస్తారు. దీంతో అది కదలకుండా స్థిరంగా ఉంటుంది. కాబట్టి అమర్చిన మర్నాటి నుంచే వాకర్‌ సాయంతో నిల్చోబెట్టి, అడుగులు వేయించొచ్చు. నాలుగైదు వారాల్లో కర్ర సాయంతో.. తర్వాత నెమ్మదిగా సొంతంగా నడవొచ్చు. ఇప్పుడు బైపోలార్‌ రకం కృత్రిమ బంతులు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో రెండు కీళ్లుంటాయి. ఇవి ఒకదాంట్లో మరోటి కుదురుకొని కదులుతుండటం వల్ల రాసుకోవు. కనీసం 15-20 ఏళ్ల వరకు ఎలాంటి ఇబ్బందీ ఉండదు. ఒకవేళ అది వదులైనా, తిరిగి కిందపడితే బంతి ఊడినా, గిన్నె కూడా అరిగినా రెండోసారి శస్త్ర,చికిత్స అవసరమవుతుంది. కాకపోతే ఇది అరుదు.
బంతికి కాస్త కింది భాగాన విరిగితే డైనమిక్‌ హిప్‌ స్క్రూ (డీహెచ్‌ఎస్‌) పద్ధతి ఉపయోగపడుతుంది. విరిగిన చోట ప్లేటు, స్క్రూలతో బిగించటం ఇందులో కీలకాంశం. దీంతో ముక్కలు కదలకుండా ఉంటాయి. ఎముక త్వరగా అతుక్కుంటుంది. ప్లేటు, స్క్రూలు బిగించిన మర్నాడే మంచం మీదో, వీల్‌ ఛైర్‌లోనో కూర్చోబెడతారు. ఎముక అతుక్కునేంతవరకు వేచి చూసి, వాకర్‌తో నడిపిస్తారు. పూర్తిగా కుదురుకొని, సొంతంగా నడిచేందుకు 3 నెలలు పడుతుంది. బంతి కీలు కింద విరిగినవారికి ప్రాక్సిమల్‌ ఫెమోరల్‌ నెయిల్‌(పీఎఫ్‌ఎన్‌)తోనూ చికిత్స చేయొచ్చు. ఇందులో రాడ్‌, స్క్రూలతో బిగించి, ఎముకను కదలకుండా చూస్తారు. రాడ్‌ వేసినవారిని పట్టు బాగానే ఉంటే మర్నాటి నుంచే నిల్చోబెట్టి, నడిపిస్తారు. వీరు సొంతంగా నడవటానికి సాధారణంగా ఆరు వారాలు పడుతుంది.


జాగ్రత్తలు అవసరం

బంతికీలు అమర్చుకున్నవారు నడవొచ్చు. మెట్లు ఎక్కొచ్చు. కానీ నేల మీద కూర్చోవద్దు. బాసింపట్టు వేసుకొని కూర్చోవద్దు. బాత్రూమ్‌లో ఎత్తు కుండీ ఉపయోగించాలి. రాడ్‌, ప్లేటు, స్క్రూ బిగించుకున్నవారైతే మామూలుగానే అన్ని పనులు చేసుకోవచ్చు.


నిర్లక్ష్యం చేస్తే అంతే..

తుంటి విరిగినప్పుడు ఆలస్యం చేయకుండా ఆసుపత్రికి తీసుకెళ్లటం చాలా ముఖ్యం. శస్త్రచికిత్స చేస్తే త్వరగా కోలుకుంటారు. లేకపోతే మంచం మీది నుంచి లేవలేక, ఏడాదిలోనే కాలం చేయొచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. ఎందుకంటే ఎక్కువ రోజులు మంచం మీద పడుకుంటే వీపు, పిరుదుల మీద పుండ్లు పడొచ్చు. కదలకుండా ఉండటం వల్ల కాళ్లలో రక్తం గడ్డలు ఏర్పడి, అవి ఊపిరితిత్తులకు చేరుకొని ప్రాణాపాయం సంభవించొచ్చు. మూత్రం రావొచ్చనే భావనతో తగినంత నీరు తాగకపోవటం వల్ల మూత్ర ఇన్‌ఫెక్షన్లు రావొచ్చు. ఒంట్లో సోడియం, పొటాషియం వంటి ఖనిజ లవణాల మోతాదులూ అస్తవ్యస్తం కావొచ్చు. రక్తంలో క్రియాటినిన్‌ పెరగొచ్చు. ఇవన్నీ ప్రాణాపాయాన్ని తెచ్చిపెట్టేవే. అందుకే తుంటి ఎముక విరగటాన్ని శరీరం పూర్తిగా చేతులెత్తేసిందనే అర్థంలో ఆంగ్లంలో ‘ఫైనల్‌ స్ట్రా’ అనీ వర్ణిస్తుంటారు. అంతానికి ముందు దశగా భావిస్తారు. కాబట్టి వృద్ధులైనా కూడా వీలైనంత త్వరగా శస్త్రచికిత్స చేసి సరిచేయటమే మంచిది.


నివారించుకోవచ్చా?

తుంటి ఎముక విరిగిన తర్వాత బాధపడటం కన్నా తగు జాగ్రత్తలతో ముందుగానే నివారించుకోవటం ఉత్తమం.

 •  చూపు బాగుండేలా చూసుకోవాలి. తరచూ కంటి పరీక్ష చేయించుకోవాలి. కళ్లద్దాలు వాడేవారు విధిగా ధరించాలి. శుక్లాలుంటే సర్జరీ చేసుకోవాలి.
 •  పడకగదిలో, బాత్రూమ్‌లో తగినంత వెలుతురు ఉండేలా చూసుకోవాలి. బాత్రూమ్‌కు వెళ్లే దారి కూడా చక్కగా కనిపించేలా లైట్లు వేసుకోవాలి. అత్యవసర పరిస్థితుల్లో ఇంట్లో వాళ్లను అప్రమత్తం చేయటానికి బాత్రూమ్‌లో కాలింగ్‌ బెల్‌ అమర్చుకోవాలి. గోడకు కడ్డీలు బిగించుకోవాలి. వీటిని పట్టుకొనే నడవాలి. మల విసర్జనకు ఎత్తుగా ఉండే వెస్ట్రన్‌ కుండీ వాడుకోవాలి.
 •  వృద్ధులు హఠాత్తుగా లేచి నిల్చోవద్దు. మంచం మీది నుంచో, కుర్చీలోంచో లేచేటప్పుడు నిదానంగా లేవాలి. తల వెనక్కి తిప్పటం, పైకి ఎత్తటం మెల్లగా చేయాలి.
 •  నడిచేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. పరిసరాలను గమనిస్తూ, నెమ్మదిగా నడవాలి. వేగంగా పక్కలకు తిరగొద్దు. దన్నుగా చేతి కర్ర వాడుకోవటానికి నామోషీ వద్దు.
 •  జారిపోయే చెప్పులు వేసుకోద్దు. అడుగున మంచి గ్రిప్‌ ఉన్నవి, పాదాలను పట్టుకొనే పట్టీలున్నవే ఎంచుకోవాలి. ఇంట్లో తివాచీలు ఉన్నట్టయితే వాటి చివర్లు పైకి లేవకుండా చూసుకోవాలి.

  ఎముక గుల్లబారకుండా..

ఎముక బలంగా ఉంటే చాలావరకు విరగకుండా చూసుకోవచ్చు. ఒకవేళ విరిగినా అంత తీవ్రం కాకపోవచ్చు. కానీ మనదగ్గర ఎముక గుల్లబారటాన్ని పెద్దగా పట్టించుకోరు. ఇదే చాలామందిలో చిక్కులు తెచ్చిపెడుతోంది. దీని నివారణకు విటమిన్‌ డి వాడుకోవాలి. వారానికి 60,000 ఐయూ మోతాదులో కనీసం 8 వారాలు వేసుకోవాలి. ఆ తర్వాత నెలకు ఒకటి వాడుకుంటే చాలు. క్యాల్షియం రోజుకు ఒక గ్రాము చొప్పున వేసుకోవాలి. ఆహారంలో క్యాల్షియం, విటమిన్‌ డి లభించే పదార్థాలు తీసుకోవాలి. రోజుకు 2 గ్లాసుల పాలు తాగాలి. గుడ్లు, చేపలు, బాదం, అక్రోట్లు, ఆకు కూరలు తినాలి. రోజూ శరీరానికి గంటసేపు ఎండ తగిలేలా చూసుకోవాలి. శారీరక శ్రమ, వ్యాయామం చేయాలి. వయసు మీరిన వారైతే తక్కువ ప్రభావం చూపే వ్యాయామాలు చేయాలి. ఒకట్రెండు కిలోల బరువు గల డంబెల్స్‌ ఎత్తటం, కుర్చీని పట్టుకొని ఒక కాలు మీద బరువు మోపటం వంటివి చేయాలి.  

 • ఎముక గుల్లబారితే చికిత్స తీసుకోవాలి. డెక్సా స్కాన్‌తో ఎముక గుల్లబారటాన్ని నిర్ధరిస్తారు. దీని స్కోర్‌ మైనస్‌ 2.5 కన్నా తక్కువుంటే ఎముకలు గుల్లబారినట్టే. వీరికి జోలిడ్రోనిక్‌ ఇంజెక్షన్లు ఉపయోగపడతాయి. వీటిని ఏడాదికి ఒకటి చొప్పున 3-5 ఏళ్లు తీసుకోవాలి. ఇది ఎముక క్షీణించకుండా అడ్డుకుంటుంది. చిన్న సూదులతో కూడిన టెరీపారటైడ్‌ ఇంజెక్షన్లూ అందుబాటులో ఉన్నాయి. వీటిని ఇన్సులిన్‌ ఇంజెక్షన్ల మాదిరిగానే ఎవరికివారే తీసుకోవచ్చు. వీటిని రోజూ 12-18 నెలలు తీసుకోవాలి. ఇవి కొత్త ఎముక ఏర్పడటానికి తోడ్పడతాయి. కొత్తగా డెనుసుమాబ్‌ అనే ఇంజెక్షన్‌ అందుబాటులోకి వచ్చింది. దీన్ని ఆర్నెల్లకోసారి తీసుకుంటే సరిపోతుంది. వీటిల్లో ఏదో ఒకటి వాడుకోవచ్చు. వెన్నెముక బలహీనంగా ఉన్నవారికి ముక్కులోకి కొట్టుకొనే కాల్సిటోనిన్‌ స్ప్రే మందూ అందుబాటులో ఉంది.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు