నిద్రవేళలు తప్పితే మతిమరుపు ముప్పు

 ఒకరోజు రాత్రి 10 గంటలకు, ఇంకో రోజు 11 గంటలకు పడుకుంటున్నారా? అలాగే ఒకనాడు ఉదయం 6 గంటలకు, మరో రోజున 7 గంటలకు లేస్తున్నారా? ఏదో ఒకరోజంటే ఏమో.. పదే పదే ఇలాగే చేస్తున్నారా? అయితే కాస్త జాగ్రత్త.

Published : 19 Dec 2023 00:28 IST

 ఒకరోజు రాత్రి 10 గంటలకు, ఇంకో రోజు 11 గంటలకు పడుకుంటున్నారా? అలాగే ఒకనాడు ఉదయం 6 గంటలకు, మరో రోజున 7 గంటలకు లేస్తున్నారా? ఏదో ఒకరోజంటే ఏమో.. పదే పదే ఇలాగే చేస్తున్నారా? అయితే కాస్త జాగ్రత్త. రోజూ రాత్రి ఒకే సమయానికి పడుకొని, ఉదయం ఒకే సమయానికి లేచేవారితో పోలిస్తే.. ఎప్పుడంటే అప్పుడు పడుకొని, లేచేవారికి మతిమరుపు (డిమెన్షియా) వచ్చే అవకాశం పెరుగుతున్నట్టు న్యూరాలజీ పత్రికలో ప్రచురితమైన అధ్యయనం హెచ్చరిస్తోంది. నిద్రవేళలు గతి తప్పటంతో మతిమరుపు వస్తున్నట్టు ఇందులో రుజువు కాలేదు గానీ రెండింటికీ బలమైన సంబంధమే ఉంటున్నట్టు వెల్లడైంది. భవిష్యత్తులో డిమెన్షియా రావటానికీ, క్రమం తప్పని నిద్రవేళలకూ మధ్య సంబంధాన్ని గుర్తించటం ఈ అధ్యయనం ఉద్దేశం. ఇందులో భాగంగా సగటున 62 ఏళ్ల వయసు గల సుమారు 88వేల మందిని ఎంచుకొని, మణికట్టు పరికరం సాయంతో నిద్ర తీరుతెన్నులను విశ్లేషించారు. ఏడేళ్ల తర్వాత వీరిలో 480 మందికి డిమెన్షియా వచ్చింది. వీరిలో ఎక్కువమంది నిద్రవేళలను పాటించనివారే. వీరికి మతిమరుపు ముప్పు 53% అధికంగా ఉంటున్నట్టు తేలింది. అంతేకాదు, వీరిలో మెదడు పరిమాణమూ తక్కువగా ఉంటుండటం గమనార్హం. రాత్రిపూట తగినంత సేపు (7-9 గంటలు) నిద్రపోవటమే కాదు.. ఒకే సమయానికి నిద్రించటం, లేవటం కూడా ముఖ్యమేని అధ్యయన ఫలితాలు నొక్కి చెబుతున్నాయి. పనివేళలు మారటం, చిన్న పిల్లలను కనిపెట్టుకోవటం, రణగొణ ధ్వనులతో కూడిన పరిసరాల్లో నివసించటం, నొప్పులు, మధుమేహం వంటి సమస్యలు నిద్రవేళలను దెబ్బతీస్తుంటాయి. దీంతో నిద్ర, మెలకువలను నియంత్రించే శరీరంలోని జీవగడియారం అస్తవ్యస్తమవుతుంది. రక్తంలోని గ్లూకోజు, కొవ్వులు శక్తిగా మారే వేగం.. రక్తపోటు నియంత్రణ వంటి ప్రక్రియలన్నీ ఈ పగలు/రాత్రి లయ మీదే ఆధారపడి ఉంటాయి. ఇది దెబ్బతింటే మెదడు మీద విపరీత ప్రభావం పడుతుంది. జ్ఞాపకశక్తి కూడా తగ్గుతుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని