పీసీఓఎస్‌తో చిగుళ్లవాపు

ఎక్కడి అండాశయాల్లో నీటి తిత్తులు (పీసీఓఎస్‌)? ఎక్కడి నోటి శుభ్రత? కానీ ఈ రెండింటికీ సంబంధం ఉందంటే నమ్ముతారా? ఇవి ఒకదాని మీద మరోటి ప్రభావం చూపుతున్నట్టు పరిశోధనలు పేర్కొంటున్నాయి మరి

Published : 02 Jan 2024 01:14 IST

ఎక్కడి అండాశయాల్లో నీటి తిత్తులు (పీసీఓఎస్‌)? ఎక్కడి నోటి శుభ్రత? కానీ ఈ రెండింటికీ సంబంధం ఉందంటే నమ్ముతారా? ఇవి ఒకదాని మీద మరోటి ప్రభావం చూపుతున్నట్టు పరిశోధనలు పేర్కొంటున్నాయి మరి. సంతానాన్ని కనే వయసు మహిళల్లో 54% మందిలో పీసీఓఎస్‌ కనిపిస్తుంటుంది. నెలసరి అస్తవ్యస్తం కావటం, గడ్డాలు, మీసాలు మొలవటం, బరువు పెరగటం దీని ప్రధాన లక్షణాలు. అయితే పీసీఓఎస్‌తో బాధపడేవారికి చిగుళ్ల ఉబ్బు (పెరియోడాంటైటిస్‌) వచ్చే అవకాశం 28% ఎక్కువగా ఉంటున్నట్టు.. అలాగే చిగుళ్ల ఉబ్బు గలవారికి పీసీఓఎస్‌ తలెత్తే ముప్పు 46% అధికంగా ఉంటున్నట్టు తాజా పరిశోధనలు చెబుతున్నాయి. కొత్తగా పీసీఓఎస్‌ బారినపడ్డవారికి చిగుళ్లువాపు ఇంకాస్త ఎక్కువగా ఉంటోంది కూడా. ఈ రెండింటిలోనూ వాపు ప్రక్రియ (ఇన్‌ఫ్లమేషన్‌) కీలకపాత్ర పోషిస్తుండటం గమనార్హం. అండాశయ తిత్తుల సమస్య చిగుళ్లతో పాటు శరీరమంతటా స్వల్ప స్థాయిలో వాపు ప్రక్రియను ప్రేరేపితం చేస్తుంది. ఇది గార ఏర్పడటానికి, బ్యాక్టీరియా వృద్ధి చెందటానికి అనువైన వాతావరణం కల్పిస్తుంది. పీసీఓస్‌తో లాలాజల గ్రంథుల పనితీరూ అస్తవ్యస్తమవుతుంది. దీంతో నోరు ఎండిపోతుంది. పళ్ల మధ్య చిక్కుకున్న ఆహార పదార్థాలు బయటకు రావటంలో, బ్యాక్టీరియా వృద్ధిని నివారించటంలో లాలాజలం ముఖ్య పాత్ర పోషిస్తుంది. దీని ఉత్పత్తి తగ్గితే పళ్లు పుచ్చిపోవటం వంటి సమస్యలు బయలుదేరతాయి. ఇక చిగుళ్ల జబ్బుతో ఇన్సులిన్‌ నిరోధకత ఎక్కువవుతుంది. అంటే కణాలు ఇన్సులిన్‌కు సరిగా స్పందించవన్నమాట. ఇది పీసీఓఎస్‌ ఇబ్బందులను మరింత తీవ్రం చేస్తుంది. నోట్లో దీర్ఘకాలం వాపు ప్రక్రియ కొనసాగితే అది శరీమంతటికీ విస్తరించొచ్చు. ఫలితంగా పీసీఓఎస్‌ నియంత్రణ కొరవడుతుంది. మందులూ సరిగా పనిచేయవు. కాబట్టి అండాశయ తిత్తులు గలవారు నోటి శుభ్రత మీదా దృష్టి సారించటం మంచిదన్నది నిపుణుల సూచన.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని