కిడ్నీలకు గడ్డల గండం!

కొన్ని సమస్యలకు చింతించాల్సిన పనిలేదు. కొన్నింటిని అసలు నిర్లక్ష్యం చేయటానికే లేదు. కిడ్నీ తిత్తులు, గడ్డలు ఇలాంటివే. మూత్రపిండాల్లో నీటి తిత్తులు (సిస్టులు) మొలవటం పెద్ద సమస్యేమీ కాదు.

Updated : 19 Dec 2023 07:11 IST

కొన్ని సమస్యలకు చింతించాల్సిన పనిలేదు. కొన్నింటిని అసలు నిర్లక్ష్యం చేయటానికే లేదు. కిడ్నీ తిత్తులు, గడ్డలు ఇలాంటివే. మూత్రపిండాల్లో నీటి తిత్తులు (సిస్టులు) మొలవటం పెద్ద సమస్యేమీ కాదు. పెద్దగా అయ్యి, ఇబ్బంది పెడితే తప్ప చికిత్స కూడా అవసరం లేదు. కానీ గడ్డల్లాంటి కణితుల విషయంలో అజాగ్రత్త పనికిరాదు. ఇవన్నీ మామూలువి కాకపోవచ్చు. నీటి తిత్తుల్లో ద్రవమే ఉంటుంది. అదే గడ్డలైతే గట్టి కణజాలంతో కూడుకొని ఉంటాయి. యాదృచ్ఛికంగా గుర్తించినా, అనుమానించి పట్టుకున్నా కొన్నింటికి సత్వర చికిత్స అవసరం. కాబట్టి కిడ్నీల్లో తలెత్తే తిత్తులు, గడ్డల మీద అవగాహన కలిగుండటం మంచిది.

కిడ్నీలు కీలక అవయవాలు. ఇవి నిరంతరం రక్తాన్ని శుద్ధి చేస్తూ, వ్యర్థాలను వడగడతాయి. మూత్రం ద్వారా వాటిని బయటకు వెళ్లగొడతాయి. కిడ్నీలు సరిగా పనిచేయకపోతే వ్యర్థాలు పోగుపడి, శరీరం చెత్తకుప్పలా మారుతుంది. కాబట్టే వీటిల్లో చిన్న సమస్య తలెత్తినా పెద్ద చిక్కులు ఎదురవుతాయి. ఇక తిత్తులు, గడ్డలు (కణితులు) ఉన్నాయని తెలిస్తే? మనసులో తీవ్ర ఆందోళన మొదలవుతుంది. ఇవి పిల్లల్లో, పెద్దల్లో ఎవరిలోనైనా తలెత్తొచ్చు. కొన్నిసార్లు తల్లి కడుపులో ఉన్నప్పుడే బయటపడొచ్చు. కొందరికి మలి వయసులోనూ పుట్టుకురావొచ్చు. నిజానికి మామూలు నీటి తిత్తులతో పెద్ద ప్రమాదమేమీ ఉండదు. కిడ్నీలో మూత్రాన్ని శుద్ధి చేసే గొట్టాల్లో ఏదైనా అడ్డంకి తలెత్తితే, అక్కడ ద్రవం పోగుపడి తిత్తిలాగా తయారవుతుంది. చాలావరకివి చిన్నగానే ఉంటాయి. ఇతరత్రా సమస్యల కోసం పరీక్షలు చేస్తున్నప్పుడు యాదృచ్ఛికంగా బయటపడుతుంటాయి. కానీ కొందరిలో పెద్దగానూ ఉండొచ్చు. చిన్నవైతే అక్కడే ఉంటాయి గానీ పెద్దగా అయితే కిడ్నీలోంచి బయటకు పొడుచుకు రావొచ్చు. కొందరికి ఒకట్రెండు తిత్తులే ఉంటే మరికొందరికి పెద్ద సంఖ్యలోనూ ఉండొచ్చు. ఇక కణితుల దగ్గరికి వస్తే- కొన్ని కణితులు క్యాన్సర్లూ అయ్యిండొచ్చు. తొలిదశలో పెద్దగా లక్షణాలు ఉండకపోవటం వల్ల పైకి అంతా బాగానే అనిపించొచ్చు. కానీ లోలోపల ముదురుతూ వస్తుంటాయి. వీటి విషయంలో నిర్లక్ష్యం తగదు.


పిల్లల్లో - రెండు రకాలు

చిన్న పిల్లల కిడ్నీ తిత్తులు, గడ్డల విషయంలో రెండు సమస్యలను ప్రధానంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఒకటి- మల్టీసిస్టిక్‌ డిస్‌ప్లాస్టిక్‌ కిడ్నీ (ఎంసీడీకే) జబ్బు. రెండు- విల్మ్స్‌ ట్యూమర్లు.

మల్టీ సిస్టిక్‌ కిడ్నీ జబ్బు

  • ఇది నవజాత శిశువులు, నెలల పిల్లల్లో కనిపించే సమస్య. ఆడ పిల్లల కన్నా మగ పిల్లల్లో ఎక్కువ. మల్టీ సిస్టిక్‌ కిడ్నీ జబ్బు పుట్టుకతో తలెత్తుతుంది. తల్లి గర్భంలో పిండం ఎదుగుతున్న దశలో కిడ్నీ సరిగా తయారు కాకపోవటం దీనికి మూలం. తల్లికడుపులో ఉన్నప్పుడో, పుట్టిన తర్వాత కొన్ని నెలలకు ఏదైనా ఇబ్బందితో స్కాన్‌ చేసినప్పుడో తిత్తులు కనిపిస్తుంటాయి. ఇవి పెద్దగా అవుతున్నకొద్దీ కిడ్నీ కణజాలాన్ని ఆక్రమించేస్తాయి. కిడ్నీ సైజు పెరుగుతుంది గానీ లోపలంతా తిత్తులు నిండిపోయి ఉండటం వల్ల పనిచేయదు. క్రమంగా కుంచించుకుపోతుంది. సాధారణంగా ఈ సమస్య ఒక కిడ్నీకే వస్తుంటుంది. అరుదే అయినా కొందరికి రెండు కిడ్నీల్లోనూ ఏర్పడొచ్చు.
  • చికిత్స: సమస్య ఒక కిడ్నీకే పరిమితమైతే రెండోది బాగానే ఉంటుంది. పనిచేయని కిడ్నీ భారాన్ని తనే మోస్తుంది. అందువల్ల పెద్దగా ఇబ్బందేమీ ఉండదు. పిల్లలు మామూలుగానే ఎదుగుతారు. కొందరికి రక్తపోటు పెరగటం, మూత్ర ఇన్‌ఫెక్షన్ల వంటివి తలెత్తొచ్చు. కాబట్టి తరచూ డాక్టర్‌ను సంప్రదిస్తూ ఉండాలి. అరుదుగా కొందరిలో కిడ్నీ కుంచించకపోవచ్చు. తిత్తులు మరీ పెద్దగా ఉండి, ఇబ్బంది పెడుతుండొచ్చు. ఇలాంటివారికి శస్త్రచికిత్స చేసి కిడ్నీని తొలగించాల్సి ఉంటుంది. ఇది పనిచేయదు కాబట్టి తీసేసినా ఇబ్బందేమీ ఉండదు. ఇక పుట్టుకతోనే రెండు కిడ్నీల్లోనూ సమస్య ఉన్నట్టయితే పిల్లలు ఎక్కువ కాలం జీవించకపోవచ్చు. జీవించినా కిడ్నీ వైఫల్యం తలెత్తొచ్చు. అప్పుడు డయాలిసిస్‌ లేదా కిడ్నీ మార్పిడి అవసరమవుతుంది.       

 విల్మ్స్‌ ట్యూమర్‌

  • ఇది ఒకరకమైన కిడ్నీ క్యాన్సర్‌. చాలావరకు పిల్లలకే వస్తుంది. దీనికి కారణమేంటన్నది కచ్చితంగా తెలియదు. జన్యుపరమైన అంశాలు కారణం కావొచ్చు. పిండస్థ దశ కణాలు కొన్ని అలాగే ఉండిపోయి, డీఎన్‌ఏలో మార్పుల మూలంగా ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతూ వచ్చి.. కణితులుగా మారతాయి. వీరిలో ఇతరత్రా జన్యు సమస్యలూ కనిపిస్తుంటాయి. సాధారణంగా ఇది 3-5 ఏళ్ల పిల్లల్లో కనిపిస్తుంటుంది. ఐదేళ్ల తర్వాత తక్కువ. అలాగని పెద్ద పిల్లలకు రాకూడదనేమీ లేదు. విల్మ్స్‌ ట్యూమర్‌ గలవారి పొట్ట మీద తాకితే చేతికి గడ్డ మాదిరిగా తగులుతుంటుంది. కడుపు భాగం ఉబ్బొచ్చు. నొప్పి కూడా ఉండొచ్చు. జ్వరం, మూత్రంలో రక్తం పడటం, రక్తహీనత, అధిక రక్తపోటు వంటి లక్షణాలూ కనిపించొచ్చు.
  • చికిత్స: విల్మ్స్‌ కణితి ప్రమాదకరమైంది. దీన్ని శస్త్రచికిత్స చేసి తొలగించాల్సి ఉంటుంది. తర్వాత కీమో, రేడియేషన్‌ చికిత్సలు ఇస్తారు. సాధారణంగా సమస్య ఒక కిడ్నీకే వస్తుంటుంది కాబట్టి దాన్ని తొలగించినా రెండోది బాగానే పనిచేస్తుంది. కాకపోతే సత్వర చికిత్స అవసరం. తొలిదశలోనే చికిత్స చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. ఆలస్యమైనకొద్దీ కణితులు పెరుగుతాయి. ఊపిరితిత్తులు, ఎముకల వంటి ఇతర భాగాలకు విస్తరిస్తాయి. ఇది ప్రాణాపాయానికి దారితీయొచ్చు.

పెద్దవారిలో- మామూలు, తీవ్రం

పెద్దవారిలో తిత్తులు, కణితులు రెండూ ఏర్పడొచ్చు. వీటిల్లో కొన్ని మామూలువైతే.. కొన్ని క్యాన్సర్లతో ముడిపడి ఉంటాయి.

మామూలు తిత్తులు

పెద్దవయసులో తరచూ కనిపించేవే సమస్య. వయసు పెరిగే కొద్దీ ఈ తిత్తులు తలెత్తుతుంటాయి. యాబై ఏళ్లు దాటినవారిలో నూటికి 50 మందిలో వీటిని చూస్తుంటాం. గుండ్రంగా లేదా కోడిగుడ్డు ఆకారంలో ఉండే ఇవి హానికరమైనవి కావు. వీటికి క్యాన్సర్‌తో సంబంధం లేదు. కానీ కిడ్నీల్లో తిత్తులు అనగానే చాలామంది బెంబేలెత్తుతుంటారు. వీటి గురించి భయపడాల్సిన పనిలేదు. కిడ్నీలు దెబ్బతినటం గానీ క్యాన్సర్‌గా మారటం గానీ ఉండదు. సాధారణంగా ఇవి చాలా చిన్నగా.. 2-3 సెంటీమీటర్ల సైజులోనే ఉంటాయి. చాలావరకు ఇతరత్రా సమస్యలకు స్కాన్‌ చేస్తున్నప్పుడు బయటపడుతుంటాయి. మరీ పెద్దగా.. 7-8 సెంటీమీటర్లు పెరిగితే తిత్తుల మీది పొర సాగి స్వల్పంగా నొప్పి పుట్టొచ్చు.

  • చికిత్స: తిత్తులను అల్ట్రాసౌండ్‌ స్కాన్‌తో నిర్ధరించొచ్చు. బోస్నియాక్‌ గ్రేడ్‌ విధానంలో తిత్తులను వర్గీకరిస్తారు. 1, 2 దశ తిత్తుల్లో క్యాన్సర్‌ ఉండే అవకాశం లేదు. ఏదైనా అనుమానం వస్తే సీటీ స్కాన్‌ చేయాల్సి ఉంటుంది. ఇందులోనూ మామూలు తిత్తే అని తేలితే.. చిన్నగా ఉంటే చికిత్స అవసరం లేదు. అలా వదిలేసినా ఏమీ కావు. తిత్తులతో నొప్పి, అసౌకర్యం కలుగుతుంటే స్క్లీరోథెరపీ చేస్తారు. ఇందులో అల్ట్రాసౌండ్‌ పరీక్షతో చూస్తూ.. పొడవైన సూదిని చర్మం మీది నుంచి తిత్తిలోకి గుచ్చుతారు. దానిలోని ద్రవాన్ని తొలగించి, ఆల్కహాల్‌ ద్రావణాన్ని నింపుతారు. ఈ ద్రావణం తిత్తి లోపలి భాగం గట్టిపడేలా చేస్తుంది. తిత్తి మరీ పెద్దగా ఉంటే ల్యాప్రోస్కోపీ శస్త్రచికిత్స అవసరమవుతుంది. ఇందులో తిత్తిలోని ద్రవాన్ని తీసేసి, దాని పొరను కాల్చటం లేదా తొలగించటం చేస్తారు.
  • సంక్లిష్ట తిత్తిగా బయటపడితే క్యాన్సరేమోనని అనుమానించాలి. తిత్తి పొర మందంగా, అస్తవ్యస్తంగా ఉంటే, లోపల రక్తస్రావ లక్షణాలు కనిపిస్తే క్యాన్సర్‌గానే పరిగణించి తొలగించాల్సి ఉంటుంది.

    మామూలు కణితులు

  • కిడ్నీలో కణితులన్నీ క్యాన్సర్‌ కాకపోవచ్చు. కొన్ని మామూలువీ ఉండొచ్చు. ఇవి ప్రాణాపాయం కలిగించవు. ఇతర భాగాలకు విస్తరించవు. ఇలాంటి కణితుల్లో ఒకటి ఆంకోసైటోమా. చాలావరకు సీటీ స్కాన్‌లోనే ఇది క్యాన్సర్‌ అవునో, కాదో తెలుస్తుంది. అయితే కణితిని తొలగించిన తర్వాత బయాప్సీ చేస్తేనే కచ్చితంగా బయటపడుతుంది. సాధారణంగా కిడ్నీ కణితులకు సూదితో గుచ్చి, నమూనా తీసే (బయాప్సీ) పరీక్ష చేయరు. ఎందుకంటే కణితికి సూదిని గుచ్చితే రక్తస్రావం కావొచ్చు. అక్కడి నుంచి వేరే చోట్లకు వ్యాపించొచ్చు. అందుకే కణితినో, కిడ్నీనో తొలగించాకే బయాప్సీ పరీక్ష చేస్తారు.
  • చికిత్స: ఆంకో సైటోమా కూడా క్యాన్సర్‌ మాదిరిగానే కనిపిస్తుంది. శస్త్రచికిత్స కూడా అలాగే చేస్తారు. బయాప్సీలో క్యాన్సర్‌ లేనట్టు తేలితే భయపడాల్సిన పనిలేదు. దీనికోసం తరచూ డాక్టర్‌ను సంప్రదించాల్సిన అవసరమూ ఉండదు.

    కొవ్వు కణితులు

  • ఇవీ మామూలు కణితులే. వీటిని యాంజియామయాలైపోమా (ఏఎంఎల్‌) అంటారు. ఆడవారిలో ఎక్కువ. వీటిల్లో కొవ్వు నిండి ఉంటుంది.  చిన్న చిన్న కణితులను సీటీ స్కాన్‌తోనే నిర్ధరించొచ్చు. ఇందులో కొవ్వు నల్లగా కనిపిస్తుంది.
  •  చికిత్స: కణితులు చిన్నగా ఉంటే చికిత్స అవసరం లేదు. ఇవి నెమ్మదిగా పెరుగుతూ వస్తుంటాయి. కాబట్టి తరచూ స్కాన్‌ చేస్తూ.. సైజు పెరుగుతుందేమో గమనించుకోవాల్సి ఉంటుంది. బాగా పెద్దగా  అయితే పగిలిపోయే ప్రమాదముంది. రక్తస్రావమై నొప్పి పుడుతుంది. ఇలాంటివారికి శస్త్రచికిత్స చేసి అక్కడి వరకు తొలగిస్తే సరిపోతుంది. కోత పెట్టి గానీ ల్యాప్రోస్కోపిక్‌, రోబోటిక్‌ పద్ధతిలో గానీ శస్త్రచికిత్స చేయొచ్చు.

    కిడ్నీ ట్యూమర్‌

  • ఇది తరచూ చూసే సమస్య. దీన్ని రీనల్‌ సెల్‌ కార్సినోమా అంటారు. ఇది కిడ్నీల్లోని గొట్టాల్లో తలెత్తుతుంది. డీఎన్‌ఏ మార్పుల మూలంగా కణాలు తామరతంపరగా పెరిగి, గడ్డ మాదిరిగా తయారవుతుంది. చాలావరకు ఒక కిడ్నీలోనే కణితిని చూస్తుంటాం. అయితే వీహెచ్‌ఎల్‌ జన్యువు గలవారికి రెండు కిడ్నీల్లోనూ ఏర్పడొచ్చు. ఒకే సమయంలో రెండింటిలో మొదలవ్వచ్చు. లేదా ఒక కిడ్నీలో మొదలైన కొన్నేళ్ల తర్వాత మరో కిడ్నీలో తలెత్తొచ్చు. కిడ్నీ కణితులను ఒకప్పుడు బాగా పెద్దగా.. 8-10 సెంటీమీటర్ల సైజు పెరిగేంతవరకూ గుర్తించటం సాధ్యమయ్యేది కాదు. ఇప్పుడు ఇతరత్రా ఆరోగ్య పరీక్షల్లో భాగంగా చేసే అల్ట్రాసౌండ్‌ పరీక్షల మూలంగా చిన్నగా.. ఒకట్రెండు సెంటీమీటర్ల సైజులో ఉన్నప్పుడే గుర్తించటం సాధ్యమవుతోంది. కణితులు చిన్నగా ఉన్నప్పుడు (స్మాల్‌ రీనల్‌ మాసెస్‌) పైకి ఎలాంటి లక్షణాలూ ఉండవు. మరీ పెద్దగా అయితే నొప్పి, మూత్రంలో రక్తం పడటం వంటివి కనిపిస్తాయి. చేత్తో తాకితే పొట్ట మీద గడ్డ మాదిరిగానూ తగలొచ్చు. అల్ట్రాసౌండ్‌ స్కాన్‌తో దీని ఆనవాళ్లను గుర్తించొచ్చు. అనుమానం వస్తే సీటీ స్కాన్‌ చేయాల్సి ఉంటుంది. ఇందులో కణితి రకం, సైజు వంటివన్నీ తెలుస్తాయి. మిగతా క్యాన్సర్ల మాదిరిగానే ఇది లింఫ్‌ గ్రంథులు, ఊపిరితిత్తులు, ఎముకల వంటి భాగాలకు విస్తరించొచ్చు. ముఖ్యంగా కిడ్నీ ప్రధాన సిరకు వ్యాపించటం గమనిస్తుంటాం.
  • చికిత్స: కిడ్నీ కణితులకు రేడియేషన్‌ చికిత్స పనిచేయదు. ఇటీవల కీమో థెరపీ మందులు అందుబాటులోకి వచ్చినప్పటికీ వీటితోనూ పూర్తిగా నయం కావు. కాబట్టి శస్త్రచికిత్స చేసి తొలగించటమే ముఖ్యం. దీన్ని చాలా జాగ్రత్తగా చేయాలి. కణితి ఆనవాళ్లేమీ మిగలకుండా పూర్తిగా తీసేయాల్సి ఉంటుంది. చిన్న కణితులైతే అంతవరకే తొలగించి, మిగతా కిడ్నీని అలాగే ఉంచొచ్చు (నెఫ్రాన్‌ స్పేరింగ్‌ సర్జరీ, పార్శియల్‌ నెఫ్రక్టమీ). అయితే రక్తనాళాలు, మూత్రమార్గం వంటి వాటికి సమీపంలో ఉన్నట్టయితే కణితులను తొలగించటం సాధ్యం కాకపోవచ్చు. కణితి బాగా పెద్దగా ఉండి, మిగతా కిడ్నీ భాగం చాలా తక్కువగా ఉన్నా.. కణితి కిడ్నీ మధ్యలో ఉన్నా, లోపలికి చేరుకోవటానికి అనువుగా లేని చోట ఉన్నా కష్టమే. ఇలాంటి పరిస్థితుల్లో మొత్తం కిడ్నీని తొలగించాల్సి ఉంటుంది. ఒకప్పుడు వీపులో కోత పెట్టి శస్త్రచికిత్స చేసేవారు. ఇప్పుడు ల్యాప్రోస్కోపీ, రోబోటిక్‌ పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. వీటితో గాటు పెద్దగా ఉండదు కాబట్టి త్వరగా కోలుకోవచ్చు. చిన్న కణితులను తొలగించాక తదుపరి చికిత్సలేవీ అవసరం లేదు. మళ్లీ తిరగబెట్టటమనేది అరుదు. క్యాన్సర్‌ ఇతర భాగాలకు విస్తరిస్తే జీవితాంతం కీమో మందు మాత్రలు వేసుకోవాల్సి ఉంటుంది. వీటితో క్యాన్సర్‌ పూర్తిగా నయం కాకపోవచ్చు గానీ జీవనకాలం పెరుగుతుంది.
  •  క్యాన్సర్‌ చికిత్స తీసుకున్నవారు క్రమం తప్పకుండా డాక్టర్‌ను సంప్రదిస్తూ ఉండాలి. ఏడాదికోసారి అల్ట్రాసౌండ్‌ స్కాన్‌, ఛాతీ ఎక్స్‌రే, రక్త పరీక్ష చేయించుకోవాలి. ఒకవేళ రెండో కిడ్నీలో కణితి ఏర్పడుతున్నట్టు అనిపిస్తే వెంటనే తొలగించటానికి వీలవుతుంది. రెండు కిడ్నీల్లోనూ పెద్ద కణితులు గలవారికి రెండు కిడ్నీలనూ తొలగించాల్సి ఉంటుంది. వీరికి డయాలసిస్‌ అవసరం. ఇలా రెండేళ్ల వరకూ చూసి, శరీరంలో మరెక్కడా క్యాన్సర్‌ ఆనవాళ్లు లేనప్పుడు కిడ్నీ మార్పిడి చేయించుకోవచ్చు.

పాలీసిస్టిక్‌ కిడ్నీ జబ్బు

ఇదో జన్యు సమస్య. వంశపారంపర్యంగా సంక్రమిస్తుంది. తల్లిదండ్రులకు ఉంటే పిల్లలకు 50% వరకు రావొచ్చు. ఇందులో రెండు కిడ్నీల్లోనూ నీటి తిత్తులుంటాయి. ఇవి ద్రాక్ష గుత్తి మాదిరిగా ఏర్పడతాయి. తిత్తుల సైజు పెరిగే కొద్దీ కిడ్నీలోని కణజాలం క్షీణిస్తుంది. దీని బారిన పడ్డవారిలో చాలామంది 50, 60 ఏళ్లు వచ్చేసరికి కిడ్నీ వైఫల్యంలోకి జారిపోతుంటారు.
చికిత్స: పాలీసిస్టిక్‌ కిడ్నీ జబ్బుకు ప్రస్తుతానికి చికిత్స ఏదీ లేదు. ఇప్పుడు కొన్ని జన్యు చికిత్సల మీద ప్రయోగాలు జరుగుతున్నాయి. కిడ్నీ విఫలమైతే మార్పిడి అవసరమవుతుంది.

జాగ్రత్తలు అవసరం

పాలీసిస్టిక్‌ కిడ్నీ జబ్బు గలవారికి రక్తపోటు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీన్ని నియంత్రణలో ఉంచుకోవాలి. ఉప్పు తగ్గించుకోవాలి. మాంసాహారం బాగా తగ్గించుకోవాలి. మాంసాహారంతో కిడ్నీల మీద ఎక్కువ భారం పడుతుంది. దీంతో త్వరగా కిడ్నీ విఫలమయ్యే అవకాశముంది. ఇంట్లో ఎవరికైనా పాలీసిస్టిక్‌ కిడ్నీ జబ్బు ఉన్నట్టయితే పిల్లలంతా 20, 25 ఏళ్ల వయసులో ఒకసారి అల్ట్రాసౌండ్‌ స్కాన్‌ చేయించుకోవటం మంచిది. ముందే గుర్తిస్తే జాగ్రత్త పడొచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని