హైబీపీ దాంపత్యం!

దంపతుల్లో ఒకరికి అధిక రక్తపోటుందా? అయితే మరొకరూ జాగ్రత్తగా ఉండాల్సిందే. భార్యకు అధిక రక్తపోటుంటే భర్తకు, అలాగే భర్తకు హైబీపీ ఉంటే భార్యకు వచ్చే అవకాశముందని అమెరికన్‌ హార్ట్‌ అసోసియేషన్‌ పత్రికలో ప్రచురితమైన అధ్యయనం పేర్కొంటోంది.

Published : 12 Dec 2023 01:12 IST

దంపతుల్లో ఒకరికి అధిక రక్తపోటుందా? అయితే మరొకరూ జాగ్రత్తగా ఉండాల్సిందే. భార్యకు అధిక రక్తపోటుంటే భర్తకు, అలాగే భర్తకు హైబీపీ ఉంటే భార్యకు వచ్చే అవకాశముందని అమెరికన్‌ హార్ట్‌ అసోసియేషన్‌ పత్రికలో ప్రచురితమైన అధ్యయనం పేర్కొంటోంది. మధ్యవయసులో, వృద్ధాప్యంలో అధిక రక్తపోటు తరచూ చూసే సమస్యే. అయితే చాలామంది దంపతుల్లో భార్యాభర్తలిద్దరికీ అధిక రక్తపోటు ఉండటం ఆశ్చర్యకరమని పరిశోధకులు చెబుతున్నారు. భారత్‌లో 50 ఏళ్లు పైబడిన 20% దంపతుల్లో ఇద్దరికీ హైబీపీ ఉంటున్నట్టు తేలింది. అమెరికా, ఇంగ్లాండ్‌, చైనాలోనూ ఇలాంటి ధోరణే కనిపిస్తుండటం విచిత్రం. మనదేశంలో అధిక రక్తపోటు లేనివారిని పెళ్లి చేసుకున్న మహిళలతో పోలిస్తే, ఈ సమస్య గలవారిని వివాహమాడిన మహిళలకు హైబీపీ వచ్చే అవకాశం 19% ఎక్కువగా ఉంటున్నట్టూ బయటపడింది. మగవారి విషయంలోనూ ఇలాగే జరుగుతుండటం గమనార్హం. ఆరోగ్యం విషయంలో దంపతులు పరస్పర ప్రభావాన్ని చూపిస్తున్నట్టు ఇది చెప్పకనే చెబుతోంది. భార్యాభర్తలు ఒకరి మీద మరొకరు ఆధారపడటం, భావోద్వేగ బంధాలతో ముడిపడి ఉండటం, ఇష్టాయిష్టాలు, పరిసరాలు, జీవనశైలి అలవాట్ల వంటివన్నీ ఆరోగ్యం మీద గణనీయమైన ప్రభావాన్ని చూపుతున్నాయని పరిశోధకులు భావిస్తున్నారు. అధిక రక్తపోటు నిర్ధరణ, చికిత్సల విషయంలో దంపతులిద్దరినీ పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరముందని అధ్యయన ఫలితాలు గట్టిగా సూచిస్తున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని